Sunday, February 4, 2018

Grand Turkదేశం చుట్టూరా ఝామ్మని తిరిగి రావాలని మీకెప్పుడైనా అనిపించిందా? నాకనిపిస్తూ ఉంటుంది. ఇండియా చుట్టూనో, అమరికా చుట్టూనో తిరిగి రావడం కుదరని పని కాని అదిగో అక్కడ కనిపిస్తోందే, గ్రాండ్ టర్క్, అదో ద్వీపము. ఆ ద్వీపాన్ని కాలినడకన చుట్టేసి రావచ్చు. ఏడు ౘదరపు మైళ్ళ విస్తీర్ణము కలిగిన ఈ చిన్న ద్వీపం, టర్క్స్ అండ్ కైకోస్ ద్వీప సమూహానికి రాజధాని. ఈ చిన్న ద్వీపంలో బాంక్, ఆసుపత్రి, జైలు, ఎలిమెంటరీ, మిడిల్ స్కూల్, హైస్కూల్ వరకూ ఉచిత విద్యా సదుపాయాలు ఉన్నాయి. సున్నపు రాయి ఇక్కడ  ప్రధాన వ్యాపారము. వీరికి విమానమార్గం ప్రధాన ప్రయాణ సౌకర్యము. ద్వీపం అనగానే పెద్ద పెద్ద చెట్లు కొండలు, గుట్టలు  ఉంటాయనుకుంటాం కదూ! ఆశ్చర్యకరమైన విషయం ఏమిటింటే ఎక్కడా పెద్ద చెట్టన్నది  కనిపించలేదు. ఈ ద్వీపంలో పక్షులు చాలా తక్కువగా కనిపించాయి. ఈ మధ్య వచ్చిన మరియా తుఫాను వలన ఈ ద్వీపానికి చాలా నష్టం కలిగిందట. ఇక్కడ వారికి  రెండువేల పంతొమ్మిది వరకు కూడా టివి సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం లేదట.

లేతాకుపచ్చ రంగుకు పిసరంత నీలం రంగు కలిపేసి సముద్రంలో గుమ్మరించినట్లు గమ్మత్తైన రంగులో మెరిసిపోతున్న ఈ  సముద్రంలోకి ఎంత లోపలకు వెళ్ళినా స్వచ్ఛంగా అడుగు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడా మురికి అన్నది కనిపించక పోవటానికి ఇసుకలో సున్నపురాయి కలసి ఉండడమే కారణమట.
పంతొమ్మిది వందల అరవై కాలం నాటికి రెండవ ప్రపంచయుద్ధం ముగిసిపోయినా, అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం
 కొనసాగుతూనే ఉండేది. అప్పటికే రష్యన్ వ్యోమగాములు భూమండలం చుట్టూ ప్రదక్షిణాలు చేసేశారు. అమెరికా ఆ విషయంలో పూర్తిగా వెనుకబడి ఉంది. ఆ సమయంలో జాన్ గ్లెన్, అనే వ్యోమగామి అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురయినప్పటికీ,  భూమండలం చుట్టూ విజయవంతంగా మూడు సార్లు ప్రదక్షిణలు చేశాడు. అతను ప్రయాణం చేసిన రోదసీ నౌక  గ్రాండ్ టర్క్ దగ్గర నీటిలోకి దిగింది. దానికి గుర్తుగా రోదసీ నౌక నకలును గ్రాండ్ టర్క్ దగ్గర ప్రదర్శనకు పెట్టారు.

పద్దెనిమిది వందల శతాబ్దంలో కరేబియన్ ద్వీపాలలో నౌకా వ్యాపారం మెండుగా ఉండేది. అసలే జిపియస్ లేని కాలం, పైగా ద్వీపానికి దగ్గరలో తీరంలోపల కొండలు, గుట్టలు. అటు వైపుగా ప్రయాణించే ఓడలు రాత్రిపూట అటూ ఇటూ ఊగడం, మునిగిపోవడంతో విపరీతమైన ధన, వస్తు, ప్రాణనష్టం వాటిల్లేదట. ఈ కారణంగా అక్కడ పద్దెనిమిది వందల యాభై  రెండవ సంవత్సరంలో లైట్ హౌస్ కట్టడం జరిగింది. అరవై అడుగుల ఎత్తు, గట్టి ఇనుముతో కట్టిన ఈ లైట్ హౌస్ లో మొదట ఆర్గాండ్ ఆయిల్ దీపాలు రిఫ్లెక్టర్ల సాయంతో కొంతకాలం ఏదో మిణుకు మిణుకు మంటూ వెలిగినా ఆ వెలుగు సరిపోలేదట. ఆ తరువాత కిరసనాయిల్ దీపాలు ఫ్రెస్నెల్ లెన్స్ లతో పరిస్తితి చక్కబడిందట. పంతొమ్మిది వందల డెబ్భై రెండొవ సంవత్సరంలో పూర్తిగా విద్యుతీకరణ చేశారు. చాలా విశేషాలు  తెలుసుకున్నాం. కాసేపలా ఊరు చూసొద్దాం రండి.

మన దేశంలో ఓ మారుమూలనున్న చిన్న పట్టణాన్ని చూస్తున్నట్లు ఉంది కదూ! అదిగో కనిపిస్తోందే అదే పెద్ద బజారు.

                                                                                                 


       ఓ గమ్మత్తైన విషయం చెప్పనా, ఇక్కడ ఎటువంటి డ్రైవింగ్ నియమాలు లేవుట. మద్యం తాగి కూడా డ్రైవింగ్ చెయ్యొచ్చట. అన్నట్లు ఇక్కడ జలుబు, జ్వరాలకు మందులు వేసుకోరట. వేపాకులు నీళ్ళలో మరిగించి తాగేస్తే తగ్గిపోతుందని చెప్తున్నారు. వేపాకులా, ఇక్కడా? అని నేను కూడా మీలానే ఆశ్చర్యపోయాను. ఎప్పుడో ఇండియా నుండి వేపమొక్క పట్టుకెళ్ళి  అక్కడ నాటారట. జైలొకటి ఉందని చెప్పాను గుర్తుందా? ఇక్కడ చిన్న చిన్న దోపిడీలు తప్ప మర్డర్లు, మానభంగాలు లాంటి పాశవిక ఘోరలేమీ ఇప్పటి వరకూ జరగలేదట. "ఏమోయ్, బొమ్మిడాయల పులుసు పెట్టెయ్. రాత్రికి వచ్చేస్తాను" అని ఖైదీలు రాత్రుళ్ళు బయటకు వెళ్ళి రావడం ఇక్కడ మామూలేనట.

     భారీ చదువులు, ఖర్చులు, కీర్తి ప్రతిష్టలు, విలువైన వస్తువులు సరే, కనీసం అద్దం కూడా కొననక్కర్లేని సాదాసీదా జీవితాలు! ఏమిటీ, అక్కడ వెళితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా? వెళ్ళేమాటయితే మీ అడ్రస్ ఏదో ఈ కింద కామెంట్ లో పోస్ట్ చెయ్యండి. ఈసారి గ్రాండ్ టర్క్ వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి వస్తాం.
 
https://en.wikipedia.org/wiki/Grand_Turk_Island
https://www.grandturkcc.com/island-information/fact-sheet.aspx

2 comments:

 1. చివర్లో మీర్రాసిన "భారీ చదువులు, ఖర్చులు, కీర్తి ప్రతిష్టలు, విలువైన వస్తువులు సరే, కనీసం అద్దం కూడా కొననక్కర్లేని సాదాసీదా జీవితాలు!" అన్న మాటలు చదివితే ఆ Grand Turk భూతలస్వర్గంలా అనిపిస్తోంది. మంచి ద్వీపాన్ని గురించి బహు-మంచి పరిచయం :)

  ReplyDelete
 2. good afternoon
  its a nice information blog
  The one and the only news website portal INS Media.
  please visit our website for more news updates..

  https://www.ins.media/

  ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.