Monday, November 28, 2011

ప్రియమైన అమ్మకు,

              చాలా ఏళ్ళయి౦ది కదూ నీకు ఉత్తరం రాసి. అప్పుడెప్పుడో...  “ఫోన్ లో మాట్లాడితే నాకు గుర్తు చేసికోవడానికేం ఉండదు, నువ్వు రాసిన ఉత్తరం అయితే  నేను చాలసార్లు చదువుకుంటాను.అన్నావు కదా, అది గుర్తొచ్చి ఈ ఉత్తరం వ్రాస్తున్నా.

        ఇక్కడ అందరం బావున్నాం. పిల్లలిద్దరూ బాగా చదువుకుంటున్నారు. ఇవేకాక ఇంకా ఆటలు, పాటలు, స్నేహితులుఇప్పటి పిల్లలకు అస్సలు తీరికే వుండదు, వారి ప్రపంచంలో వారుంటారు. చిన్నప్పుడు నువ్వు వంట చేస్తుంటే నేను బియ్యంలో రాళ్ళేరుతూనో, చిక్కుళ్ళు తు౦చుతూనో పక్కనే ఉండేదానిని. నేను చదువుతున్నప్పుడు నువ్వు కూడా పేపర్లు దిద్దుతూనో, పాఠం చెప్పడానికి పుస్తకం చదువుతూనో ఆ పక్కనే కూర్చునేదానివి. 

       నువ్వూ, నాన్నా ఏ 'మిస్సమ్మ' గురించో, 'గుండమ్మ కథ' గురించో మాట్లాడుతుంటే తెలియకుండానే మాక్కూడా వాటి మీద ఇష్టం కలిగింది. ఇప్పటికీ ఆ సినిమాలు చాలా నచ్చుతాయి, ఆ సినిమాలు చూస్తున్నప్పుడు మీ మాటలు కూడా గుర్తొస్తుంటాయి. ఈ పిల్లల్ని పదేళ్ళ క్రితం సినిమా చూడమన్నా ఓల్డ్ మూవీఅనేస్తున్నారు. జీవితంలో మార్పులు చాలా వేగంగా వస్తున్నాయి, అందుకోవడానికి పరుగులు పెట్టాల్సివస్తుంది.

        ఇంటి ముందున్న తోటలోని గులాబీలు ఈ వేసవిలో చాలా బాగా పూశాయి. గులాబీరంగు పువ్వులయితే ఎంతందంగా ఉన్నాయో! వర్షం పడుతున్నప్పుడు ఫోటో తీశాను, చాలా బాగా వచ్చింది. ఈ సారి దారి  పక్కనంతా బంతి మొక్కలు నాటాం. మొన్నటి వరకు పూజకు అవే పెట్టాను. చలికాలం వచ్చిందిగా కరివేప, మల్లెమొక్కల్ని ఇంట్లో పెట్టాము. 


       పిల్లల బట్టల కోసం మొన్న షాపింగ్ కి వెళ్ళాము. స్కూల్ తెరిచే ముందు వేసవిలో మనం అలానే వెళ్ళేవాళ్ళం కదూ! ఎక్కువ బట్టలు అప్పుడే కొనేవాళ్ళం, ప్రతి పండక్కీ దాచుకుని వేసుకునేదానిని. పండగంటే గుర్తొచ్చిందీ, సంక్రాంతికి నువ్వు ముగ్గులు వేస్తుంటే నేను రంగులు వేసేదాన్ని కదూ! ఇప్పుడా ముగ్గులూ, ర౦గులూ రెండూ లేవు. 

         మొన్నోరోజు నువ్వు చేసినట్లే మైసూర్ పాక్చేద్దామని మొదలెట్టాను. నీ అంత బాగా రాలేదు గానీ... పిల్లలకు నచ్చింది. పాపకు ఆల్జీబ్రాచెప్తుంటే 'యు అర్ సో స్మార్ట్అని సర్టిఫికేట్ ఇచ్చింది. అమ్మమ్మ అయితే ఇంకా బాగా చెప్పేదని చెప్పాను. అప్పుడు నువ్వు నేర్పిందే... నాకిప్పటికీ గుర్తుంది, ఒక్కొక్క చాప్టర్ ఎన్నిసార్లు చేసేవాళ్ళమో! చాలా సరదాగా ఉండేది. 

          నేనీ మధ్య కొన్ని నాటికలు రాశాను. పిల్లలతో వేయిస్తుంటే సరదాగా అనిపించింది. నువ్వు దగ్గరుండి చూస్తే నాకు తృప్తిగా ఉండేది. నేను కొత్త అడుగు వేసినప్పుడల్లా ఆలోచన నీవైపే సాగుతుంది. ఈ మధ్యే  బ్లాగ్ మొదలు పెట్టాను. కొంచెం రాయడం అలవాటయింది. నువ్వు నెట్  చూడవుగా, అన్నీ నీకు చూపించాలనిపిస్తుంది. బ్లాగ్ లో విజిటర్స్ ని చూసినప్పుడల్లా ఇంటికి చుట్టాలొచ్చినట్లు ఎంత సంబరంగా ఉంటుందో! కొన్ని కొన్ని కామెంట్లు ఎంత సరదాగా ఉంటాయనుకున్నావు... మనతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. 

            చాలా సంవత్సరాలయ్యింది, ఇలా నీతో కబుర్లు చెప్పి. ఎన్నో చెప్పాలి నీకు. నా కవితలూ, నాటికలు అన్నీ చూపించాలి. అవునూ, ఇవాళ నీ పుట్టినరోజు కదూ! శుభాకాంక్షలు చెప్దామంటే చిరునామా ఇవ్వకుండా వెళ్ళిపోయావు. ఈ కబుర్లన్నీ నిన్ను చేరేదెలా...


ప్రేమతో 
నీ 
జ్యోతి