అమ్మలూ నువ్వింకా కదలనే లేదా? ఇలా కబుర్లేసుకు కూర్చుంటే ఎలా తల్లీ? ఈ వేళ గురించి నీకు ఎప్పుడనగా చెప్పాను? అన్నీ విన్నావు ‘ఊ’ కొట్టావు కూడా. ఊ..ఊ..పద పద మరి. ఇలా చీమ నడకలు నడిస్తే ఎలా బంగారం? నీకిష్టమైనపుడు పరగులు పెడతావు, నిలవమన్నానిలవవు. ఇప్పుడేమో ఇలా! ఎలారా నీతో? ఏమిటీ? అంతా కోపమే! చిన్న సాయమేగా అడిగాను. అదికూడా చేయకపోతే ఎలా తల్లీ! అప్పుడెప్పుడో నాకు గాయమైనప్పుడు సాయం చేసావా? నేనెలా మరచిపోతాను మరచిపోలేదులే. ఏదో మనసూరుకోక అన్నాలేరా. అలా బుంగమూతి పెట్టకు. నీకీ వేళ మల్లెమొగ్గలతో జడల్లుతానుగా, ఏమిటీ మల్లెలొద్దా పోనీ మొగలిపూల జడ వేయనా. నా బంగారం...త్వరగా కదులమ్మా.
ఇల్లలికాను, ముగ్గులు పెట్టాను తోరణాలు కట్టాను. ఇహ..నీ పనే మిగిలింది. ఈ వర్షం ఒకటి, పొద్దు గడవనివ్వదు, రేయి తరగనివ్వదు. ఆ చందురుడ్ని మత్తే కమ్మిందో సూరీడికి బద్దకమే వచ్చిందో ఎక్కడా వెలుగు రేఖ కనపడ్డమే లేదు. చిన్నవైనా చుక్కలే నయం. స్వాగతం పలకడానికి ఎప్పుడో వెళ్లిపోయాయి ఒక్కళ్ళూ కదలరేమర్రా ఒక్కదాన్ని ఎంతని తిరగను? నాకున్న తొందరలో మీకు పిసరంతైనా లేదే?
ఈ కాలాన్ని కదలమని నువ్వైనా చెప్పవమ్మా పువ్వమ్మా! ఈ కాలం కదిలేదెప్పుడో, నా నిరీక్షణ పూర్తయ్యేదెన్నడో! అప్పుడేగా సంతోషం ముంగిట వాలేది, ఆ నక్షత్రాల వెలుగు కళ్ళలో ప్రతిఫలించేదీనూ!!