Tuesday, March 6, 2012

ఇంతకుమించి ఏమున్నది

       మొన్నాదివారం ఉదయాన్నే తెల్లవారకముందే వచ్చి కూర్చుంది. కేవలం నాలుగ్గంటల నిద్రతో బద్దకంగా వాలిన కళ్ళను బలవంతంగా తెరిచి విషయమేమిటని అడిగాను. 'ఏవో పండగలూ వేడుకలూ ఉన్నాయిగా' అంటూ దీర్ఘం తీసింది. 'ఉంటే' అన్నాను దుప్పటి ముసుగు తలపైకి లాక్కుంటూ. ఉంటే గింటే ఏం లేదు, 'నిన్న ఏవో డాన్సులూ అవీ అనే మాటలు వినపడితేనూ...' అని ఆపేసింది. ఆ మాటతో మత్తు దిగిపోయింది. హడావిడిగా లేచి మొహం కడుక్కుని ఓ కప్పు కాఫీ కలుపుకున్నాను. నిన్న అనుకున్న పనులన్నీ చకచక పూర్తి చేసి ఏడుగంటలకల్లా పదిమంది మిత్రబృంద౦ ఒక బేస్మేంట్ లో కలిశాం. చెణుకులు, చెమక్కుల మధ్య ఓ రెండు గంటల సాధన సరదాగా నడిచింది.

      "చాలా కష్టపడ్డావ్ ఇంటికి వెళ్ళగానే కాస్త విశ్రాంతి తీసుకో" అంది. ఏమైనా నేనంటే చాలా అభిమానంలెండి. ఇ౦టి లోపలకు అడుగుపెట్టగనే ఇంట్లో వాళ్ళంతా ఒక్కొక్కళ్ళూ లేచి కిందకు దిగి వచ్చారు. దోసెలు వేస్తుండగా చిట్టితల్లి 'మంచి భారతీయ వంట తెస్తానని స్నేహితురాలికి మాటిచ్చినట్లుగా' చెప్పింది. ఆ వంట సంగతేదో చూసి, ఇంట్లో పనులు అవగొట్టేసి ఇక మంచమెక్కేద్దా౦ అనుకున్నాను. వంట అవగానే మా వారు స్క్రిప్ట్ తో వచ్చి కూర్చున్నారు. నన్ను జాలిగా చూసి దీర్ఘంగా నిట్టూర్చింది. 'ష్' అని కోప్పడి నాటిక గురించి చర్చలు మొదలెట్టాం. ఈ నాటిక నాది కాదులెండి శ్రీవారిది. ఈ లోగా ఫోన్ "మిమ్మల్ని చూసి చాలా రోజులయింది ఐదు నిముషాల్లో వస్తున్నామన్న" కబురు వినిపించింది. వచ్చిన వాళ్ళతో పిచ్చాపాటీ కబుర్లు చెప్తుంటే మాకంటే ఎక్కువగా సరదా పడింది.

     ఈలోగా నాటిక రిహార్సిల్స్ మొదలెడదామని పిలిచిన మిత్రులు రానే వచ్చారు. వారికి స్క్రిప్ట్ వినిపించి మార్పులూ చేర్పులూ గురించి చర్చిస్తుండగా మరో ముగ్గురు మిత్రులు ఓ తీయని కబురు మోసుకు వచ్చారు. నాటిక చర్చలు ముగించి వచ్చిన వారు నిష్క్రమించారు. కొత్తగా వచ్చిన మిత్రులతో ఆడిన కారంస్ ఆట 'టోర్టియా చిప్స్', 'గ్వాకమోలీ' నేపధ్యంలో పసందుగా సాగింది. ఆట జరుగుతుండగానే బుజ్జిపండు కోసం పిలుపు వచ్చింది. ఝామ్మని పండు వాళ్ళ నేస్తాల దగ్గరకు వెళ్ళాడు. సందట్లో సడేమియా..చిట్టితల్లి ప్రాజెక్ట్ పేరుతో తుర్రుమంది. తనేమో జరిగేవన్నీ చిరునవ్వుతో చూస్తూ విశ్రాంతిగా కూర్చు౦ది.

      వచ్చిన మిత్రులను పంపించి తెలుగు తరగతికోస౦ పాఠ్యా౦శాలు చూసుకుని తరగతికి కావాల్సిన కుర్చీలు, బోర్డ్లు సర్డుతుండుగానే విద్యార్ధులు ఉపాధ్యాయులు హాజరు. 'తేనెల తేటల మాటలతో' పాట ప్రతి గదిలోనూ ప్రతిధ్వనించింది. ఈ పాట వింటున్నఆ కళ్ళలో పరవశం చూడాలి. సరే వాళ్ళను పంపించి భోజనాలు అయ్యాయనిపించాగానే పత్రిక పనికోసం మరో ఇద్దరి వచ్చారు. వారి పని చూసి ఫోనులో మాట్లాడాల్సిన విషయాలు పూర్తిచేసి రాత్రి పది గంటలకు విశ్రాంతిగా కూర్చుని ఉదయం నుంచీ జరిగిన విషయాల గురించి కబుర్లు చెప్పుకున్నాము. అన్ని అనుభావాలను ఆనందంగా దాచుకుని తృప్తిగా వీడ్కోలు తీసుకుంది.

    ప్రతి రోజూ ఇలా గడిస్తే ఎంత బావుంటుందో! అత్యాశ కదూ. కనీసం ప్రతి వారం అన్నా ఇలా గడిస్తే సంతోషమే. ఆ రోజు మొత్తం పెద్దలూ పిల్లలూ కలసి సుమారుగా యాభైమందిని కలిసాము. ఉదయం తిన్న ఒక్క దోశతో సాయంత్రం వరకూ ఆకలే గుర్తు రాలేదు. మూసిన తలుపుల వెనుక నెలలు నెలలు గడిచిపోయే ఈ రోజుల్లో ఒక్క రోజును అంత తృప్తిగా పంపించడం అదృష్టమే కదూ.

       పని చేయడం శ్రమ అనుకుంటా౦ కాని, ఇష్టమైన పని చేయడంలోని తృప్తిని అనుభవించిన వాళ్ళెవ్వరూ ఆ ఆనందాన్ని ఒదులుకోరు. పని చెయ్యడానికి భయపడతాం. సమయం మీదో సామర్ధ్యం మీదో నెపం వేస్తాం. పనిలో ఉండే కష్టాల్ని ఏకరువు పెడతాం. లేదు ఏతావాతా ఆ పని చేశామనుకోండి గుర్తింపు కోసం ప్రాకులాడతాం. నిజంగా పని చేసిననాడు మనకు లభించే తృప్తి ముందు ఇతరుల పొగడ్తలు తేలిపోతాయి. ఆ పని సమాజానికి సంబంధించినదైతే ఆ తృప్తే వేరు.

     ఉదయాన్నే నన్ను నిద్రలేపిన రోజు, వెళ్ళే ముందు తనకు బాగా నచ్చిన వాటి గురించి చెప్పింది.

  • మర్యాదలు, మట్టిగడ్డల గురించి ఆలోచించక నేరుగా వచ్చి తలుపు తట్టడం. 
  • నలుగురు కలిసి అడేవేళ బుజ్జిపండును తలచుకుని పిలుచుకెళ్ళడం. 
  • పిల్లల౦దరూ కలసి పాడిన 'తేనెల తేటల మాటలతో' పాట. 
  • అవకాడోతో తొలిసారిగా చేసిన 'గ్వాకమోలి'. 

17 comments:

  1. బాగా చెప్పారు! రోజులోని మధురానుభూతులనే కాక చేదు జ్ఞాపకాలను కూడా పడుకునే ముందు నెమరు వేసుకోవటం నాకు అలవాటు.

    ఇందులో చిన్న సవరణ తిట్టుకోకండే! టోర్టియా (tortilla) ని తోర్తియ అని పలకాలి. అలానే తోర్తియ అంటే కేవలం మన చపాతీ లాంటిది మెత్తగా ఉండేది. మీరు ఇక్కడ చిప్స్ అన్నారు కనుక తోర్తియ తో చేసే చిప్స్ అనుకుంటాను. వాటిని నాచోస్ అంటారు.

    ReplyDelete
  2. రోజు నిజంగానే అన్నింటినీ పట్టుకొస్తుంది.... కొన్ని మన వద్దే ఉంచి కొన్ని పట్టుకెళుతుంది..... మనము అక్కర్లేదు అని వదిలేసినవి....

    చాలా బాగా చెప్పారు...

    రసజ్ఞ గారు - మీ వల్ల రెండు విషయాలు తెలిసాయి... ఇక్కడ చిప్స్ ఆ పేరుతో కూడా దొరుకుతాయి...

    ReplyDelete
  3. రసజ్ఞా రోజూ కాదుకాని ఇలాంటి ప్రత్యేకమైన రోజును మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. ధన్యవాదాలు.

    అమెరికాలో వాటిని టోర్టియా చిప్స్ అంటారు.. నాచోస్ అంటే టోర్టియా చిప్స్, చీజ్, సల్సా, ఆలివ్స్, హాలోపినాస్ తో చేసే ఓ పలహార౦. ప్రాంతాన్నిబట్టి పదార్ధం పేరు పలకడం వేరేగా ఉండి ఉండొచ్చేమో..

    ReplyDelete
  4. అహం కాలోస్మి!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. "నిజంగా పని చేసిననాడు మనకు..." మీరు ఈ వాక్యంలో "నిజంగా" అనే పదం ఎలా వాడారో తెలియదు.

    నేను మాత్రం దానిని "నిజమైన పని" అని అర్థంచేసుకోని - నూటికి నూరు పాళ్ళు ఏకీభవిస్తాను. ఏదో అరిగిపోయిన కాసెట్టులా కాక, ఆ చేసిన పనివల్ల ఏదన్నా కొత్తది కానీ, మనకైనా లేక ఇతరులకైనా పనికి వచ్చేదికానీ అయి, sincereగా చేసిన పనులు ఇచ్చే తృప్తే వేరు.

    సాధారణంగా - ఈ మాదిరి టాపిక్కులు పెద్దగా నా బుఱ్ఱకెక్కవు కానీ చదివాక నచ్చింది.

    ReplyDelete
  6. @ మాధవి గారూ నేను రాసిన పద్ధతి అర్ధం కాదేమోనని సందేహం వచ్చింది. చక్కగా అర్ధం చేసుకున్నారు. ధన్యవాదాలు.

    @ జిలేబి గారూ ధన్యవాదాలు.

    @ తెలుగు భావాలు గారూ 'నిజంగా' కి బదులు మనస్పూర్తిగా అని వాడుండాల్సింది.
    మొన్నటి జ్ఞాపకాన్ని దాచుకునే ప్రయత్నమేనండీ ఇది. ఎవరికో నీతిబోధ చెయ్యాలని కాదు. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

    ReplyDelete
  7. "మూసిన తలుపుల వెనుక నెలలు నెలలు గడిచిపోయే ఈ రోజుల్లో ఒక్క రోజును అంత తృప్తిగా పంపించడం అదృష్టమే కదూ"
    చాలా బాగా చెప్పారు...

    ReplyDelete
  8. చాలా బాగా చెప్పారండి. మన ప్రతి అనుభవం రికార్డ్ చేసుకోవాలనిపిస్తుంది నాకైతే. కొన్ని సార్లు రోజు గడిచినట్లుండదు కాని, వెనక్కి తిరిగి చూస్తే సంవత్సరాలే గడిచిపోతూ ఉంటాయి. బుజ్జిపండు కి చిట్టితల్లికి, మీకు కూడా హోళీ శుభాకాంక్షలు.

    ReplyDelete
  9. Happy Women's Day..

    http://www.123greetings.com/events/womens_day/wishes/you_make_people_bloom.html

    ReplyDelete
  10. జయ గారూ నాక్కూడా జీవితంలో మంచి రోజులన్నిటినీ పదిలంగా దాచుకోవాలని ఉందండీ..ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ధన్యవాదాలు. మీకూ మీ కుటుంబసభ్యులకూ హోలీ శుభాకాంక్షలు.

    ReplyDelete
  11. రాజిగారూ ఎవరైనా పిలుపు కోసం ఆగక అలా చనువుగా తలుపు తోసుకుని వచ్చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో. అందుకే నాకు బ్లాగ్స్ అంటే ఇష్టం. ఏబ్లాగైనా ఏవేళైనా స్వాగతం పలుకుతూనే ఉంటాయి. ధన్యవాదాలు.
    మీకూ, మీఅమ్మగారికి, మీ చేల్లెలికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ గ్రీటింగ్ చాలా బావుంది.

    ReplyDelete
  12. http://neelahamsa.blogspot.com/2012/03/open-challenge.html

    ReplyDelete
  13. ప్రతి రాత్రి వసంత రాత్రి - ప్రతి గాలి పైర గాలి
    ప్రతి నిముషం బ్రతుకంతా - పాటలాగా సాగాలి ''
    అని భావ కవి దేవులపల్లి ఉరికే అన్నాడా
    ''ఏం తోచకుండా బాధ పడేంత వ్యవధి ఉండకూడదు'' అంటాడు చలం
    మనసైన వారి పలకరింపుతో , రోజా పూల పరిమళాల గుబాళింపుతో
    ప్రతి రోజు ఇలా ఇలా హాయిగా గడిచి పొతే ఎంత బాగుండును .
    జీవితానికి పారవశ్యం కలిగించే ఒక అందమైన దృశ్యం ఆవిష్కరించి నందుకు అభినందనలు

    ReplyDelete
  14. @ ధన్యవాదాలు సుభా..

    @ సత్యగారూ చూశానండీ. ప్రయత్నిస్తాను.

    @ నాన్నా నలుగురితో కలసిననాడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందుకే అటారేమో 'మనిషి సంఘజీవి' అని.

    ReplyDelete
  15. జ్యోతిర్మయి గార్కి,
    నేను నిజము చెపుతాను మీరు ఫీల్ కాకుడదు...
    కొంచెం అర్ద్రమయింది... కొంచెం అర్ద్రం కాలేదు....
    కాని చదివిన తర్వాత బాగానే ఉందనిపించింది.. బహుశా కాలక్రమంలో నాకు అర్ద్రం చేసుకొనే నాలెడ్జి వస్తుందనుకుంటా...

    ReplyDelete
  16. రాజీవ్ రాఘవ్ గారూ 'నేను అర్ధమయ్యేట్లు వ్రాశానా' అన్న సందేహం నాకూ వచ్చింది. ఇందులో అనుకోవడానికి ఏమీ లేదు. నన్ను నేను దిద్దుకునే అవకాశం ఇచ్చారు. మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.