Wednesday, November 2, 2011

విన్నవించుకోనా చిన్న కోరిక

         అమ్మలూ నువ్వింకా కదలనే లేదా? ఇలా కబుర్లేసుకు కూర్చుంటే ఎలా తల్లీ? ఈ వేళ గురించి నీకు ఎప్పుడనగా చెప్పాను? అన్నీ విన్నావు  ‘ఊ’ కొట్టావు కూడా. ఊ..ఊ..పద పద మరి. ఇలా చీమ నడకలు నడిస్తే ఎలా బంగారం? నీకిష్టమైనపుడు పరగులు పెడతావు,  నిలవమన్నానిలవవు. ఇప్పుడేమో ఇలా! ఎలారా నీతో? ఏమిటీ? అంతా కోపమే! చిన్న సాయమేగా అడిగాను. అదికూడా చేయకపోతే ఎలా తల్లీ! అప్పుడెప్పుడో నాకు  గాయమైనప్పుడు సాయం చేసావా? నేనెలా మరచిపోతాను మరచిపోలేదులే. ఏదో మనసూరుకోక అన్నాలేరా. అలా బుంగమూతి పెట్టకు. నీకీ వేళ మల్లెమొగ్గలతో జడల్లుతానుగా, ఏమిటీ మల్లెలొద్దా పోనీ మొగలిపూల జడ వేయనా. నా బంగారం...త్వరగా కదులమ్మా.

       ఇల్లలికాను, ముగ్గులు పెట్టాను తోరణాలు కట్టాను. ఇహ..నీ పనే మిగిలింది. ఈ వర్షం ఒకటి, పొద్దు గడవనివ్వదు, రేయి తరగనివ్వదు.  ఆ చందురుడ్ని మత్తే కమ్మిందో సూరీడికి బద్దకమే వచ్చిందో ఎక్కడా వెలుగు రేఖ కనపడ్డమే లేదు. చిన్నవైనా చుక్కలే నయం. స్వాగతం పలకడానికి ఎప్పుడో వెళ్లిపోయాయి ఒక్కళ్ళూ కదలరేమర్రా ఒక్కదాన్ని ఎంతని తిరగను? నాకున్న తొందరలో మీకు పిసరంతైనా లేదే?

       ఈ కాలాన్ని కదలమని నువ్వైనా చెప్పవమ్మా పువ్వమ్మా! ఈ కాలం కదిలేదెప్పుడో, నా నిరీక్షణ పూర్తయ్యేదెన్నడో! అప్పుడేగా సంతోషం ముంగిట వాలేది, ఆ నక్షత్రాల వెలుగు కళ్ళలో ప్రతిఫలించేదీనూ!!



17 comments:

  1. మల్లెలతో పూలజడ నాకెంత ఇష్టమో అమ్మ ప్రతీ వేసవికీ వేస్తుంది నాకు! మీరు నాకు వేస్తారా మరి? చాలా చక్కగా వ్రాశారు! కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం అన్న పాట గుర్తుకొస్తోంది ఎందుకనో! నాకు కూడా కాలం త్వరగా కదిలేసి, చదువు అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది! ఈ కాలం అనేది ఉంది చూడండి అది ఒక పెద్ద దొంగ మొఖం! ఎందుకంటే మనం ఆనంద డోలికల్లో తేలుతున్నప్పుడేమో మనో వేగమంత వేగంగా వెళిపోతుంది! మనకి ఈ క్షణం ఎప్పటికి అవుతుందిరా బాబు అనుకుంటే అక్కడే తిష్ట వేసుకుని మరీ కూర్చుంటుంది!

    ReplyDelete
  2. కాలాన్ని చిన్ని పాపతో పోలుస్తూ తల్లి కూతురిని బుజ్జగిస్తున్నట్లుగా
    విన్నవించుకున్న మీ చిన్ని కోరిక చాలా బాగుందండీ..

    ఈ రోజు మీ బ్లాగ్ చూసిన తర్వాత వనజవనమాలి గారు చెప్పిన రచయిత్రి జ్యోతిర్మయి మీరేనేమో అని నాకు కూడా అనిపిస్తుంది...

    ReplyDelete
  3. excellent expression. kaalaanni ilaa chinni paapagaa choodatam chaalaa baagundhi.

    ReplyDelete
  4. కాలాన్ని బ్రతిమలాడుతూ, బుజ్జగిస్తూ, లాలిస్తూ బాగుంది మీ తపన. మీరడగాలే గానీ పువ్వూ చెప్తుంది, నవ్వూ చెప్తుంది.. మీ నిరీక్షణ నీరు మాత్రం కాదు. ఇలా చెప్తే తప్పకుండా ఫలిస్తుంది. బాగుంది మీ భావన.

    ReplyDelete
  5. చాలా ఆహ్లాదకరంగా వుంది, సున్నితంగా, అందంగా.

    ReplyDelete
  6. @ రసజ్ఞ ఈ సారి నవంబరులో కూడా మా ఇంట్లో మల్లెలు పూస్తున్నాయి జడ వేస్తాను వస్తారా? ధన్యవాదాలు.

    @ రాజి గారూ స్వాగతం. ఏదో అభిమానంగా అలా అంటున్నారు. ధన్యవాదాలు

    @ వనజ గారూ
    రాజిగారిని పరిచయం చేసినందుకు, టపా నచ్చినందుకు ధన్యవాదాలండీ.

    ReplyDelete
  7. సంఘమిత్ర గారూ స్వాగతం. మీ పేరు కూడా ఆహ్లాదంగా, అందంగా ఉందండి. టపా నచ్చినందుకు ధన్యవాదాలు.

    శుభా మీ వ్యాఖ్యలు బోలెడు మురిపించేస్తాయి. ధన్యవాదాలు

    మధురవాణి గారూ ధన్యవాదాలు.

    ReplyDelete
  8. ఎంచక్కా రాసారో! శీర్షిక చాలా బాగుంది. టపా ఇంకా బాగుంది. అలనాటి ఆణిముత్యాలని ఏరుకొచ్చి టపాలకి టైటిల్స్ పెట్టేసుకుంటున్నారే! భలే!

    మీ ఇంట్లో మల్లెలు పూస్తున్నాయా? నిజమా?? మీ ఇంట్లో కాఫీ బాగుంటుందని చెప్పండి, వచ్చి తిష్ట వేసేస్తా!

    ReplyDelete
  9. @జ్యోతిర్మయి
    అభ ఏంటి ఇలా ఉన్నారే మీరు. మాకంతా రాసే హక్కు లేదా . మీకు మరీ ఎంత తెలివి ఉంటే మాత్రం ఇలా రాసుకుంటూ వెల్లిపోవడమేనా . ఏదో సరదాగా రాస్తున్నార్లే అనుకుంటే ఎంటండి. కొంచమైన కూసింతైన కనికరం చూపెట్టచ్చు కదా. లేదా కొంచమైన చక్కగా రాయచ్చు కదా. అందరికి ఇదే బాధ. ఎపుడు ఎం రాస్తారో తెలియదు ఎం జేరుగుతుందో తెలియదు. కొందరేమో సంతోషంగా ఉండేలా రాస్తారు. కొందరిని ఏడిపించేలా రాసేస్తారు తల రాతను . మీ ధోరణి అస్సలు అర్థం కాదు బ్రహ్మా గారు. సరే అవంత ఇహ వద్దు కాని ఒక్క చిన్న విన్నపం జ్యోతిర్మయి గారు ఎలాగో ఇలా రాసేస్తున్నారు చక్కగా ముత్యాలు పొదిగినట్టు కావున బొమ్మలు కూడా వేసేటట్టు తలరాతను మార్చేయండి త్రిమూర్తి గారు ప్లీజ్ . కావాలంటే మీకు మీ మీద రాసిన కవితను లంచంగా ఇమ్మంటాను ఏమంటారు . అభ ఒప్పుకోండి. అంతే నాకు తెలీదు ఒప్పెస్కున్నారు.

    ReplyDelete
  10. అక్కా, చాల బాగుంది

    ReplyDelete
  11. @ కొత్తావకాయ గారూ...నాకు పాటలంటే చాలా ఇష్టమ౦డీ. ఎక్కువగా వింటూ వుంటాను. అందుకేనేమో శీర్షికలు పెట్టడానికి ముందుగా ఆ వాక్యాలే గుర్తొస్తాయి. మల్లెలు ఈ సారి వేసవి తరువాత పూయడం మొదలెట్టాయి. మీకు మంచి ఫిల్టర్ కాఫీ ఇస్తాను వచ్చేయకూడదూ..మీ బాల్యం కబుర్లు చాలా వినాలని వుండి. ధన్యవాదాలు.

    @ కళ్యాణ్ గారూ మీరీ మధ్య మరీ పోగిడేస్తున్నరండీ. నాకు బొమ్మలు గీయడం అసలు రాదండీ. ఫోటోలు పెట్టడానికి ప్రత్నించాను కాని, ఫోటో లేకపోతేనే భావం ఊహల్లో బావుందనిపించింది. మీ అభిమానానికి ధన్యదాలు.

    @ సుధీర్ what a pleasant surprise! అస్సలు ఊహించలేదు. చాల సంతోషంగా ఉంది. థాంక్ యు.

    ReplyDelete
  12. @జ్యోతిర్మయి గారు పొగడ్తలు కాదు చూసినవెంతనే నాకు ఏమైతే తోస్తుందో అదే పెడతాను అంతే. మంచిగా వివరించారు అవను ఊహలను ఎంతగా బొమ్మను చేసినా పెట్టడం కష్టమే . ఏదో మేము అ ఊహను కనులారా చూసుకుందాం అని. ఇంతకు ఎవరు చెప్పారు మీకు బొమ్మలు రావని గీస్తే ఎవ్వరికైనా వచేస్తాయండి. మీరు ఎన్నైనా చెప్పండి కచ్చితంగా మీ బొమ్మలు ఏదోకరోజు చూస్తానని ఆసిస్తూ వేచి ఉంటాను.మేము అర్థం చేస్కోగాలమంది మీరు ఏమి గీసినా.

    పిచ్చి గీతాలు గీసినా అది పక్షి గూడు కాదా!
    వంకర టింకర పోయినా అది వాగు వంక కాదా!
    తెల్ల కాగితం పై నల్లని చుక్క కూడా
    మెత్తని బుగ్గలపై అందమైన దిష్టి చుక్కలా మారిపోదా!
    కుంచె కధలాలే కాని అందమైన ప్రేమ కూడా
    అరచేతికి దాసోహమవ్వదా !

    ReplyDelete
  13. కళ్యాణ్ గారూ మీ అభిమానానికి ఎలా ధన్యవాదాలు తెలుపుకోవాలో కూడా తెలియడం లేదు. నన్ను ప్రోత్సహించి నాతో కవితలు వ్రాయిస్తున్నారు. అలాగే నా చేత చిత్రాలు కూడా వేయించేలా ఉన్నారు. బోలెడు ధన్యవాదాలు.

    ReplyDelete
  14. @జ్యోతిర్మయి గారు మరి మాష్టారంటే ఏమనుకున్నారు :) గీయకపోతే బెత్తం పట్టుకుంటా హా :D

    ReplyDelete
  15. పాపాయిని బుజ్జగిస్తున్నారనుకున్నాను :) కాలాన్నే పాపాయి ని చేసారా ! బాగుంది .

    ReplyDelete
  16. @ మాలా కుమార్ గారూ చాలా టపాలు చదివినట్లున్నారే ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.