Sunday, December 22, 2024

వాటికన్ సిటీ

ఇంతకు ముందుభాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

రోమ్ కు వెళ్ళిన మూడవ రోజు ఉదయాన్నే ఏడు గంటలకల్లా మెట్రోలో వాటికన్ సిటీ కు బయలుదేరాము. వాటికన్ సిటీ రోమన్ కాథలిక్స్ కు పవిత్రమైన ప్రదేశం. ఆ దేశం పోప్ ఆదేశానుసారం నడుస్తుంది. మరో విశేషం కూడా ఉంది, అది ప్రపంచంలోనే అతి చిన్న దేశం, అంతా కలిపి పంతొమ్మిది మైళ్ళు ఉంటుంది. అక్కడ చూడవలసినవి వాటికన్ మ్యూజియమ్స్, సెయింట్ పీటర్స్ బసిల్లికా, సిస్టీన్ చాపెల్.

వాటికన్ సిటీ చూడడానికి ముందుగానే టూర్ బుక్ చేసుకున్నాము. మెట్రో దిగి టూర్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళే సరికి ఏడున్నర అయింది. ఆ ఆఫీస్ పక్కనే ఉన్న కేఫ్ లో బ్రేక్ ఫాస్ట్ చేసేసరికి టూర్ గైడ్, టూరిస్ట్ లు అంతా సిద్దంగా ఉన్నారు. 

టూర్ ఆఫీస్ నుండే మొదలైంది మా టూర్అ. టూర్ ఆఫీస్ కు వాటికన్ సిటీ నడిచే దూరంలోనే ఉందండంతో అక్కడకు నడుస్తూ వెళ్ళాము. వెళ్తున్నాంత సేపూ గైడ్ ఆ సిటీ విశేషాలు చెప్తూ ఉన్నాడు. హెడ్ ఫోన్స్ పెట్టుకోవడంతో అతను చెప్పేది స్పష్టంగా వినిపించింది. 

మేము వెళ్ళేసరికి వాటికన్ సిటీ గేట్ ఇంకా తెరువలేదు కానీ అప్పటికే అక్కడ పెద్ద లైన్ ఉంది. మేము టూర్ టికెట్స్ తీసుకున్నాము కాబట్టి తలుపులు తెరిచిన వెంటనే మమ్మల్ని లోపలకు పంపించారు. 




గైడ్ మమ్మల్ని ముందుగా వాటికన్ మ్యూజియమ్ కు తీసుకుని వెళ్ళాడు. అప్పటి ప్రముఖ కళా కారుల కళా రూపాలను ఎన్నింటినో ఆ మ్యూజియం లో భద్రపరిచారు. గోడల మీద, పైకప్పు మీదా అంతా కూడా వర్ణ చిత్రాలు. ఆ మ్యూజియం కారిడార్స్ మొత్తం ఎనిమిది మైళ్ళ వరకూ ఉంటుందిట. గైడ్ లేకపోతే అక్కడ ఏమి చూడాలో తెలుసుకోవడం కష్టమే.




నేలంతా మార్బుల్స్ పరిచి అక్కడక్కడా అందమయిన డిజైన్స్ ఉన్నాయి.



ఎంతో ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఆ మ్యూజియం లో ఉన్న మ్యాప్ లు. పదహారవ శతాబ్దంలో ఇటాలియన్ రీజియన్ ను విపులంగా చిత్రీకరించిన వారి పరిజ్ఞానికి జోహార్లు.  


మ్యూజియమ్ లో ఉన్న సిస్టీన్ చేపెల్ లో ఎటు చూసినా వర్ణ చిత్రాలు. చిత్రాలు గోడల మీద వేయడం సరే పైకప్పు మీద వేయడం ఎంత కష్టం. అవన్నీ వేయడానికి మైకెలాంజిలో కి నాలుగు సంవత్సరాలు పట్టిందట.


మ్యూజియమ్ నుండి సెయింట్ పీటర్స్ బసిల్లికాకు వెళ్ళాము. అద్భుతం మరో మాట లేదు. అక్కడ స్తంభాలు, గోడలు, పైకప్పు ఎంతో శ్రద్ధతో చెక్కినట్లు ఉన్నాయి. శిల్పాలైతే చెప్పనే అక్కర్లేదు. ఒక శిల్పంలో దుప్పటి మడతలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో విశేషం అక్కడ ప్రశాంతత. ఎంత మంది మనుషులు ఉన్నా, నిశ్శబ్దంగా, శుభ్రంగా ఉంది ఆ ప్రాంతం అంతా.  
 

 




అక్కడ నుండి బయటకు వచ్చేసరికి పదకొండున్నర అయింది. అక్కడ బస్ ఎక్కి పెంథియాన్ దగ్గర దిగాము. 

Tuesday, July 16, 2024

ఏటిగట్టున గాలిపాట

రోజులన్నీ అలాగో ఇలాగో ఎలాగో నడుస్తూ ఉంటాయి కానీ అనుకోని అదృష్టం పట్టినప్పుడు మాత్రం పువ్వుల పల్లకిలో ఊరేగుతాయి. నా వరకు నాకు గడిచిన మూడు రోజులు అట్లాంటివే. అదెట్లాగంటారా, నాలుగేళ్ళ క్రితం ఒకరోజు

"ఆటలు ఆడీ పాటలు పాడీ అలసీ వచ్చానే
తియ్యాతియ్యని తాయిలమేదో తీసి పెట్టమ్మా"

అంటూ పసివాళ్ళలో పసివాడై పాటలు పాడుతున్న సి.యె.ప్రసాద్ గారిని ఫేస్ బుక్ లో చూసాను. అరవైలో ఇరవైలాగా ఉండాలని అనుకునేవారిని చూశాను కానీ అరవైయేళ్ళ వయస్సుని పదుల్లోకి మళ్ళించడం ఎట్లా సాధ్యమయ్యింది? ఆసక్తిగా అనిపించి ఆ రహస్యం ఏమిటో తెలుసుకుందామని సింగరాయకొండలోని వారి ఇంటికి వెళ్ళాను. ఊరికి చివరగా ఉన్న కాలనీలో వేపచెట్టు కింద చల్లని నీడలో ఉందా ఇల్లు. అక్కడ వసారాలో కూర్చుని ఆయన మాటలు, పాటలు, కథలు వింటూ ఉన్న నాకు మూడు గంటలు ఎట్లా గడిచిపోయాయో తెలియలేదు. అప్పుడు అర్థం అయ్యింది నేను కలిసింది పసివాడిని కాదు మాటల మాంత్రికుడిని అని. ఆశ కలిగింది ప్రసాద్ గారు మా ఊరికి వచ్చి పాఠశాల పిల్లలతో అటలు అడి, మా టీచర్లకు పిల్లలను ఆకట్టుకునే విద్యేదో కాస్త నేర్పిస్తే బావుంటుంది కదా అని.

సరే ప్రస్తుతం కథలోకి వస్తే విఎ.ఎన్.ఆర్.ఐ అసోసియేషన్ ఈవెంట్ కోసం ప్రసాద్ గారు సెయింట్ లూయిస్ కు వస్తున్నట్లుగా తెలిసింది. అప్పటి ఆశ చివుర్లు తొడిగింది. అయితే ఇక్కడో ఇబ్బంది ఉంది. జులై అంటే ఒకపక్క ఉద్యోగం, మరోపక్క ఇంట్లో కొత్త సందడ్లు, ఇంకోవైపు పాఠశాల ప్లానింగ్ సెషన్స్. వీటన్నింటితో ఆ నెలలో జడకోలాటం లాంటిదేదో ఆడవలసి వస్తుందని ముందే తెలుసు. మరి ఆ సమయంలో ప్రసాద్ గారి కార్యక్రమాన్ని మా ఊరిలో ఏర్పాటుచేయడం కష్టమైనపని. పాఠశాల టీమ్ తో చర్చిస్తే మురళి గారు మరేం పరవాలేదు ప్రసాద్ గారి వసతి, ఈవెంట్ ఏర్పాట్లు తాను చూసుకుంటాను అన్నారు. అలా ప్రసాద్ గారిని షార్లెట్ కు తీసుకుని రావడానికీ, మా పాఠశాల పిల్లలకు, పెద్దలకు ప్రసాద్ గారిని కలిసే అవకాశం కలిగించడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి.

అంతవరకు బాగానే ఉంది. మా పాఠశాల వారికి ప్రసాద్ గారు ఎవరో ఏమిటో తెలిస్తేనే కదా వారు ఆయన్ని కలవడానికి ఆసక్తి చూపించేది. తెలుసుగా మాదంతా కమ్యూనిటీ విద్యా విధానం. అంటే టీచర్స్ ఎక్కడెక్కడో ఉంటారు, వారి ఇళ్ళలోనే తరగతులు జరుగుతాయి. ఆ తరగతి విద్యార్థులు వారి చుట్టు పక్కలే ఉంటారు. వీరినంతా మేము కలిసేది వార్షికోత్సవం రోజునే. పేరెంట్స్ కు కానీ టీచర్స్ కు కానీ ఒక విషయం తెలియజేయలంటే వాట్స్ ఆప్ మెసేజో, ఇమెయిలో మాత్రమే మాకున్న సాధనం. ప్రసాద్ గారు ఎవరో ఏమి చేస్తుంటారో తెలిస్తేనే కదా వాళ్ళకు తనను కలవాలనే ఆసక్తి కలిగేది. వారి గురించి చూపించడానకి వారి ఫేస్ బుక్ ప్రొఫైల్ తప్ప, యూ ట్యూబ్ వీడియోస్ లాంటివి లేవు. సరే ఆ ఫేస్ బుక్ ప్రొఫైల్ కే కొన్ని మాటలు జోడించి మా రాజు గారు 'గాంధీ హాల్ లో జులై పదమూడవ తేదీన 'ఇంటరేక్టివ్ తెలుగు వర్క్ షాప్ ఉంటుంది తప్పకుండా రండి' అంటూ పేరెంట్స్ కు తెలియజేసారు. ఇంతకూ ప్రసాద్ గారు ఎవరని కదూ మీ సందేహం కూడా, మీకూ పరిచయం చేస్తాను.

వారు ఎస్ సిఇఆర్ టి (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్) సభ్యులు. పూర్వం జన విజ్ఞాన వేదికలో కూడా పనిచేసారు. నయీతాలీమ్ లో నేషనల్ కమిటీ మెంబర్. ఇంతకూ నయితాలీమ్ అంటే ఏమిటో తెలుసా? గాంధీ గారు ప్రతిపాదించిన విద్యావిధానం. నయి అంటే కొత్త, తాలీమ్ అంటే విద్య. మాతృభాషలోనే చదువు చెప్పాలని, చదువు, పని రెండూ కలిపే నేర్పించాలని ఆ విద్యావిధానం చెప్తోంది. దగ్గర దగ్గరగా మాంటిస్సోరి విధానం అని చెప్పవచ్చు. ఆయన ప్రజా సైన్స్ వేదిక లో స్టేట్ ప్రెసిడెంట్. అయినా ప్రసాద్ గారి గురించి ఇలా చట్రంలో కుదించి చెప్పాలంటే కుదరదు. తాను ఏటిగట్టున గాలిపాట. తన సమక్షాన్ని అనుభవిస్తేనే తెలుస్తుందా విషయం. నా మాట నిజమో కాదో తెలుసుకోవలంటే మూడు రోజులు పూర్తిగా తనతోనే ఉంటున్న మురళి గారిని, వారి కుటుంబాన్ని అడగండి.

మళ్ళీ కథలోకి వద్దాం, ప్రసాద్ గారు పోయిన శుక్రవారం సాయంత్రం షార్లెట్ కు వచ్చారు. తను వచ్చే ముందు రోజు అంటే గురువారం అర్ధరాత్రి నాకొక ఆలోచన వచ్చింది. ప్రసాద్ గారికి మా పాఠశాల సిలబస్ చూపించి తన సలహా తీసుకుంటే బావుంటుందేమో అని. మా సిలబస్ ఏమైనా పుస్తకాల్లో ఉందా తనకు ఇచ్చి చదవమనడానికి, మేము పిడిఎఫ్ పంపిస్తే విద్యార్ధులు ప్రింట్ తీసి బై౦డర్ లో పెట్టుకోవడమేగా చేస్తున్నది.వెంటనే టీచర్స్ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టాను, 'నాకో చిన్న సాయం కావాలి. మీరు కానీ, మీ తరగతి పేరెంట్స్ కానీ నాలుగు తరగతుల బై౦డర్స్ తీసుకెళ్ళి మురళి గారి ఇంట్లో ఇచ్చిరాగలరా' అని.

ఏమడిగినా నేను చేస్తా అని వెంటనే చెయ్యి పైకెత్తే మా టీచర్ హిమ 'అడ్రస్ ఇవ్వండి ఇవాళ లంచ్ టైమ్ లో వెళ్ళి నా దగ్గరున్న నాలుగవ తరగతి బై౦డర్ ను ఇచ్చి వస్తాను' అన్నారు. బంగారు తల్లి కదూ! నార్త్ లో ఉన్న టీచర్స్ తాము రాలేము చాలా దూరం అన్నారు. మిగిలిన వారు ఎవరూ కూడా ఊ, ఉప్పరాయి అనలేదు, మరి మిగిలిన తరగతుల బై౦డర్స్ ఎలా? సాయంత్రం వరకూ చూసి విశాఖ టీచర్ కు ఫోన్ చేసి పరిస్థితి ఇదీ అని చెప్పాను. పాపం రెండు రోజుల నుండీ జ్వరంతో ఉన్నా కూడా తానే స్వయంగా మిగిలిన మూడు తరగతుల బై౦డర్స్ సేకరించి మురళి గారి ఇంట్లో ఇచ్చేసి వచ్చారు. మొత్తానికి ఆ విధంగా మా సిలబస్ శుక్రవారం రాత్రికి ప్రసాద్ గారికి చేరింది.

శనివారం సాయంత్రం కదా ప్రోగ్రామ్. ఆ మధ్యాహ్నం కాసేపు వారి దగ్గర టీచింగ్ మెథడ్స్ తెలుసుకుంటేనో అనిపించి ఆసక్తి ఉన్నటీచర్స్ ను శనివారం మధ్యాహ్నం మా ఇంటికి రావలసిందిగా టీచర్స్ గ్రూప్స్ లో మెసేజ్ పెట్టాము. ఊహించినట్లే మెసేజ్ చూసిన వెంటనే 'నేనొస్తా' అంటూ హిమ చెయ్యి పైకెత్తారు. వాహిని గారు జ్వరంగా ఉందని, మరి కొంత మంది తమకు కుదరదని చెప్పారు. కొంతమంది అసలు ఏమీ చప్పలేదు. సరే నేనూ, హిమా, అనురాధా ప్రసాద్ గారిని మా ఇంటి దగ్గర కలుద్దామని అనుకున్నాము.

ఇంటి ముందుగా దేవుడి ఊరేగింపు వెళ్తుంటే తలుపులు మూసి గది లోపల కూర్చున్నట్లుగా ఉంది పరిస్థితి, చాలా వెలితిగా అనిపించింది. ఎంతో దూరం నుండి మాకోసం షార్లెట్ కు వచ్చిన ప్రసాద్ గారిని కలవడానికి కేవలం ముగ్గురికే వీలవుతుందా అని. అట్లా కాదని శనివారం ఉదయాన్నే పాఠశాల నిర్వాహకులలో మా ఇంటికి దగ్గరగా ఉన్న వారికి వాట్స్ ఆప్ లో మెసేజ్ పెట్టాను మనమంతా ప్రోగ్రామ్ ముందు ప్రసాద్ గారిని కలుద్దామా అన్నాను. అందరూ వెంటనే సరే అని అప్పటికప్పుడు సరోజిని, సంధ్య, అనురాధ, స్నేహ, హిమ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వండేసి మధ్యాహ్నానికల్లా వచ్చేసారు. విజయ్ గారు వాళ్ళింట్లో చుట్టాలున్నారని కాసేపు వచ్చి వెళ్తామన్నారు. అలా ఆరు కుంటుంబాల వాళ్ళం ప్రసాద్ గారి కబుర్లు వింటూ భోజనాలు చేశాం.
 

సాయంత్రం నాలుగింటికి ప్రోగ్రామ్, మూడు గంటలకల్లా బయలుదేరాలి, అక్కడ రెండు గంటలు మాట్లాడాలి. ముందు రోజు రాత్రి కూడా వాళ్ళంతా ఆలస్యంగా పడుకున్నారని మురళి గారు చెప్పారు. ప్రసాద్ గారిని కాసేపు విశ్రాంతి తీసుకుంటారా అని అడిగాము. అబ్బే అవసరం లేదమ్మా అంటూ కబుర్లలో కథలు, పాటలు కలిపేసి బాలాంత్రపు రజనీకాంత రావు గారిని, కొండ్రెడ్డి వేంకటేశ్వర రెడ్డి గారిని, సైకిల్ డాక్టర్ గారిని ఇంకా ఎందరెందరినో పరిచయం చేసారు. అందులో రజనీకాంతారావు గారు తెలుసు. ఆయన రాసిన 'అలుసుగా నన్నైతే అంటావుగానీ ఏమి చేసిన కాని నాన్నారి ననవే' అనే పాటను మా పిల్లలతో నాటిక వేయించా౦ కదా. అన్నట్లు ప్రాసాద్ గారు మా పాఠశాలకు బహుమతులు కూడా తెచ్చారు. 
సరే మూడు ముప్పావుకంతా వెన్యూ దగ్గరకు చేరిపోయాం. అక్కడకు దేవిక గారి కుటుంబం, మురళి గారు, వెంకట్ గారు, టీచర్ శ్రవణ్ గారు ముందుగా వెళ్ళి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేశారు. నాలుగుంబావుకంతా శోభ, రాధిక, శ్రావణ్, అమృత, జయరామ్, ఉష, స్వాతి కొంతమంది పేరెంట్స్ పిల్లలు, నాన్నమ్మలు, తాతయ్యలు వచ్చారు. మా టీచర్ జ్యోతి గారు ప్రసాద్ గారిని పరిచయం చేసారు. ప్రసాద్ గారు మైక్ తీసుకుని "నేను వేదిక మీద కాకుండా ఇలా మీ దగ్గరగా ఉంటే ఏమైనా అభ్యంతరమా" అంటూ అక్కడ మెట్ల మీదే కూర్చున్నారు. 'మీరంతా పిల్లలు బావుండాలి అనుకుంటారు కదా, అసలు బావుండడం అంటే ఏమిటి? భాష నేర్పించాలని అనుకుంటున్నారు కదా, భాషకు చదువుకూ ఉన్న సంబంధం ఏమిటి? అసలు చదువంటే ఏమిటి? అంటూ సంభాషణ మొదలు పెట్టారు. ఆ రోజు తెలుసుకున్న అంశాలు

చదువు వలన ఉపయోగం ఏమిటంటే మనలో అంతర్గతంగా ఉన్న శక్తిని బయటకు తీసుకురావడం. భాష నేర్చుకోవడానికి పాటలు, కథలు చాలా ఉపయోగపడతాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారం లేనిదే ఏ స్కూల్ కూడా పిల్లలకు భాష నేర్పించలేదు. పిల్లలకు ఏమి నేర్పించినా ఒక ఆటలా ఉండాలి, కానీ పాఠంలాగా చెప్తే వారు నేర్చుకోరు. పాటలను పేరడీ చేసి, పిల్లలతో చేయించి వారిలో భాష పట్ల ఆసక్తిని పెంచవచ్చు.


అంతేనా పిల్లలు చెప్పిన మాట వినాలంటే ఏమి చెయ్యాలని అడిగిన ప్రశ్నకు మీరెవరమ్మా చెప్పడానికి? అన్నారు. అదేమిటండీ మనం చెప్పక పోతే ఎలా నేర్చుకుంటారు అంటే "రెండు మొహాలు, రెండు నాలుకలు ఉన్న మనమా చెప్పేది? పిల్లలు పుట్టగానే ఈ అబ్బాయి ఇట్లా, ఈ అమ్మాయి అట్లా అంటూ వారి మీద లేబుల్ వేసి వారిని మానికల్లో గిద్దల్లో సర్దేసి ఎదగనీయకుండా చేసే మనకు తెలుసా పిల్లల్ని ఎట్లా పెంచాలో అన్నారు. వారిని నడవనీయండి, పడనివ్వండి, లేవనివ్వండి, తెలుసుకోనివ్వండి, ఎదగనివ్వండి" అని చెప్పారు.



ఆ రెండు గంటల పాటు పిల్లలంతా ఆయన చుట్టూనే ఉన్నారు. ఆ పిల్లలతో ఆడారు, పాడారు, వారికి బొమ్మల పుస్తకాలలోని చిన్న చిన్న కథలు చదివి వినిపించారు. పాఠాలెలా చెప్పాలో మాకు ప్రత్యేకంగా చెప్పలేదు, చూపించారు. అక్కడకు రాని పేరెంట్స్ టీచర్స్ ఎంత కోల్పోయారో కదా అనిపించింది. ఆ కార్యక్రమ౦ జరిగిన రెండు గంటలూ ఆయన దాదాపుగా నిలబడో పిల్లల చుట్టూ తిరుగుతూనో ఉన్నారు. అంతా వెళ్ళిపోయాక కూడా ఒక గంట మాతో కబుర్లు చెపుతూ నిలబడే ఉన్నారు. ఆ వయస్సులో ఆ ఓపికకు ఆశ్చర్యపోయాము. మీరు చెప్పమంటే రేపు ఒక రెండు గంటల పాటు పాటు సైకాలజీ పాఠం చెప్తాను అంటూ మాకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతకంటేనా అనుకుని సరే అన్నాము.
ఆదివారం ఉదయం పదిగంటలకు పాఠం మొదలయి దాదాపుగా ఒంటి గంటకు పూర్తయ్యింది. మరికొంత సేపు కబుర్లు చెప్పుకుని దాదాపుగా రెండు గంటల ప్రాంతంలో మురళి గారింటికి భోజనానికి వెళ్ళాము. 
భోజనం చేసాక ప్రసాద్ గారితో సిలబస్ రివ్యూ మొదలు పెట్టాను. ఆ రెండు రోజులూ పూర్తిగా మాతోనే ఉన్నారా, మరి సిలబస్ ఎప్పుడు చూసారో కానీ అప్పటికే చక్కగా నోట్స్ రాసి పెట్టుకున్నారు. ఇంతకూ మా సిలబస్ చూసి ఏమన్నారో తెలుసా "భాష నేర్పడం సంభాషణల రూపంలో ఉండడం సరైన పద్దతి, అది మీ సిలబస్ లో చక్కగా ఉంది కానీ అమ్మా" అంటూ ఏమి మార్పులు చేయాలో చెప్పారు. అట్లాగే మాట్లాడడానికి ఇచ్చిన పదాలు, రాయడానికి ఇచ్చిన వాక్యాలలో ఎక్కడెక్కడ మార్పులు చేయవచ్చో, ఎక్కువగా వాడని పదాలను ఏ పాఠాలలో చెప్పాలో వివరంగా చర్చించారు. దాదాపుగా నాలుగు గంటల పాటు సిలబస్ రివ్యూ చేసారు.

తాను అమెరికాలో చూడాలని అనుకున్నదేమిటో తెలుసా? స్కూళ్ళు, లైబ్రరీలు. మురళి గారు లైబ్రరీకి తీసుకునివేళ్ళారు. ఇది వేసవి కాలం కదా స్కూల్ తెరిచి ఉండదు అందుకని అనురాధ డేకేర్ కు తీసుకుని వెళ్ళారు. తనకు ఆ డేకేర్, లైబ్రరీ చాలా చాలా నచ్చాయట. ప్రసాద్ గారు ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడతారు, దాంతో అక్కడ పనిచేసే వాళ్ళతో మాట్లాడగలిగారు. 

అలా ప్రసాద్ గారితో గడిపిన మా రోజులు పువ్వుల పల్లకిలో ఊరేగాయి. నిన్న సాయంత్రమే తనను శివ జాస్తి గారి దగ్గరకు వెళ్ళడానికి మినియాపోలిస్ కు వెళ్ళే ఫ్లైట్ ఎక్కించాము. తనతో గడిపిన ఈ మూడు రోజులలో ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు అనే హద్దులేవీ లేకుండా ఎన్నో ప్రశ్నలు అడిగాను, ఆయన ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. ఎన్నో సందేహాలకు సమాధానాలు దొరికాయి. ఆటా ఇటా అంటూ ఎటూ తేల్చుకోలేని మనసు బరువు దించుకుని స్వేచ్ఛగా గాలిలో గిరికీలు కొట్టింది.

మనకు కావలసినదేమిటో, ఎలా ఉంటే సంతోషంగా ఉండగలమో తెలుసుకోవడానికి చాలా ఏళ్ళు పడుతుంది, బహుశా జీవితకాలం పడుతుందేమో! ఒకవేళ తెలిసినా కూడా అలా బ్రతకలేము, అలా ఉండలేక పోవడానికి బోలెడు కారణాలని చెప్పుకుంటాము. తాను నమ్మిన సిద్ధాంతాల ప్రకారం తనకు నచ్చిన దారిలో జీవితాన్ని మలుచుకున్న ప్రసాద్ గారిని కలవడం ఒక గొప్ప అనుభవం. తెలుసుకోవాలన్న తపన, తెలిసింది చెప్పాలన్న ఉత్సాహం తప్ప తనకు మరే దానిమీద కోరిక లేదు. ప్రతిఫలాపేక్ష లేని మనిషి, ఎవరైనా తన గురించి ఒక్క మంచి మాట చెప్పాలని కూడా కోరుకోని గొప్ప వ్యక్తి. అందరికీ ఉండేది రోజుకు ఇరవై నాలుగు గంటలే. ఇలా ఎన్నో రోజులు, వారాలు, నెలలు కుటుంబానికి దూరంగా ప్రసాద్ గారు తనకు నచ్చిన దారిలో నడవడానికి సహకారం ఇస్తున్న వారి సతీమణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

ఆదివారం మా పాఠం పూర్తయ్యాక, ఆయన ఏమైనా ప్రశ్నలు అడగమంటే మా మొదటి ప్రశ్న ఏమిటంటే " ప్రసాద్ గారిని షార్లట్ లో ఉంచెయ్యాలంటే ఏమి చెయ్యాలి?" అని. అట్లా కుదరదు కదమ్మా, పండగ రోజూ ఉంటే బావుండదు కదా అన్నారు. నిజమే పండగ రోజూ ఉండాలనుకోవడం అత్యాశే. అయితే  ఇలాంటి పండుగలు మహా అరుదు. 

తాను పాడిన పాటలు, చెప్పిన కబుర్లు అన్నీ ఇంకా గదిలోనే తిరుగుతున్నాయి. గుండె తడి తెలుస్తోంది, ఈ మధ్య కాలంలో ఇది అరుదైన అనుభవం, మంచిదే. మనం శ్వాస తీసుకుంటోంది బ్రతకడానికి మాత్రమే కాదు జీవించడానికని గుర్తు చేసేది ఇదే కదా! థాంక్యూ సర్.

ప్రసాద్ గారు ఇక్కడకు వచ్చినప్పటి ఫోటోలు, వారి ప్రసంగాలు ఇక్కడ ఉన్నాయి. సైకాలజీ ప్రసంగాన్ని ఇక్కడ చూడవచ్చు.  

Sunday, March 31, 2024

రోమన్ ఫోరమ్

ఈ పోస్ట్ కు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి. 

రోమ్ కు వెళ్ళిన రెండవ రోజు ఉదయాన్నే విల్లా బొర్గీస్ గార్డెన్ కు వెళ్ళామని చెప్పాను కదా! అక్కడ నుండి రోమన్ ఫోరమ్ కు ట్రామ్ లో వెళ్ళాము. ఫోరమ్ చూడడానికి ముందుగానే ఆన్ లైన్ లో 'స్కిప్ ది లైన్' టికెట్స్ తీసుకోవడంతో లైన్ లో నిలబడవలసిన అవసరం లేకుండా లోపలకు వెళ్ళాము. రోమన్ ఫోరమ్ చూసేముందు రోమ్ చరిత్ర కొంత తెలుసుకుందాం. 

రోములస్ (Romulus) పరిపాలించడం వలన రోమ్ నగరానికి ఆ పేరు వచ్చిందని చెప్పుకున్నాం గుర్తుందా. అలా క్రీస్తు పూర్వం ఏడు వందల యాభైమూడవ సంవత్సరం(753 BC) లో రోమ్ మొదలైంది. అక్కడ నుండి నూటయాభై సంవత్సరాల పాటు ఏడుగురు రాజులు రోమ్ ను పరిపాలించారు. ఆ తరువాత రాజరికం అంతరించి ప్రజాస్వామ్యం మొదలైంది. 

రోమ్ లో రెండు వర్గాలు ఉండేవి, పేర్టిషియన్స్ (Patricians) భూస్వాములు, ధనవంతులు, ప్లెబియన్స్ (plebeians) సామాన్య పౌరులు, బానిసలు. రోమ్ లో పేరుకు ప్రజాస్వామ్యమే ఉన్నా ప్రభుత్వయంత్రాంగంలో అంతా పేర్టిషియన్స్ ఉండేవారు. వారిలో వారికి రాజకీయంగా వివాదాలు ఏర్పడి యుధ్ధాలు జరగడంతో అలజడి మొదలైంది. చివరకు జూలియస్ సీజర్ (Julius Ceasar) హత్యతో ప్రజాస్వామ్యానికి తెరపడింది. జూలియస్ సీజర్ మేనల్లుడు అగస్టస్ (Augustus) రోమ్ కు రాజయ్యాడు. అలా క్రీస్తు పూర్వం ఇరవైయ్యేడవ సంవత్సరంలో (27 AD) రోమ్ లో మళ్ళీ రాజరికం మొదలయ్యింది, రోమ్ నగరం విస్తరించి తిరుగులేని సామ్రాజ్యం అయింది. ఆ తరువాత మత పరమైన మార్పులు జరిగి  క్రిస్టియానిటీ (Christianity) రోమ్ లో స్థానం ఏర్పరుచుకుంది రోమన్ ఫోరం శిథిలమయ్యింది. 

picture courtesy: Roman Forum - Wikiwand
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోన గరిగిపోయే.
యిచ్చోటనే భూములేలు రాజన్యుని యధికారముద్రికలంతరించె!

ఒకప్పటి వైభవానికి సాక్ష్యంగా ఆ ఫోరమ్ లో నిలిచిన శిథిలాలను చూడగానే జాషువా కవి పద్యం గుర్తొచ్చింది. రోమన్ ఫోరమ్ లోని ఆ రాతి స్తంభాలు శతాబ్దాల కథలు వినిపించాయి. అప్పట్లో ప్రభుత్వాన్ని నిర్వహించిన విధానం, కోర్ట్ లు, మార్కెట్, రాజులు, యుద్ధాలు అప్పటి నమ్మకాలు, అలజడులు, వాటి వెనుక కారణాలు ఇలా ఎన్నో. 

రోమన్ ఫోరమ్ పాలటీనా హిల్ (palatine hill), కపిటలైన్ హిల్ (Capitoline Hill) మధ్యలో ఉంది. ఆ ప్రాంతం నగరానికి మధ్యలో ఉండడంతో మొదట అక్కడ ట్రేడింగ్ జరుగుతూ ఉండేది. తరువాత కాలంలో అక్కడ  ప్రభుత్వ కార్యాలయాలు, స్మారక చిహ్నంగా నిలిచిన స్థూపాలు, భవనాలు, విజయ సంకేతంగా కట్టించిన ఆర్చ్ లు, సభలు, సమావేశాలు, వేడుకలు, జైత్ర యాత్ర లతో ఎప్పుడూ కోలాహలంగా ఉండేది. అక్కడ ఉన్న కొన్ని కట్టడాల  గురించి తెలుసుకుందాం. 
'ఆర్చ్ ఆఫ్ టైటస్ '(Arch of Titus, 70 BC), టైటస్(Titus) మహారాజు జరూసలెమ్(Jerusalem) మీద సాధించిన విజయానికి గుర్తుగా కట్టినది. ఆ ఆర్చ్ కి లోపల ఒక వైపున రథం మీద మహారాజు యుద్దానికి వెళ్తున్న చిత్రం, మరో వైపు యుద్దం గెలిచి జెరూసలేమ్ నుండి జ్యూవిష్(Jewish) లకు  సంబధించిన పవిత్రమైన  మినోర(Menorah), వెండి ట్రంపెట్(Trumpet) లాంటివి తీసుకుని వస్తున్న చిత్రాలు ఉన్నాయి.  
వయా సేక్రా (Via Sacra). రోమన్ ఫోరమ్ లోని ముఖ్యమైన కట్టడాల మధ్యగా వెళ్ళే ప్రధాన మార్గం. యుద్ధములో గెలిచిన రాజు ఊరేగింపు ఆ దారి వెంబడే వెళ్ళేది. 
'బాసిల్లికా ఆఫ్ మాక్సె౦చెస్' (Basilica of Maxentius, 312 BC). ఈ భవనం రోమన్ ఫోరమ్ లోని అతి పెద్ద కట్టడం, దీనిని పెద్ద సంఖ్యలో సమావేశాలు నిర్వహించవలసి వచ్చినప్పుడు, న్యాయస్థానంగానూ ఉపయోగించేవారు. ఈ భవనం ఆర్కిటెక్చర్ ఆధారంగానే న్యూయార్క్ పెన్ స్టేషన్ కట్టారు. 
టెంపుల్ ఆఫ్ ఆంటోనైనస్ పైయస్ అండ్ ఫాస్టిన (Temple of Antoninus Pius and Faustina, 104 AD) ను ఆంటోనైనస్ తన భార్య ఫాస్టిన జ్ఞాపకార్థంగా కట్టించారు. ఆంటోనైనస్, ఫాస్టిన ప్రజలకు ప్రీతి పాత్రమైన వారు. ఫాస్టిన, స్త్రీల కోసం, బాలికల విద్య కోసం ఎన్నో పధకాలు అమలు చేయించారు.  ఆ టెంపుల్ లోనే ఆంటోనైనస్ పార్ధివ దేహాన్ని కూడా ఉంచారు. 
టెంపుల్ ఆఫ్ కాస్టొరి అండ్ పొలుక్స్, (Temple of Castor and Pollux, 495 BC). కాస్టొరి, పొలుక్స్ ఇద్దరూ డెమి గాడ్స్. గ్రీకు రోమన్ పురాణాలలో దేవునికి లేదా దేవతకు మనిషికి పుట్టిన వారిని డెమి గాడ్స్ అంటారు. రోమన్ రిపబ్లిక్ ఏర్పడడానికి కారణమైన రిగలస్ యుద్ద౦ (Battle of Lake Regillus) యుద్దం జరిగినప్పుడు, కాస్టొరి, పొలుక్స్ ఆ యుద్దంలో రోమన్స్ కు సహాయం చేసి గెలిపించారట. 
టెంపుల్ ఆఫ్ శాటర్న్,( The Temple of Saturn, 499 BC). రోమన్ ఫోరం లో అతి పురతమైన కట్టడం. మొదట కట్టిన గుడి శిథిలమైతే క్రీస్తు పూర్వం నలభై రెండవ సంవత్సరంలో(42 BC) ఆ ప్రదేశంలోనే మళ్ళీ కట్టారు. ఆ గుడిని కోశాగారంగా ఉపయోగించేవారు.   
టెంపుల్ ఆఫ్ వెస్ట (Temple of Vesta). వెస్ట దేవత గృహానికి, కుటుంబ సౌభాగ్యానికి, ముఖ్యంగా ఆహారం తయారయ్యే అగ్ని గుండానికి సంబంధించిన దేవత. రోమన్ పురాణం ప్రకారం ఆవిడ కన్య. అందుకని వెస్ట గుడి బాధ్యతలు కన్యలే నిర్వహించాలనే నియమం ఉండేది. 
వెస్టల్ వర్జిన్స్(Vesta Virgins), రోమన్ పూజారిణులు. టెంపుల్ ఆఫ్ వెస్టా లోని అఖండ దీపాన్ని అన్ని వేళలా వెలుగుతూ ఉండేలా చూడడం వీరి బాధ్యత. ఆ దీపం రోమ్ సౌభాగ్యం అని రోమన్ల నమ్మకం. అలా ఆ దీపం వెస్ట గుడిలో వెయ్యేళ్ళ పాటు వెలిగింది.  

వీరి నివాసం వెస్ట టెంపుల్ వెనుక ఉన్న అందమైన భవనం. వీరి సేవ కోసం, మందీ మార్బలం ఉండేవారు. వీరి కోసం ప్రత్యకమైన దుస్తులు నేసేవారు. వీరు ఊరిలోకి వెళ్ళాలంటే గుర్రపు బండ్లు సిద్ధంగా ఉండేవి. ఒకవేళ కాలినడకన వెళితే సెనేటర్ అయినా సరె ఆగి వారికి దారి ఇవ్వవలసిందే. అన్ని ప్రధాన వేడుకలలోనూ మొదటి వరుస వారిదే. వీరు ఆస్తులు సంపాదించుకోవచ్చు, పన్ను కట్టనక్కర్లేదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆ పదవీ బాధ్యతకు  పేర్టిషియన్స్ కుటుంబంలోని కన్యలు మాత్రమే అర్హులు. వీరిని ఎంచుకునే బాధ్యత ప్రధాన పూజరిది. 

వెస్ట వర్జిన్స్ కు కొన్ని షరతులు కూడా ఉన్నాయి. వీరు ముప్పై ఏళ్ళ పాటు ఆ గుడికే అంకితమవుతామని ప్రమాణం చేయాలి. వారు వారి కుటుంబంతో కానీ, బంధు మిత్రులతో కానీ కలువకూడదు. వారికి సంసారమూ, పిల్లలు అనే ఆలోచనే రాకూడదు. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే వారికి మరణ దండన విధించే వారు. దానికి కారణం వెస్టల్ వర్జిన్స్ పవిత్రంగా ఉండాలి, వారి తప్పటడుగు రోమ్ కు అరిష్టం అని నమ్మేవారు. వారి శిక్ష అమలు విధానం ఎలా ఉండేదంటే వారికి కాస్త నూనె, దీపం, బ్రెడ్ ముక్క ఇచ్చి నేల మాళికలో ఉంచేవారు. ఆహారం లేకపోవడం వలన వారు మరణించే వారు. 

ముప్పై ఏళ్ళ పాటు వెస్టల్ వర్జిన్స్ గా ఉండి, బాధ్యత తీరిన తరువాత వారు పెళ్ళి చేసుకోవడానికి అర్హులు. అయితే అప్పటివరకూ సాధారణ జీవితం గడపక పోవడం వలన పెళ్ళి అవడమే కష్టం, ఒకవేళ పెళ్ళి చేసుకున్నా సాధారణ జీవన విధానంలో ఇమాడలేక విడిపోయే వారు. మరికొంత మంది జీవిత కాలం ఆ భవనంలోనే ఉండి పోయేవారు.  
చూరియా జూలియా (Curia Iulia 44 BC), రోమన్ ఫోరమ్ లోని ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయం. రోమ్ కు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను అక్కడ భద్రపరిచే వారు. ఏడవ శతాబ్దంలో దీనిని చర్చ్ గా మార్చారు. 

రోమన్ సామ్రాజ్యం కూలిపోయిన తరువాత  కొన్ని కట్టడాలను చర్చ్ లుగా మార్చారు. తరువాత కాలంలో భూకంపాలు, వరదలు, తుఫాన్ ల తాకిడికి ఆ ప్రాంతం అంతా బీడు పడి దుమ్ము పేరుకుపోయి భూస్థాపితం అయింది. పదహారవ శతాబ్దంలో జరిపిన తవ్వకాలలో ఆ శిథిలాలు బయట పడ్డాయి. ఆ ప్రాంతాన్ని మొత్తం బయటకు తీయడానికి దాదాపుగా వంద సంవత్సరాలు పట్టింది. ఈ సమాచారం అంతా చరిత్ర పుస్తకాలు, వెబ్ సైట్స్ నుండి సేకరించింది. ఇవన్నీ పదిలపరిచి అందించిన వారికి ధన్యవాదాలు.

అలా రోమన్ ఫోరమ్ లో ఆ కట్టడాలవీ చూస్తూ దాదాపు రెండు గంటల వరకూ అక్కడే ఉన్నాము. తిరిగి వస్తుంటే అనిపించింది. ముందు రోజు ట్రెవీ ఫౌంటెన్ లో కాయిన్ వేయలేదు కాకమ్మ కథ అనుకుంటూ, కానీ అక్కడకు వెళ్ళి కాయిన్ వేస్తే మళ్ళీ రోమ్ కు రాగలమేమో అని. 

వస్తూ వస్తూ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆగి లంచ్ చేసి మా గది వెళ్ళి సాయంత్రం నాలుగింటి వరకూ నిద్ర పోయాము. లేచాక తయారయి బస్ స్టాండ్ దగ్గర బస్ ఎక్కి గమ్యం లేని ప్రయాణం చేసి ఊరు తిరిగి వచ్చాము. మధ్యాహ్నం భోజనం ఆలస్యంగా చేయడంతో ఆకలి అనిపించలేదు. ఇక మళ్ళీ భోజనం అదీ చేయకుండా ఆ రాత్రి త్వరగా నిద్రపోయాము. తరవాత రోజు ఉదయాన్నే ఏడున్నరకు వాటికన్ సిటీ టూర్ కు వెళ్ళాలి. 

ఈ ప్రయాణం కబుర్లు మొదటి నుండీ చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.

Sunday, March 3, 2024

రోమ్ - 2

ఈ పోస్ట్ కు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు  వెళ్ళండి. 

రోమ్ ను ఏడు కొండల మీద కట్టారని చెప్పుకున్నాం కదా! అందులో పిన్సియన్ హిల్(Pincian Hill) కింద భాగంలోఉన్న పియజ్జా డి స్పాన్యా (Piazza di Spagna) లో స్పానిష్ ఎంబసీ(Spanish Embassy) ఉంది. కొండ పైన ‘ట్రినిడా ది మాంటి’(Trinità dei Monti) అనే ఫ్రెంచ్ చర్చ్ ఉంది. కిందనున్న పియజ్జా నుండి పైన ఉన్న ఆ చర్చ్ వరకు కట్టిన మెట్లను స్పానిష్ స్టెప్స్(Spanish Steps) అంటారు. ఇటలీలో ఫ్రెంచ్ వారు కట్టించిన స్పానిష్ స్టెప్స్ అవి. 

మేము ఉంటున్న అపార్ట్మెంట్ కు ఎదురుగా ఉన్న బస్ స్టాండ్ దగ్గర బస్ ఎక్కితే ఐదు నిముషాలలోనే స్పానిష్ స్టెప్స్ వచ్చాయి. పద్దెనిమిదవ శతాబ్దంలో కట్టిన మెట్లవి, మొత్తం నూట ముప్పై ఎనిమిది. అప్పట్లో అది కవులు, రచయితలు, ఫోటో గ్రాఫర్స్, మోడల్స్ కు సమావేశ స్థలం. ప్రస్తుతం కూడా టూరిస్ట్ లతో సందడిగా ఉంది. ఆ మెట్ల పైకి వెళ్ళి చూస్తే ఊరంతా కనిపిస్తోంది. ఆ మెట్లు ఎక్కడానికి టికెట్ ఏమీ లేదు కానీ ఆ మెట్ల మీద కూర్చుంటే మాత్రమే రెండు వందల యాభై యూరోలు జరిమానా వేస్తారట.


పియజ్జా డి స్పాన్యా లో ఆ స్టెప్స్ ముందు ఒక పడవ లాంటి ఫౌంటెన్ ఉంది, దాని పేరు ఫౌంటానా డెల్లా బార్చా(Fontana della Barcaccia). పదహారవ శతాబ్దంలో ఆ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఒక పడవ కొట్టుకుని వచ్చి అక్కడ ఆగిపోయిందిట. దానికి గుర్తుగా ఆ ఫౌంటెన్ కట్టారు.

అక్కడ మరో విశేషం కూడా ఉంది, ప్రముఖ కవి జాన్ కీట్స్ ఆ మెట్లకు మధ్యలో ఒక పక్కగా ఉన్న ఇంట్లో ఉండేవారు. అతనికి టిబి వచ్చినప్పుడు డాక్టర్ సలహా మీద రోమ్ కు వచ్చి అక్కడ ఉన్నాడట. ఆ ఫౌంటెన్ శబ్దం వింటూ అతను ఆఖరి రోజులు గడిపాడు. పాపం పాతికేళ్ళకే అతని జీవితం ముగిసిపోయింది. అతనున్న ఇంటిని ఇప్పుడు మ్యూజియమ్ చేసారు.  
https://www.italy-travels.it/
అంతకు ముందే వర్షం పడడం వలన వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉంది. ఒక దగ్గర చెస్ నట్స్ వేపుతున్నారు. అవి తీసుకుని తింటూ ట్రెవి ఫౌంటైన్(Trevi Fountain) వైపు నడవడం మొదలు పెట్టాము.




క్రీస్తుపూర్వం పంతొమ్మిదవ సంవత్సరంలో రోమ్ కు నీటి సరఫరా కోసం ట్రెవి ఫౌంటెన్ కట్టారు. ట్రెవి అంటే మూడు, మూడు రోడ్ల కూడలిలో కట్టిన ఫౌంటెన్ అది. పద్దెనిమిదవ శతాబ్దంలో అప్పుడున్న ఫౌంటెన్ స్థానం లోనే ఎనభై ఆరు అడుగుల ఎత్తు, నూట అరవై అడుగుల వెడల్పుతో బొరాక్ స్టైల్ లో ఒక కొత్త ఫౌంటెన్ ను కట్టారు. 
ఆ ఫౌంటెన్ మీద చాలా విగ్రహాలు ఉన్నాయి. మధ్యలో ఉన్న పెద్ద విగ్రహం భూమిని చుట్టిన నీటికి సంబంధించిన దేవుడు, ఓసియనస్ (Oceanus). అతని రథం ఒక పెద్ద గవ్వలాగా ఉంది. ఆ రథానికి ఉన్న రెండు నీటి గుర్రాలలో ఒకటి శాంతంగా మరొకటి రౌద్రంగా ఉన్నాయి. అంటే అవి నది, సముద్రాలను ప్రతీకలన్నమాట. ఆ గుర్రాలను లాగుతూ ఇద్దరు రథసారధులు. ఓసియనస్ కు ఎడమ వైపునున్న విగ్రహం సౌభాగ్య దేవత, అబన్డాన్షా(Abundance). ఆ విగ్రహానికి పై నున్న విగ్రహం రోమ్ నగరానికి నీళ్ళు తేవడానికి కంకణం కట్టుకున్న, అగ్రిఫ(Agrippa). కుడి వైపునున్న విగ్రహం ఆరోగ్య దేవత, సలుబ్రిటస్(Salubritas). రోమ్ నగరానికి నీటి ఎద్దడి వచ్చినప్పుడు వర్జిన్ మైడన్ నగరానికి పద్నాలుగు మైళ్ళ దూరంలో నీటిని చూపించిందట. సలుబ్రిటస్ విగ్రహం పైన, వర్జిన్ మైడన్, సైనికుల విగ్రహాలు ఉన్నాయి. వీటన్నింటి పైన ఉన్న నాలుగు శిల్పాలలోని ఒకరు పండ్లు , ఒకరు పువ్వులు, ఒకరు గోధుమలు, మరొకరు ద్రాక్ష వైన్ పట్టుకుని వున్నారు. అవన్నీ భూమి, నీరు ద్వారా వచ్చే వనరులు. అన్నింటి కంటే పైన ఈ ఫౌంటెన్ పాప్ క్లెమెన్స్ IIX(Pope Clemens XII) ఆధ్వర్యంలో కట్టిందనడానికి గుర్తుగా సింహాసనం ఉంటుంది. ఈ ఫౌంటెన్ ను ఇంత అర్థవంతంగా డిజైన్ చేసిన వారు నికోలా సాల్వి(Nicola Salvi). ఆ ఫౌంటెన్ ను కట్టడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది. 

ఇటాలియన్స్ కు ఒక ఆసక్తి కరమైన నమ్మకం ఉంది. ఆ ఫౌంటెన్ లోని నీళ్ళలో కనుక ఒక నాణాన్ని వేస్తే తిరిగి రోమ్ కు వస్తారని, రెండు నాణాలు వేస్తే ఇటాలియన్ తో ప్రేమలో పడతారని, మూడు నాణాలు వేస్తే ఆ ప్రేమించిన వారితో పెళ్ళి అవుతుందని నమ్ముతారు. ఆ నమ్మకంలో నిజమెంతో కానీ, ఆ ఫౌంటెన్ లోని కాయిన్స్ లెక్క పెడితే రోజుకి దాదాపు మూడు వేల యూరోలు ఉంటుందట. స్పానిష్ స్టెప్స్ దగ్గర కంటే ఎక్కువ మంది టూరిస్ట్ లు ఉన్నారు ట్రెవి ఫౌంటెన్ దగ్గర. 


మేము హిస్టారిక్ సెంటర్ లో ఉన్నందువలనేమో ఎటు చూసినా చక్కని ఆర్కిటెక్చర్ తో బిల్డింగ్స్, పియజ్జాలు. హిస్టరిక్ సెంటర్ కాకుండా రోమ్ మిగలిన దగ్గర ఎలా ఉంటుందో చూడాలని దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ కు వెళ్ళి బస్ ఎక్కాము. ఎక్కడికి అని ఏమీ లేదు అది ఎక్కడకు తీసుకుని వెళితే అక్కడికి. హిస్టారిక్ సిటీ దాటిన తరువాత కూడా బిల్డింగ్స్ చక్కని ఆర్కిటెక్చర్ తో చాలా అందంగా ఉన్నాయి. ఒక అరగంట అలా ప్రయాణం చేసి బస్ దిగి మెట్రో ఎక్కి తిరిగి రూమ్ కు వచ్చాము. అలా ఇక్కడకు వెళ్ళాలి ఇది చెయ్యాలి అని ప్రణాళికలేమీ లేకుండా గమ్యం లేని ప్రయాణం బావుంది.

రూమ్ కు వెళ్ళి ఫ్రెష్ అయి సాయంత్రం డిన్నర్ కు గాంధీ టూ రెస్టారెంట్ కు వెళ్ళాం. గాంధీ అనే పేరు చూసి వెజిటేరియన్ రెస్టరెంటేమో అనుకున్నాం కానీ కాదు. గార్లిక్ చికెన్, టమోటో చాట్ తీసుకున్నాం. మా పక్క టేబుల్ లో ఫిలడెల్ఫియా నుండి వచ్చిన ఒక యువ జంట కనిపించింది. వాళ్ళు మాలాగే స్వ౦తంగా ఇటలీ చూడడానికి వచ్చారట. వాళ్ళ సలహా ప్రకారం టీ ఆర్డర్ చేసాం, మేము యూరప్ వచ్చాక అదే మొదటి సారి టీ తాగడం. అక్కడి నుండి వస్తుంటే ఒక పియజ్జా దగ్గర సందడిగా ఉంది. మేము కూడా మెకరూన్స్ తీసుకుని అక్కడే చాలా సేపు గడిపాము. మేము ఆ రోజే అక్కడకు వచ్చామని, ఆ ప్రాంతం అంతా మాకు కొత్తని అనిపించనే లేదు.



తరువాత రోజు ఉదయాన్నే ఆరు గంటలకల్లా బయలుదేరాం. అప్పటికి రోమ్ ఇంకా నిద్ర లేవలేదు. ఖాళీగా ఉన్న వీధులలో తిరుగుతూ, స్పానిష్ స్టెప్స్, ట్రెవి ఫౌంటెన్ కు మళ్ళీ ఒకసారి వెళ్ళి కావలసినన్ని ఫోటోలు తీసుకుని, ఎనిమిది గంటల వరకూ అక్కడే గడిపాము. రోమ్ లో ఇక్కడా అక్కడా అని ఏం లేదు ఎటు చూసినా అందమే.


అక్కడి నుండి దగ్గరలోనే ఉన్న విల్లా బొర్గీస్ గార్డెన్ కు వెళ్ళాం. చాలా పెద్ద గార్డెన్ అది, ఆ సమయంలో వాకింగ్ చేస్తున్న వాళ్ళు తప్ప ఎవరూ లేరు. అక్కడ, మ్యూజియమ్, సఫారీ, లేక్, ఫౌంటెన్స్, స్టాచ్యూస్ ఉన్నాయి. అక్కడ ఉన్న పంతొమ్మిదవ శతాబ్దం నాటి వాటర్ క్లాక్ ఇప్పటికీ నడుస్తోంది. ఆ గార్డెన్స్ ఎత్తులో ఉండడం వలన అక్కడి నుండి రోమ్ అందంగా కనిపిస్తోంది.




ఆ గార్డెన్ లోని కేఫ్ లో క్రొషంట్, కాఫీ తీసుకుని రోమన్ ఫోరం వైపు వెళ్ళే ట్రామ్ ఎక్కాము.  మిగిలిన కబుర్లు తరువాత చెప్పుకుందాం. 

తరువాత భాగం చదవాలంటే ఇక్కడకు, ఈ ప్రయాణం కబుర్లు మొదటి నుండీ చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.