Thursday, July 12, 2012

ఆటా జ్ఞాపికలో నా వ్యాసం 'తెలుగు బ్లాగులు'

      అదో అందమైన పల్లెటూరు... భావపరిమళాలు వెదజల్లే అక్షరసుమాలు, కవితా పూరితమైన చల్లని తెమ్మెరలు, పద్యసాహిత్యపు హరితవనాలు, తీర్చిదిద్దిన రంగవల్లుల వంటి రచనలు, పదచాతుర్యంతో కూడిన సంభాషణల తోరణాలు, ఎల్లవేళలా స్వాగతం పలికే వీధి గుమ్మాలతో అక్కడ నిత్య౦ పండుగ శోభ కళకళ్ళాడుతూ సాక్షాత్కరిస్తుంది. అంతర్జాలంలో కనిపించే అద్భుత౦ ఈ తెలుగు బ్లాగు ప్రపంచం.

    సాహిత్యపు విలువలు వలువలు వీడని సామ్రాజ్యం అది. ‘తెలుగుభాష అంతరించి పోతోంద’ని వాపోతున్నవారందరూ ఒక్కసారి అంతర్జాలంలోకి వచ్చి, నిశ్శబ్దంగా అక్కడ తెలుగువారు చేస్తున్న సాహిత్య సేవ చూడండి. కథలు, కవితలు, పద్యాలు, పుస్తకాలు, సినిమాలు, పాటలు, రాజకీయాలు, సమీక్షలు, సమాచారాలు, కబుర్లు, చెణుకులు, ఛలోక్తులు, చిత్రాలు, వంటలు, చిట్కాలు ఇలా ఎన్నో విశేషాల సమాకలనమే ఈ బ్లాగులు. తెలుగు భాష మీద ఆసక్తి వున్న వారు ఉత్సాహంగా పాల్గొని హర్షాతిరేకంతో వ్రాసుకుంటున్న రచనలు, తెలుగు భాషావైభవాన్ని ఎలుగెత్తి చాటుతున్నాయి.

       మనిషికీ మనిషికీ మధ్య పెరిగిన దూరంలో, వంటరితనపు ఎడారి దారులలో వేసవి వడగాల్పుల ధాటికి వేసారిన వారందరికీ ఈ బ్లాగులు చలివేంద్రాలే. మనసులో మాట పదుగురి ముందు నిర్భయంగా చెప్పుకోగలిగిన స్థైర్యాన్ని, కావలసిన ఊరటనీ అందిస్తాయి. సంతోషాన్ని, బాధనీ పంచుకోవడానికి ఓ వేదికలా నిలిచి, పరిష్కారం చూపిస్తాయి. ఒకరి ఆత్మసంఘర్షణ పదుగురికి ఉపయోగపడే జీవిత పాఠమౌతుంది. ఏ ప్రపంచీకరణ వలన మానవ సంబంధాలకు అంతరాయం వాటిల్లిందో, దానినే ఆయుధంగా చేసుకుని, వేరు వేరు పట్టణాలలో, దేశాలలో, ఖండాలలో వు౦టున్న వ్యక్తులతో స్నేహ సంబంధాలు కొనసాగించుకోవడానికి, ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న మిత్రులతో విశేషాలు పంచుకోవడానికి ఈ బ్లాగులు ఒక వేదికగా ఉపయోగపడుతున్నాయి.

బ్లాగులు

        ప్రాంతీయ సభలు, సమావేశాల వివరాలు, పుస్తక ప్రదర్శనలు, యాత్రా విశేషాలు, ప్రపంచంలోని వింతలు, విడ్డూరాలు, చూడచక్కని ప్రదేశాలు అన్ని౦టి వివరాలు ఇక్కడ దొరుకుతాయి. ఈ విశేషాల గురించి అంతర్జాలంలో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. కానీ, అభిరుచులు కలగలసిన వారు అందించిన వివరాలకు సాటి రావు కదా అవి. పైగా మన సందేహాలకు సమాధానాలు, సూచనలూ దొరికే సౌలభ్యం అక్కడ ఉంటుంది.

      ఈ బ్లాగు ప్రపంచంలో కలుషితమైన కుల రాజకీయాలు, మతోన్మాదాలు లేవనే చెప్పొచ్చు. ఉత్తమ రచన ఎవరు చేసినా సహృదయంతో ప్రోత్సహించేవారే ఎక్కువ శాతం ఉంటారు. ఒక్కోసారి ఈ బ్లాగులోని చర్చలు వ్యక్తిగత దూషణల వరకూ వెళుతుంటాయి కానీ అవి చాలా తక్కువ శాతమని చెప్పొచ్చు. బ్లాగులు మొదలైన కొత్తలో ‘కామెంట్ మోడరేషన్’ లేని కారణంగా, ఈ వ్యాఖ్యల మీద అదుపు వుండేది కాదు. అందువలన ఆ రోజుల్లో ఈ వ్యక్తిగత దూషణలు కొంచెం ఎక్కువ మోదాతులోనే వుండేవని వినికిడి.

     సాధారణంగా బ్లాగు నిర్వహించడానికి blogger.com, wordpress.com లను ఉపయోగిస్తారు. వీటిని వాడడానికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు, చాలా సులభంగా కావలసిన రీతిలో బ్లాగును నిర్మించుకోవచ్చు. బ్లాగు పేరు పెట్టడానికి, వ్రాసిన రచన ఏ విభాగానికి సంబంధించిదో తెలుపడానికి, ఏ రోజు, నెల, సంవత్సరం వ్రాశామో నమోదు చేసుకోవడానికి వీలుగా అన్ని సదుపాయాలు ఉంటాయి. రచనలకు అనుబంధ చిత్రాలను ప్రచురించే సౌలభ్యం కూడా వుంటుంది. ఎక్కువ మంది ఆదరించిన రచనలు, కొత్తగా పెట్టిన వ్యాఖ్యలు, వారికున్న ఇతర బ్లాగుల వివరాలు అన్నీ ఒకే దగ్గర చూసే వీలు ఉంటుంది. ఎవరి బ్లాగు వాళ్ళే కాకుండా నచ్చిన ఇతర బ్లాగుల వివరాలు కూడా అదే పేజీలో పొందుపరిచే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇతర బ్లాగర్లు కొత్త రచనలు చేసినప్పుడు ఆ సమాచారం సొంత బ్లాగులో చూసే వీలు వుంటుంది. తమ రచనలను గూగుల్ ప్లస్, ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్ డెన్, ఈమెయిలు ద్వారా ఇతరులతో పంచుకునే సౌలభ్యం కూడా ఉంది.

      వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు వారు, వారి పరిసరాలలోని ప్రజా జీవన విధానం గురించి వ్రాసిన రచనల వలన సమకాలీన సాహిత్యం అవగతమౌతుంది. బ్లాగులో మాండలిక౦లో వ్రాసిన అనుభవాలు, కథలూ గడచి పోయిన బాల్యాన్ని, ఆనాటి అనుబంధాలను తిరిగి కళ్ళ ముందుకు తీసుకొస్తాయి. కవితలు రాయడమే కాక వాటికి తగిన అందమైన బొమ్మలు వేసి అందించే బ్లాగులు కూడా ఉన్నాయి. ఒక సాధారణ విషయాన్ని అసాధారణ శైలిలోవ్రాయగలిగిన బ్లాగరులు కొందరు తమ రచనలను ఏ పత్రికకూ పంపించక బ్లాగులో పెడుతూ ఉంటారు. ఆ రచనలపై, పాఠకుల తక్షణ స్పందనలే వారి రచనలకు స్ఫూర్తి.

     పుస్తక సమీక్షలు, పుస్తక పరిచయాలు తెలిపే బ్లాగులో వ్రాసిన పుస్తక సమీక్షలను చదివి, చదువవలసిన పుస్తకముల జాబితా తయారు చేసుకోవచ్చు. దీనివలన ఎన్నో మంచి పుస్తకాలు చదివే అవాకాశం ఉంటుంది. ఈ బ్లాగులు రచయతల గురించి, రచనల గురించి విస్తృతమైన సమాచారం అందిస్తున్నాయి. ఒక్క రచయితల గురించే కాకుండా చిత్రకారులు, ప్రాచీన కవులు, శిల్పులు, ఆయా రంగాలలో నిష్ణాతులైన వారి పరిచయాలు కూడా లభ్యమౌతాయి.

     చలనచిత్రాలపై వ్రాసిన సమీక్షలు చదవడం వలన గతంలో చూడలేకపోయిన మంచి సినిమాలు చూసే అవకాశం కలుగుతుంది. నేడు విడుదవుతున్న కొన్ని అసభ్య చిత్రాలపై సమీక్షలను ఎటువంటి పక్షపాతం లేకుండా వ్రాసి బ్లాగులో పెట్టడం గమనార్హం. నేటి చిత్రాలలో అశ్లీలతను ప్రతిఘటి౦చే విషయంలో బ్లాగులలో జరిగే చర్చలు చదివిననాడు, అటువంటి చిత్రాలు నిర్మించడానికి, కనీసం ఊహించడానికి కూడా ఎవరూ సాహసించరేమో అనిపిస్తుంది. నాటి ఆణిముత్యాల నుంచి నేటి ఉర్రూతలూగించే పాటల వరకూ అన్నింటి సాహిత్యం ఈ బ్లాగులో చదవొచ్చు. వేటూరి, జంధ్యాల, ఘంటసాల, సావిత్రి మొదలైన సినీప్రముఖుల అభిమానులు కొందరు వారికోసం బ్లాగులు నిర్వహిస్తున్నారు. ఈ బ్లాగులలో వారి నటజీవితానికే కాక నిజ జీవితానికి సంబంధించిన వివరాలూ, వారి జీవితాలలో వారనుభవించిన అటుపోట్లూ చదివి ‘ఎందరో మహానుభావులు’ అనుకోకుండా ఉండలేము.

     నిశ్చలచిత్రాలకు సంబంధిన బ్లాగుల్లో అందమైన ప్రకృతి దృశ్యాలను, అద్భుతమైన విశేషాలను చూడొచ్చు. విరిసిన పువ్వులు, శోభాయమానమైన సాయంస౦ధ్యలు, నదీనదాలు, గడ్డిపరకపై జారుతున్న చినుకు ముత్యాలు పరవశింపచేస్తే, ఎన్నడో చిన్నతనంలో చూసిన పువ్వు, లేచిగురు మావిడి చెట్టు, చేదభావి హఠాత్తుగా మన ఎదురుగా నిలబడి మనల్ని గతస్మృతుల నేపధ్య౦లోకి తీసుకువెళ్ళి, ఎదలో అనుభూతుల పరిమళాలు నింపుతాయి. పాపికొండల నడుమ సూరీడు, ఝుంటి తేనెలు గ్రోలుచున్న తుమ్మెద, ఆకసాన నీలిమేఘ౦, వెన్నెలతో సయ్యాటలాడే కొబ్బరాకు, గూటిలోంచి తొంగిచూసే గువ్వపిట్ట, సందెవేళ వికసించే సన్నజాజి మనసున మల్లెలు పూయిస్తాయి.

     తెలుగు నేర్చుకోవలనుకునే వారికి, పిల్లలకు తెలుగు నేర్పించేవారికి అవసరమైన సమాచారం బ్లాగులలో దొరుకుతుంది. ఈ విషయంలో ఆయా బ్లాగరుల సహాయసహకారాలు కూడా ఉంటుంది. పిల్లల కథలు, బొమ్మల కథలు, శ్రవణ కథలు, పిల్లల పాటలు ఇలా ఉన్న ప్రత్యేకమైన బ్లాగులు ఉన్నాయి. వేమన శతక౦, సుమతీ శతకం, శ్లోకాలు, నీతి కథలు అన్నీ కూడా ఈ బ్లాగుల్లో దొరుకుతాయి.

తెలుగు భాషా ఉపకరణాలు

      కంప్యూటర్ లో తెలుగు వ్రాయడానికి baraha.com, lekhini.org, telugulipi.net, google.com/transliterate లాంటి ఉపకరణాలు ఎన్నో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. బ్లాగ్ స్పాట్ లో తెలుగులో రాసే సౌలభ్యం కూడా ఉంది. ఈ ఉపకరణాలు ద్వారా ఇంగ్లీషులో టైప్ చేసిన అక్షరాలను తెలుగులోకి మార్చుకోవచ్చు. ప్రారంభంలో అలవాటులేని కారణంగా తెలుగు టైప్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించినా త్వరలోనే సులభంగా టైప్ చెయ్యగలుగుతాము. అయితే ఈ సాఫ్ట్ వేర్ ల వలన ఎదురయ్యే ముఖ్య సమస్య ఏమిటంటే తెలుగు టైపింగ్ లోఅక్షరదోషాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. భవిష్యత్తులో ఈ సమస్యలులేని ఉపకరణాలు లభ్యమౌతాయని ఆశిద్దాం.

      బ్లాగు, వ్రాయడం చదవడం మూలంగా మంచి చిత్రాలు, పాటలు, సాహిత్యం పరిచయమౌతుంది. బ్లాగులో వ్యక్తిగత అభిప్రాయాలు, అనుభవాలు పంచుకోవడం వలన అవి చదివిన వారికి, మనలాంటి అభిప్రాయాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారన్న అవగాహన కలుగుతుంది. తద్వారా ఒకే అభిరుచులు కలిగిన వారు స్నేహితులవడం సర్వసాధారణం. తెలుగు చదవడం కోసం ఆన్ లైన్ పత్రికల మీద ఆధారపడిన వాళ్ళకు ఈ బ్లాగులు ఒక వినూత్న కోణాన్ని చూపిస్తాయి. మొదటిసారి ఈ ప్రపంచంలో అడుగు పెట్టిన వాళ్ళకు ఒక అత్భుత ప్రపంచాన్ని చూస్తున్న భావన రాకమానదు.

వ్యాఖ్యలు

       ఏ పని చేయడానికైనా తగిన ప్రోత్సాహం, సమర్ధవంతంగా చేయగలమన్న ఆత్మవిశ్వాసం కావాలి. మెచ్చుకుంటే పొంగిపోని వాళ్ళు ఉ౦డరేమో...ఈ మెచ్చుకోలు ఔషదంలాగా పనిచేసి వ్రాయడానికి, తద్వారా సృజనాత్మకత పెంచుకోవడానికి తగిన ప్రోత్సాహం ఇస్తుంది. బ్లాగులో వ్రాసిన టపా చదివిన పాఠకులు వ్యాఖ్యల రూపంలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఈ వ్యాఖ్యలు కొన్ని మనసారా నవ్విస్తాయి, కొన్ని ఆలోచింపచేస్తాయి, మరికొన్ని ఓదార్పునిస్తాయి, ఎక్కువ భాగం ప్రోత్సహిస్తాయి. సామాన్యంగా వ్రాయగలిగిన వారెవరైనా, భాష మీద ఆసక్తి ఉంటే బ్లాగు వ్రాయడం మొదలెట్టాక వ్రాయడంలో నిష్ణాతులవుతారు. అక్కడ లభించే ప్రోత్సాహమటువంటిది. చదివిన వారందరూ వ్యాఖ్య పెట్టాలనేం లేదు, కాని ఎంత మంది బ్లాగు చదువుతున్నారో బ్లాగు నిర్వహించేవారు చూసుకోవడానికి వీలుంటుంది. దానివల్ల తాము వ్రాసిన జాబు ఎక్కువమందికి నచ్చిందో లేదో తెలిసిపోతుంది.

     అంతర్జాలం ఎల్లలు లేని ప్రపంచం కావడం వల్ల ఒక్కొక్కసారి విపరీతమైన వ్యాఖ్యలు ఎదురవుతుంటాయి. విమర్శల ఘాటు మితిమీరుతుంది. అదుపులేని స్వేఛ్ఛ ఎవరికీ మంచిది కాదు. అందుచేత వ్యాఖ్యలని నియంత్రించుకోవడం తప్పనిసరి. వ్యాఖ్యలు రాసేటప్పుడు కూడా సంయమనం పాటించడం మంచిది.

బ్లాగు సంకలినిలు

      కొన్ని వందల సంఖ్యలో వున్న బ్లాగులను ఒకచోట చూపించి, పదుగురికీ తెలియజేసేవే సంకలినులు . ఈ సంకలినుల నిర్వాహకులు, తెలుగు భాషాభిమానంతో వీటిని స్వచ్ఛ౦దంగా నిర్వహించడం అబినందనీయం. ఈ సంకలినుల్లో ప్రధానమైనవి koodali.org, maalika.org, jalleda.com, haaram.com , sankalini.org, telugu.samoohamu.com, blogillu.com. బ్లాగు మొదలుపెట్టినప్పుడు బ్లాగు వివరాలను ఈ సంకలినిలలో నమోదు చేసుకోవాలి. బ్లాగులో ఒక టపా ప్రచురించగానే ఆ సమాచారం సంకలినిలో మొదటి పేజీలో చూపిస్తుంది, అక్కడ ఎప్పటికప్పుడు కొత్త సమాచారం లభ్యమౌతుంది. దాదాపుగా అన్ని సంకలినిలలోనూ బ్లాగులలోని తాజా వ్యాఖ్యలను చూసే సౌలభ్యం ఉంది. దీని వలన పాత టపాలు, చూడలేకపోయిన మంచి టపాల సమాచారం తెలుస్తుంది. కొన్ని సంకలినులు తమ అనుబంధ పత్రికలను కూడా నిర్వహిస్తున్నాయి. సంకలినుల్లో ఆసక్తి ఉన్న అంశాలు చదవడానికి వీలుగా బ్లాగులు, వ్యాఖ్యలు, ఫోటో బ్లాగులు, సినిమాలు, సాంకేతికం, వార్తలు, సాహిత్యం లాంటి విభాగాలు విభజించారు. కొన్ని సంకలినుల్లో ఎక్కువ మంది ఆదరించిన టపాల వివరాలు, ఆసక్తి కరమైన అంశాల వివరాలు కూడా లభ్యమౌతాయి. ఉత్తమ తెలుగు బ్లాగులను 100telugublogs.blogspot.com బ్లాగులో చూడొచ్చు.

    నేటి వేగవంతమైన జీవన సరళిలో చిన్న చిన్న ఆనందాలను, స్పందించే అంశాలను వదిలి ఎండమావుల వెంట పరుగులు పెడుతున్నాం. బాల్యంలో ఆడిన ఆటలు, చదివిన చందమామ కథలు, అమ్మ పెట్టిన గోరుముద్దల మాధుర్యం అన్నీ అక్షరాల్లో దాగి వేచిచూస్తున్నాయి. మన మూలాలను గుర్తుచేసే ఎన్నో విషయాలు పుస్తకాల్లో భద్రపరచి ఉన్నాయి. అశ్లీలత, అసభ్యం పెచ్చుపెరిగి పోతున్నాయని వగచే ముందు మన సంస్కృతి, సాంప్రదాయాలను మరొక్కసారి మననం చేసుకుందాం. నవతరానికి మన సంస్కృతిని పరిచయం చేసి ఉత్తమ విలువలు కాపాడదాం, దానికి చదవడం ఒక్కటే మార్గం.

         చదవు ఒక యోగం, చదవగలగడం ఒక భోగం, బ్లాగు చదవడం అందరికీ మోదం.


ఆటా జ్ఞాపికను చదవడానికి ఇక్కడ నొక్కండి. 

43 comments:

  1. చాలా బాగుంది.....

    Souvenir Committee లో ఉన్నది మీరే కదండీ.... వెతికి మరీ పట్టాను....

    ReplyDelete
    Replies
    1. అవునండీ ననే. ధన్యవాదాలు మాధవి గారూ..

      Delete
  2. ఆనందమానందమాయనే.... చప్పట్లు .......

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు బాబాయిగారూ..

      Delete
  3. జ్యోతీ ,
    బ్లాగుల గురించి వివరణ బాగుంది
    నేటి కవులకు ఈ విషయాలు నిజంగా తెలియవు
    తెలుగు వెలిగి పోతున్న తీరు దానిని ఉపయోగించుకొనే విధానం స్ఫూర్తి దాయకం
    ఎంతో అనుభవంతో భాషాపటిమతో అందించిన బ్లాగ్ సమాచారం ఎందరికో ఉపయుక్తం
    మంచి రచన ఆటా సభల ద్వారా అందించినందుకు అభినందనలు

    ReplyDelete
    Replies
    1. >>నేటి కవులకు ఈ విషయాలు తెలియవు>>
      నాకు తెలిసిన చాలా మందికి కూడా ఈ తెలుగు బ్లాగులు గురించి తెలియదట నాన్నా. అందుకే వ్రాయలనిపించిది.

      Delete
  4. ఉపయోగకరమైన సమాచారం బ్లాగుల గురించి...
    కొత్తగా బ్లాగ్ మొదలు పెట్టాలనుకొనే వారికీ,
    బ్లాగ్ ఇప్పటికే ఉన్నవారికీ.....
    అక్షర దోషాలన్నారు కదా!
    తెలుగు భాషలో సమాసాలు, సంధులు.
    కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే...అక్షర రాక్షసాలను తేలికగా అధిగమించవచ్చు
    లభ్యమైన software లతో కూడా...
    అభినందనలు మీకు జ్యోతి గారూ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. నేను బ్లాగు మొదలుపెట్టినప్పుడు నాకు బ్లాగ్స్ లో ఎవరూ తెలియదు. బ్లాగ్ రాయడం, చదవడం నాకు చాలా నచ్చిందండీ, ఇంత కాలం ఎలా తెలియలేదా అని నేనే ఆశ్చర్యపోయాను. ధన్యవాదాలు శ్రీ గారూ..

      Delete
  5. blog la pai oka manchi rachana,
    mee soochanalu kooda bhagunnai.
    thank you, keep writing.

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారూ ధన్యవాదాలండీ..

      Delete
  6. జ్యోతిర్మయి గారు.. బ్లాగుల గురించి మీ పరిచయం చాలా బాగుంది. సమగ్ర మైన వివరణతో..మీ అభిప్రాయాన్ని చక్కగా అందించారు.
    ధన్యవాదములు.

    ReplyDelete
  7. ఆటా సావనీర్ లో నా కథ "కూతురైతేనేం " చోటుచేసుకున్నందుకు ..మీకు హృదయపూర్వక ధన్యవాదములు.

    ReplyDelete
    Replies
    1. నాదేం ఉందండీ..మీ కథ బావుంది. అందుకే ప్రచురితమయ్యింది. మీరు ఇంకా మంచి మంచి కథలు వ్రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

      Delete
  8. Replies
    1. ధన్యవాదాలు వెన్నెల గారు..

      Delete
  9. very nice book with 320 pages information. Thanks for sharing.

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు రామ్ గారూ..

      Delete
  10. చాలా మంచి ఇన్ఫో తో చక్కని వ్యాసం రాశారు జ్యోతి గారు..మీకు అభినందనలు..:-)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నాగిని గారూ..

      Delete
  11. జ్యోతిర్మయి గారు..
    తెలుగు బ్లాగుల గురించి మీ వ్యాసం బాగుందండీ.

    ReplyDelete
  12. చాలా బాగా రాశారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శిశిర గారూ..

      Delete
  13. very nice article.. Congratulations..

    ReplyDelete
  14. అభినందనలమ్మా

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు దుర్గేశ్వర రావు గారూ..

      Delete
  15. చాలా చక్కగా వివరంగా వ్రాసారు.ఇవన్నీ తెలీక నేను కూడా
    చాలా ఇబ్బంది పడ్డాను.సమయానికి మంచి ఫ్రెండ్ దొరక బట్టి
    ఎలాగో లాక్కోచ్చేసాను.
    కనీసం కామెంట్ ఇచ్చిన వాళ్లకి రిప్లై ఎలా ఇవ్వాలో కూడా తెలీలేదు.
    వాళ్లేమో మనకు గర్వం అనుకొని ఉంటారు అనుకొని బాధ పడేదాన్ని.
    ఎలాగో బ్లాగ్ ఫ్రెండ్స్ దొరికిన తరువాత కొంచం పర్లేదు.

    మీరు చెప్పిన విషయాలే కాదండి....బ్లాగ్ మిత్రులు
    ఏంతో దగ్గర వారుగా మారి సలహాలు,సహాయాలు
    కూడా చేస్తూ అది ఒక కుటుంభం గా మారిపోయింది ఇప్పుడు.
    థాంక్యు టు బ్లాగ్ ప్రపంచం

    ReplyDelete
    Replies
    1. నేను బ్లాగ్ మొదలుపెట్టినప్పుడు నాకెవరూ తెలియదు శశి కళ గారూ..మెల్లగా ఒకటొకటి నేర్చుకున్నాను. బ్లాగ్స్ గురించి ఎవరైనా వ్యాసం వ్రాస్తే బావుంటు౦దనుకున్నప్పుడు కొత్తపాళీ గారు నన్ను వ్రాయమన్నారు. వారిచ్చిన ప్రోత్సాహానికి కొత్తపాళీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

      మీరు చెప్పింది అక్షరాలా నిజం బ్లాగ్ మిత్రులు కుటుంబసభ్యులైపోయారు. ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.

      Delete
  16. బ్లాగుల పై చాలా చక్కగా వ్రాసారు.మీరు వర్ణించిన తీరు చదివిన వారు బ్లాగులోకం లోకి రాకుండా ఉండలేరు.మీ నాన్న గారు బాలకృష్ణ రెడ్డి గారా !ఆయనతో మాకు చాలా అనుబంధమండి.మా కవితా బంధువాయన.నాన్న గారితో బాగా పరిచయం ఉంది..మీరు ఆయన కూతురంటే చాలా happy గా వుంది.

    ReplyDelete
    Replies
    1. కవితలు రాస్తారు ఆ బాల కృష్ణారెడ్డి గారా ?నిజమా?

      Delete
    2. @ రవిశేఖర్ గారూ..వ్యాసం నచ్చినందుకు చాలా సంతోషం. బాలకృష్ణా రెడ్డి గారు మా నాన్నగారేనండీ..మీ పరిచయం గురించి చెప్పారండి. నేను వ్రాసినవి చదివి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.

      @ వెన్నెల గారూ అవునండీ ఆయన మా నాన్నగారు. మా నాన్నవల్లే నాకీ సాహిత్యంతో పరిచయం.

      Delete
    3. blood లొ ఉందనమాట!!! వారి కవితలు నాకెంతో ఇష్ట్టం అండి

      Delete
  17. జ్యోతిర్మయి గారు,

    చక్కని వ్యాసం ద్వారా బ్లాగులోకానికి ప్రాచుర్యం కల్పించి కొత్తవారికి మరింత ఆసక్తి కలిగేలా చేసారు.

    అన్నట్టు నేను సృష్టించిన http://100telugublogs.blogspot.inను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు అనుకున్నాను, మీరు ఆ బ్లాగు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు!!

    ReplyDelete
    Replies
    1. జీడిపప్పు గారూ..బ్లాగులు చదవడ౦ నాకు చాలా ఇష్టం. ఇంతకాలం ఇవి ఎలా మిస్ అయ్యానా అనుకుంటూ..నాలాంటి వారికోసం ఈ వ్యాసం వ్రాశానండీ. మీకు నచ్చినందుకు చాలా
      సంతోషం.

      నచ్చిన బ్లాగుల గురించి వ్రాయాలంటే చాలా ఉన్నాయి. అలాంటి బ్లాగులన్ని౦టిని ఒకచోట చేర్చిన మీ బ్లాగును గురించి ప్రస్తావించాను. నేను మీ బ్లాగును ఫాలో అవుతూ ఉంటానండీ. ధన్యవాదాలు.

      Delete
  18. చక్కని వ్యాసం. బాగుంది. బ్లాగులు మనలోని భావ వ్యక్తీకరణకు, పదుగురితో పంచుకోటానికి చక్కని వేదిక. వూర్వంల పత్రికలమీద ఆధారపడకుండా మనమే నేరుగా పాఠకుణ్ణి చేరుకోవచ్చు.
    మంచి విశ్లేషణ. ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. శశిధర్ గారూ వ్యాసం నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

      Delete
  19. మీ ప్రయత్నం అభినందనీయం జ్యోతిర్మయి గారూ.. :)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మధురవాణి గారూ...

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.