Monday, November 12, 2012

నరకచతుర్దశి

       "రేపెకొంజావునే లేవాల తొందరగా పడుకోండి" రాత్రి పదైనా కూడా నిద్రపోకుండా కబుర్లు చెప్పుకుంటున్న మమ్మల్ని హెచ్చరించి౦దమ్మమ్మ. ఇంకా కబుర్లు చెప్పుకోవాలని వున్నా ఉదయన్నే లేస్తే కొన్ని టపాసులు కాల్చుకోవచ్చని పడుకున్నాం. నరకచతుర్దశి నాడు పూర్తిగా తెల్లవారిపోతే కాల్చనీయరుగా, అప్పుడు కాకపోతే టపాకాయలు కాల్చడానికి మళ్ళీ దీపావళి రోజు సాయంత్రం వరకూ ఆగాలి.

       ఉదయం లేచేప్పటికి ఇంకా చీకటిగానే వుంది. కొబ్బరాకుల మధ్యన ఆకాశం గులాబి రంగులో కనబడుతోంది. మేడపైన రాత్రి నా పక్కన పడుకున్న వాళ్ళెవరూ కనిపించలేదు, కిందకు దిగి వచ్చేసరికే ఇల్లంతా లైట్లు వెలుగుతున్నాయి. అసలయితే ఇల్లంతా లైట్లు వేయడం అమ్మమ్మకు ఇష్టం ఉండదు. "ఎందుకమ్మా కరెంటు కర్చా, కిటికీ తలుపుల్దెరిస్తే పోలా" అంటుంది కాని ఇవాళ తెల్లవారకుండానే లేచామేమో కిటికీ అవతల కూడా చీకటిగానే వుంది.

      సందులో పొయ్యి మీద పే...ద్ద జర్మన్ సిల్వర్లో దబరలో నీళ్ళు కాగుతున్నాయి. నారింజ రంగులో పైకి లేచిన మంట భగాభగా మండుతూ దబర చుట్టూ మూత దాకా పాకుతోంది. ఉదయం చలికి ఆ మంట దగ్గర వెచ్చగా కూర్చుని అరచేతులకు సెగ చూపిస్తుంటే "నీళ్ళు కాగినాయి నాయనా, మావయ్యనా బావిలోంచి నీళ్ళు తోడి గంగాళంలో పొయ్యమన్జెప్పు" చెప్పిందమ్మమ్మ. "మావయ్యా" అని పిలుస్తూ బావి దగ్గరకు వెళ్ళేసరికే గంగాళం నిండుగా నీళ్ళు తోడున్నాయి. పక్కనే వున్న బిందెల్లో, బక్కెట్లల్లో కూడా నిండుగా నీళ్ళున్నాయి.

      "అమ్మమ్మా మామయ్య నీళ్ళు తోడేశాడు" అక్కడ్నుంచే  అరిచాను.
"దబర కాలిపోతావుంది, వేడ్నీళ్ళు తెస్తన్నానడ్డ౦ రాబాకండి" అంటూ సందులోంచి వేడి నీళ్ళు తెచ్చిందమమ్మ. "అన్నిట్లో నిండా తోడ్నారు ఎక్కడ్నే వేడి నీళ్ళు పోసేదా...వాకిట్లో నీళ్ళు జల్లను పిన్ని బక్కెనెత్తుకపోయింది, ఖాళీ అయిందేమో జూసి తీసకరా నాయనా" అని మళ్ళీ నన్నే పంపింది. ఒక బక్కెనలో సగం నీళ్ళు కింద పొయ్యొచ్చుగా! ఊహు..పొయ్యదు. పైగా నేను కనుక చెప్పాననుకోండి "ఎందుకమ్మా ఉర్దాగా పారబొయ్యడమా" అంటుంది. వాకిలి దగ్గరకు వెళ్ళేసరికి పిన్ని నీళ్ళు చల్లేసి ముగ్గేస్తూ వుంది. అప్పటికే పిన్ని స్నానం చేసి తలకు తెల్ల టవల్ చుట్టుకుని వుంది. ఖాళీ బక్కెన తీసుకుని బావిదగ్గరకు వెళ్ళగానే అమ్మమ్మ సగం వేడ్నీళ్ళు సగం చన్నీళ్ళు ఆ బక్కెట్లో పోసి వేళ్ళు తగిలించి చూసింది. "అబ్బ...ఖాలి పోతన్నాయే" అంటూ ఇంకో రెండు చెంబులు పోసి మళ్ళీ పరీక్ష చేసి "ఇజ్యమ్మా పాపకు తలకు బోద్దువురా" అని అమ్మను పిలిచింది.

     అమ్మ ఆనంద కలరు కొత్త పావడా, జాకెట్టు తీసుకుని వచ్చింది. నాకైతే పట్టులంగా వేసుకోవాలని వుంది కాని, అది దీపావళికని చెప్పిందిగా అమ్మ, అందుకని స్నానం అవగానే ఆ కొత్తబట్టలు వేసుకున్నాను. అమ్మ తమ్ముడికి బావి గట్టుమీదే నీళ్ళు పోసినట్టుంది, మధ్యగదిలో పలుచని టవల్ చుట్టుకుని ఎగురుతున్నాడు. దేవుడి గదిలోకి వెళ్లి దండం పెట్టుకుని వరండాలోకి వెళ్ళేసరికి వీధిలో కొద్దిగా వెలుతురు కనిపిస్తోంది. వాకిట్లో గేటు పక్కనున్న రెండు స్థంభాల మీద రెండు దీపాలు వెలుగుతున్నాయి. వరండాలో కాకరప్పూవ్వొత్తులు, సీమ టపాకాయలు, లక్ష్మీ బాంబులు పెట్టి వున్నాయి

      నేను తమ్ముడూ కాకరప్పూవ్వొత్తులు వరండా గట్టుమీద నిలుచుని దూర౦గా పట్టుకుని కాలుస్తుంటే మామయ్యలిద్దరూ లక్ష్మీ బాంబులు ఇంటిముందు వీధిలో పెట్టి కాకరపువ్వొత్తితో పేలుస్తున్నారు. ఎంత ధైర్యమో! పిన్ని కూడా భయ౦ లేకుండా సీమటపాకాయల్ని కొవ్వొత్తితో అంటించి వీధిలోకి విసిరేస్తే టపాటపా, ఢమాఢమా అని ఒకటే శబ్దం. మామయ్య తమ్ముడ్ని ఎత్తుకుని వీధిలోకి తీసుకెళ్ళి లక్ష్మీ బాంబు పేలిస్తే, వాడు భయ౦తో కెవ్వున ఏడవడం మొదలెట్టాడు. "పసిపిలకాయల్ని ఎందుకురా ఏడిపిస్తారా, మీ పాటికి మీరు కాల్చుకోకుండా" అని తాతయ్య అంటే, "వాడికి భయం పోగొట్టాలన్లే బాబా" అని నవ్వేశాడు శేష్మావయ్య

      సాయ౦త్రం నేను, తమ్ముడు, శ్యామ్మావయ్య, శేష్మావయ్య రచ్చబండ దగ్గరకు వెళ్ళాం. అక్కడ గడ్డి నరకాసురుణ్ణి కాలుస్తారుగా! నరకాసురుడు తగలబడిపోతుంటే అందరం చప్పట్లు కొడ్తాం. అసలైతే అలాంటి పని చేస్తే పెద్దవాళ్ళు కోప్పడతారు. కాని నరకాసురుడు రాక్షసుడు, పైగా అందర్నీ బోలెడు బాధలు పెడుతున్నాడని సత్యభామా దేవి అప్పుడెప్పుడో చంపేసిందిట. ప్రజలకు రాక్షసుని బాధ తొలగినందుకు సంతోషించి అందుకు గుర్తుగా ఇప్పుడు ఇలా నరకాసురుడు తగలబడిపోతున్నందుకు చప్పట్లు కొడతామన్నమాట. గడ్డి నరకాసురుడిలో పెట్టిన టపాసులన్నీ ఢా౦ఢా౦ అని పేలిపోయి అక్కడా ఇక్కడా పడి గడ్డి పూర్తిగా కాలిపోయేదాకా చూసి ఇంటికొచ్చేశా౦. రేపే అసలు పండుగ దీపావళి.