Wednesday, January 25, 2023

కొట్టకల్ - ఆర్యవైద్యశాల - 7

కోజికోడే (కాలికట్), కొట్టకల్ కు నలభై ఐదు కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఈ  పట్టణం ఒకప్పుడు మలబార్ జిల్లా రాజధాని. "సిటీ ఆఫ్ స్పైసెస్"  అని పిలువబడే ఈ పట్టణంలో సుగంధ ద్రవ్యాల ఎగుమతి ఏడవ శతాబ్దం నుండి మొదలైయ్యింది. అంతే కాదు  వాస్కోడిగామా మొదటిసారి భారత దేశానికి అడుగు పెట్టిన ప్రాంతం అది. "కోజికోడే బీచ్ లో సూర్యాస్తమయం చాలా బావుటుంది. అక్కడ ఎస్.ఎమ్ స్ట్రీట్ అనే వీధిలో దొరికే స్వీట్స్ రుచి అమోఘం" అని హాస్పిటల్ స్టాఫ్ చెప్పారు. కొట్టకల్ కు దగ్గరలోనే ప్రఖ్యాతి గాంచిన గురువాయూర్ గుడి ఉంది. ఇవి రెండూ  చూడాలని సరదా పడ్డాం. 

ఆర్యవైద్యశాల నుండి బయటకు వెళ్ళడానికి డాక్టర్ అనుమతి తీసుకోవాలి.  అలా వెళ్ళొస్తామని డాక్టర్ తో చెప్పగానే  "ట్రీట్‌మెంట్ తీసుకునే సమయంలో శరీరానికి విశ్రాంతి అవసరం, ఎక్కడికీ ప్రయాణం చేయకూడదు" అనేసారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు శరీరం చాలా సున్నితంగా అవుతుందట. అలాంటి సమయంలో చిన్న పాటి కుదుపులకు కూడా ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువట. అంతే కాదు ట్రీట్మెంట్ పూర్తి అయిన తరువాత కూడా రెండు వారాలు పూర్తి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పారు. 

ఈ విషయం ముందుగా తెలిస్తే కొంత ముందే వచ్చి అవన్నీ చూసే వాళ్ళం కదా అనుకున్నాము.ట్రీట్‌మెంట్ రేపు పూర్తవుతుందనగా కొట్టకల్ లోనే ఉన్న మ్యూజియమ్, హెర్బల్ గార్డెన్, కాలేజ్ చూసి వచ్చాము. 

మ్యూజియమ్ చూడవలసిన ప్రదేశం. అక్కడ ఆర్యవైద్యశాల చరిత్ర, పి.ఎస్.వారియర్, పి.కె.వారియర్ లకు వచ్చిన అవార్డ్స్, వైద్యశాల మొదలెట్టినప్పటి ఫోటోలు, పి.వి.యస్ నాట్య సంఘంలో ప్రదర్శనలిచ్చిన ప్రముఖుల ఫోటోలు, ఇంకా ఎన్నో విశేషాలు వివరంగా వ్రాసి ఉన్నాయి.





ఛారిటబుల్ హాస్పిటల్,  మ్యూజియమ్ ఉన్న ప్రాంగణంలోనే ఉంది. మేము వెళ్ళిన సమయంలో కన్సల్టేషన్ కోసం వచ్చిన పేషంట్స్ తో హాస్పిటల్ ముందు చాలా పెద్ద లైన్ ఉంది. అక్కడ ఇన్ పేషంట్స్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఆయుర్వేదంతో పాటు అక్కడ అల్లోపతి డాక్టర్స్ కూడా ఉంటారట. అక్కడ వైద్యం, భోజనం, రూమ్ అన్నీ ఉచితం.


హెర్బల్ గార్డెన్ లో ఆయుర్వేద మందుల తయారీకి కావలసిన మొక్కలు పెంచుతున్నారు. పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. 






అక్కడకు కొంచెం దూరంలోనే ఆయుర్వేద కళాశాల ఉంది. చాలా పెద్ద కాలేజ్, హాస్టల్ కూడా ఉంది. 
డాక్టర్స్ రౌండ్స్ కు వచ్చేటప్పుడు వారితో పాటు జూనియర్ డాక్టర్స్ ఇద్దరు వచ్చేవారు. వాళ్ళు ఒకరు కొట్టకల్ లో మరొకరు ఉత్తరాఖండ్ లో అంతకు ముందు సంవత్సరమే BAMS పూర్తి చేసారట. ఆయుర్వేదంలో కోర్సు పూర్తి చేసాక ఒక గురువు దగ్గర కానీ హాస్పిటల్ లో కానీ పని చేయాలి. హౌస్ సర్జన్సీ లాగా అన్నమాట. వాళ్ళిద్దరితో ఒకరోజు కాంటీన్ కు వెళ్ళాను, ఆయుర్వేద వైద్యం గురించి, కొట్టకల్ హాస్పిటల్ గురించి చాలా వివరాలు చెప్పారు. 

మాన్యుఫాక్చరింగ్ యూనిట్ హాస్పిటల్ కు దగ్గరలోనే ఉంది కానీ చూడడానికి అనుమతి లేదు. అక్కడ తయారయిన మందులు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. మందుల తయారీకి అవసరమైన ఆకులు, మూలికల కోసం ఫామ్స్ లో చాలా మొక్కలు పెచ్చుతున్నారు. ఇవే కాక అడవులలో దొరికేవీ గిరిజనులు సేకరించి ఇస్తారు.