Tuesday, February 28, 2012

ప్చ్.. నాకంత అదృష్టమా

      ఝాన్సీ కాఫీ తాగుతూ కిటికీలో నుండి బయటకు చూస్తూ ఉంది. ఉదయం నుండి ఆకాశం మబ్బుపట్టి ఉందేమో వేసవికాలం అయినా ఆరుగంటలకే చీకట్లు ముసురుకుంటున్నాయి. రోడ్డుమీద అప్పుడో కారు ఇప్పుడో కారు వెళుతూ వున్నాయి. రోజూ ఈ సమయానికి వీధిలో ఆడుకునే పిల్లలెవరూ ఆ సమయంలో కనిపించలేదు. ముందుగదిలో లైట్ వేసి కిటికీతెర వేసేసింది ఝాన్సి. భర్త, పిల్లలు సెలవలకు ఇండియా వెళ్ళడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఉద్యోగంలో ఏవో ఇబ్బందుల కారణంగా ఝాన్సీకి వెళ్ళడానికి కుదరక ఆమె అమెరికాలోనే ఉండిపోయింది.
      

      ఆ గదిలో ఒక మూలగా వున్న 'డ్రాగన్ ట్రీ' ఆకులు చివర ఎండిపోయి ఉ౦డడం  గమనించి మగ్ తో నీళ్ళు తీసుకునివచ్చి పోసింది. అలాగే ఇంట్లో ఉన్న మిగతా మొక్కలకు కూడా నీళ్ళు పోసి వాటి ఆకులమీద నీళ్ళు చల్లి, 'ఆఫ్రికన్ వైలెట్' మొక్కకున్న వాడిన పూలను తీసేసింది ఝాన్సి. నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే చెక్క నేల మీద తన అడుగుల చప్పుడు తనకే పెద్దగా వినిపిస్తోంది. ఆ పనవగానే సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసింది. ఓ పావుగంట చూసిన తరువాత తననెవరో గమనిస్తున్నట్లుగా
అనిపించింది.

       మెల్లగా తల తిప్పి చూస్తే పెరటి వెనుకవైపునున్న కిటికీలన్నీ తెరచివున్నాయి, బయట లీలగా చెట్లు తప్ప ఏమీ కనిపించలేదు. 
ఇంట్లో వాళ్ళతో వెళ్ళకుండా ఒంటరిగా ఉండిపోవాల్సిన పరిస్థితులను తిట్టుకుంటూ లేచి వెళ్ళి అన్ని కిటికీలు వేసి, తెరలు దించి  టివి చూడాలనిపించక బాబు గదిలోకి వెళ్ళి అరమర సర్దడం మొదలు పెట్టింది. అక్కడ పిల్లలిద్దరూ దాచుకున్న 'యూగియో కార్డ్లు',  'కాయిన్ కలెక్షన్' పుస్తకం కనిపించాయి. వాళ్ళ వస్తువులు చూస్తున్న కొద్దీ వాళ్ళ మీద మరీ బెంగగా అనిపించి పాప గదిలో ఉన్న కంప్యూటర్ లో పవర్ ఆన్ చేసి పాటలు పెట్టి౦ది. సర్దడం పూర్తవగానే వాల్యూమ్ బాగా పెంచి వంటగదిలోకి వెళ్ళింది. ఇంటికి మధ్యలో పెద్ద హాలు, హాలుకు ఒక పక్కగా మూడు పడగ్గదులు, రెండో వైపున వంటగది డైనింగ్ హాలు ఉండే ఆ ఇంట్లో వంటగది వరకూ పాటలు వినిపించాలంటే ఎక్కువ వాల్యూమ్ పెట్టక తప్పదు. ఉదయం చేసిన పప్పు, దొండకాయ వేపుడుతో భోజనం చేస్తూ ఉండగా ఫోన్ మోగింది. పాటల శబ్దంలో అవతల వాళ్ళు చెప్పేది వినిపించక, పాప గదిలోకి పరిగెత్తి కంప్యూటర్ పాజ్ లో పెట్టి ఫోన్ చేసిన రాగిణితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ భోజనం ముగించేసరికి ఎనిమిది గంటలయింది.

      కిటికీలూ, తలుపులన్నీ వేసివున్నాయో లేదో మరొక్కసారి చూసి, సెల్ ఫోనూ, మంచినీళ్ళ గ్లాసు తీసుకుని సెక్యూరిటీ అలారం ఆన్ చేసి పడగ్గదిలోకి వెళ్ళింది. గ్లాసు, ఫోన్ మంచం పక్కనే ఉన్న నైట్ స్టాండ్ మీద పెట్టి గది తలుపు గడియవేసి తలుపు ఒకసారి లాగి చూసి౦ది. ఉదయం నుంచి కిటికీ తీయకపోవడం వల్ల ఉక్కగా అనిపించి కిటికీ తీయబోయి ఒంటరిగా ఉన్న విషయం గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకుని ఫాన్ ఆన్ చేసి మంచం మీద వాలి రాత్రి సగం చదివి ఆపేసిన పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది ఝాన్సి. ఆ నిశ్శబ్దం...ఒంటరితనంలో చదవాలనిపించక పుస్తకా౦ మూసి పక్కన పెట్టింది. హోరున గాలి వీస్తున్నట్లు౦ది, బయటనుండి వింత శబ్దాలు మొదలయ్యాయి. కొంచెం సేపు ఆలకించి మంచం దిగి మెల్లగా కిటికీ దగ్గరకు వచ్చి తెర తొలగించి చూసింది. చీకట్లో పెరట్లో వున్న పెద్ద ఆలివ్ చెట్టు ఊగిపోతూ భయకంరంగా కనిపించింది.   


        అంతవరకూ ఉన్న ఒంటరితనం భయంగా మారింది. ఇలా ఒక్కర్తే ఉండడం ఝాన్సీకి అస్సలు అలవాటు లేదు. అందులోనూ వర్షం రాత్రి, ఇప్పుడు కరంట్ పోతేనో అనుకుని మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకుంది. పక్కన ఇంటి వాళ్ళతో కొద్ది పరిచయం ఉన్నా ఏ రాత్రన్నా అవసర౦ పడితే పిలిచేంత చనువు లేదు. పోనీ ఏ స్నేహితులింటికి వెళదామన్నా వర్షం చాలా ఎక్కువగా ఉంది. ఇంతలో ఝాన్సి భయానికి తగ్గట్టుగా కరంట్ పోయింది. గాలికి పెరట్లో చెట్లు ఊగుతున్న శబ్దం భయంకరంగా వినిపిస్తోంది. కిటికి మీద వర్షం పడే శబ్దంకూడా చీకట్లో భయం గొలిపేలా ఉంది. గదిలో ఫాన్ ఆగిపోవడంతో మరీ ఉక్కగా ఉంది. సుమారుగా అరగంట తరువాత కరెంట్ వచ్చింది. ఝాన్సీకి టీవీ చూస్తూ నిద్రపోయే అలవాటు ఉండడంతో టివి రిమోట్ లో స్లీప్ మోడ్ కి టైమర్  పెట్టి టీవీ చూస్తూ పడుకుంది. కాసేపటికి మాగన్నుగా నిద్ర పట్టింది.

"ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా
ముట్టుకుంటే ముడుసుకు౦టావ్ అంత సిగ్గా
మబ్బే మసకేసిందిలే  పొగమంచే తెరగా నిలిసి౦దిలే "


      ఉలిక్కిపడి నిద్ర లేచింది ఝాన్సీ. ఒక్కక్షణం తనెక్కడుందో.. ఏమిటో అర్ధం కాలేదు ఆమెకి.
 ఒంటరిగా ఉన్నానన్న విషయం గుర్తురాగానే వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. టైం చూస్తే రాత్రి రెండయింది, ఇంట్లో తనొక్కతే ఉంది. మరి పెద్దగా వినిపిస్తున్న ఆ తెలుగు పాట ఎక్కడినుండి వస్తున్నట్టు? పోనీ బయటెక్కడి నుండో వినిపిస్తు౦దా అనుకుంటే ఇంటి పక్క ఇళ్ళవాళ్ళంతా అమెరికన్లు. వెంటనే ఇండియాలో ఉన్న భర్తకు ఫోన్ చేసింది.

"హలో ఏంట్రా ఈ టై౦లో ఫోన్ చేశావ్? ఇంకా పడుకోలేదా?" అడిగాడు విక్రం.
"పడుకున్నాను. ఇప్పుడే మెలుకువ వచ్చింది."
"ఇప్పుడే బయటకు వెళదామనుకు౦టున్నాం. ఇంతలో నువ్వు ఫోన్ చేశావు" ఝాన్సీ గొంతులోని కంగారు గమనించక చెప్పుకుపోతున్నాడు విక్రం.
"అది కాదు మనింట్లో పెద్దగా పాటలు  వినిపిస్తున్నాయి. నాకు చాలా భయంగా ఉంది."
"పాటాలా? పాటలేంటి?" అయోమయంగా అడిగాడు విక్రం.
"అదే నాకూ అర్ధం కావట్లేదు."
"రాత్రి పాటలు పెట్టి మరచిపోయి నిద్ర పోయుంటావ్."
"నిన్న సాయత్రమెప్పుడో కంప్యూటర్లో పెట్టాను. తరువాత పాజ్ చేశాను. ఎవరూ కదిలించకుండా ఇప్పుడెలా వస్తున్నాయవి?" సందేహంగా వెలిబుచ్చింది ఝాన్సి.
"కంప్యుటర్ దగ్గరకు వెళ్ళి చూడోసారి."
"అమ్మో నాకు భయం. నేను వెళ్ళను."
"సరే పడుకో అయితే ఉదయాన్నే చూడొచ్చు"
"అసలు మీకు కొంచెమన్నా కంగారు లేదు. అర్ధరాత్రి ఇంత పెద్ద శబ్దంతో పాటలు వస్తుంటే 'ఎవరు పెట్టారా?' అని నేను భయంతో చచ్చిపోతుంటే సింపుల్ గా 'పడుకో పొద్దున్న చూడొచ్చని' చెప్తారా" భయంతో పాటు కోపం కూడా తోడయ్యింది.

"మరి ఎలా? పోనీ సాగర్ వాళ్లను పిలుస్తావా వాళ్ళొస్తారు."
"ఒద్దులెండి, అసలేమయిందో తెలియకుండా మరీ అర్ధరాత్రి ఎలా లేపుతాం. ఉదయం దాకా మీరే ఇలా మాట్లాడుతూ ఉండండి" చెప్పింది ఝాన్సి.
"ఏమిటీ! ఉదయం దాకానా? నాకు ఫరవాలేదు కానీ నీకే సమస్య, రేపు నువ్వు వర్క్ కి వెళ్ళాలి కదా. ఒక్కసారి వెళ్ళి చూడు పాటలు ఎక్కడినుండి వస్తున్నాయో, సెక్యురిటీ అలారం ఆన్ చేసే ఉందిగా భయం లేదులే"

        ఈ కబుర్లలోనే ఓ పావుగంట గడిచింది. పాటల శబ్దానికి పక్క వాళ్ళు లేస్తారేమో అని ఒకపక్క ఝాన్సీకి కంగారుగా ఉంది. ఏమైతే అదయిందని వెళ్ళిచూడడానికే నిశ్చయించుకుని సెల్ ఫోన్ లో '911' నొక్కి చేతిలో పట్టుకుంది. అవసరమై టాక్ బటన్ నొక్కితే పోలీస్ స్టేషన్ లో వాళ్ళు లైన్ లోకి వచ్చి ఇక్కడ జరుగుతున్నది మాటల ద్వారా తెలుసుకుంటారని  ఝాన్సి ఉద్దేశం. 

     ఇక్కడ ప్రమాదం జరుగుతుందని తెలిసిన వెంటనే ఐదు నిముషాల్లో పోలీసులొస్తారన్న భరోసాతో "సరే మీరు లైన్ లోనే ఉండండి" అని విక్రం కి చెప్పి 'బహుశా ఇదేనేమో తను చేసే ఆఖరి కాల్' అనుకుంటూ మెల్లగా తలుపు తీసి బయటకు తొంగిచూసింది ఝాన్సి. అనుమాని౦చదగ్గ దృశ్యాలు కాని, భయానక దృశ్యాలు కానీ లేక అంతా మామూలుగా ఉంది. పాటలు పెద్ద శబ్దంతో పాప గదిలోనుండి వినిపిస్తున్నాయి. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా పాప గది తలుపు తీసింది. ఏ అగంతకుణ్ణి చూడాల్సివస్తుందో,  ఏ పరిస్థితిని  ఎదుర్కోవలసి వస్తుందో అనుకుంటూ లైట్ వేసింది. ఆశ్చర్యం గదిలో ఎవరూ లేరు కిటికీ కూడా మూసే ఉంది. కంప్యుటర్ నుండి పెద్దగా పాటలు మాత్రం వినిపిస్తున్నాయి. ఆ శబ్దానికి ఫోన్ లో అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినపడడం లేదు. కంప్యూటర్ దగ్గరకు వెళ్ళి పాటలు ఆపింది ఝాన్సి.

"ఇక్కడెవరూ లేరు కాని కంప్యుటర్ నుండే పాటలు వస్తున్నాయి." చెప్పింది. ఝాన్సీ తో సరదాగా మాట్లాడుతున్నాడు కాని విక్రంకి కూడా కంగారుగానే ఉంది. "ఎలా వస్తున్నాయి పాటలు ఇంట్లో ఎవరైనా ఉండి ఉంటారా? పోలీసులను పిలవకుండా తప్పు చేస్తున్నామా" ఇలా పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఝాన్సీకి కింద పడి ఉన్న ఫైర్ అలారం కనిపించింది. "ఏమండీ ఇక్కడ ఫైర్ అలారం కింద పడి ఉంది." ఆన్నది.

      జరిగింది అర్ధం అయ్యింది విక్రమ్ కి. "నువ్వు సాయంత్రం పాటలు పాజ్ లో పెట్టానన్నావుగా. ఆ తరువాత ఆ ఫైర్ అలారం కీ బోర్డు మీద పడడంతో పాజ్ లో ఉన్న బటన్ ఆన్ అయి పాటలు వచ్చాయి" చెప్పాడు విక్రం. జరిగిన విషయం అర్ధమై సమస్య ఏమీ లేదని తెలిశాక మనసు తేలికపడింది ఝాన్సీకి. ఈ ఫోన్ హడావిడి వల్ల ఇండియాలో ఉన్నఇంట్లో వాళ్ళందరకూ విషయం తెలిసి అందరూ ఝాన్సీతో మాట్లాడారు. అంతకుముందు వరకు భయం కలిగించిన విషయం కాస్తా సరదాగా మారింది. 

     ఏం జరిగి ఉంటుందో ఆలోచించకుండా ఏవేవో ఊహించుకుని తను భయపడి వాళ్ళను భయపెట్టినందుకు సిగ్గుగా అనిపించిది ఝాన్సీకి. రెండు వారాలుగా ఒంటరిగా ఉంటున్నా, నిన్న సాయంత్రం వాతావరణం, పరిస్థితులు కలిగించిన అనుమానం తనలో భయాన్ని పెంచినట్లుగా గుర్తించింది. అయినా కూడా ఎవరినీ పిలిచి ఇబ్బంది పెట్టకుండా కొంతవరకూ ధైర్యాన్ని ప్రదర్శించి వెళ్ళి చూసినందుకు గర్వంగానూ అనిపించింది ఆమెకు. అలా ఆలోచిస్తూ ఆ తెల్లవారుఝామున నిశ్చింతగా నిద్ర పోయింది ఝాన్సి.

    ఇంతకూ ఆ ధైర్యశాలి ఝాన్సీలక్ష్మి ఎవరో తెలుసా నేనే..ఇప్పుడిలా సరదాగా చెప్తున్నాను కాని ఆ రాత్రి తలుపు తీసేప్పుడు పేపర్లో చదివినవి, టివిలో చూసిన వార్తలన్నీ గిర్రున తిరిగాయి. నా జీవితలో ఆఖరిరోజన్న నిర్ణయానికి కూడా వచ్చేశాను. ఎప్పుడైనా ఈ విషయం గుర్తొచ్చి ఈ మాట మా వారితో అంటే "ప్చ్ నాకంత అదృష్టమా" అని నిట్టూరుస్తూ ఉంటారు. 

20 comments:

  1. అయ్యో! నేను యెంత దురదృష్టవంతుడిని..అనుకోవాలి .. అనను .. కానీ..నవ్వు + కొంచెం భయం కల్గుతాయి కదా! బాగా వ్యక్తీకరించారు. బాగుంది.తాడుని చూసి పాము అనుకోవడం అంటే..ఇంతేనేమో!

    ReplyDelete
  2. అమ్మో... బాగానే భయపెట్టారు. ఈ కథ different గా ఉంది.

    ReplyDelete
  3. ఇంతకీ భయపెట్టారా???
    భయపడ్డారా???:-)

    ReplyDelete
  4. నిజమే అలాంటి పరిస్థితుల్లో ఎంత భయం వేస్తుందో...
    చాలా చక్కగా భయపెడుతూ బాగా చెప్పారు....
    ఒక్క క్షణం మీరు తలుపు తీసేప్పుడు నేనే ఏవేవో అలోచించేసాను... ఇంక మీ సంగతి సరే సరి...

    ReplyDelete
  5. నిజంగా భయపడ్డావమ్మాయ్! సమయం అటువంటిది మరి...

    ReplyDelete
  6. మీరు ఏ మాత్రము బయపడ్డారో తెలియదు కానీ,
    చదివినంతసేపు మమ్మల్లి భయపెట్టేసారు...
    చాలా సిల్లీగా ఉంటాయి ఇలాంటివి... మా చెల్లాయి కూడా అలాగే భయపడిపోయేది.
    తన భయాన్ని అసరాగా తీసుకొని కొన్ని సార్లు సరదాగా ఏడిపించిన సందర్బాలు కూడా ఉన్నాయిలెండి..
    ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే తనను భయపెట్టడం తప్పే అనిపిస్తుందండీ...
    చాలా బాగుండండి..

    ReplyDelete
  7. 'పాటలు గూడా భయపెడ్తాయ్.'.
    ఇన్నాళ్ళు ప్రశాంతత ఇస్తాయనే తెలుసు అందరికి
    చదివించే గుణం కలిగి , రచనా విధానం అద్భుతంగా ఉంది
    .ఒక చిన్న అనుభవాన్ని రస బంధురంగా అందించి నందుకు అభినందనలు

    ReplyDelete
  8. ఇంతకీ సార్ కి అదృష్టం లేదు అంతే.. ఏం చేస్తాం చెప్పండి ;);)

    ReplyDelete
  9. "మబ్బే మసకేసిందిలే..." పాటకే అట్టా బెంబేలెత్తిపోతే, ఖర్మ కాలి "నిను వీడని నీడను నేనే..." పాటొచ్చుంటే ఏమయ్యేదో?!? xP

    ReplyDelete
  10. నిజమే అండి ఒకోసారి ఇలాంటివి మస్తు బయపెడుతాయి.. తరువాత కారణం తెలిసి దీనికోసమా ఇంత భయపడ్డాము అనిపిస్తుంది.. నేను అయితే ఉదయం దాక బెడ్ దిగక పోయేవాడిని.. మీకు చాలా ధైర్యం ఉంది.. ఇంకో విషయం మీరు ఆ పైర్ అలారం పడింది అని సాంగ్ వస్తున్నాయి అనుకోని వదిలేశారు.. నేనే అయితే ఆ పైర్ అలారం ఎందుకు పడిందా అని కూడా భయపడేవాడిని అండి

    ReplyDelete
  11. అమ్మో , సడన్ గా అలా పాటలు వినిపిస్తే నిజంగానే ఎంత భయంవేస్తుంది. పరవాలేదు ధైర్యం గానే ఎదురుకున్నారు .

    ReplyDelete
  12. @ వనజ గారూ అనేసెయ్యండి ఫరవాలేదు. నేనేమీ అనుకోను. బ్లాగులో వ్యాఖ్యలు సరదాగా ఉంటేనేకదండీ బావుండేది. తాడు..పాము సమెత బావుంది. ధన్యవాదాలు.

    @ శైలజ గారూ అయ్యో మిమ్మల్ని భయపెట్టానా ఆ రోజు ఇండియాలాలో వాళ్ళనీ భయపెట్టేశాను. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    @ పద్మార్పిత గారూ రెండూనూ.. ధన్యవాదాలు.

    ReplyDelete
  13. @ మాధవి గారూ నాకసలే ఒంటరిగా ఉండడమంటే చచ్చేంత భయం. ఇక ఆ రోజు చాలానే భయపడ్డాను. ధన్యవాదాలు.

    @ బాబాయ్ గారూ నిజమేనండీ..అప్పుడున్న ఇంట్లో చుట్టూ పెద్ద ఖాళీ స్థలం పెద్ద పెద్ద చెట్లు. పగటిపూట పెరట్లోంచి చూస్తే పక్కిల్లే సరిగా కనిపించదు. ఇక రాత్రిళ్ళు చెప్పనే అక్కర్లేదు. ధన్యవాదాలు.

    @ రాజీవ్ రాఘవ్ గారూ స్వాగతం. ఇలా భయపడ్డాలు, ఏడిపించడాలు..సరదాలూ, సంతోషాలే కాదండీ జీవితంలో కావాల్సింది. ఇంతకూ మీ అమ్మగార్ని చూసొచ్చారా..ధన్యవాదాలు.

    ReplyDelete
  14. @ నాన్నా సమయం, సందర్భ౦ అనుసరించి ఏదైనా రూపం మార్చుకుంటుందనుకోవడానికి ఇది చక్కని ఉదాహరణ కదూ..

    @ సుభా సారు వారు నీ వ్యాఖ్య చూసి నువ్వు సూక్ష్మగ్రాహివని మెచ్చుకున్నారు. ;) ధన్యవాదాలు.

    @ తెలుగు భావాలు గారూ ఏమయ్యేద౦టేనండీ నా టపాలు చదివే బాధ మీకుండేది కాదు అంతే..మంచి సలహా ఇచ్చారు...ప్రయత్నించాను. ఎలా మార్చాలో నాకూ అర్ధం కాలేదు. ధన్యవాదాలు.

    ReplyDelete
  15. @ తెలుగు పాటలు గారూ నా ధైర్యానికి మెచ్చుకు౦టున్నారా, భలే భలే.ఇసారెప్పుడైనా నన్నేడిపిస్తే మీరిచ్చిన సర్టిఫికేట్ చూపిస్తాను...ధన్యవాదాలు.

    @ మాలా కుమార్ గారూ వేరే దారి కనిపించక ధైర్యంగా ఉండాల్సొచ్చి౦ది. ఒంటరిగా ఉండాలంటే ఈనాటికీ భయమే. ధన్యవాదాలు.

    ReplyDelete
  16. నేను కథ అనుకుంటూనే చదివా చివరి వరకు..ఎంత చక్కగా చెప్పారో మీ అనుభవాన్ని. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వంటరిగా ఉన్నారా! మళ్లీ ఇప్పుడొకసారి ప్రయత్నించండి..ఈ సారి బ్లాగర్లంతా మీకు తోడుంటారు ఏం భయపడక్కరలేదు:)


    "వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలులు"..

    మీ వ్యాఖ్యల పెట్టె పైన స్వాగత వచనాలు భలే ఉన్నాయండి.

    ReplyDelete
  17. మువ్వ గారూ స్వాగతం. "ఈసారి బ్లాగర్లంతా తోడుంటారు" మీ మాటతో మనసు నిండిపోయింది.
    పలకరించడానికి వచ్చి పరిమళాలు పంచారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  18. నేనింకా కథ క్లైమేక్స్ లో ఏ దెయ్యమో, భూతమో ఉంటుందని సస్పెన్స్ గా చదివాను. కానీ విచిత్రంగా కథ బలే బాగా ముగించారు మేడం..

    ReplyDelete
  19. చైతన్య దీపిక గారూ స్వాగతం. మీ బ్లాగు పేరు చాలా బావుంద౦డీ..
    నా భయాల్లో ఈ దెయ్యాలు భూతాలూ కూడా ఉన్నాయండీ. అదృష్టంకొద్దీ ఆ కథ అలా ముగియలేదు. ధన్యవాలు.

    ReplyDelete
  20. నా అనుమానం నిజమయ్యింది! పాప గది సర్దుతూ అని చదవగానే ఎందుకో నా ఆత్మ ఘోషించటం మొదలెట్టింది అది మీరే అని ;) మన ఆలోచనే మన భయం, అదే మనకి అభయం కూడాను!

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.