Monday, November 28, 2011

ప్రియమైన అమ్మకు,

              చాలా ఏళ్ళయి౦ది కదూ నీకు ఉత్తరం రాసి. అప్పుడెప్పుడో...  “ఫోన్ లో మాట్లాడితే నాకు గుర్తు చేసికోవడానికేం ఉండదు, నువ్వు రాసిన ఉత్తరం అయితే  నేను చాలసార్లు చదువుకుంటాను.అన్నావు కదా, అది గుర్తొచ్చి ఈ ఉత్తరం వ్రాస్తున్నా.

        ఇక్కడ అందరం బావున్నాం. పిల్లలిద్దరూ బాగా చదువుకుంటున్నారు. ఇవేకాక ఇంకా ఆటలు, పాటలు, స్నేహితులుఇప్పటి పిల్లలకు అస్సలు తీరికే వుండదు, వారి ప్రపంచంలో వారుంటారు. చిన్నప్పుడు నువ్వు వంట చేస్తుంటే నేను బియ్యంలో రాళ్ళేరుతూనో, చిక్కుళ్ళు తు౦చుతూనో పక్కనే ఉండేదానిని. నేను చదువుతున్నప్పుడు నువ్వు కూడా పేపర్లు దిద్దుతూనో, పాఠం చెప్పడానికి పుస్తకం చదువుతూనో ఆ పక్కనే కూర్చునేదానివి. 

       నువ్వూ, నాన్నా ఏ 'మిస్సమ్మ' గురించో, 'గుండమ్మ కథ' గురించో మాట్లాడుతుంటే తెలియకుండానే మాక్కూడా వాటి మీద ఇష్టం కలిగింది. ఇప్పటికీ ఆ సినిమాలు చాలా నచ్చుతాయి, ఆ సినిమాలు చూస్తున్నప్పుడు మీ మాటలు కూడా గుర్తొస్తుంటాయి. ఈ పిల్లల్ని పదేళ్ళ క్రితం సినిమా చూడమన్నా ఓల్డ్ మూవీఅనేస్తున్నారు. జీవితంలో మార్పులు చాలా వేగంగా వస్తున్నాయి, అందుకోవడానికి పరుగులు పెట్టాల్సివస్తుంది.

        ఇంటి ముందున్న తోటలోని గులాబీలు ఈ వేసవిలో చాలా బాగా పూశాయి. గులాబీరంగు పువ్వులయితే ఎంతందంగా ఉన్నాయో! వర్షం పడుతున్నప్పుడు ఫోటో తీశాను, చాలా బాగా వచ్చింది. ఈ సారి దారి  పక్కనంతా బంతి మొక్కలు నాటాం. మొన్నటి వరకు పూజకు అవే పెట్టాను. చలికాలం వచ్చిందిగా కరివేప, మల్లెమొక్కల్ని ఇంట్లో పెట్టాము. 


       పిల్లల బట్టల కోసం మొన్న షాపింగ్ కి వెళ్ళాము. స్కూల్ తెరిచే ముందు వేసవిలో మనం అలానే వెళ్ళేవాళ్ళం కదూ! ఎక్కువ బట్టలు అప్పుడే కొనేవాళ్ళం, ప్రతి పండక్కీ దాచుకుని వేసుకునేదానిని. పండగంటే గుర్తొచ్చిందీ, సంక్రాంతికి నువ్వు ముగ్గులు వేస్తుంటే నేను రంగులు వేసేదాన్ని కదూ! ఇప్పుడా ముగ్గులూ, ర౦గులూ రెండూ లేవు. 

         మొన్నోరోజు నువ్వు చేసినట్లే మైసూర్ పాక్చేద్దామని మొదలెట్టాను. నీ అంత బాగా రాలేదు గానీ... పిల్లలకు నచ్చింది. పాపకు ఆల్జీబ్రాచెప్తుంటే 'యు అర్ సో స్మార్ట్అని సర్టిఫికేట్ ఇచ్చింది. అమ్మమ్మ అయితే ఇంకా బాగా చెప్పేదని చెప్పాను. అప్పుడు నువ్వు నేర్పిందే... నాకిప్పటికీ గుర్తుంది, ఒక్కొక్క చాప్టర్ ఎన్నిసార్లు చేసేవాళ్ళమో! చాలా సరదాగా ఉండేది. 

          నేనీ మధ్య కొన్ని నాటికలు రాశాను. పిల్లలతో వేయిస్తుంటే సరదాగా అనిపించింది. నువ్వు దగ్గరుండి చూస్తే నాకు తృప్తిగా ఉండేది. నేను కొత్త అడుగు వేసినప్పుడల్లా ఆలోచన నీవైపే సాగుతుంది. ఈ మధ్యే  బ్లాగ్ మొదలు పెట్టాను. కొంచెం రాయడం అలవాటయింది. నువ్వు నెట్  చూడవుగా, అన్నీ నీకు చూపించాలనిపిస్తుంది. బ్లాగ్ లో విజిటర్స్ ని చూసినప్పుడల్లా ఇంటికి చుట్టాలొచ్చినట్లు ఎంత సంబరంగా ఉంటుందో! కొన్ని కొన్ని కామెంట్లు ఎంత సరదాగా ఉంటాయనుకున్నావు... మనతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. 

            చాలా సంవత్సరాలయ్యింది, ఇలా నీతో కబుర్లు చెప్పి. ఎన్నో చెప్పాలి నీకు. నా కవితలూ, నాటికలు అన్నీ చూపించాలి. అవునూ, ఇవాళ నీ పుట్టినరోజు కదూ! శుభాకాంక్షలు చెప్దామంటే చిరునామా ఇవ్వకుండా వెళ్ళిపోయావు. ఈ కబుర్లన్నీ నిన్ను చేరేదెలా...


ప్రేమతో 
నీ 
జ్యోతి       


20 comments:

  1. అమ్మ ఎక్కడున్నా అమ్మ చిరునామా మనలోనే ఉంటుంది. మన ఆలోచనలు, జ్ఞాపకాలు, అలవాట్లు, పద్ధతులు అన్నీ అమ్మే (అమ్మ నేర్పినవే కదా) ఎక్కడున్నా మనతోనే ఉంటారు. మీ అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆల్జీబ్రా గుండెగాబర అనే దానిని చిన్నప్పుడు! ముగ్గులు నేను ఇక్కడ కూడా ముగ్గు పిండి దొరకకపోయినా బియ్యపు పిండితో మరీ రోజూ మా గుమ్మం ముందు ముగ్గు వేసుకుంటానుగా! మీ ఉత్తరంతో ఎటో తీసుకెళ్ళిపోయారు!

    ReplyDelete
  2. చిరునామా ఇవ్వకుండా వెళ్ళిపోయావు..ఈ ఒక్కటీ చదవగానే మాటల్లేవండీ.ఏదేమైనా అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

    ReplyDelete
  3. మీ ఉత్తరం చదువుతుంటే నేను Law చదివిటేప్పుడు హాస్టల్ నుండి మా అమ్మకి నేను రాసిన ఉత్తరాలు గుర్తుకువచ్చాయి...

    రోజూ లాండ్ ఫోన్లో మాట్లాడుకున్నా ఉత్తరం రాస్తేనే కాని అన్ని విషయాలు చెప్పినట్లు వుండేది కాదు నాకు అమ్మకి...

    ReplyDelete
  4. సుభగారి కామెంట్ కాపీ-పేస్ట్
    అంతకన్నా ఏం మాట్లాడాలో తెలీదు

    ReplyDelete
  5. చివరి వాక్యాలు చదివేసరికి మనసు కలుక్కుమంది.

    ReplyDelete
  6. చిరునామా ఇవ్వకుండా ... ఈ వాక్యం చదవనంత వరకూ ఒకలా, చదివాక ఒకలా.. :-(

    ReplyDelete
  7. @జ్యోతిర్మయి గారు మొదట మీ అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరునామా మీకు ఇవ్వలేదా నాకు ఇచ్చారు అయ్యో నేనే ఇవ్వడం మరచిపోయా మర్నించాలి అండి ఎక్కడున్నారో చెప్తాను నోట్ చేస్కొండి.

    మీరు అల్లారు ముద్దుగా పెరిగినపుడు మీ ప్రాణం లా ఉన్నారట
    నడకలు నేర్చేటప్పుడు మీ పాదమై మేలిగారట
    చేతికందినపుడు స్నేహమై కలిసిపోయారట
    మీరు అమ్మయే సరికి తను మీ పిల్లలో ఉండిపోయారట
    కాబట్టి మీ పిలల్ని పిలిచి ఓ సారి చూడండి అమ్మ కనిపించేస్తారు

    ReplyDelete
  8. సరదా సరదాగా చదువుకుంటూ అలా చివరికొచ్చేసరికి మనసు బరువెక్కిందండీ.. :(
    కళ్యాణ్ గారి కామెంట్ కి సూపర్ లైక్! అదన్నమాట సంగతి.. మీ అమ్మ గారు మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందరే తిరిగేస్తున్నారటండీ..:)

    ReplyDelete
  9. మాననిగాయ౦, జ్ఞాపక౦తో కలసి కాలాన్ని ఎప్పుడూ ఓడిస్తూనే వుంది. మాట మౌనాన్ని ఆశ్రయించి ముత్యమై జారుతోంది. నాను౦చి నన్ను దూరం చేసే క్షణాల్లో నాకోసం నిలిచిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete
  10. అమ్మ ఒక కమ్మని కావ్యం! అమ్మ ఒక చెరగని జ్ఞాపకం చాలాబాగుంది మీ ఉత్తరం. అందరిలాగానే చివర్లో మనసు చివుక్కుమంది. ముఖ్యంగా మీఉత్తరమ్ వ్రాయటం, వ్రాసేతీరూ చాలాబాగున్నాయి.ఓ పాతికేళ్ళు వెనక్కి తీసుకెళ్ళాయి. సెల్‍ఫోనులూ, టెలిఫోనులూ, ఇంటర్నెట్లూ మనిషినియంత్రసమానంగాచేసాయేమోననిపిస్తుంది నాకైతే. ఉత్తరంభాగావ్రాసినందుకు మరోసారి అభినందనలు

    ReplyDelete
  11. ఉత్తరం జీవితములో మరచిపోలేని విలువకట్టలేని తీయని గుర్తు, ఇది చదివినాక నేను నాన్న గారికి నాన్న గారు నాకు వ్రాసినా ఉత్తరాల జ్ఞాపకాలు గుర్తు చేశారు ధన్యవాదములు శర్కరి గారు..

    ReplyDelete
  12. @ శశిధర్ గారూ స్వాగతం..ఉత్తరం వ్రాయడంలోనూ అందుకోవడంలోనూ ఓ గొప్ప ఆనందం ఉంది. పోస్ట్ మాన్ వచ్చే టైంకి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఒకప్పుడు..
    ధన్యవాదాలు.


    @ తెలుగు పాటలు గారూ నిజమేనండీ..ఉత్తరాలు జ్ఞాపకాలకు ప్రతిరూపాలు..ధన్యవాదాలు.

    ReplyDelete
  13. amma chirunama mana venta epudu untundi akka..!!

    meeru poddunne legisi chai tagutaru kada...dantlo teyyadanam amma..!!

    meeru morning breakfast chestaru kada...dantloni kammadanam amma..!!

    meeru intlo pani chesukuntunnapudu meeku vache chiraku...pani ayaka meeku kalige anandam amma..!!

    prathi nimisham meetho undali anukune mee chirunavvu amma..!!

    amma ni mee deggare pettukuni...chirunama ledu anatam correct kadu akka..!!!

    meeru ivanni amma ki cheppali ani anukuntunnaru...kani amma manasuki meeru oka chirunavvutho cheppina eh vishayam aina ala arthma aipothundi....address avasaram ledu..!!

    ReplyDelete
  14. @ ఎన్నో విషయాలు అలా పంచుకోవాలని పిస్తుంది..ఉన్నదున్నట్లుగా చెప్పగలిగింది అమ్మకే..మన అభివృద్దికి మనస్ఫూర్తిగా మెచ్చుకునేదీ అమ్మే కదా! ఒక్కోసారి మనసు సమాధానపడదు. నాకింతమంది ఆత్మీయులున్నందుకు ఎంత సంతోషంగా ఉందో.. ధన్యవాదాలు.

    ReplyDelete
  15. జ్యోతీ
    అమ్మను గురించి నీ ముచ్చట్లు చదివాను బ్లాగ్లో
    ఆర్ద్రమయ్యాను కన్నీటి పర్యంతమయ్యాను.

    కవితలన్నీ బాగున్నాయి ఎంతో పరిణతి కనిపిస్తోంది
    నీ ఉన్నతికి గర్విస్తున్నాను
    --------------నాన్న

    ReplyDelete
  16. అమ్మకు రాసిన ఉత్తరం చాలా బాగుంది జ్యోతిర్మయి గారు. ముఖ్యంగా మీరు అమ్మకు వంటలో సాయం చేయడమూ మీతోపాటు మిమ్మల్ని చదివిస్తూ తన ఆఫీస్ పని ఇంటికి తెచ్చుకుని చేస్తుండటమూ చూసిన వెంటనే మా అమ్మ గుర్తొచ్చింది మేమిద్దరంకూడా అచ్చంగా అంతే..

    ReplyDelete
  17. అమ్మ చిరునామా - తన బిడ్డల హృదయం.

    ReplyDelete
  18. @ వేణుగారూ సమాధానం దొరకదని తెలిసినా, ఎ౦దుకిలా అన్న ప్రశ్న పదే పదే మనసును తొలుస్తు౦డేది. కొన్ని౦టికి అలవాటు పడడడం తప్ప ఇంకేమీ చెయ్యలేం. ఎంత టైం పడుతుదన్నది కాలమే నిర్ణయించాలి. ధన్యవాదాలు.

    @ బోనగిరి గారూ బాగా చెప్పారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  19. నిజం కదా బ్లాగ్ లో విసిటర్స్ ని చూస్తే ఇంటికి చుట్టాలోచ్చినట్టే అనిపిస్తుంది. మీ బ్లాగ్ చాలా బాగుంది ఈ రోజు తీరిక చేసుకుని దాదాపు మొత్తం చదివాను జ్యోతి గారూ .

    ReplyDelete
  20. సామాన్య గారూ స్వాగతం..మీకు బ్లాగు నచ్చినందుకు చాలా సంతోషం..ధన్యవాదాలు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.