Monday, December 31, 2012

రాళ్ళు

"లక్ష్మీ నేను ఆఫీసుకు వెళ్తున్నాను తలుపేసుకో" చెప్పులు వేసుకుంటూ చెప్పాడు సుబ్బారావ్. "అలాగే" పెరట్లోనుండే చెప్పింది లక్ష్మి. కాసేపటికి వాకిట్లో 'అమ్మా'అంటూ కార్తీక్ ఏడవడం వినిపించింది. "ఏమైంది నాన్నా" అంటూ హడావిడిగా వచ్చిన లక్ష్మికి కార్తీక్ కింద కూర్చుని కాలు పట్టుకుని ఏడుస్తూ కనిపించాడు. దగ్గరకు వచ్చి లేపబోతే కాలు పట్టుకుని బాధతో విలవిలలాడిపోయాడు కార్తీక్.
"అయ్యో కాలు బాగా నొప్పి చేసినట్లుందే?" అనుకుని గబగబా పిల్లాణ్ణి చేతుల్లో ఎత్తుకుని అటో కోసం వీధిలోకి వచ్చింది. ఇంతలో గోడ అవతల నుండి "లక్ష్మీ ఎందుకమ్మా బుజ్జిగాడు ఏడుస్తున్నాడు?" అని అడిగారు పిన్నిగారు.
"కింద పడ్డాడు పిన్నీ కాలు బాగా వాచింది. హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాను." చెప్పింది లక్ష్మి.
"అయ్యో మీ ఇంటి ముందున్న రాయే తట్టుకుని ఉంటాడు. అయినా అమ్మాయ్ నేను చెప్పానని కాదుగాని ఇంటిముందు మట్టి వాకిలి వున్నట్టయితే దెబ్బ తగిలేది కాదుగా ఏదో ఫాషనని మీరంతా రాళ్ళేయిస్తున్నారు కాని...." గోడ మీద నుండి చూస్తూ అన్నారావిడ. 
వీధిలో కూరలు కొనడానికి వచ్చిన విమలకు లక్ష్మి హడావిడిగా ఆటోలో వెళ్ళడం కనిపించింది. 
"ఏంటి పిన్నిగారు లక్ష్మీ అలా వెళుతుంది? ఏమయింది?" అని అడిగింది.
"బుజ్జిగాడు పడ్డాడు విమలా కాలు బాగా వాచింది. లక్ష్మి హాస్పిటల్ కు తీసుకుని వెళ్తుంది." చెప్పారు పిన్నిగారు. 

"ఓ అలాగా పిల్లలు పడ్డం మామూలేగా మా వాడయితే రోజుకు పదిసార్లన్నా పడుతుంటాడు. ఆ మాత్రం దానికి హాస్పిటల్ కి పరిగెత్తాలా" నిర్లక్ష్యంగా అంటూ లేత బెండకాయలు ఏరుకోవడం మొదలెట్టిది విమల.  

పిన్నిగారు లోపలకు వెళ్ళడంతోటే విమల హడావిడిగా బయలుదేరి సరళ ఇంటిముందు ఆగి "సరళా కార్తీక్ పడ్డాడట వాడికి కాలు విరిగిందట. బహుశ కాలు కూడా తీసేయాలంటారేమో" అప్పటి వరకు బలవంతంగా దాచుకున్న వార్తకు కొంత రంగులు కలిపి చేరవేసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.
"విరగదూ మరి. అయినా పెద్దవాళ్ళ తప్పులు ఊరికే పోతాయా! చిన్నపిల్లలకు ఇలాగే చుట్టుకుంటాయ్" నిన్న తనను పిలవకుండా లక్ష్మి సినిమాకు వెళ్ళిన అక్కసు తీర్చుకుంది సరళ. 
"బాగా చెప్పావ్, అయినా ఎంత డబ్బుంటే మాత్రం మిడిసిపాటు కాకపోతే ఇంటి ముందు అలా రాళ్ళేయించుకుంటారా" బాగా అయ్యింది అని పైకి అనలేక మనసులో అనుకుంటూ వాళ్ళ పోర్షన్ లోకి వెళ్ళిపోయింది విమల.
సరళ వెళ్లి ఈ విషయం వాళ్ళాయనతో చెప్పగానే అయన "వాడికి దూకుడెక్కువ ఏదో ఒక రోజు ఇలా అవుతుందనే నేను అనుకుంటూనే ఉన్నాను" అన్నాడు. 
ఆయన ఆఫీసుకు వెళ్ళడంతోటే అప్పారావు పిలిచి ఈ విషయం గురించి చెప్పాడు. 
అప్పారావు "మన దేశంలోనే ఈ దరిద్రం అంతా. అదే అమెరికాలో అయితే పిల్లలున్న ఇంట్లో అసలే రాళ్ళే వెయ్యకూడని చట్టముందట. ఎప్పటికి బాగు పడతామో మనం" నిట్టూర్చాడు.
అంతా వింటున్న పక్క సీట్లోని మహేష్ "అసలు తప్పంతా మన ప్రభుత్వానిదేనండి కంపెనీల దగ్గర లంచాలు తీసుకుని నాసిరకం రాళ్ళ తయారికి ఆమోద ముద్ర వేస్తే అవి పైకి లేచి ఇలాంటి ఘోరాలే జరుగుతాయి." ఆవేశం వెళ్ళగక్కాడు. 

"పిలకాయలు అంతేనండి ఎంత చెప్పు పరిగెత్తకుండా ఉండరు, ఏం చెప్పినా అనవసరం... వాళ్ళని మార్చడం దేముడి తరం కూడా కాదు, ఇక మన వల్ల ఏమౌతుందండి" నిరాశ
చుట్టూరా చల్లేశాడు జనార్ధన్.
"ఒక్కళ్ళనని ఏం లాభం. అసలు సమాజమే ఇలా తయారయ్యింది. దీన్ని మార్చాలనుకోవడం మన బుద్ది తక్కువ." వంత పాడాడు రామ్మూర్తి .
"మీరెప్పటికీ మారరా జరిగిన ఘోరం చూస్తే కడుపు తరుక్కుపోతుంది. 
"ముక్కుపచ్చలారని పిల్లాడు వాడు 
పరిగెత్తి పరిగెత్తి పడ్డాడు చూడు 
ఓ భూదేవి నీకు కరుణ లేదా 
ఓ సుడిగాలి నీకు దయ రాదా" అంటూ వెంటనే ఓ కవిత అల్లేశాడు
హరి.
బుజ్జిగాడి తండ్రి సుబ్బారావు కూడా అదే ఆఫీసులో పనిచేస్తున్నాడు. విషయం ఆయన దగ్గరకు వచ్చే సరికి పిల్లాడి వివరాలు మారిపోయాయి. "అసలు వాడి తల్లిదండ్రులను అనాలి పిల్లల్ని పట్టించుకోకుండా వీధిలో వదిలేయడం ఈ మధ్య ఫాషన్ అయిపోయింది." నాలుగు పడికట్టు పదాలు వాడేశాడు.

       ఆ రాయి అక్కడ ఎప్పటినుండో వుంది, ఆ మాటకొస్తే  ఆ వీధి వీధంతా రాళ్ళే పెద్దవాళ్ళు కూడా తట్టుకున్న సందర్భాలు వున్నాయి. ఎవరికీ వాళ్ళు తప్పుకుని పక్కన పోతూ వున్నారు. ఏదో ఒకరోజు ఇలాంటివి ఎదుర్కుంటారని తెలియందేమి కాదు అయినా కొత్తగా ఆశ్చర్యపోతున్నాం?(నటిస్తున్నామా?). 

      ఒక్కరంటే ఒక్కరైనా ఆ పిల్లాడికా దెబ్బ తగలడానికి  కారణమేంటి? వెళ్లి చూద్దామని కాని....ఏ రాయి తగిలి పడ్డాడు? ఒకవేళ రాయి తగిలి పడితే ఆ రాయి ఎక్కడుంది? దాన్ని పక్కకు తీద్దామన్నఆలోచన చేయలేదు. జరిగిన విషయం తెలుసుకోవాలి, పక్కవాళ్ళకు చెప్పాలన్నకుతూహలం మాత్రం మెండుగా వుంది అందరికీ. మన బాధో, ఆక్రోశమో అందరితో పంచుకోవాలి. అలా కాక ఏ ఒక్కరు నడుం కట్టినా నలుగురు కలసి ఆ రాయిని పెకిలించి మరో పదిమంది పిల్లలు పడకుండా చేయగలిగి ఉండేవారు. అది ఒక్కింటి సమస్య కాదు కాబట్టి వీధి వీధే కాదు ఆ ప్రక్షాళణ దేశంమంతా జరిగుండేది.

      ఎవరి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు వెళ్లబోసుకున్నారు. అక్కసు తీర్చుకున్నారు. ఆ వార్త కాలక్షేపం బఠాని అయ్యింది. సాయంత్రానికల్లా ఆ విషయమే మరచిపోయారు. నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోయారు. 
మరి మనమో...

      

24 comments:

  1. మనమూ ఆ బఠాణీలు కాస్త తినేసి నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోదాం పదండి ;)
    పిలకాయలూ అంతే, లోకం తీరూ అంతే, ఏం చేస్తాం!
    జ్యోతిర్మయి గారూ, మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ గారు మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. లోకం తీరు అంతే అని ఊరుకోవలనిపించడం లేదండి. ధన్యవాదాలు.

      Delete
  2. Replies
    1. ధన్యవాదాలు శ్రావ్య గారు.

      Delete
  3. హ్మ్...నిజం గడప దాటే లోపు అబద్దం ప్రపంచం చుట్టేసి వస్తుంది అంట.
    ఆ రాయి తీస్తే సరి పోతుంది అని ఎవరూ ఆలోచించరు.బాగా వ్రాసారు

    ReplyDelete
    Replies
    1. శశి కళ గారు ఈ సామెత ఎప్పుడూ వినలేదు. ఎంత నిజం కదా..రాళ్ళేరే పని మనమే మొదలుపెడదాం. ఏమంటారు? థాంక్యు.

      Delete
  4. అక్షరసత్యం ... చెప్పారు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్రీలలిత గారు.

      Delete
  5. మరి మనమో ? జ్యోతిర్మయీ గారు,

    రాయి పడ్డ దన్న విషయం గురించి కామెంట్ల తో చెండాడి, ఆ పై మరిచి... ఇది ఎట్లా అంటే,

    అర్ధ రాత్రి దాక మేలుకుని ఉండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ఆ పై పొద్దంతా నిద్దుర పోతా మన్న మాట.! మరి అట్లా..

    ఆలోచించ దగ్గ విషయం రాసేరు.

    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు జీవితాన్ని పక్కన పెట్టి ఆలోచించక్కర్లేదు. దాన్ని ఒక భాగంగా తీసుకుందాం. అందరూ మన పిల్లలే కదండీ. ఏమంటారు? ధన్యవాదాలు.

      Delete
  6. కర్రు కాల్చి వాత పెట్టినా మారరుగాక మారరు

    ReplyDelete
    Replies
    1. బాబాయి గారు అలా అనడండి. నిరాశ మనల్ని నీరుగార్చేస్తుంది. కొన్ని విషయాలు నేర్చుకోవడానికి సమయం పడుతుంది. చెప్పే ఓపిక మనకుండాలి. ధన్యవాదాలు.

      Delete
  7. మనం మాత్రం ఏం ఉంది గనక, ఈ రాయి గాపోతే ఇంకో రాయి. అంతేకదా.
    పనిలో పని, మీకు, పిల్లలకు, అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
    Replies
    1. జయ గారు ఏ రాయి లేని శుభ్రమైన రహదారి ఏర్పాటు చేయడానికి మనవంతు కృషి మనం చేద్దాం. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

      Delete
  8. Replies
    1. శిశిర గారు బావున్నారా? మీ బ్లాగ్ కనిపించడం లేదేమండి?

      Delete
  9. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జ్యోతిర్మయి గారు.. :)

    ReplyDelete
    Replies
    1. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు శోభ గారు.

      Delete
  10. అనవసరమైన వాటికి అతిగా స్పందించడం నిజ్జంగా అవసరమైన చోట చోద్యం చూడడం భారతంలో సహజం అయిపోయిందండి. ఢిల్లీ సంఘటన తలచుకుంటేనే వెన్నులో చలి వేస్తుంది. ఆపద లో ఉన్న ఆ జంటని ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదుకానీ ఆ అమ్మాయి చావుబతుకుల్లో ఉన్నప్పుడు మాత్రం అందరూ ఉద్యమలబాట పట్టారు. దేశంలో చదువులు ఉద్యోగాలు ఇప్పించే కార్ఖానాలు అయిపోయాయి కానీ కాస్తంత సంస్కారం, బాధ్యతలు నేర్పడంలో పూర్తిగా మర్చిపోయాయి. మా తరం (80-90) వరకు స్కూళ్ళల్లో కాస్త మంచిచెడు చెప్పేవాళ్ళు ఇప్పుడవి బొత్తిగా అవసరంలేని అంశాలయిపోయాయి. స్కూళ్ళల్లో నేర్చుకున్న ఆ మంచితనమే పరాయిదేశంలో నలుగురికి చేతనైన సయం చేసే బుడ్డి నేర్పింది. దాన్ని ఈతరం వారికీ చేరేసే బాధ్యత పెద్దలదే.

    ReplyDelete
  11. హై హై నాయక గారు ఈ తరం వారికి చేరేసే బాధ్యత మనదేనని బాగా చెప్పారు. ఎవరికి వారు నిజాయితీగా ఉండాలనే జ్ఞానం అలవరచుకోవాలి. అశ్లీలత పెరిగిపోతోందంటూ అశ్లీల చిత్రాలను ప్రచురించే పత్రికలను నిలదీయనంతకాలం ఈ పరిస్థితిలో మార్పు రాదు. అదొక్కటే కాదు ఎన్నో కారణాలు మన గోతులు మనమే తవ్వుకున్తున్నాం. థాంక్యు.

    ReplyDelete
  12. వాస్తవాన్ని చాలా బాగా ప్రజంట్ చేశారండీ...

    ReplyDelete
  13. నిజమే... ఈ రోజుల్లో అలా ఆలొచించేవారు తక్కువే అని చెప్పాలి...

    ReplyDelete
    Replies
    1. మనదాక వచ్చినప్పుడు చూద్దాంలే అనికాక, అందరూ మనవాళ్ళే అన్న ఆలోచన వచ్చిన రోజున చాలా సమస్యలు వాటంతట అవే సమసిపోతాయండి. ధన్యవాదాలు మాధవి గారు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.