సాల్జ్బర్గ్, ఆస్ట్రియా దేశం లోని రాష్ట్రము, పట్టణమూను. సాల్జ్బర్గ్ కు ఆ పేరేలా వచ్చిందంటే అక్కడ ఉన్న ఉప్పు గనుల వలన. జర్మన్ భాషలో సాల్జ్ అంటే ఉప్పు, బర్గ్ అంటే కోట. సాల్జ్బర్గ్ క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుండీ ఉంది. అక్కడ ఆస్ట్రియన్ జర్మన్, ఆస్ట్రో బవేరియన్ భాషలు మాట్లాడతారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో సాల్జ్బర్గ్ కూడా ఒకటి.
సాల్జ్బర్గ్ లో మేము తీసుకున్న హోటల్ డోరియంట్ సిటీ హోటల్. విశాలంగా గాలీ వెలుతురుతో బావుందా హోటల్. సామానంతా లోపల పెట్టి ఊరు చూడడానికి బయలుదేరాము.
ఒక్క రెండు మలుపులు తిరగగానే కనిపించింది మొజార్ట్ పుట్టిన ఇల్లు. ఊల్ఫ్ గాంగ్ ఆమెడ్యుయస్ మోజార్ట్, పద్దెనిమిదవ శతాబ్దపు ప్రముఖ మ్యుజీషియన్, కంపోజరూను. మోజార్ట్ బాల మేధావి, తన ఆరేళ్ళ వయస్సులో వియన్నాలోని షాన్బ్రిన్ ప్యాలస్ లో ఎంప్రెస్ మెరియా థెరిస్సా ముందు కాన్సర్ట్ ఇచ్చాడు. పాపం అతని జీవించింది ముప్పై ఏళ్ళే కానీ, తను సృష్టించిన సంగీతానికి మాత్రం మరణం లేదు.
మోజార్ట్ ఇంటి నుండి ఇంకొంచెం దూరం వెళ్ళగానే కనిపించింది మీరాబెల్ ప్యాలస్. దాన్ని పదిహేడవ శతాబ్దంలో ఆర్చ్ బిషప్ ఊల్ఫ్ డైట్రిక్ రైతనౌ తన ప్రేయసి సలోమ్ ఆల్ట్ కోసం కట్టించాడు. ప్యాలస్ చుట్టూ అందంగా తోటలు మధ్యలో బొరాక్ స్టైల్ లో విగ్రహాలు, ఫౌంటెన్ లు. ఇవన్నీ నచ్చేసి సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమాలో కొంత భాగం అక్కడ తీసారు. ఆ ప్యాలస్ హాల్ లో కాన్సర్ట్స్, బాల్ డాన్స్ లు జరుగుతూ ఉంటాయి.
ప్యాలస్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే కనిపించింది సాల్జక్ నది. వడివడిగా పారుతున్న నీళ్ళు, నది వంపులో ఒక వైపు అందమైన చర్చ్, మరో వైపు క్లాక్ టవర్.
మరో వైపు తీరుగా కట్టిన ఇళ్ళ వెనుకనున్న కొండ మీద పెద్ద కోట. ఎటు చూసినా అద్భుతమే. మాటల్లో చెప్పడానికి అక్షరాలలో ఒదిగే అందమా అది, చూసి తీరవలసిందే.
ఇంకాస్త దగ్గరగా వెళ్ళేసరికి బ్రిడ్జ్ మెష్ హోలీ ఆడినట్లు రంగులతో హంగులతో ఉంది. ఆదేమిటో చూడాలని దగ్గరగా వెళ్ళాం. రంగు రంగుల తాళం కప్పలు, అవును మీరు సరిగ్గానే చదివారు, అవన్నీ రంగురంగుల తాళం కప్పలు. వింతగా ఉంది కదూ! తమ ప్రేమను నిలుపుకోవడానికి ప్రేమ పావురాలు చేసిన ప్రయత్నాలవి. తాళం కప్పను మెష్ కు కట్టేసి తాళాన్ని నదిలోకి విసిరేస్తే ఆ ప్రేమ కలకాలం నిలుస్తుందట. హౌ రొమాంటిక్!
అంతకు ముందు వస్తున్నప్పుడు దారిలో తాజ్ పాలస్ అనే రెస్టారెంట్ చూసాం. ఆ రోజు రాత్రి భోజనానికి నేరుగా అక్కడకే వెళ్ళాం. మేము అడిగినవి అన్నీ తెచ్చి పెట్టాక స్వయంగా ఆ హోటల్ ఓనరే వచ్చి భోజనం ఎలా ఉందని పలకరించారు. మోహమాటంతో చెప్పడం కాదు కానీ భోజనం నిజంగానే బావుంది. ఆ రెస్టారెంట్ పెట్టి ఇరవై ఏళ్ళయిందట. మా ఊర్లో ఏ రెస్టారెంట్ ఓనరూ గట్టిగా రెండు సంవత్సరాలు నడపడం కష్టం అనేస్తారు, మరిక్కడ ఇరవై ఏళ్ళుగా ఎలా నడుపుతున్నారో.
ఉదయం వియన్నాలో బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం హాల్స్టాట్ లో భోజనం, రాత్రి సాల్జ్బర్గ్ లో డిన్నర్. బావుంది కదూ! ఆ చల్లని రాత్రి ఈ కబుర్లే చెప్పుకుంటూ రూమ్ కు చేరాం.
ఉదయం హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు మళ్ళీ నది దగ్గరకు వెళ్దామా అనే ఉంది. “పెదనాన్నా, మీరు కబుర్లు చెప్పి మమ్మల్ని ఊరంతా నడిపించేస్తున్నారని” పిల్లలు అనడంతో “సరే పదండి, ఇప్పుడు బస్ ఎక్కించేస్తానని” బస్ స్టాండ్ దగ్గరకు తీసుకుని వెళ్ళారు పెదనాన్న. ఎక్కిన ఐదు నిముషాల్లోనే బ్రిడ్జ్ దాటి నదికి అవతల వైపున దింపేసింది బస్. కోట వరకూ వెళ్ళదట.
బస్ దిగాక ఎదురుగా ఉన్న వీధిలోకి వెళ్ళాం, ఆ ప్రాంతాన్ని అంతా ఆల్స్టాట్ అంటారు. పన్నెండవ శతాబ్దంలో అక్కడ ట్రేడింగ్ జరిగేది, ప్రస్తుతం కూడా అంతే. అప్పట్లో వస్తు మార్పిడి జరిగేది, ఇప్పడు డబ్బు తీసుకుని వస్తువులివ్వడం జరుగుతోంది. ఆ వధిలో మోజార్ట్ ఉన్న ఇల్లు ఉంది, దాన్ని మోజార్ట్ మ్యూజియమ్ చేసారు.
అక్కడి నుండి కోటదగ్గరకు వెళుతుంటే పెద్ద ఖాళీ స్థలం మధ్యలో ఫౌంటెన్ కనిపించాయి. ఆ ఫౌంటెన్ ను పదిహేడవ శతాబ్దంలో కట్టారట. సెంట్రల్ యూరప్ మొత్తంలో అతి పెద్ద ఫౌంటెన్ అది.
అది దాటి ముందుకు వెళితే కనిపించాయి ఎప్పుడో పదహారు, పదిహేడవ శతాబ్దాలలో కట్టిన ఇళ్ళు, కెథడ్రల్. ఆ ప్రాంతం మొత్తాన్ని రెసిడెంట్జ్ ప్లాజ్ అంటారు. అక్కడి నుండి దూరంగా కొండమీద హోహెన్ సాల్జ్బర్గ్ ఫోర్టెస్ కనిపిస్తోంది.
ఆ కోట దగ్గరకు వెళ్ళడానికి ఫానిక్యులర్ ఉంది. అది ప్రతి పది నిముషాలకు కోట దగ్గరకు వెళ్ళి కిందకు వస్తోంది. ఆ ఫానిక్యులర్ వెళ్తున్న రైలు పట్టాలు పదహారవ శతాబ్దంలో వేసినవి. బహుశా అంత వయసున్న రైలు పట్టాలు మరెక్కడా లేవేమో.
కోట చూద్దామని పైకి వెళ్ళిన వాళ్ళం ఆ కోట లోపలకు వెళ్ళడం కూడా మరచిపోయి ఆ ఊరి అందాన్ని అలా చూస్తూ ఉండిపోయాం.
కోట అంటే ఏదో పాతగా ఉంటుందని అనుకున్నాం కానీ చక్కగా మ్యూజియమ్ చేసారు దాన్ని. అప్పట్లో వాళ్ళు వాడిన వస్తువులు, ఆట బొమ్మలు, యుద్ద సామగ్రి, అన్నీ భద్రంగా ఉంచారు. కొన్ని గదులలో వాళ్ళు ఎలా ఉండేవారో, ఏం చేసేవారో , ఏం తినేవారో అన్నీ డాక్యుమెంటరీలుగా చూపిస్తున్నారు. కోటను చూసి ఫానిక్యులర్ లో కిందకు వచ్చేసాం.
సాల్జ్బర్గ్ లో ఏడవ శతాబ్దం నుండీ మోనస్ట్రీ ఉంది. వారు ఉండే ప్రాంతాన్ని సెయింట్ పీటర్స్ అబీ అంటారు. అక్కడొక శ్మశానం ఉంది. సాల్జ్బర్గ్ వెళ్ళిన వారు తప్పనిసరిగా శ్మశానానికి వెళతారు, కంగారూ పడకండి చూడడానికే లెండి. ముందు శ్మశానాన్ని చూడడం ఏమిటీ, వద్దులే అనుకున్నవాళ్ళం కాస్తా ఇక్కడ వరకూ వచ్చాం కదా ఒకసారి వెళదాం అనుకున్నాం. లోపలకు వెళ్ళాక మాకక్కడ శ్మశానానికి బదులుగా అందమైన తోట కనిపించింది. ఇదేమిటి దారి కానీ తప్పామా అనుకున్నాం కానీ తప్పలేదు మేం నిలబడి దిక్కులు చూస్తూ ఉంది శ్మశానం లోనే.
యూరప్ లో శ్మశానాలు కూడా ఇంత అందంగా ఉంటాయా అని ఆశ్చర్యపోయాం. అక్కడ మరో ఆసక్తి కరమైన విషయం కనిపించింది. సమాధి మీద ఒక పేరు కదా ఉండాలి, అలా కాక కొన్నింటి మీద దాదాపు పది పేర్ల దాకా ఉన్నాయి. అదేమిటో తెలుసుకోవాలని గూగుల్ చేసాం. ప్రతి సమాధిని పది సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలట. అయోమయంగా చూసాను, పోయిన వాళ్ళు రెన్యువల్ ఎలా చేసుకుంటారు అని. “ఊరుకో అక్కా, నువ్వు మరీనూ. వాళ్ళకు పిల్లలు ఉండరా” అన్నది మా తోటికోడలు. వాళ్ళు కట్టకపోతేనో అన్నాను, అందుకే కాబోలు ఒక్కోదాని మీద అన్ని పేర్లు అనుకున్నాం. ఇంత అందమైన శ్మశానాన్ని ఎక్కడా చూడలేదు మనం కూడా ఒక ప్లాట్ బుక్ చేసుకుందామా అని కబుర్లు చెప్పుకుంటూ అన్నీ తిరిగి చూసాం. అలా శ్మశానం మధ్యలో నిలబడి సరదా కబుర్లు చెప్పుకుంటామని ఎప్పుడూ అనుకోలేదు.
సెయింట్ పీటర్స్ అబీ దగ్గర నుండి వస్తుంటే దారిలో బొమ్మలు వేసేవాళ్ళు, గిటారిస్ట్ లు కనిపించారు.
దారిలో ఒకతను బంగారు బాల్ మీదెక్కి నిలబడి ఉన్నాడు మొహంలో ఒక బాధో సంతోషమో ఏమీ లేకుండా. అతనెందుకు అలా ఉన్నాడు? ఆ బంగారు బాల్ ఏమిటీ, అని చూస్తే జర్మన్ కళాకారుడైన స్టీఫెన్ బాల్కెన్హాల్ తయారుచేసాట్ట ఆ బంగారు గ్లోబ్ ను, దాని పైనున్న మనిషిని. ఆ మనిషిని అలా భావ రహితంగా ఎందుకు తయారు చేశాడో మరి.
ఆ వేళ లంచ్ కు ఫిలాఫెల్ రాప్స్ తీసుకుని నది ఒడ్డునున్న చిన్న గోడ మీద కూర్చున్నాము. ఫిలాఫెల్ శనగలతో మెడిటేరియన్ వాళ్ళు వేసే వడలు, వాటిని చెపాతీలో చుట్టి కాసిని ఆకులు, సాస్ లు వేసి ఇస్తే అవే రాప్స్. అంటే మేము కూర్చున్న గోడకు దిగువగా బైక్ ట్రాక్ ఉంది. రయ్యిన పోతున్న సైకిల్స్, సైకిల్ తొట్టిలో నవ్వులు రువ్వుతున్న పిల్లల్ని చూస్తూ లంచ్ పూర్తి చేసాము.
అప్పడే ఒక గమ్మత్తు జరిగింది. నది ఒడ్డున నీళ్ళ పక్కకు ఒక చిన్న సైజ్ టూర్ బస్ నీళ్ళ దగ్గరగా వచ్చి ఆగింది. టూరిస్ట్ లు దిగుతారేమో అని చూస్తూ ఉన్నా౦. బస్ లోంచి ఇద్దరు చెంగున కిందకు దూకి, బస్ కు అటూ ఇటూ రెండు మొప్పలు తొడిగారు. పాపం పిచ్చిది తనొక బస్సునని మర్చి పోయి చేపలాగా ఈదుకుంటూ నీళ్ళ లోకి వెళ్ళిపోయింది.
అక్కడే ఉంటే మాక్కూడా ఎవరైనా మొప్పలు తగిలించేస్తారేమోనని అక్కడి నుండి వెంటనే బయలుదేరాం. మ్యూజిక్ యూనివర్సిటీ మీదుగా వెళ్ళి ఒక కఫే దగ్గర ఆగాము. అన్నట్లు మీకు చెప్పలేదు కదూ, యూరప్ లో కాఫీ ఆర్డర్ చేస్తే తప్పనిసరిగా ఒక గ్లాస్ నీళ్ళు కూడా ఇస్తారు. నీళ్ళు తాగి కాఫీ తాగితేనే కాఫీ టేస్ట్ తెలుస్తుందట. కాఫీలు కబుర్లు అయ్యాక హోటల్ కు వెళ్ళిపోయాము.
ఆ రాత్రి మళ్ళీ నది దగ్గరకు వెళ్దామన్న నా మాటను, “స్వామీ నదికి పోలేదా” అని కామెడీ డైలాగ్ చెప్పి కొట్టి పడేశారు. అప్పటికి అందరికీ ఓపికలు అయిపోయాయి పాపం. డిన్నర్ కు హోటల్ కు దగ్గరే ఉన్న చైనీస్ రెస్టారెంట్ కి వెళ్ళాము. అక్కడ పెదనాన్న చాప్ స్టిక్స్ తో ఫుడ్ ను ఎలా పట్టుకోవాలో నేర్పిస్తే పిల్లలు, అమ్మ పోటీలు పడి పెదనాన్నప్లేట్ లో చాప్ స్టిక్ తో సూషీ వడ్డించి గురు దక్షిణ ఇచ్చుకున్నారు. ఆర్డర్ చేసినవి రెస్టారెంట్ వాళ్ళు వడ్డిస్తే కబుర్లనీ, నవ్వులనూ వాటితో కలిపేసి భోజనాలు చేసేసాము.
మొదట మేము సాల్జ్బర్గ్ కు వెళ్ళాలని అనుకోలేదు. వెళ్ళకపోతే మాత్రం చాలా మిస్ అయ్యేవాళ్ళం. గలగల పారే ఆ నది, పక్కనే ఉన్న చర్చ్, ఆ కోట, ఆ సాయంత్రం అన్నీ మనసులో అలా నిలిచి పోయాయి.
తరువాత భాగం ఇక్కడ చదవొచ్చు.