అమ్మమ్మ వంటింటి పక్కనున్న వరండాలో కూర్చుని పెసలు విసురుతూ ఉంది. తిప్పడం ఆపినప్పుడల్లా గుప్పెడు
గుప్పెడు పెసలు తీసుకుని జాగ్రత్తగా తిరగలి మధ్య గుంటలో పోస్తున్నాను. తాతయ్య గుమ్మం
పక్కన కూర్చుని విస్తళ్ళు కుడుతున్నాడు.
"ఎందుకు
తాతయ్యా ఆ విస్తరాకులు?" అడిగాను.
"కుప్ప
నూర్చేదానికి కూలోళ్ళు వస్తళ్ళా, వాళ్ళకు అన్నాలు బెట్టినప్పుడు కాబళ్ళా"
చేస్తున్న పని ఆపకుండానే చెప్పాడు తాతయ్య.
"ఎంతమందొస్తారు
తాతయ్యా?" అడిగాను.
"మీ మామయ్యా
ముప్ఫైమందికి జెప్పొచ్చినాడు" అని నాతో చెప్పి. కోళ్ళెన్ని గావాల్న"
అమ్మమ్మ నుద్దేశించి అడిగాడు.
"నాలుగన్నా
గావద్దా? బదులిచ్చింది అమ్మమ్మ.
"కోళ్ళెందుకు
అమ్మమ్మా?"
"కుప్ప నూర్పిళ్ళప్పుడు కూలోళ్ళకు కోడి కూరొండి అన్నాలు బెట్టాల నాయనా." చెప్పింది
అమ్మమ్మ.
ఇంతలో గేటు దగ్గర
చప్పుడయ్యింది. చూస్తే చిన్నమ్మమ్మ.
"ఏందికా
రామ్మన్నావంట్నే?" ఎప్పుడొచ్చిందో గేటు దగ్గరే నిలబడి అడిగింది చిన్నమ్మమ్మ.
"గేటుకాడ్నించే
అడగాల్నా. రామ్మే లోపలకా." పిలిచింది అమ్మమ్మ.
"మళ్ళొస్తాలేకా.
బర్రెలొచ్చేయేళవతావుళ్ళా ఇంటికి బోవాల. మందలేందో కనుక్కుందావని వచ్చినా."
"నీడ ఇంకా యాప
చెట్టుగాడిగ్గూడా పోలా, బర్రెలప్పుడే యాడొస్తాయా? మీ అక్కేందో రాస్యం జెప్పాలంట రామ్మే"
పిలిచాడు తాతయ్య.
"నీక్దెలీని రాస్యాలు
యాడుండాయి మావా మాకా" అంటూ నవ్వుతూ లోపలకి వచ్చి అమ్మమ్మ చేతిలోంచి తిరగలి
పిడి తీసుకుని తిప్పడం మొదలు పెట్టింది.
"ఏంలేదు మే,
పండగ దగ్గరకొస్తావుళ్ళా నిప్పట్లెప్పుడు జేద్దామా?" విసిరిన పెసర
బద్దల్నిచాటలోకి ఎత్తుతూ అడిగింది అమ్మమ్మ.
"ఈ రోజు సోమ్వారం
గదకా, బేస్తవారం జేద్దావా!"
"అట్నేలే. అన్నట్టు
నిప్పట్లీయేడు యెవురెవురికి పంపీయ్యాల?" అడిగింది అమ్మమ్మ.
"పిలకాయలకు
పంపేదానికి తలో పాతిక. పండగరోజు కూలోళ్లు పదిమందన్నా రారా?"
"వస్తారు.
ఇంకా కోటపాడుగ్గూడా పంపియ్యాల. పెదనాయన చనిపోయిళ్ళా, వాళ్ళీ యేడు పండగ జేసుకోరు." చెప్పింది అమ్మమ్మ.
"ఇంకా చాకలోళ్ళు,
మంగలోళ్ళు, బుడబుక్కలోళ్ళు, జంగం దేవర...ఓ ఐదొందల్దాకా జెయ్యాల." లెక్క తేల్చింది చిన్నమమ్మ.
"ఆ.. అట్నే" చెప్పింది అమ్మమ్మ.
"మణుగుబూలగ్గూడా బియ్యం నానెయ్యి. బేస్తవారం పొద్దున్నే బియ్యం నానబెడ్తె మద్దినేళకి పిండి
గొట్టుకోవచ్చు. పొద్దున్నే సందులో గాడిపొయ్యి తొవ్వీడం మర్చిపోబాక." అంది
చిన్నమ్మమ్మ.
"అట్నేలేమ్మే.
మణుగుబూ గిద్దలు సుబరత్నమ్మ తీసుకుపోయ్యుండాది. అయ్యి కూడా తెప్పీయ్యాల." పెసలు
పోసిన టిఫిన్ కేన్ మూతబెట్టింది అమ్మమ్మ.
"నిప్పట్లు
ఒత్తేదానికి ముత్తయ్యను గూడ పిలిపిచ్చు."
"సరుకులెన్ని గావాల? బియ్యం నాల్గుమానికలు సరిపోతాయా?" అడిగింది అమ్మమ్మ.
"సాలకేం జేస్కోనుకా. బెల్లం తులం బడద్దేమో. ఏలక్కాయలు ఏబళం, నూనె నాలుగు శేర్లు" వరుసగా లెక్క చెప్పింది చిన్నమ్మమ్మ.
"శెట్టి
కొట్టుకాడ అన్నీ దెప్పిచ్చి పెడతా. బేస్తవారం కాస్త పెందలాడేరా."
"రవన్ని సజ్జ
బూరెలు గూడ జేయ్ గూడదా" అడిగాడు తాతయ్య.
"ఏం మావా,
సజ్జబూరెలు దినాలనుందా, అట్నేలే. సజ్జలు గూడ దెప్పిచ్చి పెట్టుకా. మూడవతా ఉంది ఇంక
నేబోయోస్తా." అంటూ లేచి చీర కుచ్చిళ్ళు దులుపుకుని చక్కాబోయింది
చిన్నమ్మమ్మ.
తాతయ్య విస్తళ్ళు
కుట్టడం పూర్తి చేసి ఆకుల మీద తిరగలి ఉంచాడు అణగడానికి.
ReplyDeleteయెన్నాళ్ళ కెన్నాళ్ళకు జ్యోతిర్మాయి వారి టపా !:)
అన్నాలెల్లను బెట్టడానికయినా కాబళ్ళ ? కూలోళ్ళకున్
చిన్నా శర్కరి కోళ్ళు నాల్గయిన? తా జెప్పొచ్చినాడే సుమా
రాన్నా! యంచును మావ యందరికి హోరాహోరి ! నిప్పట్లకై
చిన్నమ్మమ్మను కూడ బిల్చెనుగదా చిత్రంబు యమ్మమ్మయున్
జిలేబి
😊 thank you.
Delete