Sunday, June 18, 2017

నాన్నా,

       మనం ఉత్తరాలు రాసుకుని చాలా కాలం అయింది కదూ! నేను హాస్టల్ లో ఉన్నప్పుడు కేవలం నన్ను పలకరించడం కోసమే రోజుకో ఉత్తరం రాసేవాడివి. అప్పట్లో ఫోన్ వాడకం ముఖ్యమైన విషయాలకే పరిమితమై ఉండేది.

       తమ పిల్లల జీవితం నందనవనంలా ఉండాలని ప్రతి తల్లీతండ్రీ కోరుకుంటారు. ఆ నందనవనానికి నాందీ వాక్యం గురించి ఆలోచిస్తుంటే ఎన్నో విషయాలు గుర్తొచ్చాయి.

      ఓ మబ్బు పట్టిన సాయంత్రం...ఊరికే... కేవలం ఊరికే, మనకు అప్పుడు టివియస్ ఉండేది. నువ్వూ, నేనూ, తమ్ముడూ జిటి రోడ్డు మీద ఓ రెండు కిలోమీటర్లు వెళ్ళి చిన్న బ్రిడ్జి  దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకోవడం గుర్తొచ్చింది. ఏం మాట్లాడుకున్నామో గుర్తులేదు కాని ఆ సాయంత్రం మాత్రం అలా ఓ చక్కటి జ్ఞాపకంలా మిగిలిపోయింది. పిల్లలతో అలాంటి అందమైన సాయంత్రాలు ఎన్నో కేవలం ఊరికే... తీరిగ్గా కూర్చుని గడపగలిగే అదృష్టానికి ఆ సాయంత్రం బీజం వేసింది. 

       అప్పుడప్పుడూ మమ్మల్ని నీతో పాటు మీ ఆఫీస్ కు తీసుకువెళ్ళేవాడివి. కోర్టు ఆవరణలోకి వెళ్ళగానే దారి పక్కగా కనిపించే పెరివింకల్ పువ్వుల రంగు, అవి దాటి లోపలకు వెళ్ళగానే గదిలో వినిపించే టైప్ మిషన్ టకటక శబ్దం ఇప్పటికీ తాజాగా గుర్తున్నాయ్. అప్పుడు అనుకోలేదు కాని తరువాత మా జీవితాలను పిల్లలకు పరిచయం చెయ్యాలనే ఆలోచనకు పునాది ఆ జ్ఞాపకం.

     ఏ పండగో వస్తే బడికి సెలవొస్తుందిగా, రెండు జతలు బట్టలు బాగ్ లో పెట్టుకుని బస్ స్టాండ్ కు వెళ్ళిపోవడమే. ఒక్కోసారి ఈ ఊరా ఆ ఊరా అని కూడా అనుకునేవాళ్ళం కాదు. కావలో, ఉలవపాడో, గుడ్లూరో... ముందుగా ఏ బస్ వస్తే ఆ ఊరికి అటు అత్తా వాళ్ళింటికి కాని నాన్నమ్మ వాళ్ళింటికి కాని, పిన్ని వాళ్ళింటికి కాని. ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళెవరికీ కూడా చెప్పాపెట్టకుండా చుట్టాలొచ్చారు, ఇప్పుడెట్లా అనే భావం ఉండేది కాదు. మొహమంతా వెలిగిపోతుండగా "రాండి...రాండి. సరైన టయానికి వచ్చారు. తోట కాడ్నించి మామిడి పళ్ళు దెచ్చినారు, దక్షిణపు గట్ల మీద తాటికాయలు ముదిరుండాయి, నిన్నే మచ్చల బర్రె ఈనింది. జున్నెట్లా పంపాలా అనుకుంటుండాం, " అంటూ లోపలకు తీసుకెళ్ళేవాళ్ళు. ఈ రోజు ఇంటికి ఎవరైనా వస్తే అదే భావంతో వారిని ఆహ్వానించగలుగుతున్నామంటే ఆనాటి ఆనుభూతి పదిలంగా మనసులో నిలిచిపోవడమే కారణం. 

        ఓ పత్రికో పుస్తకమో చదువుతూ నచ్చిన వాక్యాలు పెద్దగా చదివి వినిపించడం నీకు అలవాటు. వింటూ బావున్నాయని అనుకున్నానే కాని అవి నాలో సాహిత్యాభిలాష పెంచే విత్తనాలని తరువాత కదా అర్థం అయ్యింది. చందమామ, బాలమిత్రలతో మొదలై చతుర, విపుల, ఆంధ్రభూమి ఆ తరువాత యద్దనపూడి, ఆరెకపూడి, పురాణం సీత, మాలతీ చెందూర్, చలం ఇలాంటి పరిచయాలతోనేగా జీవితానికో నిర్దుష్టమైన అభిప్రాయం ఏర్పరిచింది. 

        నీకు ఏవేవో ఆశయాలు అవీ ఉండేవి. లంచం తీసుకోవడం తప్పు, అలాగే అప్పు చేయడం ఇక మద్యపానం అంటే మహా నేరం. ఆ రోజుల్లో నీ ఒక్కడికే కాక జనాంతికంగా కూడా అవే అభిప్రాయాలు ఉండేవి. మారినకాలంతో పాటు ఎన్నో మార్పులు... లక్షీదేవి ఆదిపత్యంలోకి వచ్చాక, మంచి చెడు మధ్యనుండే అడ్డుగోడను లౌక్యం మేఘంలా కమ్మేసింది. భౌతికంగా సుఖమయ జీవినప్రమాణస్థాయి పెరిగినా మానసికంగా అల్లకల్లోలమవుతున్నవారే ఎక్కువ. ఈ మార్పులకు లోనవక నిటారుగా నిలబడగలిగామంటే ఆ నాడు మీరాచరించి చూపిన విచక్షణే కారణం. 

        నాకు సరిగ్గా గుర్తులేదు కాని బహుశా నేను ఇంటర్ లో చేరినప్పుడనుకుంటాను ఓ రోజు ముందుగదిలో మనందరం కూర్చుని ఉన్నప్పుడు అతిశయోక్తి కాని, అబద్డంకాని కాని జోడించకుండా మన ఆదాయం ఖర్చు లెక్కలన్నీ  వివరంగా చెప్పావు.  అందువల్లనే నువ్వు వంద రూపాయలు చేతికిచ్చినా తమ్ముడికి కాని నాకు కాని పదే ఖర్చు చెయ్యాలని చెప్పకుండానే అర్ధం అయింది. అందులో మేము సర్దుకుని బ్రతికిందీ లేదూ, అలా అని చాలకపోవడమూ లేదు. అంతా సహజంగానే. ఆస్తిపాస్తులు లేకపోయినా ఏ రోజు పేదగా బ్రతకలేదు. ఆనాటి మీ ఆ జీవిన విధానమే మాకు జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను ఎదుర్కునే ధైర్యం ఇచ్చింది. 

       అమ్మాయి మైనస్ అబ్బాయి ప్లస్ అనుకునే రోజుల్లో కదా పుట్టాను. అందులో అవి పిల్లలను డాక్టర్లనో, ఇంజనీర్లనో చెయ్యాలనుకునే రోజులు కూడానూ. మమ్మల్నిద్దర్నీ సమానంగా చూడడమే కాక మీ అభిప్రాయాలను మా మీద రుద్దకుండా మా భవిష్యత్తు పూర్తిగా మా చేతుల్లో వదిలి మా నిర్ణయమేదైనా ఆమోదించారు. ఆ ఆత్మవిస్వాసంతోనే జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేయగలిగాను. ఒకవేళ నాకు జీవితాన్ని వెనక్కి తిప్పగలిగే అవకాశం వచ్చినా మళ్ళీ అవే నిర్ణయాలు తీసుకుంటాను. 

         నలభై, యాభై యేళ్ల క్రితం ఎవరైతే నీకు ముఖ్య స్నేహితులో ఇప్పటికీ మీ మధ్య అదే స్నేహం. వాళ్ళ పట్ల నీ అభిప్రాయం మారలేదు. అది ఆ స్నేహం గొప్పతనమని నీవన్నా అది నీ గొప్పతనమేమని నాకనిపిస్తుంది. మనింట్లో ఓ వ్యక్తి  గురించి గాని, ఓ సంఘటన గురించి గాని పదే పదే చెడ్డగా మాట్లాడే అలవాటులేదు. అది బహుశా నాన్నమ్మ వాళ్ళింటి నుంచి వచ్చిన అలవాటు కావచ్చు. తాతయ్య పోయి ముప్పై ఏళ్ళయినా ఈ నాటికీ  ఆయనను గుర్తు చేసుకోవడం కోసం ఎడాదికో రోజు మీరంతా  కలుస్తున్నారు. "మాకే కష్టమొచ్చినా మా అన్నకు చెప్పుకుంటామమ్మా ఆయనేగా మాకు పెద్ద" అని అరవై యేడేళ్ళ బాబాయి అన్నప్పుడు అబ్బురంగా అనిపించింది, గుండె తడి అర్ధం అయింది. ఆ అనుబంధాల తీవ్రత ఇప్పుడు లేకపోయినప్పటికీ ఎక్కడ ఏ పొరపాటు జరిగినా మౌనంగా భరించగలిగి, మరిచిపోగలిగిన పరిణితి ఇచ్చింది. జీవిత కాలపు స్నేహాలను నిలుపుకోగలిన అదృష్టాన్నిచ్చింది.

       నాన్నా ప్రస్తుతం నడుస్తున్న చరిత్రలో నువ్వు నమ్మిన సిద్ధాంతాలు తారుమారవడం, విలువలకు అర్థాలు మారడం నిన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో అర్థం చేసుకోగలను. నీ జీవితంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. బాధపడడానికి , నీ బాధ వ్యక్తం చేయడానికి సహేతుకమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. కాని విధికి తలవంచి జరిగిన వాటిని తలచుకుంటూ కోర్చోక పరిస్థితులను ఎదుర్కొని సంతోషంగా గడపగలుగుతున్న నీ జీవితం మాకే కాదు ఎందరికో ఆదర్శం.   

      ప్రస్తుతం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తున్న కొద్దీ ఏవేవో  అనిపిస్తూ ఉన్నాయి. వీధిలో చెత్త వేసినట్లు సోషల్ మీడియాల్లో విషం చిమ్మడం చూస్తుంటే బాధ వేస్తోంది. ప్రముఖులమని చెప్పుకుంటున్న వారు వేస్తున్న పిల్లిమొగ్గలను చూసి బాధతో కూడిన నవ్వు వస్తోంది. ముఖ్యంగా నలుగురిలో గుర్తింపు కోసం తమ కోరికలను పిల్లల మీద రుద్దడం చూసి బాధనిపిస్తోంది. తల్లిదండ్రుల ప్రోద్భలంతో సమాజం దృష్టిలో గొప్పవారనిపించుకున్న వారు సంతోషంగా ఉండగలుగుతున్నారా? సంతృప్తితో జీవితాన్ని గడపగలుగుతున్నారా?   

      "నేనెలాంటి నిర్ణయం తీసుకున్నా మా నాన్న సమర్ధిస్తారు. నా అడుగులు తడబడినప్పుడు ఫరవాలేదులే అని భుజం తడతారు, నన్ను నన్నుగా మా నాన్న ఆమోదిస్తారు". ఇలాంటివి కదా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచేది. అదిలేని వారు ఎంత గొప్ప పదవులలో ఉన్నా ఉద్యోగాలు చేస్తున్నా అత్మన్యూనతతో బాధపడుతూ జీవితాన్ని కోల్పోతారని ఎంత మంది నాన్నలకు తెలుస్తుంది? 

     అక్షరాలు అందంగా రాయడం నేర్పింది అమ్మయితే ఆ అక్షరాలకు అర్ధం చెప్పింది నువ్వు. 

                                Happy Fathers Day Nanna. 


8 comments:

 1. చక్కటి జ్ఞాపకాలు. నాన్న గురించి కూతురే చక్కగా చెప్పగలదేమో? మీకు మంచిని ఆచరించి చూపించి, మిమ్మల్ని చక్కగా తీర్చి దిద్దిన మీ నాన్న గారు అదృష్టవంతులు.

  ReplyDelete
  Replies
  1. జీవితం ఎలా ఉండాలో ఆచరణలో చూపించిన తల్లిదండ్రులు ఉన్ననందుకు మేమండీ అదృష్టవంతులం. ధన్యవాదాలు.

   Delete
 2. ఉత్తరాలు - ఎవరు ఎవరికి రాసినవైనా సరే - ఎక్కడో ఒకచోట మనల్ని మనం చూసుకునేలా ఉంటాయండీ.. 'ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ అందమే వేరు' అనే మాట ఎందుకు పుట్టిందో మరోసారి అర్ధమయ్యింది నాకైతే..

  ReplyDelete
  Replies
  1. అవునండీ ఉత్తరాలు ఎవరు ఎవరికి రాసినా బావుంటాయ్. ముఖ్యంగా భామిని విభునకు, మదిని కోరికలు మదన గీతికలు లాంటి ఉత్తరాలు ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు. ధన్యవాదాలు మురళి గారు.

   Delete
 3. ఉత్తరాలు వస్తే భలే సంతోషంగా ఉండేదండి.పెద్ద వాళ్ళు చుట్టూ కూర్చో పెట్టు కొని అవతలి వాళ్ళు ఎవరెవరి గురించి ఏమేమి రాసారో వివరిస్తుంటే భలే. చెప్పలేం.

  నా పేరు ch .అజయ్ కుమార్,మాది కృష్ణ జిల్లా విజయవాడ, నాకొక ఇంటర్నెట్&వెబ్ టెక్నాలజీస్ బ్లాగ్ ఉంది. దాని పేరు AP WEB ACADEMY .ఈ బ్లాగ్ లో నేను ముఖ్యంగా వెబ్ సైట్స్,బ్లాగ్స్ బిల్డ్ చేయటం, వాటిని మైంటైన్ చేయటం మరియు ప్రోగ్రామింగ్ లాంగ్వాజెస్ ఐన HTML CSS జావాస్క్రిప్ట్,మై SQL ,PHP మొదలైన వాటి గురించి ,మరియు హాకింగ్ గురించి,కంప్యూటర్ మొబైల్ టిప్స్ గురించి ఆర్టికల్స్ ప్రెజెంట్ చేస్తాను.దయ చేసి నా బ్లాగ్ ని విసిట్ చేసి మీ విలువైన సలహాలు తెలియ చేయగలరు.

  నా వెబ్సైటు అడ్రస్:- HTTPS://apwebacademy.com

  థాంక్ యు సో మచ్

  ReplyDelete
  Replies
  1. పది పదకొండు అయ్యేసరికి పోస్ట్ మాన్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం.

   మీ బ్లాగు చూశానండి ఓపిగ్గా రాస్తున్నారు. తెలుగులో ఉండడం వలన ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ధన్యవాదాలు అజయ్ గారు.

   Delete
 4. ఎంత చక్కని ఉత్తరం అండీ.. చాలా బాగుంది.. అంతా చదివాక మనసులో మెదిలిన ఒకేమాట "మీరు అదృష్టవంతులు".. జీవితాన్ని వెనక్కి తిప్పగలిగే అవకాశం వచ్చినా మళ్ళీ అవే నిర్ణయాలు తీసుకుంటాను అని చెప్పగలగడం కన్నా సాఫల్యమైన జీవితం ఏముంటుందండీ.

  టైప్ రైటర్ శబ్దాలను గుర్తుచేసి నన్ను మా నాన్నాగారి ఆఫీస్ కి వెళ్ళిన రోజులకు తీస్కెళ్ళారు. నమ్మరేమో కానీ ఆ వాక్యం చదవగానే నాకు ఆ శబ్దం చెవుల్లో మారుమోగింది. దానితోపాటే నాన్నారి ఆఫీస్ లోని వట్టివేళ్ళ వాసన, ఆ చల్లదనం కూడా చుట్టేశాయి.

  ReplyDelete
  Replies
  1. మిమ్మల్ని బాల్యం లోకి తీసుకెళ్ళానాన్న మాట. ఈ పోస్ట్ కి గొప్ప సాఫల్యం ధన్యవాదాలు వేణు గారు.

   Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.