Monday, February 6, 2012

తల కళ్ళు

       అక్క బుల్లి డ్రాయింగ్ టేబుల్ దగ్గర కూర్చుని దీక్షగా బొమ్మ వేసుకుంటుంది. బుజ్జిపండు అక్క దగ్గరకెళ్ళి నిలబడ్డాడు. "కక్కా(మన బుజ్జాయికి అప్పటికి అక్క అనడం రాదు) నువ్వేం చేత్తున్నావ్?" అడిగాడు పండు. "బొమ్మ వేస్తున్నా" తల పైకెత్తకుండానే చెప్పింది అక్క. "ఏం బొమ్మ?" కొంచెం ఒంగి మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని బొమ్మ వైపు చూస్తూ అడిగాడు పండు.  "మన ఫామిలీ బొమ్మ వేస్తున్నా" పేపర్ పైకి పెట్టి ఆనందంగా చూసుకుంటూ చెప్పింది అక్క.

"ఇది ఓలు?" ఒక బొమ్మ మీద వేలు పెట్టి చూపిస్తూ అడిగాడు.

"అది అమ్మ" చెప్పింది అక్క.
"మలి ఇది?"
"నాన్న"
"ఇది కక్క" కాళ్ళ వరకు పొడవు జుట్టున్న బొమ్మను చూపించి ఆనందంగా చెప్పాడు పండు. అక్కను తలచుకుంటేనే పండు మోహంలో సంతోషం తోసుకుని వస్తుంది.
"గుడ్ జాబ్. భలే కనుక్కున్నావే". అక్క మొహం వెలిగిపోయింది. అక్క వేసిన లావుపాటి బెరడు పైన చిన్న బాల్ ఆకారంలో వున్న చెట్టును చూపిస్తూ "ఇది బిల్దింగ్" అన్నాడు పండు.

      అక్కకు అది నచ్చలా. 'నేను ఇంత బాగా చెట్టు వేస్తే బిల్డింగ్ అంటాడా' అనుకుని, "బుజ్జిపండూ నువ్వు బ్లాక్స్ పెట్టుకో" అంది. పండుకి బ్లాక్స్ పెట్టడం అంటే ఎక్కడలేని సరదా. రయ్యిమని పరిగెత్తుతూ మూలనున్న పెద్ద డబ్బాని గది మధ్యకు లాక్కుని వచ్చి మూత తీసి అన్నీ కిందపోశాడు. ఆ శబ్దానికి అక్క రెండు చెవులూ గట్టిగా మూసుకుంది. పెరట్లో మొక్కలకు నీళ్ళు పోస్తున్న అమ్మ ఏం జరిగిందోనని పరిగెత్తుకునొచ్చి౦ది. అమ్మయ్య బ్లాక్స్ శబ్దమే అనుకుని "పండూ ఆడడం అయిపోయాక అన్నీ సర్దేయాలి. ఏం" అని చెప్పింది. "ఓకే అమ్మా" అంటూ బుజ్జిపండు బ్లాక్స్ ఒకదాని మీద ఒకటి పెట్టడం మొదలుపెట్టాడు. 

     "కక్కా కక్కా, లుక్ లుక్" సంతోషంగా చప్పట్లు కొడుతూ పిలిచాడు బుజ్జిపండు. ఓ సారి తలెత్తి చూసి, తమ్ముడి కళా సృష్టికి ఒకి౦త ఆశ్చర్యపడి "వావ్ భలే పెట్టావే, ఇంతకూ ఏంటి పండూ అది?" అని అడిగింది. "ఇది ఏలోపెన్." దాని చుట్టూ ఎగురుతూ బదులిచ్చాడు. కాసేపటికి మళ్ళీ బ్లాక్స్ అటూ ఇటూ మార్చి "కక్కా కక్కా" అని పిలిచాడు. "మెల్లగా తలెత్తి చూసి, "ఇప్పుడే౦ పెట్టావు పండూ" అడిగింది. "కాల్" చెప్పాడు బుజ్జి. "కార్ చాలా బావుంది." అని బొమ్మకి క్రేయాన్ తో రంగులు వేయడం మొదలు పెట్టింది.

     "కక్కా లుక్" మళ్ళీ పిలిచాడు పండు. అక్క చూడలేదు దీక్షగా రంగుల్లో మునిగి పోయింది. దగ్గర కెళ్ళి మొహంలో మొహం పెట్టి "కక్కా కక్కా, చూలు ఏం పెత్తానో" అని బ్లాక్స్ వైపు చూపించాడు. అక్క అయిష్టంగా బొమ్మ మీదనుంచి చూపు మరచి కొంచెం నీరసంగా "గుడ్ జాబ్ పండు" అంది. అక్క మెచ్చుకోగానే పండు ఎగురుకుంటూ బ్లాక్స్ దగ్గరకెళ్ళాడు. ఓ ఐదు నిముషాలాగి "కక్కా లుక్" అన్నాడు. అక్క తలెత్తకుండానే "చూస్తున్నా పండూ" అంది. పండు నమ్మలా "లుక్ ఎత్ మై ఎల్లో తక్" అన్నాడు మళ్ళీ.

    "పండూ నాకు ఫోర్ ఐస్ ఉన్నాయ్. రెండు ఫ్రంట్ రెండు బాక్. నా బాక్ ఐస్ తో చూస్తున్నా" అని వివరించింది అక్క. దానికి సాక్ష్యంగా "నీ ఎల్లో ట్రక్ బావుంది" అని మెచ్చుకుంది కూడా. నిజమే కాబోలనుకున్నాడు పండు. అప్పటినుండి ఎప్పుడైనా అక్కని పిలిచి అక్క తల తిప్పకపోతే "ఓ బాక్ ఐస్ తో చూస్తున్నావా" అనేవాడు పండు. ఓ రెండేళ్ళు అక్క 'తల కళ్ళు' దివ్యంగా పనిచేశాయి. నిజం తెలిసే వరకూ బుజ్జి పండు హాపీస్, అక్క హాపీస్. ఇద్దరూ గొడవ చెయ్యకుండా ఆడుకు౦టున్న౦దుకు అమ్మ కూడా హాపీ.