Sunday, December 9, 2012

బూచాడు

         మొదటిసారిగా నిన్ను సరోజా వాళ్ళింట్లో అనుకుంటాను చూసింది. నీ గురించి అప్పటికే సరోజ ద్వారా చాలా వినున్నానేమో నిన్ను చూడగానే ఇదీ అని చెప్పలేని భావమేదో మనసంతా నిండిపోయింది. పెరట్లో పువ్వులు కోయడానికి వెళ్ళినపుడు నువ్వు ఎవరినో పిలవడం వినిపించింది. శ్రావ్యమైన ఆ పిలుపు విని నీ స్వరంలో అమృతం దాగుందేమో అనిపించింది. ఆ తరువాత నిన్ను అక్కడా ఇక్కడా చూస్తూ వచ్చాను. నీ మీద నా అభిమానం కూడా రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. నిన్నెలాగైనా మా ఇంటికి తీసుకువెళ్ళాలని స్థిరంగా నిశ్చయించుకున్నాను.

         ఆ లోగా నాకు పెళ్లిచూపులు...పెళ్ళి నిశ్చయమవడం కూడా జరిగిపోయింది. ఆ సమయంలో నువ్వు నా దగ్గరుంటే బావుండునని ఎంతగా అనిపించిందో తెలుసా. కాపురం పెట్టిన కొత్తల్లో కేవలం నీ కోసమే అర్ధరాత్రి.. అపరాత్రి చీకటిలో, చలిలో సైతం లెక్కచేయక చాలా దూరాలు ప్రయాణం చేశాం. ఏమాటకామాటేలే మా ఊరి ముచ్చట్లన్నీ నీవల్లనేగా తెలిసేవి మరి.

       ఆ తరువాత ఓ నాలుగేళ్ల కనుకుంటాను, తలవని తలంపుగా నువ్వే మాయింటికి వచ్చావు. ఎన్నాళ్ళుగానో నీ కోసం ఎదురుచూశానేమో ఎంత సంతోషపడ్డానో మాటల్లో చెప్పలేను. మా వారికి కూడా నీవంటే అభిమానం ఏర్పడింది. బంధు మిత్రులందరినీ పరిచయం చేశాం, నువ్వు కూడా మా కుటుంబంతో పూర్తిగా కలిసిపోయావు. అన్నట్టు నీకు ఎవరినైనా ఇట్టే పరిచయం చేసుకునే నేర్పు వెన్నతో పెట్టిన విద్య కదూ! నీ తోడుగా వున్నామేమో ఎక్కడెక్కడి వారో స్నేహితులయ్యారు. ఆ తీయ్యని కబుర్లలో మునిగి పోయి వారే మాకు ప్రాణ స్నేహితులు, అత్మీయులు అన్నంతగా ఊహించేసుకున్నాం. ఆ రోజులన్నీ ఎడతెగని కబుర్లతో నిండిపోయేయి.

      ఒకరోజు బహుశా మా పెళ్ళిరోజనుకుంటాను, నా కెంతో ఇష్టమైన పెసర పచ్చరంగు పట్టుచీర కట్టుకుని కనకంబరాలు పెట్టుకుని గుడికి వెళ్దామని తయారయ్యాను. ఓ అరగంటలో బయలుదేరతామనగా నువ్వు ఏదో పను౦దని  వారిని పిలిచావు. అంతే....సాయంత్రం కరిగి రాత్రియినా తనకా స్పృహే కలుగలేదు. ఎదురు చూసి చూసి  విసిగిపోయి మెల్లగా ఆ చీకటి రాత్రి వంటరిగా ఆలోచిస్తూ గడిపాను. దానికి కారణం నువ్వని అర్ధమయ్యాక నీ పట్ల కొంచెం నిర్లక్ష్యం ఏర్పడి నువ్వు పిలిచినా విననట్లుగా నటించడం మొదలు పెట్టాను. రోజులు, నెలలుగా, నెలలు సంవత్సారాలుగా మారాయి.

       ఇన్నాళ్ళుగా మాతో కలసివున్నావు, ఈ రోజున ఇష్టం ఉన్నా లేకున్నా నీ మీద ఆధారం పడడం ఎక్కువయింది. అసలు ఆలోచిస్తే నువ్వు రాకముందు వరకు ఎంతో జీవితం సరదాగా ప్రశాంతంగా వుందనిపించింది. అనిపించడం ఏమిట్లే...పిల్లలతో కలసి ఏటి గట్టున షికార్లు, తోటలలో విహారాలు అన్నీ వాస్తవాలేగా! మా చుట్టూ ఉన్న ఆత్మీయులతో సంబంధాలు తగ్గిపోయాయన్న సంగతి చాలా ఆలశ్యంగా అర్ధమైంది. మా సౌకర్యం కోసమే నువ్వున్నావనుకున్నాం కాని, మా సంతోషాన్ని దోచుకు౦టున్నావని తెలిశాక అప్రమత్తంగా వుండాలని తగు చర్యలు తీసుకువాలని నిర్ణయించుకున్నాం.

       నువ్వు మహా తెలివైనవాడివి సుమా! రెండు వైపులా పదునున్న తేనె పూసిన కత్తివి. మమ్మల్నిక ఏమీ చెయ్యలేవని అర్ధం అయిన వెంటనే మా పిల్లల్ను నీ వైపు తిప్పుకున్నావ్. ఎంతగా అంటే నువ్వు తప్ప ప్రపంచంలో ఇంకెవరూ అక్కర్లేనంత. ఏం మంత్రం వేశావో తెలియదు కాని వాళ్ళు నీ సమక్షంలో తప్ప మిగిలిన సమయంలో బాహ్య ప్రపంచంతో మాట్లాడడమే మానేశారు. అసలు వారి చుట్టూ ఏం జరుగుతుందో కూడా గ్రహించే స్థితిలో లేరు. ఇరవై నాలుగు గంటలు నీ నామ స్మరణే నిన్ను చూడకుండా వుండలేని విధంగా వారిని తయారు చేశావ్.

      మా మీద నీ అసూయ ఏ స్థాయికి చేరిందంటే మా పిల్లలు మాతో సరదాగా గడపడం కూడా చూడలేకపోయావు. వారికి చివరకు మేమన్నా, మా మాటన్నా భరించలేని స్థితికి వచ్చారు. అది ఆసరాగా  చేసుకుని రకరకాల ఆటపాటల ప్రదర్శించి వారిని పూర్తిగా నీ బానిసలుగా చేసుకున్నావు. నిన్ను అభిమానించినందుకు ఇదా నువ్వు మాకు చేసిన ఉపకారం, నమ్మించి మోసం చెయ్యడమంటే ఇదే కదూ!

     ఆనాడేదో "బూచాడమ్మా బూచాడు బుల్లి పిట్టలో వున్నాడు" అని నీ గురించి సరదాగా పాటలు పాడుకున్నాం. కాని ఈ నాడు మా పిల్లల్ని ఇలా ఎత్తుకెళ్ళిపోయే బూచాడివని మాకు తెలియకనే పోయనే! మనిషికి మనిషికి మధ్య కనిపించని అడ్డుతెరలు వేలాడదీశావు. ప్రతి మనిషిని నీ సొంతం చేసుకుని మా బలహీనతలతో ఆడుకుంటున్నావు. ఎక్కడికెళ్ళినా, ఎంత వినకూడదనుకున్నా చెవిన పడే నీ వికటాట్టహాసాలు నాకు భయం కలిగిస్తున్నాయి. ఒకనాడు గదిలో ఓ మూలన పడివుండిన నువ్వు ఈనాడు ప్రతి వ్యక్తి చేతిలోనో, జేబులోనో కూర్చుని గర్వంతో విర్రవీగుతున్నావు.

    ఎదురుగా వున్న మనిషితో కళ్ళలోకి చూస్తూ మాట్లాడే అనుభూతి నిన్ను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడితే వుంటుందా! కావలసిన మనిషితో ఉత్తరాలలో వ్యక్తీకరించే భావప్రకటన నిన్ను మద్యవర్తిగా చేసుకుంటే వస్తుందా! నీ ఇనుపచెర వదిలే రోజు రావాలని మళ్ళీ ఉత్తరాలు, ఎదురుచూపులతో వియోగాన్ని, విరహాన్ని అనుభవించాలని, మానస వీణలు మోహనరాగాలు అలపించాలని కోరుకుంటున్నాను.