Monday, December 5, 2011

మా బుజ్జోడి భోజనం

“బుజ్జి పండూ అన్నం తిందువు రా నాన్నా...”
“నాకన్నమొద్దు..”
“బంగారు కదూ.. రామ్మా. కథ చెప్తాగా”. తీసుకొచ్చి హై చైర్ లో కూర్చోపెట్టాను.
ప్లేట్ వైపు చూసి “నాకు బెండంకాయ వద్దు.”
“బె౦డకాయ కాదు ఇది టమోటా కూర”
“నాకు టంటంమ్మో వద్దు.”
“సరే టమోటో వద్దులే కథ విను.”
“ఒక సారి ఏమయ్యిందో తెలుసా! ఒక ముద్ద నోట్లో పెట్టాను. “పెద్ద గాలొచ్చింది....చెట్లన్నీ ఊగిపోతున్నాయి“ రెండో ముద్ద, చిన్నగా వర్షం మొదలయ్యింది.” మూడో ముద్ద పెట్టబోతుండగా..
“నాకు ట౦ట౦మ్మో వద్దూ..”
వర్షం కాస్తా పెద్దదయింది. చెట్లు, పక్షులూ, జంతువులూ అన్నీ తడిసిపోతున్నాయి. ఇంకో రెండు ముద్దలు పెట్టేసాను.
“చైకిలు కూదానా?”
“ఆ సైకిలు కూడా”...ఇంకో ముద్ద పెట్టేసా.
“అప్పుడు నువ్వెక్కదున్నావ్?”
“నేను, అమ్మమ్మ, మామయ్య, తాతయ్య అందరం ఇంట్లో ఉన్నాం. ఇల్లంతా చీకటి.” ఇంకో రెండు ముద్దలు.
“మరి నాన్న ఎక్కద వున్నాలు?”
“నాన్న అప్పుడు నాకు తెలీదుగా.” ఇంకో ముద్ద..
“ఎందుత్తెలీదు?”
“ఎందుకంటే అప్పుడు నేను చిన్నదాన్ని కదా అందుకని.” ఇంకో ముద్ద...
“మలి నేను చిన్న నాకు నాన్న తెల్చుగా..”
ఈ నేపధ్య౦లో కూరన్నం పెట్టడం పూర్తయ్యింది.
“పెరుగన్నం పెట్టనా?”
“నాకు పెలుగొద్దు.”
“అదికాదు నాన్నా అప్పుడేమో ఒక పెద్ద వేపచెట్టు ఉండేది మా ఇంటి వెనుక.” అన్నం కలుపుతూ..
“వేప చెత్త౦తే?”
“వేప చెట్టంటే బే ట్రీ లాగా అదో పే....ద్ద చెట్టు. నీకు ఇండియా వెళ్ళినప్పుడు చూపిస్తాలే.” ఒక ముద్ద పెడ్తూ...
“నిమ్మతాయి పెత్తావా?”
“ఆ నిమ్మకాయ పెట్టాను, నువ్వు తిను మరీ..”
“అప్పులేమైంది?”
“అప్పుడూ గాలికి చెట్టు ఊగుతుందా..ఎప్పుడు ఇంటి మీద పడుతుందో అని భయం. రాత్రంతా వర్షం గాలి తగ్గలా..” ఇంకో ముద్ద....
“ఆ వర్షం రాత్రి అలానే నిద్ర పోయాం.” అమ్మయ్య అన్నం పెట్టడం పూర్తయ్యింది.
“నిద్ర లేచిసరికి గాలివాన తగ్గింది. ఆ చేట్టేమో వేరేవైపుకు పడిపోయింది."
"ఇంతి మీద పదలేదా?"
"లేదు వేరేవైపు పడిపోయింది." అన్నాను మూతి తుడుస్తూ.
"పాపం చెత్తు."
"అవును నాన్నా పాపం చెట్టు".

వాడికి నాలుగు నిండేదాకా ఈ విధంగా ఉండేది ప్రతి పూటా మా బుజ్జోడి భోజన కార్యక్రమం. కథలో మునిగిపోయి ఏం పెట్టినా తినేసేవాడు. మా కథల్లోకి భూకంపాలు, వాల్కనోలు, వరదలు వచ్చేస్తు౦డేవి. అప్పుడప్పుడూ పిల్లి, నక్క, ముసలి, ఎలుగుబంటి లాంటివి, మరికొన్ని రోజులు మర్యాద రామన్నలు, లవకుశులు..వీరు కూడా వచ్చేవార౦డోయ్. ఇలా మాట్లాడబట్టేమో మా పిల్లలిద్దరికీ భాషతో సమస్య రాలేదు. వాళ్ళు ఇండియా వెళ్ళినప్పుడు కూడా అందరితో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడగలుతున్నారు.