Sunday, December 9, 2012

బూచాడు

         మొదటిసారిగా నిన్ను సరోజా వాళ్ళింట్లో అనుకుంటాను చూసింది. నీ గురించి అప్పటికే సరోజ ద్వారా చాలా వినున్నానేమో నిన్ను చూడగానే ఇదీ అని చెప్పలేని భావమేదో మనసంతా నిండిపోయింది. పెరట్లో పువ్వులు కోయడానికి వెళ్ళినపుడు నువ్వు ఎవరినో పిలవడం వినిపించింది. శ్రావ్యమైన ఆ పిలుపు విని నీ స్వరంలో అమృతం దాగుందేమో అనిపించింది. ఆ తరువాత నిన్ను అక్కడా ఇక్కడా చూస్తూ వచ్చాను. నీ మీద నా అభిమానం కూడా రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. నిన్నెలాగైనా మా ఇంటికి తీసుకువెళ్ళాలని స్థిరంగా నిశ్చయించుకున్నాను.

         ఆ లోగా నాకు పెళ్లిచూపులు...పెళ్ళి నిశ్చయమవడం కూడా జరిగిపోయింది. ఆ సమయంలో నువ్వు నా దగ్గరుంటే బావుండునని ఎంతగా అనిపించిందో తెలుసా. కాపురం పెట్టిన కొత్తల్లో కేవలం నీ కోసమే అర్ధరాత్రి.. అపరాత్రి చీకటిలో, చలిలో సైతం లెక్కచేయక చాలా దూరాలు ప్రయాణం చేశాం. ఏమాటకామాటేలే మా ఊరి ముచ్చట్లన్నీ నీవల్లనేగా తెలిసేవి మరి.

       ఆ తరువాత ఓ నాలుగేళ్ల కనుకుంటాను, తలవని తలంపుగా నువ్వే మాయింటికి వచ్చావు. ఎన్నాళ్ళుగానో నీ కోసం ఎదురుచూశానేమో ఎంత సంతోషపడ్డానో మాటల్లో చెప్పలేను. మా వారికి కూడా నీవంటే అభిమానం ఏర్పడింది. బంధు మిత్రులందరినీ పరిచయం చేశాం, నువ్వు కూడా మా కుటుంబంతో పూర్తిగా కలిసిపోయావు. అన్నట్టు నీకు ఎవరినైనా ఇట్టే పరిచయం చేసుకునే నేర్పు వెన్నతో పెట్టిన విద్య కదూ! నీ తోడుగా వున్నామేమో ఎక్కడెక్కడి వారో స్నేహితులయ్యారు. ఆ తీయ్యని కబుర్లలో మునిగి పోయి వారే మాకు ప్రాణ స్నేహితులు, అత్మీయులు అన్నంతగా ఊహించేసుకున్నాం. ఆ రోజులన్నీ ఎడతెగని కబుర్లతో నిండిపోయేయి.

      ఒకరోజు బహుశా మా పెళ్ళిరోజనుకుంటాను, నా కెంతో ఇష్టమైన పెసర పచ్చరంగు పట్టుచీర కట్టుకుని కనకంబరాలు పెట్టుకుని గుడికి వెళ్దామని తయారయ్యాను. ఓ అరగంటలో బయలుదేరతామనగా నువ్వు ఏదో పను౦దని  వారిని పిలిచావు. అంతే....సాయంత్రం కరిగి రాత్రియినా తనకా స్పృహే కలుగలేదు. ఎదురు చూసి చూసి  విసిగిపోయి మెల్లగా ఆ చీకటి రాత్రి వంటరిగా ఆలోచిస్తూ గడిపాను. దానికి కారణం నువ్వని అర్ధమయ్యాక నీ పట్ల కొంచెం నిర్లక్ష్యం ఏర్పడి నువ్వు పిలిచినా విననట్లుగా నటించడం మొదలు పెట్టాను. రోజులు, నెలలుగా, నెలలు సంవత్సారాలుగా మారాయి.

       ఇన్నాళ్ళుగా మాతో కలసివున్నావు, ఈ రోజున ఇష్టం ఉన్నా లేకున్నా నీ మీద ఆధారం పడడం ఎక్కువయింది. అసలు ఆలోచిస్తే నువ్వు రాకముందు వరకు ఎంతో జీవితం సరదాగా ప్రశాంతంగా వుందనిపించింది. అనిపించడం ఏమిట్లే...పిల్లలతో కలసి ఏటి గట్టున షికార్లు, తోటలలో విహారాలు అన్నీ వాస్తవాలేగా! మా చుట్టూ ఉన్న ఆత్మీయులతో సంబంధాలు తగ్గిపోయాయన్న సంగతి చాలా ఆలశ్యంగా అర్ధమైంది. మా సౌకర్యం కోసమే నువ్వున్నావనుకున్నాం కాని, మా సంతోషాన్ని దోచుకు౦టున్నావని తెలిశాక అప్రమత్తంగా వుండాలని తగు చర్యలు తీసుకువాలని నిర్ణయించుకున్నాం.

       నువ్వు మహా తెలివైనవాడివి సుమా! రెండు వైపులా పదునున్న తేనె పూసిన కత్తివి. మమ్మల్నిక ఏమీ చెయ్యలేవని అర్ధం అయిన వెంటనే మా పిల్లల్ను నీ వైపు తిప్పుకున్నావ్. ఎంతగా అంటే నువ్వు తప్ప ప్రపంచంలో ఇంకెవరూ అక్కర్లేనంత. ఏం మంత్రం వేశావో తెలియదు కాని వాళ్ళు నీ సమక్షంలో తప్ప మిగిలిన సమయంలో బాహ్య ప్రపంచంతో మాట్లాడడమే మానేశారు. అసలు వారి చుట్టూ ఏం జరుగుతుందో కూడా గ్రహించే స్థితిలో లేరు. ఇరవై నాలుగు గంటలు నీ నామ స్మరణే నిన్ను చూడకుండా వుండలేని విధంగా వారిని తయారు చేశావ్.

      మా మీద నీ అసూయ ఏ స్థాయికి చేరిందంటే మా పిల్లలు మాతో సరదాగా గడపడం కూడా చూడలేకపోయావు. వారికి చివరకు మేమన్నా, మా మాటన్నా భరించలేని స్థితికి వచ్చారు. అది ఆసరాగా  చేసుకుని రకరకాల ఆటపాటల ప్రదర్శించి వారిని పూర్తిగా నీ బానిసలుగా చేసుకున్నావు. నిన్ను అభిమానించినందుకు ఇదా నువ్వు మాకు చేసిన ఉపకారం, నమ్మించి మోసం చెయ్యడమంటే ఇదే కదూ!

     ఆనాడేదో "బూచాడమ్మా బూచాడు బుల్లి పిట్టలో వున్నాడు" అని నీ గురించి సరదాగా పాటలు పాడుకున్నాం. కాని ఈ నాడు మా పిల్లల్ని ఇలా ఎత్తుకెళ్ళిపోయే బూచాడివని మాకు తెలియకనే పోయనే! మనిషికి మనిషికి మధ్య కనిపించని అడ్డుతెరలు వేలాడదీశావు. ప్రతి మనిషిని నీ సొంతం చేసుకుని మా బలహీనతలతో ఆడుకుంటున్నావు. ఎక్కడికెళ్ళినా, ఎంత వినకూడదనుకున్నా చెవిన పడే నీ వికటాట్టహాసాలు నాకు భయం కలిగిస్తున్నాయి. ఒకనాడు గదిలో ఓ మూలన పడివుండిన నువ్వు ఈనాడు ప్రతి వ్యక్తి చేతిలోనో, జేబులోనో కూర్చుని గర్వంతో విర్రవీగుతున్నావు.

    ఎదురుగా వున్న మనిషితో కళ్ళలోకి చూస్తూ మాట్లాడే అనుభూతి నిన్ను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడితే వుంటుందా! కావలసిన మనిషితో ఉత్తరాలలో వ్యక్తీకరించే భావప్రకటన నిన్ను మద్యవర్తిగా చేసుకుంటే వస్తుందా! నీ ఇనుపచెర వదిలే రోజు రావాలని మళ్ళీ ఉత్తరాలు, ఎదురుచూపులతో వియోగాన్ని, విరహాన్ని అనుభవించాలని, మానస వీణలు మోహనరాగాలు అలపించాలని కోరుకుంటున్నాను.

40 comments:

  1. అమ్మాయ్! సెల్ఫోన్ బూచాణ్ణి మాటల్లో దాచేశావ్

    ReplyDelete
    Replies
    1. ఆ శక్తే నాకుంటే నిజంగా దాచేస్తాను బాబాయ్ గారు. ధన్యవాదాలు.

      Delete
  2. మనిషిలోని ఆలోచనలు,
    మనిషి అవసరాలు తెలిపే ఆ సాధనం
    అవసరానికి ఉపయోగపడుతూ సాంకేతిక పరంగా
    ఏంతో అభివ్రుది చెందుతూ
    నేడు మనిషి జీవితంలో ఎంతగా అక్రమించిందో
    అది లేనిదే మనుగడే లేనంతగా అక్రమించిందో
    ఉపయోగాలతో పాటు బాంధవ్యాలు ఎలా దూరం చేస్తుందో
    జగమెరిగిన సత్యమే....


    ఫోన్ మాధ్యమాన్ని గురించి చక్కగా చెప్పారు

    ReplyDelete
    Replies
    1. మణి గారు నా బ్లాగుకు స్వాగతమండీ. మీరూ నాతో ఏకీభవిస్తున్నారన్నమాట. ధన్యవాదాలు.

      Delete
  3. ముమ్మాటికి నిజం. ఒకప్పుడు దురభారాలను దగ్గర చేసే పరికరంగా పరిచయమై, ఇప్పుడు దానికి బానిసైపోయేలా చేసుకుంది ఈ స్పర్శ లేని పలకరింపు

    ReplyDelete
    Replies
    1. ప్రవీణ గారు ఒక్కోసారి చాలా బాధనిపిస్తూ వుంటుంది. ఆ ఫలితమే ఈ టపా. ధన్యవాదాలు.

      Delete
  4. ఎంత బాగ రాసారు..
    నిజంగానండి..ఆ బుచాడివల్లే
    దగ్గరి బంధాలు దూరమవుతున్నయి..
    దూరపు సొదలు దగ్గరవుతున్నయి..
    నిజంగా మళ్ళీ ఉత్తరాలొస్తే బాగుండు..:(

    ReplyDelete
    Replies
    1. ధాత్రి గారు రాయడం మొదలుపెడితే సరి. ధన్యవాదాలు.

      Delete
  5. భలే రాస్తారండి మీరు..మీ శైలి నాకిష్టం. భాగుంది :)

    ReplyDelete
    Replies
    1. శిశిర గారు నచ్చినందుకు చాలా సంతోషం. మీలాంటి వారి వ్యాఖ్యలే ఈ రాతలకు స్ఫూర్తి. ధన్యవాదాలు.

      Delete
  6. """కావలసిన మనిషి తో ఉత్తరాలలో వ్యక్తీకరించే భావ ప్రకట నిన్ను మధ్య వర్తి గా చేసుకుంటే వస్తుందా?""
    Brilliant write up జ్యోతి గారు..:-)Just wow..:-)

    ReplyDelete
    Replies
    1. నాగిని గారు ఆ భావ వ్యక్తీకరణ కలం పడితేనే కదండీ వచ్చేది. ధన్యవాదాలు.

      Delete
  7. బాగుందండి.....నేను మొదట టి.వి. అనుకున్నాను,....ఫోన్,మొబైల్ పై చాలా మంచిగ రశారు,20 ,30 యెళ్ళు వెనక్కి వెళితే బాగనే ఉంటుంది ..... (కాని నాదొక సలహా....కాంగ్రెస్ కి వోట్ వెయండి...బ్యక్ టొ వెదాస్ అనకుండా అభివృద్ధి కుంటు పర్చి మళ్ళీ ఆ పాత రోజులకి తీసుకు పోతుంది అని నా అనుమానం.)

    ReplyDelete
    Replies
    1. అజ్ఞాత గారు వెనక్కి వెళ్ళడం అంటారా....గుండ్రంగా తిరిగి అది ముందడుగు అనుకుందాంలెండి. ధన్యవాదాలు.

      Delete
  8. Replies
    1. వనజ గారు టపా వ్రాసి మీ వ్యాఖ్య కోసం చూడడం అలవాటుగా మారింది. మీ ప్రోత్సాహానికి బోలెడు ధన్యవాదాలు.

      Delete
  9. బాగుంది.
    మొబైల్ కంటే టివి కే ఎక్కువగా సరిపోలుతుంది.
    అనవసరంగా వాడకపోతే మొబైల్ వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది.
    కాని టివి వల్ల పెద్దగా ఉపయోగమే లేదని చెప్పచ్చు.

    ReplyDelete
    Replies
    1. బోనగిరి గారు నా బ్లాగుకు స్వాగతమండీ. మీరు చెప్పిందీ నిజమేనండి. కాకపోతే అవసరం కంటే ఆర్భాటం కోసమే వాడడం మొదలుపెట్టి ఆ తరువాత దాని చేతిలో కీలుబొమ్మలైపోయాము. ధన్యవాదాలు.

      Delete
  10. మీదైన బాణీ లో మళ్ళీ సపెన్స్ తో నడిపించారు...బూచాడమ్మా పాటతో ఈ బూచాడెవరో అర్ధమయిపోయింది.
    బాగుంది సరదాగా.

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ గారు ఈ బూచాడి అల్లరి మరీ ఎక్కువై పోయిందండీ. ఎవరైనా అట కట్టిస్తే బావుణ్ణు. ధన్యవాదాలు.

      Delete
  11. Replies
    1. విజయమోహన్ గారు ధన్యవాదాలండీ.

      Delete
  12. చాలా బాగుందండీ... నేను చంద్రుడేమో అని ఊహించాను...మొదట.. ;) ;)

    ReplyDelete
    Replies
    1. రాజ్ గారు ఆ ఊహ కూడా బానే ఉందండోయ్. ధన్యవాదాలు.

      Delete
  13. చాలా బాగుంది....టీవీ , మొబైల్, కంప్యూటర్ (ఇంటర్నెట్).....ఎన్ని ఊహలు వచ్చాయో మనసులో...:)

    ReplyDelete
    Replies
    1. కావ్యాంజలి గారు స్వాగతమండీ. చివరకు సరిగ్గా ఊహించగలిగారు. :-) ధన్యవాదాలు.

      Delete
  14. ఎప్పటిలాగే మీదైన శైలి లో మొబైల్ గురించి చెప్పేశారు...అభినందనలు...
    o రెండు లైన్లు వ్రాస్తున్నా...

    (మొబైల్ కింద పడింది....గదినిండా ముత్యాలే...

    మొబైల్ కి నీ మాటంటే ఎంతిష్టమో!...సైలెంట్ లో కూడా మోగేస్తుంది...)...సరదాకి వ్రాసినవి...

    o కవిత వ్రాసాను త్వరలో పోస్ట్ చేస్తాను జ్యోతి గారూ!...:-)

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు మీ కవిత కోసం ఎదురుచూస్తుంటాం. ధన్యవాదాలు.

      Delete
  15. కొత్తపాళి గారు ధన్యవాదాలు.

    ReplyDelete
  16. Jyothi garu, boochoodu manchode, pillalni ettukeelatame kaadu ettukostaadu koodaa.

    ReplyDelete
    Replies
    1. బూచాడ్ని కొంచెం కట్టడిలో ఉంచితే చాలా మంచివాడండి...చనువిస్తేనే....
      ధన్యవాదాలు మెరాజ్ గారు.

      Delete
  17. Jyoti Garu,
    Chala baga chepparu.
    Shyam.

    ReplyDelete
  18. Replies
    1. ధన్యవాదాలు సుబ్రమణ్యం గారు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.