Thursday, November 29, 2012

అనగనగనగనగా ఓసారి...

"ఈ కార్తీకంలో పంచమి గురువారం నాడు సత్యన్నారాయణ స్వామి వ్రతం జేసుకుంటున్నామొదినా. మీరందర్రావాల." అంటూ ఊర్లో నలుగురినీ పిలిచింది సావిత్రమ్మ. వ్రతం రోజున చుట్టాలు, పక్కాలు, చుట్టూ వున్న నాలుగిళ్ళవాళ్ళు సాయానికొచ్చారు. అందరూ సరదాగా కబుర్లాడుకుంటూ కలసి పనిచేస్తున్నారు.

                   *              *               *                *

"అమ్మాయ్ ఆ దబర ఇటు అందుకోవే"
"దిట్టంగుంది. యాడగొన్నావొదినా?"
"నేనేడగొన్నానా, నాయుడిగారి రాంసుబ్బులు మొన్న టౌనుకు బోయినప్పుడు సుబకార్యాలకు పనికొస్తుందని గొనిందంట. ఇవాళ మనకక్కరకొచ్చింది."
"చిట్టెమ్మావ్ చిక్కుళ్ళు మరీ అంత చిన్నగా తుంచబాకే. కూరముక్కలు కోసే సరికే పోద్దుగూకేటట్టుంది. కొంచెం పెద్దముక్కలు జెయ్." 
"చేసే వాళ్ళకు అడ్డంగాకపోతే నీకేం వంటొచ్చనిమే పోతండావా, అన్నాడక్కా" ముక్కలు తరుగుతూ కాస్త నిష్టూరంగా చెప్పింది జయ. 
"ఎవరుమే అనింది?" అడిగింది పెద్దొదిన.
"ఇంకెవరా, మీ తమ్ముడే"
"అందరూ ఒండేవాళ్ళయితే రుజ్జూసేదెవరని జెప్పలా నువ్వు" మేలమాడింది జానకి. 
"నువ్వుగూడా అట్టనే అంటావేందొదినా" ఉడుక్కుంది జయ. 
"గమ్మునుండండిమే, మనందరమూ కాపురానికొచ్చిన ఇన్నేళ్ళగ్గదా చేస్తండావ, ఆ పిల్లగూడా నేర్చుకుంటదిలే. అయినా ఆ పిల్ల గోసినట్టు కూరగాయలు ఎవరైనా కొయ్యగలరా అంట" సాయానికొచ్చింది పెద్దత్త. 

"పప్పుకు ఇన్ని మావిడికాయలు ఎందుకకా, అసలే ఈ కాయలు పులుసు రొడ్డు. రెండు జాలు." 
"సోలెడు పప్పుకు రెండు కాయలేడ జాల్తాయక్కా?"
"నువ్వట్ట జూస్తావుండు. పప్పుదిన్నాక అదే కరట్టనొప్పుకుంటావు"
"వదినా బూందీకి తోకలొస్తండాయ్ ఇటొచ్చి జూడోసారి." పెరట్లోంచి చిన్నక్క కేకేసింది.
"కాసిని నీళ్ళు చిలకరించి పల్సన జేద్దాం. సరోజా ఆ స్టీలు గిన్నెలో నీళ్ళు దీసకరా!" అని పిండిలో మరికాసిని నీళ్ళు కలిపింది జానకి.
"ఆ..ఆ..పిండి మరీ అలా రైలింజన్లా తొందరతొందరగా దిప్పమాకు. గూడ్సుబండిలా కాస్త మెల్లంగా దిప్పు జయమ్మా."
"ఆ ఇప్పుడు గుండ్రంగా ముత్యాల్లాగా వస్తున్నాయొదినా."
"అకా, ఈ పాకం సరిపోద్దా?"
"ఆ సరిపోద్ది, పాకం ముదిరితే లడ్డు పైన చక్కెర తెల్లంగా పేరుకు పోద్ది. తొందరగా పూస పోసెయ్ అందులో."
"దాన్నట్టా ఒదిలేసి ఇటు రండి, పచ్చడి నూరదాం. వేడిమింద చెయ్యి గాల్తది, బాగా ఆరినాక లడ్లు జుట్టొచ్చులే తొందర్లా."

"ఒదినా ఈ అల్లం, కొబ్బరా, మిరపకాయలూ కాస్త రోట్లో మెత్తంగా దంచీ."
"జానకా ఈ బీన్స్ కూర రుజ్జూడవే."
"నువ్వు బీన్సూ, చనగలు కలిపి కూరచేద్దాం అంటే "ఇదేం కూరా" అని కాస్త ఇచిత్రంగా అనిపించింది గానొదినా, కూర బెహ్మాడంగా కుదిరిందనుకో."
"పెదమ్మా పులుసుకిన్ని ముక్కల్జరిపోతయ్యా?"
"ఆ..అ.. చాల్లే, రాధమ్మోవ్ పులుసుగాస్త చింతపండు నానెయ్"
"రసంగూడా తీసి పెట్టానత్తా. నువ్వింక పొయ్యిమింద బాండలి పెట్టు."
"పిన్నీ ఇదిగో ఈ కొత్తిమీరాకు దుంచి చారులోఎయ్యి కమ్మని వాసనొస్తది." అందించింది జయ.
"ఆ గోంగోరపచ్చట్లో కాసిని ఎరగడ్డలేసి దంచు, కమ్మంగుంటది."
"పన్నెండు గావొస్తుంది, ఈ బీరకాయలకు చెక్కుదీసి చక్రాల్లా గుండ్రంగా కొయ్యి జయమ్మా." 
"బీరకాయ కూర మా అత్త బ్రహ్మాడంగా జేస్తది. అత్తచేతి వంట తిని శానా రోజులైంది. ఆ కూర నువ్వు చెయ్యత్తా." అప్పుడే వచ్చిన అత్తనడిగింది నిర్మల.
"తమ్ముడూ మరదలూ ఒస్తున్నారంటనా"
"ఇంట్లో వ్రతం జేసుకుంటా వుంటే వాళ్ళు రాకుంటే ఎట్టా"

               *                   *                   *                *

"ఏం జేస్తండారు. పనంతా ఐపోయిందా?" అంటూ వచ్చింది పద్మావతమ్మ.
"ఇచిత్రంగా మాట్టాడతండావే. నువ్వురాకుండా పనెట్టా పూర్తవుద్దా."
"నిన్నటినుండి వద్దామనుకుంటున్నానొదినా, యాడా పన్దేమిల్తేగా, ఆ పెద్దగిన్నిటీ కాసిని బంతిపూలు గోసుకొచ్చి మాలగడతా."
"నీ వొక్కదానివల్ల  యాడవద్ది, చెట్లానిండా ఇరగబూసుండాయు. పద నేంగూడొస్తా."
"శానా పూలైనాయే. మాల నేన్గడతాగాని నువ్వు ఇంటి ముందుర నీళ్ళుజల్లి ముకర్ర గీ."
"ఈ మామిడాకులు దీసకపొయ్యి గుమ్మానికి తోరణం కట్టన్నా."
"అందరూ కూర్చునేదానికి కుర్చీలు, బల్లలూ తేను బోతుండాం. ఇంకేమన్నుంటే ఇట్టీండి, కట్టేసి తొందరగ బొయ్యొస్తం."
"పూజ సామానంతా దీసుకొచ్చినట్టేనా! ఆ టెంకాయిటీ పీచు దీస్తా."
"పేరంటాల కివ్వడానికి జాకెట్ ముక్క, పుసూగుంకం, ఆకులు, వక్క రెండరిటిపళ్ళు పొట్లాలలో యేసినం. అంతేనా ఇంకేమైనా ఎయ్యల్నా"
"ఇచ్చేటప్పుడు స్వామికాడ పువ్వోటేసివ్వు. కాస్త నీళ్ళుబోసుకునొచ్చి అక్షింతల బియ్యం ఆ గిన్నెలో గలిప్పెట్టు. అట్టనే సాయంకాలం ప్రసాదానికి, పులుసన్నానికి రవ్వ, బియ్యం అన్నీ పక్కన కొల్చిపెట్టుకో. పనంతా అయినట్టేగా, ఇంక తొందరగా తయారవ్వండి. మేం ఇంటికిబోయి పిలకాయల్ని దీసుకొస్తాం."
"వచ్చినంక రొంత ఎసట్లో బియ్యం బొయ్యడం మర్చిపోబాక."
"అట్నేలె."

                   *                 *             *                *
         ఈ సందడంతా ఇరవై ఏళ్ళ క్రితం మా నాయనమ్మా వాళ్ళింట్లో అనుకుంటున్నారా...కాదండీ పోయిన వారం మేం వ్రతం చేసుకున్నాం. పిలుపులే తేడా సంభాషణలన్నీఅవే. ఈ కాలంలో అమెరికాలోకూడా ఇలాంటి వారి మధ్య ఉన్నామంటే ఎంతదృష్టమో కదా! సుమారుగా వంద మందికి ఇలా ఇంట్లోనే వంటలు చేసేశాం. ఆహుతులందరూ కూడా ఏదో ఒక సాయం అందించిన వారే! వంట, వడ్డన, కుర్చీలు, బల్లలు తేవడం, చివరకు మిగిలిన కూరలు సర్దడం వరకూ అన్ని పనుల్లో సహాయం చేశారు. మా ఊర్లో ఎవరింట్లో ఏ శుభకార్యమైనా ఇలాగే చేసుకుంటాం. పుజారిగారు శాస్త్రోక్తంగా పూజ చేయించారు. వ్రతానికి వచ్చినవారి గోత్రనామాలు అడిగి మరీ వారిని కూడా ఆ దేవుడికి పరిచయం చేశారు. పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుని అందరికీ తాంబూలాలివ్వడంతో వ్రతం పూర్తయ్యింది. 

               *                   *                   *                *

ఇంతకూ వ్రతానికొచ్చిన బంధు మిత్రులేమన్నారో చెప్పలేదు కదూ...

"వంటలన్నీ బ్రహ్మాడంగా కుదిరాయి."
"లడ్లు రుచి అమోఘం."
"వ్రతం చాలా బాగా చేయించారు. ఈ పూజారి గారిని మనూర్లో ఎప్పుడూ చూడలేదే."
"కొత్తగా వచ్చారండీ తెలుగు పూజారి కదా మన పద్దతులు అవీ వారికి బాగా తెలుసు."
"ముఖ్యంగా కథ చదవమని పేపర్లు మన చేతిలో పెట్టకుండా ఆయన చెప్పడం చాలా నచ్చింది."
"కార్తీక పౌర్ణమినాడు పూజారి గారికి మా ఇంట్లో వ్రతం చేయించడానికి  వీలవుతోందేమో కనుక్కోవాలి."












43 comments:

  1. జ్యోతిర్మయి గారు, నేను చదువుతూ ఇక్కడే ఈ నెల్లూరి జిల్లాలోని ఒక చిన్న ఊళ్లో చేసుకున్నారెమో అని అనుకున్నాను. ఎక్కడున్నా పద్ధతులు మాత్రం మారలేదన్న మాట.బావున్నాయి మీ ముచ్చట్లు.

    ReplyDelete
    Replies
    1. చిన్ని గారు ఎక్కడున్నా ఆంధ్రులమేనండీ. దూరంగా వుంటే మన భాషా, సంప్రాదాయాల పట్ల అదివరకుకంటే కూడా ఇష్టం పెరిగిపోతుంది. మా ముచ్చట్లు ఓపిగ్గా చదివి మీ అభిప్రాయం తెలియజేశారు. చాలా సంతోషం. ధన్యవాదాలు.

      Delete
  2. ఎంతో బాగుందండి.ఈ రోజుల్లో ఆ రోజుల్లానా... మీరు నిజంగా అద్రుష్టవంతులండీ!
    -దీరూశి

    ReplyDelete
    Replies
    1. దీరూశి గారు ఇక్కడ అందరం కలసిమెలసి సందడిగా సమయం గడిపిన ప్రతిసారి నాకదేభావం కలుగుతుందండి. ఇంతమంది ఆత్మీయుల మధ్య ఉండడం మా అదృష్టం. ధన్యవాదాలు.

      Delete
  3. Replies
    1. ధన్యవాదాలు అజ్ఞాత గారు.

      Delete
  4. శ్రీ సత్యన్నారాయణుని సేవకు రారండి, మనసారా స్వామిని కొలిచి హారతులీరండీ అంటూ పంచమి నాడు చేసుకున్నారనమాట! బాగు బాగు!
    నాకు కార్తీక బహుళ ఏకాదశి నాడు ఈ వ్రతం చేసుకోవడం అలవాటు. ప్రసాదం కాస్త ఇటు పంపండి :)

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞా చాలా రోజులకు కనిపించావు, కులాసానా..నీకు తెలియని పూజలు వ్రతాలు లేవుగా. నీ దగ్గరనుండి చాలా నేర్చుకోవాలి. ధన్యవాదాలు.

      Delete
  5. బాగుందమ్మాయ్! ప్రసాదమేదమ్మా :)

    ReplyDelete
    Replies
    1. బాబాయి గారు...మీరొచ్చారు నాకదే మహా ప్రసాదం.
      అక్కడ ప్రసాదం కూడా పెట్టాను, మీరలా కూర్చోండి నేను వడ్డిస్తాను. :) ధన్యవాదాలు.

      Delete
  6. జ్యోతి గారూ!బాగుందండీ...మీ ఇక్కడ భోపాల్ లో సామూహికంగా ౦ 30 కుటుంబాలు వ్రతం చేసుకున్నాం...పున్నమి నాడు...వంటలు...అన్నీ మేమే...పండుగలు వేరేచోట్లే బాగా జరుపుకుంటున్నామేమో అనిపిస్తోంది...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు మీరు కూడా మాలాగేనన్న మాట. ఎదురుగా ఉన్నప్పటికంటే దూరంయ్యేక వాటి విలువ బాగా తెలుస్తుందండి. ధన్యవాదాలు.

      Delete
  7. హ హా...పండక్కి నేరుగా నెల్లూరే బట్టుకెళ్ళారు మమ్మల్ని...కొబ్బరికాయ పీచు తీశారు సరే, ఇంతకీ టెంకాయ గొట్టారా? ;)
    పువ్వుల కుప్పా బాగుంది ;)
    తోరణాలూ భలే కట్టారు.
    అన్నీ కలసి మీ ఇప్పటి పూజ లో అప్పటి తీపి నెల్లూరు గురుతులు, చాలా బాగుండాయ్.

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ గారు మీది నెల్లూరే అనుకుంటాను, ఆ యాసలో మీరో టపా వ్రాస్తే చదవాలని వుండండి. మా పూలు, తోరణాలు, జ్ఞాపకాలు నచ్చినందుకు చాలా సంతోషం. కొబ్బరికాయలున్న ఫోటో గూగులయ్య ముందనుమతించలేదండి. మీరడిగారనేమో ఇప్పుడు కనిపిస్తోంది. ధన్యవాదాలు.

      Delete
  8. వావ్ నిజంగా ఆశ్చర్య పరచారండీ.. నేను పోస్ట్ చదువుతూ.. చివర్లో ఒకప్పుడు ఇంత సందడిగా జరిగేవి ఇపుడంతా టేప్ రికార్డర్ మంత్రాలు హోటల్ తిళ్ళూనూ అని కంక్లూడ్ చేస్తారని అనుకున్నాను. మీరు రాసింది చూసి చాలా సంతోషించాను. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మీఅందరి ఓపికకి జోహర్లు అభినందనలండీ.

    ReplyDelete
    Replies
    1. వేణు గారు ఈ ఊరొచ్చి తరువాత అలా పెద్ద స్టవ్ లమీద పెద్ద గిన్నెలు పెట్టి తలా ఒక పని అందుకుని చేస్తున్నప్పుడల్లా మా చిన్నప్పటి ఊరు గుర్తొస్తుందండి. అందుకే ఈ అనుభూతలను ఆ జ్ఞాపకాలతో కలిపి వ్రాశాను. పాల్గొన్న ప్రతివారు ఈ టపా చదువుతారు. మీ అభినందలకు మా ధన్యవాదాలు.

      Delete
  9. ఆయ్..పూజా, వ్రతం, నైవేద్యం, భోజనం, తోరణాలు అన్నీ చాలా బాగున్నాయండీ. ఈ టపా రాసినవారికీ, చదివినవారికీ కూడా ఆ సత్యనారాయణస్వామి అనుగ్రహం కలుగుగాక...ఆయ్...

    ReplyDelete
    Replies
    1. శ్రీ లలిత గారండీ మీరు సల్లని మనసుతో కోరుకున్నారు కదండీ. తప్పకుండా మంచే జరుగుతుందండీ. ధన్యవాదాలండీ...ఆయ్.

      Delete
  10. ఆయ్..పూజా, వ్రతం, నైవేద్యం, భోజనం, తోరణాలు అన్నీ చాలా బాగున్నాయండీ. ఈ టపా రాసినవారికీ, చదివినవారికీ కూడా ఆ సత్యనారాయణస్వామి అనుగ్రహం కలుగుగాక...ఆయ్...

    ReplyDelete
  11. మీ సత్యనారాయణ వ్రతం హడావిడి బాగుందండి . ఫొటోలు కూడా బాగున్నాయండి .

    ReplyDelete
    Replies
    1. మాలా కుమార్ గారు మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

      Delete
  12. చాలా బావుంది. చదువుతూ.. నెల్లూరికి పోయొచ్చాను . వెనక్కొచ్చి టపీ మని అమెరికాలో ఉన్న ఇంట్లో పడి ..ఈ జ్యోతమ్మ మాహా చతుర గత్తె .. అనుకున్నాను.

    :) :)

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్య పెట్టడంలో మీకు మీరే సాటి వనజ గారు థాంక్యు.

      Delete
  13. నాకు చివరి ఫోటో బాగా నచ్చింది,.మాకు పెట్టకుండా తినేసారా.....

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారు లేదండీ మీకూ వుంచాము. మీరు ఎప్పుడొస్తే అప్పుడే పెట్టేస్తాం. ధన్యవాదాలు.

      Delete
  14. చాల బాగుందండి. చదువుతున్నంత సేపూ నెల్లూరులోని మా ఇల్లు, పక్కింటి అక్క, ఎదురింటి ఆంటీ వాళ్ళు, ఇలా మా వీధి లో వాళ్ళందరూ నా చూట్టూ నిలబడి మాట్లాడుతున్నట్లున్నింది.ఇప్పటికి కూడా మా వీధిలో ఎవరింట్లో ఫంక్షన్ అయిన చుట్టుపక్క వాళ్ళందరం అది మా సొంత ఇంట్లో జరుగుతోంది అన్నట్లు కలుస్తారు.

    ReplyDelete
    Replies
    1. స్వాతి గారు స్వాగతమండీ. మిమ్మల్ని ఇక్కడ చూడడం చాలా సంతోషంగా వుంది. మీది నెల్లూరేనా...మీరు ఇలాగే కలుస్తుంటారన్నమాట. అందరమూ కలిస్తేనే కదండీ, ఏ పండగైనా వేడుకైనా నిండుగా ఉండేది. ధన్యవాదాలు.

      Delete
  15. భలే రాసారండీ.. చాలా సరదాగా అనిపించింది చదువుతుంటే..
    మీ ఇంట్లో వ్రతం జయప్రదంగా జరిగిందన్నమాట.. ఫోటోలు బాగున్నాయి.

    ReplyDelete
    Replies
    1. మధుర గారు పోయిన వారం అంతా అలా సరదాగా గడిచింది. కుటుంబసభ్యుల సమక్షంలో వ్రతం చేసుకున్నట్లుగా అనిపించింది. థాంక్యు.

      Delete
  16. మేము కూడా కార్తీక పౌర్ణమి రోజు కేదారీశ్వర వ్రతం చేసుకుంటామండీ..
    మీ సత్యనారాయణ స్వామి వ్రతం కబుర్లు,పూల అలంకరణ అన్నీ బాగున్నాయి..

    ReplyDelete
    Replies
    1. రాజి గారు కార్తీక పౌర్ణమి రోజు చేసుకోగలిగారు...అదృష్టవంతులు. మా కబుర్లు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

      Delete
  17. ఓ నలభై ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయాను.
    బావుందండీ మీ టపా. 99.9 మార్కులు. ఆ కాస్తా ఎందుకు తగ్గిందంటే, వడ్డన కూడా ఆ పద్ధతిలో చేస్తే.......దహా.

    ReplyDelete
    Replies
    1. సుబ్రహ్మణ్యం గారు వడ్డన కూడా చేయాలని చాలా ప్రయత్నించామండీ. వాతావరణం అనుకూలిస్తుందో లేదో అన్న సందేహంలో ఆగిపోయాము. నవంబర్ అంటే మాకు చాలా చలి కదా. మీరిచ్చిన మార్కులతో నేను బోలెడు సంతోషపడ్డాను. ధన్యవాదాలు.

      Delete
  18. హెల్లొ చాలా బావుందండి మీ ఇంట్లొ సందడి.నాకు మీ వూరు మారి పొవలని వుంది అర్జెంట్గా...

    ReplyDelete
    Replies
    1. అజ్ఞాత గారు త్వరగా వచ్చేయండి, ఆలస్యం ఎందుకు. నేను చెప్పినదానికన్నా ఎంతో బావుంటుంది మా ఊరు. ధన్యవాదాలు.

      Delete
  19. సంతొషంగా అనిపించింద, చాలా బాగుంది. అప్పుడె అయిపొయిందా అనిపించింది

    ReplyDelete
    Replies
    1. మొరాజ్ గారు మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

      Delete
  20. Replies
    1. కృష్ణప్రియ గారు ఓపిక చేసుకుని బ్లాగులో ఇవాళ చాలా చదివినట్లున్నారే...మీ అభిప్రాయం చెప్పినందుకు బోలెడు ధన్యవాదాలు.

      Delete

  21. వ్రతం చాలా బాగా చేసుకున్నారన్నమాట....

    నిజమే దూరంగా ఉన్నప్పుడు ప్రేమ కాస్త ఎక్కువగానే ఉంటుంది మరి...

    ReplyDelete
    Replies
    1. సత్యం చెప్పారు. ధన్యవాదాలు మాధవి గారు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.