Monday, March 19, 2012

వాకిట్లో ముగ్గులు...వంటి౦ట్లో దోశలు

      నెల్లూరికొచ్చి అప్పుడే రెండు రోజులయిపోయింది. ఇంటికొచ్చిన వాళ్ళందరికీ మా ఊరి కబుర్లు చెప్పడమూ అయింది. ఇంతకూ మా అమ్మమ్మవాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారో చెప్పనేలేదు కదూ! అమ్మమ్మ తాతయ్య, పిన్ని, ఇద్దరు మామయ్యలు, చుట్టుపక్కల ఊర్లలో చదువుకునే సౌకర్యంలేక అమ్మమ్మవాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునే చుట్టాల పిల్లలూ, హాస్పిటల్ కి, పెళ్ళిళ్ళ షాపింగ్ లకూ, కోర్టు పనులకూ, ఊరికే చూసిపోవడానికీ వచ్చే పెద్దవాళ్ళూ ఉండేవాళ్ళు. పశువుల పాకలో రెండు ఎద్దులు, మూడు బర్రెలు, రెండు దూడలు, గాడి, కుడితొట్టి, దిబ్బ ఉండేవి.

      రాత్రిళ్ళు మేడమీద అందరం వరుసగా పరుపులు వేసుకుని చుక్కల్ని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవాళ్ళం. అప్పుడేగా సప్తఋషిమండలి, అరుంధతి నక్షత్రం, పిల్లలకోడి, వేగుచుక్క వీటన్నిటి గురించి తెలుసుకుందీ! ఆకాశంలో నెలవంకను చూస్తూ పడుకోవడం భలే ఉండేదిలే. ఇంటిపక్కనున్నవేపచెట్టు మీద ఉన్న కాకులు ఆరు గంటలకే నిద్ర లేపేసేవి. కళ్ళు తెరిచి చూస్తే ఒక్క మబ్బు తునక కూడా లేని లేతనీలపు ఆకాశం కనిపించేది. తల పక్కకు తిప్పితే ఇంటిమీదకు వచ్చిన పచ్చని వేపకొమ్మ నిండా తెల్లనిపువ్వులతో నవ్వులు రువ్వుతుండేది. పిట్టగోడ దగ్గరకు వచ్చామనుకోండి. వాకిలి ఊడ్చేవాళ్ళు, కళ్ళాపి చల్లేవాళ్ళు, ముగ్గులేసే వాళ్ళు, బొగ్గుతో పళ్ళుతోమేవాళ్ళు, కుళాయి దగ్గర నీళ్ళు పట్టేవాళ్ళు కనిపించేవాళ్ళు. లేచి దుప్పటి మడతబెట్టి పరుపు చుట్టేసి కిందకు వెళ్ళిపోవడమే, పరుపు లోపల పెట్టే పని నాది కాదు. ఎందుకంటే అది చాలా బరువు కదా పెద్దవాళ్ళెవరైనా పెడతారన్నమాట.

       ఇక మెట్లు దిగి కిందకు రాగానే వాకిట్లో బుల్లి ముగ్గు శుభోదయం పలికేది. వరండాలో తాతయ్య పడక్కుర్చీలో కూర్చుని హిందూ పేపర్ చదువుతూ ఉండేవారు. పేపరు... తాతయ్య, పేపరు... తాతయ్య. ఈ దృశ్యం మనం రోజుమొత్తంలో చాలా సార్లు చూస్తాం. పడక్కుర్చీ వైపు చూస్తే పేపరు మొదటి పేజీనో, మధ్య పేజీనో, చివరి పేజీనో కనిపించాలన్నమాట. పొరపాటున తాతయ్య కనిపించారనుకోండి, "జ్యోతీ పేపర్ చదువు" అని పిలుస్తారు. పోనీలే తాతయ్య ముచ్చటపడుతున్నారని పేపర్ చదవుతుంటానా, అలా కాదు, "పెద్దగా చదువ్" అంటారు. ఆ ఇంగ్లీష్ పేపర్ గాట్టిగా పైకి చదవాలి, తాతయ్య ఒక్కో పదం దగ్గర ఆపి అర్థాలు అడుగుతుంటారు. కాబట్టి ఏ సమయంలోనైనా తాతయ్యను చేతిలో పేపర్తో గాని చూశామా చప్పుడు చేయకుండా అక్కడినుండి వెళ్ళిపోవాలి.

      లోపలకు వెళ్ళగానే  పెద్దదో చిన్నదో అంచున్న చీర కట్టుకుని పావలా అంత బొట్టు, ముడి చుట్టూ పూలు పెట్టుకుని వేరుశనగ పప్పు వేపుతూనో, అప్పటికే వేపడం అయిపోతే చేటలో పప్పులు వేసుకుని పొట్టు చెరుగుతూనో అమ్మమ్మ కనిపిస్తుంది. ఇటుకరంగు పొట్టు గాలికి ఎగురుతుంటే చూడడానికి ఎంత 
బావు౦టుందనుకున్నారూ! తోడుగా అమ్మమ్మ గాజుల శబ్దం. నన్ను చూడగానే, "లేచామ్మా, పళ్ళు తోంకుని మొహం సుబ్బరంగా సబ్బేసి కడుక్కో పాల్దాగుదువు గాని" అంటుంది. "పేస్టు కొంచెం వేస్కో నాయినా, వేస్టు జేయబాక" అని చెప్పడం మాత్రం మరచిపోదు. మొహం కడుక్కుని రాగానే "టవల్ దండెం మీద అరేశ్నా?" అని వాకబుచేసి "జయా, పాపకు కొబ్బరినూనె బెట్టి రెండు జెళ్ళెయ్" అని పిన్నికి పురమాయిస్తుంది. ఆడపిల్లలు ఇంట్లో ముచ్చటగా కనిపించాలంట. చింపిరి జుట్లేసుకుని నిద్ర మొహాలతో కనిపిస్తే ఇంటికి దరిద్రం అట. మేమీ పనిలో ఉండగా పచ్చడి తయారవుతుంది. అప్పుడు౦టుంది అసలు ఘట్టం. 

      అమ్మమ్మ వంటి౦ట్లో పొయ్యి దగ్గర కూర్చుని దోశలు వేస్తూ ఉంటుంది. తాతయ్య పేపరు పక్కన పెట్టి వంటి౦ట్లోకి వస్తారు. పెద్దపీట తాతయ్యకు చిన్నపీట నాకు. బాదంకాయ ఆకారం
లో ఉన్న స్టీలు పళ్ళెంలో తెల్లని మెత్తని దోస వేసి ఓ పక్కగా పచ్చడి పెట్టి ఇస్తుంది, ఎన్ని దోసెలు తింటే అన్ని, లెక్కుండదు. దోసెలు కానివ్వండి, ఇడ్లీలు కానివ్వండి, టిఫిన్ ఏదైనా సరే తాతయ్య మాత్రం రెండే తినేవాళ్ళు అమ్మమ్మ ఏ సైజులో వేసినా. నా పని గ్లాసులో నీళ్ళు ముంచి పెట్టుకోవడమే, పెద్దవాళ్ళెవరైనా పక్కనుంటే వాళ్ళకి కూడా నీళ్ళు ముంచి పెట్టడం. టిఫిన్ తింటుండగా మామయ్యలూ, పిన్నీ, అక్కా ఇంటి పక్కనుండే మామయ్యా, ఇంకా చుట్టాలూ అందరూ వంట గది దగ్గరకొచ్చి పీట వాల్చుకుని టిఫిన్ తింటూ కబుర్లు చెప్పుకునే వాళ్ళు. నేను ఆఖరి దోశ వరకూ వేచుండేదాన్ని. మరి అమ్మమ్మ అప్పుడే కదా నాకు కరకరలాడే నూనె దోశ వేసి ఇచ్చేది. ఆ తరువాత పెద్దవాళ్ళందరికీ నేను కాఫీలు ఇచ్చి రావాలి. వాళ్ళు కాఫీ తాగిన తరువాత గ్లాసులు తెచ్చి జల్దాట్లో వేయడం మరచిపోకూడదు. లేకపోతే గ్లాసులో మిగిలిన కాఫీ దొర్లి ఈగలు ముసురుతాయి కదా! 

ఈ లోగా "మా, ఏ౦ జేస్తండారు?" అంటూ వెనుక వీధిలో ఉండే ఇంకో పిన్ని వంటింటి గోడ బైటనుండి పలకరిస్తుంది. 
"ఏం లా దోశలు ది౦ట౦డాం. లోపలికి రారాదా రెండు దోశలు తిందువుగాని" అంటూ వంటింటి రెండో గుమ్మం గట్టు దగ్గరకు వస్తుందమమ్మ.
"అప్పుడే తొమ్మిదవతా ఉంది. నేనాఫీసుకి పోబళ్ళా. ఇడ్లీ దినేసొచ్చినాన్లె." అ౦టుంది పిన్ని.
"పిలకాయలు టిఫిన్ జేసినారా?" 
"ఆ జేసినారు. సరే నేను బోతండా. జోతమ్మా కాస్త పిలకాయలు ఇంట్లోకొచ్చినారో లేదో జూడు" అని చక్కాబోతుంది. 
ఇవన్నీ అయ్యేప్పటికి "హోటల్ మమత వారి సమయం తొమ్మిది గంటలు" అని రేడియోలో చెప్తారు. ఈ వ్యవహారం అ౦తా వంటింటి గట్టుమీద నిలబడి కాళ్ళెత్తి చూస్తుంటామన్నమాట, లేకపోతే కనిపించదుగా మరీ.

     ఈ పూట  దోశలు మరీ ఎక్కువగా తినేశానేమో భుక్తాయసంగా ఉంది కొంచెం విశ్రాంతి తీసుకుని మిగిలిన కబుర్లు రేపు చెప్పుకుందాం.