Monday, January 27, 2020

యిలువ

"కా, లచ్చింన్నారాయణన్న యిలువ బెంచుకోడం గురించి చెప్పు౦డే యీడియో యిన్యావా?" ఫోన్ తట్టు జూపిస్తా అడిగినాను.
"
ల్యా యెవురాయన్న, యేం జెప్పినాడ". ఫోన్ లోకి జూస్తా ఆనిందక్క.
"
ఆయన్న బాగా జదూకొని పెద్ద పోలీసయి, యెన్నో మంచిపన్లు జేసినాడని కథలకథలుగా జెప్పుకుంటారులే. యిదిగో యినా" అంటా యీడియో బెట్నా.
పూర్తిగా యినీ "ఆయన్న బలే జెప్పినాడు మే" అంటా మెచ్చుకునింది.
"
యేమోకా, అసలీ యిలువ బెంచుకోడమెందుకా?"
"
యిలువ బెంచుకుంటే అదేందో స్ట్రెస్సు తక్కవవతాదంటనే. అప్పుడు జబ్బుల్రావు డాకటర్ల కాడికి పోబళ్ళా అని జెప్పినే య్యిన్లా. మళ్ళొకసారి సరింగా యినుమే యీడియోనా".
"
పళ్ళేదులేకా. అట్టా యిలువ బెంచుకుంటా బోతా వుంటేనే గదా స్ట్రెస్స. డాలరు చొక్కా, రెండు డాలర్లక, పది డాలర్లక, ఐదొందల డాలర్లకా అమ్మే దానికి వూరికినే వుండాదా? యెంతాలోచన జెయ్యాల యెంత పని మిందేసుకోవాల. పైగా తడవతడవకి అట్ట కుదరతాదా. డాలరు చొక్కా యింకో పది సెంట్లు యెక్కవ కమ్మితే యేవా? నాలుగెక్కవ టీ షర్టులమ్ముకుంటే కడుపులో సల్ల గదలగుండా రొ౦త సంపాదిచ్చుకోవొచ్చు. "
"
అదిగాదుమే." ఆపిందక్క.
"
వుండుకా నన్ను సాంతం జెప్పనియ్యా. యియేకానందుడు షికాగో బోకపోతే, అబుదులు కలాం పీపులుసు పరిసిడెంటు అవకపోతే యేమోతాదా? యిట్టాంటియన్నీ బెట్టుకుంటే యీడో గంతూ, ఆడో గంతూ యేసినట్టే, యింక కుదురుగా నిలబడేదెట్టా. సాయంకాలానికి పనీ గినీ పూర్తి జేసుకుని ఇంటికొచ్చినావా, టీవీ జూసినావా, అన్నం గిన్న౦ దిన్నవా, పండుకున్నావా అన్నట్టుండాలి గానా. యిట్టా యిలువ లేడ బెంచుకుందాం."
"
అట్నా, నీయాలోచన గూడా కరస్టేను మే. అయినా ఆ అన్న జెప్పింది పిలకాయలికిలే మనగ్గాదు. పా మిద్ది మిందె౦డబెట్టిన సద్దలూ, మినువులూ దెద్దాం, కాస్తాలితే యింగా తీలేదని నాయనమ్మ తిడతాది" అంటా పైకిలేచిందక్క.

"మే తాలండట్ట. చదూకోక ముందు పెసలు పెసలన్నాడంట, చదూకున్నాక పిసలైదంట, ఆట్టుంది మీ యవ్వారం". అక్కడే కూర్చుని వైనంగా కొబ్బరాకు ఈనెలు దీస్తున్న రత్నమ్మత్త ఆపింది. 
"యేవత్తా అట్టన్యావా?" పైకి లేచిందల్లా మళ్ళా కింద కూలబడతా అనిందక్క.
"
మీ నాయనమ్మ నాకేమోతాది మే" అనడిగిందీనెలు దీస్తా.
"
యీ మాట అడిగేదానికా ఆపినావ. పిన్నమ్మ గదా" చెప్పిందక్క.
"
అట్టయితే నేను మంచి చెబ్బర చెప్పుకునే దానికి రెండు మైళ్ళవతలున్న మాయమ్మ కాడికి గాకుండా పదూర్ల దూరానున్న పిన్నమ్మ కాడికెందుకొస్తండాను?" చేస్తున్న పనాపి మా తట్టు చూసింది.
అక్కా నేను మోహమోహాలు జూసుకున్నం.
మా యెఱ్ఱి మొహాల్జూసీ పెద్దమ్మే జెప్పింది. "ఎందుకంటే మీ నాయనమ్మ యిలువ బెంచుకుంది గాబట్టి."
అర్థం గాలా. నాయనమ్మకేమన్నా చదువా చట్టుబండలా. యిలువ పెంచుకునేదానికి అదే అడిగినాం.
"
మేయ్. యిలువ పెంచుకునేదానికి సదువే గావాల్నాయిలువెట్టా బెరిగిద్దో జెప్తా యినండి. 

    మీ తాతయ్య సేద్దె౦ జేసిన్నాడు ఇరవై ఎకరాల మాగాణిపన్నెండెకరాల మెట్ట ఉండేది. కమతగాళ్ళుకూలోళ్ళువచ్చే పొయ్యే సుట్టాలుపండగలుపబ్బాలుపైగా నెల్లూళ్ళో కాపరం. ఆసుపత్రికి బొయ్యేవోళ్ళుకోరుటు పన్ల మిందొచ్చేవోళ్ళుఅంతే లేని జనం. అందరికీ వొంటి చేత్తో వొండి బెట్టిందిమే మీ నాయనమ్మ. పొద్దన్న ఆరు గంటలకి పొయ్యెలిగిస్తే ఆర్పేది రాత్రి పదిగంటల మీందే. 

    పెద్ద కమతమగాళ్ళ మని యేనాడు ఎచ్చరికాలకి బొయ్యిందిల్యా. పాలు బిండీమజ్జిగలమ్మీ ఆడపిలకాయలకి చీరా నారా గొని౦ది. పొలంలో వచ్చే పదీ పరకా పోగేసి నాగా నట్రా అమర్చింది. యేటేటా కానుపులకొచ్చే ఆడపిలకాయలికి చింత చిగురు కాడ్ను౦డీ బిడ్డలగ్గావల్సిన కాటిక్కాయి దాకా అన్నీ అమిర్చి బెట్టింది. పనిలో వైనం, మట్టసం దెలిసిన మనిషి. యేడా యెవురికీ లోటు రానీల్యా. అందర్నీ కడుపులో బెట్టుకుని జూసుకునింది. యిన్ని జేస్తాగూడా యేనాడూ గుడ్డ నలగనీలాకొప్పులో పూలు వాడనీలా. యాపొద్దు జూడు మాలచ్చిమిలాగుండేది.

    ఇంగ మాయమ్మా వుంది. రెండ్రోలు సుట్టాలొస్తే వుసూరుసూరుమనేది యిసురుకునేది. అట్టని వొళ్ళు బాగలేక నీరసంగుందేమో యాడ జేస్తది అనుకునేరు. అట్టే౦ల్యా గుండ్రాయిలా వుండేది. పన్జేసీనా వైనంమట్టసం ల్యా. మెల్ల౦గా సుట్టాల రాకపోకలు దగ్గినయ్. యెవురైనా యెందుకొస్తారాయేదో మనోళ్ళు౦డారు జూసి పోదామనొస్తారుగానికూటికి గుడ్డకి ల్యాకొస్తారా. వొంటికాయి సొంటి కొమ్ములా తయారయ్యింది మాయమ్మ. పైగా అక్క౦టే ఒకటే మంట. అందరూ ఆమె చుట్టూతానేనని.

    మీ నాయనమ్మేమో ముని మనవరాల్ని గూడా కాలిమిందేసుకుని నీళ్ళు బోసిందంటే సూడండి. యీ దినం యా కూతురుకోడలు గూడా యీవ ల్యాకుండా సుబకార్యమే జెయ్యరు. చివరికి అల్లుళ్ళు గూడా “పాపకి పెళ్ళి చూపులుకా నువ్వు రెండ్రోల ముందే రావాల” అనీయీపరాళ్ళేమో “మూవ్, మాగమాసానికి ఇల్లు పూర్తవతాది. ఆపైన ఇళ్ళల్లో జేరతండాం టయానికొస్తావేమో అట్ట గాదు నాల్రోల ముందే రావాల” అని పిలుస్తా వుండారంటే జూడండి. అట్టా యీనాటికీ గూడా అందరూ రా రమ్మని పిలిచే వోళ్ళే. ఆమెకు కాస్త వొళ్ళు యెచ్చబడిందంటే ఆగమేగాల మింద పరిగెత్తే వోళ్ళే.

     పెద్దరికం వొయిసుతో గాదు యిలువ బెంచుకుంటేనే వస్తాదనేది తెలుసుకుంటే కాపరాలన్నీ కుదురుంగా వుంటయ్. యిలువ బెంచుకోవలంటే కష్టం, సుకం అనుబగిచ్చాల పనీ పాటా జెయ్యాల, అట్టని గుడ్డెద్దు చేలో బడ్డట్టు గాదు, సుట్టుపక్కల గమనిస్తా పనిలో వాటం, వైనం దెలుసుకోవాల. వొకటే మొయిన పిలకాయలు పట్టిచ్చుకోరుఅయినా అడ్డాలు నాడు బిడ్డలుగాని గడ్డాలు నాడు గాదని మా యమ్మ జెప్పినట్టు సామెతలు జెప్పుకుంటే పిల్లాజెల్లా దగ్గరకొస్తారా. అంటూ కొబ్బరి పుల్లలన్నీ కలిపి వైనంగా కట్టిన చీపుర్ని తీసుకుని లోపలకి చక్కా బోయిందత్త.





2 comments:

  1. నిజమేనండి, మన పెద్దవాళ్ళు ఆచరణలో చూపిన వాటిని ఇప్పుడు వీడియోల్లో చూస్తున్నాం.. యాస చిక్కబడుతోంది, పట్టు విడవకుండా ప్రయత్నిస్తున్నారుగా :)

    ReplyDelete
    Replies
    1. వీడియోల్లో అయినా చూడగలుగుతున్నాం సంతోషమే. యాస మరీ చిక్కనైనట్లుంది కదూ! కొంచెం పలుచన చేయాలి. :). ధన్యవాదాలు మురళి గారు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.