Friday, December 23, 2011

పసి మనసులు


         ఆకాశం మబ్బుపట్టి ఇప్పుడో ఇంకాసేపటికో వర్షం వచ్చేలా ఉంది.  చీకటి, నగరానికి నల్ల దుప్పటి కప్పుతోంది. రాజు, వెంకట్రావ్ డాబా మీద రాజు గదిలో కూర్చుని వున్నారు.

“రేఖా థియేటర్ లో కొత్త ఇంగ్లిష్ సినిమా ఉంది వెళ్దామా?”  అడిగాడు రాజు.
“ఇప్పుడా? ఫస్ట్ షో మొదలై ఉంటుందిగా,” స౦దేహం వెలిబుచ్చాడు వెంకట్రావ్.
“ఫస్ట్ షోకి కాదు సెకండ్ షోకి వెళ్దా౦” అన్నాడు రాజు కిటికీ తరుపు తెరిచి ఆకాశం వైపు చూస్తూ..

“సెకండ్ షోకా! ఇవాళ కోణార్క్ కి మా ఆవిడ వస్తుంది, స్టేషన్కి వెళ్ళాలి, పోనీ రేపెళదామా?” అంటూ సిగిరెట్ వెలిగించాడు వెంకట్రావ్.
“అలాగేలే ముందు బాబాయి హోటలకి వెళ్లి భో౦చేద్దాం పద”. అరలో ఉన్న తాళం చేతిలోకి తీసుకుని తలుపు తెరిచి పట్టుకున్నాడు రాజు. వెంకట్రావ్ లేచి లైటర్ టేబుల్ మీద పెట్టి బయటకు వచ్చి చెప్పులు వేసుకున్నాడు. తలుపు తాళం వేసాక ఇద్దరూ మెట్లు దిగి వీధిలోకి వచ్చారు. రోడ్డు మీద పడుకున్న నల్లకుక్క ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ ముడుచుకుని పడుకుంది.

         ఇద్దరూ హోటలకి వెళ్లి కూర్చుని రెండు మీల్స్ ఆర్డరిచ్చారు. సర్వర్ గ్లాసులు పెట్టి నీళ్ళు పోశాడు. “ఆ సినిమా చాలా భయంకరంగా ఉందట్రా,” పక్క టేబుల్ దగ్గర మాటలు వినిపించి అటువైపుగా చూసాడు రాజు. నలుగురు కుర్రాళ్ళు కూర్చుని ఉన్నారు. ఎర్ర చొక్కా వేసుకున్న అబ్బాయి చెప్తున్నాడు. “దయ్యాలు, సినిమా చూసిన వాళ్ళను కూడా వదలడం లేదట. నిన్న రాత్రి మా వీధిలో రవణా రెడ్డి వెళ్లాడు. రాత్రి నుంచి భయంతో మంచం దిగట్లేదు.” “నువ్వు మరీ చెప్తావ్ సినిమా చూసి ఎవరన్నా జ్వరం తెచ్చుకు౦టారా? మాకు పిరికి మందు పోయకు,” అన్నాడు పచ్చ చొక్కా. “కాదురా అందులో దెయ్యాలు, సినిమా చూసిన వాళ్ళను పట్టి పీడిస్తున్నాయట. ఎవరైనా వంటరిగా వెళితే ఇంటి వరకూ వెంబడించి మారీ చంపేస్తున్నాయట.” అన్నాడు నీలం చొక్కా.

      సర్వర్ రెండు ప్లేట్ లు తెచ్చి రాజు వాళ్ళ ముందు పెట్టాడు. “వాళ్ళు మాట్లాడుకుంటున్నది ఇందాక నువ్వు వెళ్దామన్న సినిమా గురించేనా?” అన్నాడు వెంకట్రావ్ అన్నంలో సా౦బారు కలుపుతూ.  

“ఆ..ఆ అదే అనుకుంటా”

      ఇద్దరు భోజనం పూర్తయ్యి బయటకు వచ్చారు. “ఎనిమిదవుతోంది నీకు టైమవుతు౦దేమో, స్టేషన్ కు వెళ్ళడానికి ఓ అరగంట పడుతు౦దిగా” అంటూ దారిన పోతున్న రిక్షాని ఆపాడు రాజు.  “రేపుదయం నీ గదికి వస్తాను మనం కలిసే ఆఫీసుకి వెళ్దాం,” అంటూ ఎక్కి కూర్చున్నాడు వెంకట్రావ్. రిక్షా వీధి మలుపు తిరిగే వరకూ చూసి ఇంటి దారి పట్టాడు రాజు.

      “ఇంకా ఎనిమిదే ఇప్పుడే వెళ్లి చేయల్సినదేమీ లేదు. పోనీ సినిమాకే వెళ్దామని” హాలు వైపు తిరిగాడు రాజు. మబ్బు పట్టి ఉందేమో దారంతా గుడ్డి వెలుగు. థియేటర్ దగ్గరకు వెళ్ళేసరికి నిర్మానుష్యంగా ఉంది. అప్పుడే సినిమా మొదలయ్యిందే అనుకుంటూ ఒక టికెట్ కొనుక్కుని లోపలి వెళ్లాడు. లోపలంతా చీకటిగా ఉంది, వెతుక్కుంటూ వెళ్లి ఒక పక్కగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.

    సినిమా సగంయ్యాక తలనొప్పిగా అనిపించి బయటకు వచ్చాడు రాజు. బయట గేట్ దగ్గర ఎవరూ లేరు. ఎప్పుడూ ఉండే షాపు కూడా మూసేసి ఉంది. ఇక సినిమా చూడాలనిపించక, తలనొప్పి టాబ్లెట్ వేసుకు౦టే కాని తగ్గేలా లేదని ట్రంక్ రోడ్డు మీదకు వచ్చి ‘విష్ణు మెడికల్స్’ వైపు చూసాడు. షాపు కొంచెం సేపట్లో మూసేస్తారన్నదానికి గుర్తుగా షట్టర్ సగం వేసి ఉంది. త్వరత్వరగా అడుగులు వేస్తూ షాపులోకెళ్ళి ‘అనాసిన్’ కొన్నాడు.  రాత్రి పదకొండు కావొస్తు౦దేమో అన్ని షాపులు మూసేసి ఉన్నాయి. అతని గది నాలుగు వీధులవతలే.

     రోడ్డు మీద ఒక్క వీధిలైటు వెలగడంలేదు. ఆ వీధిలో అన్నీ పెంకుటిళ్ళు ఉన్నట్లునాయి. ఒక ఇంటి ముందు వేపచెట్టు గాలికి ఊగుతూ ఉంది. చీకటిలో జాగ్రతగా నడుస్తూ వెళ్తున్నాడు రాజు. తనకు సమాంతరంగా ఎవరో వస్తున్నట్లనిపించి ఆగి చూశాడు. తన పక్కన కాదు పక్కనున్న ఇంటి పె౦కుల మీద తెల్లని ఆకారం గాల్లో తేలుతున్నట్లు అనిపించింది. రాజుకు నీలం చొక్కా అబ్బాయి మాట్లలు గుర్తొచ్చాయి. ఒక్కసారి తల విదిలించి మళ్ళీ చూసాడు, పక్షి ఒకటి ఎగురుతూ వెళ్ళింది. అప్పుడప్పుడూ పైకి చూస్తూ ఇంటి దగ్గరకు వచ్చాక, తాళం తీసి లోపలకు వెళ్లాడు.

      తరువాత రోజు ఉదయం ఆఫీసు వెళ్ళడానికి వెంకట్రావ్ వచ్చి తలుపు తట్టాడు. తలుపు ఓరగా తెరుచుకుంది..లోపలకి వెళ్లి చూసేసరికి గదంతా చిందరవందరగా ఉంది. మంచం మీద కనుగుడ్లు బయటకు వచ్చి చలనం లేకుండా పడి ఉన్నాడు రాజు.

                       *******

కథ చెప్పడం పూర్తయినా ఆ క్లాసులో ఎవరూ కదలలేదు. ఆఖరి బెంచీలో కూర్చున్న గీత మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది.  

“టీచర్ దెయ్యాలు నిజంగా ఉంటాయా?” గీత పక్కన కూర్చున్న రేష్మ అడిగింది.
“ఆ..నిజంగా ఉంటాయి” నాన్సీ టీచర్.
“అవి అర్ధరాత్రి పన్నెండు గంటలకు వస్తాయట” అమాయకమైన పెద్ద కళ్ళతో భయంగా చూస్తూ చెప్పాడు కృష్ణ.
“అవును దెయ్యాలు వచ్చేప్పుడు గజ్జెల శబ్దం కూడా వినిపిస్తుంది” చెప్పి౦ది టీచర్.
“దెయ్యాలకు కాళ్ళు ఉండవట,  మా బామ్మ చెప్పింది” చెప్పాడు సత్య.
“ఏం కాదు, వాటికి కాళ్ళు  వెనక్కి తిరిగి ఉంటాయట” ముందు బెంచీలోని రాణి చెప్పింది.

“సరే సరే ఇక దెయ్యాల గురించి చాలు పుస్తకాలు లోపల పెట్టుకోండి”. తను చెప్పిన విషయాలు ఆ ఆరేళ్ళ పిల్లల మనసులో ఎలాంటి భయాలు రేపుతాయో తెలియని టీచర్ పిల్లలందరినీ దగ్గరుండి బస్సు ఎక్కించింది.

                           ********

        “ఒళ్ళు కాలిపోతుంది, రెండు రోజుల్నించీ మూసిన కన్ను తెరువడం లేదు పైగా ఒకటే కలవరింతలు. రేపు డాక్టర్ దగ్గరకు తీసుకెళదాం.” అంది అమ్మ . ఆ మాటలు వింటూ పక్కకు తిరిగి పడుకుంది గీత. అమ్మ తలుపులన్నీ వేసి గీతకు దుప్పటి కప్పి లైటు ఆర్పి పడుకుంది. ఆ ఇంటి వరండాలో అటూ ఇటూ అమ్మా నాన్న మంచాలు, మధ్యలో గీత మంచం. నాన్న దగ్గర తమ్ముడు పడుకున్నాడు.

    దాహంగా అనిపించి కళ్ళు తెరిచింది గీత. తనెక్కడు౦దో అర్ధం కాలేదు, ఎదురుగా ప్రహరీ గోడమీద తెల్లని ఆకారం కూర్చుని, తల ముదుకు వెనక్కూ ఊపుతూ..గట్టిగా కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచి౦ది..అదే ఆకారం. భయంతో గట్టిగా అరిచాననుకుంది, మాట బయటకు వినిపించలేదు. ఎప్పుడు నిద్రపోయిందో...

అప్పటినుండీ గీతకు దెయ్యాల కథలన్నా, ఒంటరిగా ఇంట్లో ఉండడమన్నా విపరీతమైన భయం.