Wednesday, October 8, 2014

సీడర్ పాయింట్

      కమ్మని కాఫీ తాగేశారా? కాఫీ ఏమిటి అంటారా? కథ చెప్పుకుంటూ మధ్యలో చిన్న విరామం తీసుకున్నాం. ఇంతకు ముందు జరిగిందేమిటో తెలుసుకోవాలంటే మీరు అనుబంధాలు జ్ఞాపకాలు చదవండి. 

*                         *                              *                              *

     ఎనిమిదేళ్ళ క్రితం ఇలాగే ఓ చీకటి రాత్రి 'లేక్ టాహో' నుండి వస్తుండగా... పైపైకి దూసుకొస్తున్న తెల్లని కత్తులు.... మొదట అవేమిటో నాకర్ధం కాలేదు. "మనం స్నో పడుతుండగా చూడాలని వచ్చాం, అది ఇలా తీరుతుందనుకోలేదు" అని జ్యోతి భయంగా అంటుంటే తెలిసింది అది మంచని. 
Photo couretsy: Astro Bob

మొదట దూది పింజల్లా తెల్లగా అందంగా నన్ను చుట్టేసి గిలిగింతలు పెట్టాయి కాని రాను రాను అవి మంచు బాణాలై యుద్దానికి దిగాయి. ఆ దాడికి చూపు మసకబారింది. ఆకాశం వేలవేల మంచు బాణాలను నిర్విరామంగా సంధిస్తుంటే తప్పించుకోవడానికి నా వైపర్స్, డిఫ్రాష్టర్ చేసిన కృషిని, జర్రున జారుతున్న రోడ్డుమీద నిలదొక్కుకోవడానికి నా టైర్లు పడిన శ్రమను ఈ రోజుకీ మరచిపోలేను. 
  
     "వర్షం కొంచెం తగ్గినట్లుంది కదూ!" అన్న రఘు మాటలకు ఈ లోకంలోకి వచ్చాను. "ఒంటి గంటక్కూడా సీడర్ పాయింట్ చేరలేమేమో!" సందేహం వ్యక్తం చేసింది జ్యోతి.  అనుకున్నట్లుగానే హోటల్ కు చేరేసరికి నా గడియారం మూడు చూపిస్తోంది.

        ఉదయం ఎనిమిదిన్నరకల్లా నలుగురూ చక్కగా తయారయి వచ్చేసారు. బ్రేక్ ఫాస్ట్ చాలా బావుందట. ముఖ్యంగా ఫ్రెష్ వాఫల్స్. హోటల్ రూమ్ కూడా ఫరవాలేదట. అందరూ చక్కగా నిద్రపోయారట కాని పండు మాత్రం ఆ రాత్రి ఎంతసేపో హోమ్ వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడట. వాళ్ళమ్మ పడుకోమన్నా "స్కూల్ మానేస్తున్న రెండు రోజులూ చాలా హోమ్ వర్క్ ఉంటుందని" చెప్పేడట. రాత్రంతా వంటరిగా వున్ననాకు వాళ్ళ కబుర్లు వినడం సరదాగా ఉంటుంది. 

       కొత్త ప్రాంతాల కెళ్ళినప్పుడు చిన్న చిన్న రోడ్ల వెంబడి ఊరు చూసుకుంటూ వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. సీడర్ పాయింట్ కి అలానే వెళ్ళాము. ఒక చిన్న మోటెల్ ముందు వాళ్ళ అమెనిటీస్ లిస్ట్ లో ‘కలర్ టివి’ ఉండడం చూసి పిల్లలిద్దరూ ఒకటే నవ్వు. "విచ్ సెంచురీ ఆర్ దే ఫ్రమ్" అని. "లేక్ ఎరీ" ఒడ్డునే ప్రయాణిస్తూ గమ్యం చేరాం. పార్కింగ్ లాట్ దాదాపుగా ఖాళీగా ఉంది. వాళ్ళటు వెళ్ళగానే చుట్టూ పరిశీలించడం మొదలెట్టాను. చాలా పెద్ద పార్కింగ్ లాట్ అది. ముందుగా రావడం వలన నాకు మొదటివరుసలోనే స్థలం దొరికింది.  

   ఇంతలో రెండు సీగల్స్ నా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నాయి. ఎక్కడినుంచి వస్తున్నారని 
అడిగాను. " లేక్ ఎరీ" అని ఆ లేక్ గురించి గొప్పలు చెప్పడం మొదలెట్టాయి. "నేను చూశానులే "లేక్ టాహో". దాని కంటే పెద్దదా?" అని అడిగాను . అవి ఫక్కున నవ్వి ఐదు రెట్లు పెద్దదని, అది 'ఫైవ్ గ్రేట్ లేక్స్ ' లో ఒకటని చెప్పాయి. ఇంకోసారెప్పుడూ ఎక్కువ మాట్లాడి నా అజ్ఞానాన్ని బయటపెట్టుకోకూడని నిర్ణయించుకున్నాను. ఇంతలో హఠాత్తుగా అరుపులు వినిపించడంతో ఉలిక్కిపడ్డాను. ఆ పక్షులు కిసుక్కున నవ్వి, "ఎంటీ, ఎప్పుడూ 'థీం పార్క్' చూడలేదా?" అంటూ ఆట పట్టించాయి. “మా ఊర్లో 'కేరవిండ్స్' ఉంది కాని నేను ఎప్పుడూ దగ్గరగా చూడలేదు. కాని అది కూడా చాలా పెద్దదేనట పండు చెప్పాడు" ఈసారి జాగ్రత్తగా సమాధానం చెప్పాను.


"పండెవరు?" అడిగాయవి. పండు గురించి ఎవరైనా అడిగితే నాకు మహా సంతోషం. ఇక కథ మొదలు పెట్టాను. నేను ప్రపంచాన్ని చూడడం మొదలెట్టిన తొలిరోజుల్లో పండు ఎలా ఉండేవాడో, కార్ సీట్ కూడా వదలని పండు కుకీ క్రంబ్స్, కోక్, కనీసం మంచినీళ్ళు కూడా నా మీద పోయకుండా నన్ను ఎంత శుభ్రంగా చూసుకునేవాడో, వాళ్ళ అక్క చిట్టితల్లి ఎంత అల్లరి పిడుగో, మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో అన్నీ చెప్పాను. 

అవి నాకు 'సీడర్ పాయింట్' గురించి చెప్పాయి. అందులో ‘టాప్ థ్రిల్ డ్రాగన్’  అని ఒకటుంటుందిట. నాలుగొందల ఇరవై అడుగుల నుండి నూట ఇరవై మైళ్ళ వేగంతో కిందకు పడేస్తుందట. అది కూడా కేవలం పదిహేడు సేకన్ల లోనేనట. కాని అది ఎక్కిన వాళ్ళకు మాత్రం జీవితాతం ఆ అనుభవం గుర్తుండి పోతుందిట. అలాంటిదే ‘పవర్ టవర్’ కూడానట.‘మెలినియం ఫోర్స్’ అని ఇంకో రైడ్ ఉంటుందట. దాని పేరు లాగానే  చాలా ఫోర్స్ గా వెళ్తుందట. పండు, చిట్టితల్లి మొదట దానిదగ్గరకే వెళ్ళుంటారని అనుకున్నాను. 
మా ఎదురుగా పచ్చపాములా మెలికలు తిరుగుతూ కనిపిస్తున్న దాన్ని చూపిస్తూ అదే ‘రెప్టార్’ అని చెప్పాయి. రైడ్ ఆకాశం అంచుల్లో ఉన్న దాని తలమీదకు రాగానే ఒక్కసారిగా తలకిందులుగా 
తిప్పేస్తోంది. కెవ్వున కేకలు...అది చూడాగానే నాకు గుండాగినట్లయింది. విండ్ సీకర్ ‘ ఎక్కితే ఆకాశంలోకి తీసుకెళ్ళి గుండ్రంగా తిప్పుతుందట. అక్కడునుండి లేక్ ని చూడడం చాలా బావుంటుందట. 

చెట్టపట్టాలు వేసుకుంటూ ఒకదాన్ని ఒకటి ఉడికిస్తూ తిరిగే ట్రామ్స్ గురించి కూడా చెప్పాయి. అప్పుడప్పుడూ ఇవి వాటిమీద ఎక్కి పార్క్ అంతా తిరిగి వస్తాయట.


'జెయింట్ వీల్’ ఉంటుందట కాని అది సరదాగా ఎక్కడానికే తప్ప పెద్ద రైడ్ కాదట. ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే నా నీడ కుడి నుండి ఎడమకు తిరిగింది. ఓ గంట తరువాత చేతిలో కూల్ డ్రింక్స్ పట్టుకుని వచ్చారు నలుగురూ. మోహంలో అలసట కనిపిస్తున్నా ఉత్సాహంగా ఉన్నారు. పండు, చిట్టితల్లి ఇద్దరూ రెండు షర్ట్స్ కొనుక్కున్నారట. ముదురు నీలం రంగు...చాలా బావున్నాయి.  సీగల్స్ కు వీడ్కోలిచ్చి అక్కడినుండి 'షికాగో'బయలుదేరాం.

     రాత్రి గమనించేలేదు గాని ఎటుచూసినా పచ్చని పొలాలతో 'ఒహాయో' చాలా అందంగా ఉంది. నేను వెళ్తున్నది సింగిల్ లైన్, స్పీడు అరవై ఐదు. ఎక్కువ ట్రాఫిక్ లేకపోవడంతో ఓ పది పెంచి దారిని వెళ్తున్న ట్రక్కులను దాటుకుంటూ ఉల్లాసంగా వెళ్తున్నాను. అక్కడక్కడా పొదల పక్కన దాక్కున పోలీస్ కార్లను చూసినప్పుడు మాత్రం కొంచెం మెల్లగా పోతున్నాను. ఇంతలో ఎక్కడినుండి వచ్చిందో నా వెనుగ్గా మీరూహించిందే... పోలీస్ కార్. ఇక చెయ్యడానికేం వుంది, మెల్లగా రోడ్డు పక్కగా ఆగాను. పిల్లలిద్దరూ హడావిడిగా సీట్ బెల్ట్ పెట్టేసుకున్నారు. కాప్ దగ్గరకొచ్చి విండోలోకి తొంగి చూస్తూ “హౌ ఆర్ యు సర్?’ అని అదీ ఇదీ మాట్లాడి ఓ పావుగంట తరువాత ఓ కాగితం జ్యోతి చేతిలో పెట్టి వెళ్ళాడు. “టికెట్ ఇచ్చాడా?” నన్ను రోడ్డు మీదకు తీసుకురావడానికి కిటికీలో నుండి వెనక్కు చూస్తూ అడిగాడు రఘు. “లేదు రెండొందలు ఫైన్ వేశాడు” చెప్పింది జ్యోతి.

గుడ్డిలోమెల్ల అని నిట్టూర్చాను. పోయినసారి డెల్లాస్ వెళ్ళేప్పుడయితే మరీ దారుణం. ఇది జరిగింది 'అలబామా'లో అనుకుంటాను. “నేను బుద్దిగా క్రూజ్ కంట్రోల్లోనే వెళ్తున్నాను. ఆ విషయం రఘు చెప్తున్నా వినకుండా కాప్ టికెట్ ఇచ్చేసాడు. వేరే ప్రాంతాల నుండి వచ్చే మాలాంటి వారంటే మరీ చిన్నచూపనుకుంటాను. పైగా డిసెంబర్ నెలలో టికెట్లు ఇవ్వడాలు మరీ ఎక్కువట. నా బోర్డు మీద ఊరి పేరు తీసేస్తే బావుణ్ణు.

దగ్గరలో ఎక్కడైనా పెద్ద రెస్ట్ ఏరియా ఉందేమోనని చూశాను. అక్కడైతే నాలాంటి వారు ఎంత మందో వస్తారు. వారిక్కూడా ఇలాగే అయిందేమో కనుక్కుందామనుకున్నాను. కాని నా కోరిక తీరలేదు. చిన్న రెస్ట్ ఏరియాలోనే ఆగి, కనుచీకటి పడుతుండగా 'ఇండియానా'లోకి అడుగుపెట్టాను. “హౌ మచ్ లాంగర్?” అడిగాడు పండు. “షికాగో వెళ్ళేప్పటికింకో మూడు గంటలు పడుతుంది నాన్నా. కాసేపు పడుకోరాదూ టైర్డ్ అయినట్లున్నావ్” చెప్పింది అమ్మ.


11 comments:

  1. అబ్బా... భలే interesting ga ఉంది. నేను వచ్చిన మొదటి సంవత్సరం ఒక లాంగ్ డ్రైవ్, ఒక షార్ట్ డ్రైవ్ ఇంకా బై వీక్లీ మినీ డ్రైవ్ లు ( ఇండియన్ గ్రాసరీ కావాలి కదా)... మీ పోస్ట్ చూసాక ఇంకొంచెం ఉత్సాహం గా ఉంది... మా పండు కొంచెం పెద్దగా అయ్యాక మళ్ళీ ప్లాన్ చేయాలి.

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా ప్లాన్ చెయ్యండి. పిల్లలతో ప్రయాణాలు చాలా సరదాగా ఉంటాయి. తిరిగి చూసుకునేలోగా వాళ్ళు కాలేజ్ కి వెళ్ళిపోతారు.

      Delete

  2. వావ్ వావ్ , వెరీ గుడ్ ట్రా వె లాగ్ !!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మీరు వావ్ అంటే బోలెడు ఉత్సాహం వచ్చేస్తుంది. మొదట్లో పోస్ట్ రాయగానే మీ కామెంట్ కోసం చూసేదాన్ని. మీ కామెంట్లు చూసి బ్లాగ్ లు చదివిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ బ్లాగులకు ఆ వైభవం కలిగించండి జిలేబి గారు. థాంక్యు సో మచ్.

      Delete
  3. వావ్ వావ్ ,

    వెరీ గుడ్ ట్రావేలోగ్ !!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  4. భలే రాస్తారు జ్యోతిర్మయి గారు బావుంది :) Radhika (nani)

    ReplyDelete
    Replies
    1. మీ ఫోటోల కన్నానా :-)
      థాంక్యు రాధిక గారు.

      Delete
  5. బాగున్నాయండీ విశేషాలు :)

    ReplyDelete
  6. బాగున్నాయండీ :)
    (లేట్ గా వచ్చానేమో :))

    ReplyDelete
    Replies
    1. ఆలశ్యం ఏముందిలెండి. థాంక్యు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.