Sunday, December 24, 2023

ఫ్లోరెన్స్

ఇంతకు ముందు భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి. 

ఫిరెన్జె(ఫ్లోరెన్స్), టస్కనీ ప్రాంతానికి రాజధాని. యునెస్కో వాల్డ్ హెరిటేజ్ సైట్స్ లో అది కూడా ఒకటి. మెడిస్సీస్ ఫ్లోరెన్స్ ను పదిహేనవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకూ అంటే దాదాపుగా రెండువందల యనభై సంవత్సరాల పాటు పరిపాలిచారు. వారు రాజవంశీకులు కానప్పటికీ బ్యాంకింగ్, ఊల్ ట్రేడింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతో రాజకీయ అధికారాన్ని సంపాదించుకున్నారు. 

రాజ్యాధికారం కోసం జరిగిన యుద్దాలు, బ్లాక్ డెత్, కృసేడ్స్ లతో నలిగిపోయి, అలసిపోయిన సమయంలో యూరప్ లో మొదలైంది లో రెనెసాన్స్ కాలం. రెనెసాన్స్ అంటే పునర్జన్మ, యూరప్ నాగరికతకు పునర్జన్మ. పద్నాలుగవ శతాబ్దం నుండి, పదిహేడవ శతాబ్దం వరకూ మానవత్వం(హ్యూమనిజం) కోసం చేసిన ఆ కళాత్మక విప్లవ ప్రయాణం ఫ్లోరెన్స్ నుండి మొదలైంది. రెనెసాన్స్ కు చేయూత నిచ్చిన వారు మెడిస్సీస్. వారి పరిపాలనలో కళలకు, భవన నిర్మాణాలకు(ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్) ప్రాధాన్యత నిచ్చి మైకెలాంజెలో, లియోనార్డో డా విన్సీ, శాండ్రో బొట్టిసెల్లి, డోనటెల్లో లాంటి కళాకారులను ప్రోత్సహించారు. అలాగ ఫ్లోరెన్స్ లో రెనసాన్స్ మొదలై ఇటలీ అంతా వ్యాపించింది. 

వెనిస్ లో తొమ్మిది గంటలకు ట్రైన్ ఎక్కితే పదకొండున్నర కల్లా ఫ్లోరెన్స్ కు చేరిపోయాము. మేము తీసుకున్న ఫ్లోరెన్స్ ఆర్ట్స్ అపార్ట్మెంట్స్ హిస్టారిక్ సెంటర్ లో ఉంది, స్టేషన్ కు కూడా దగ్గర. మా దగ్గర సూట్ కేస్, బ్యాక్ ప్యాక్ తప్పవేరే లాగేజ్ లేదుగా బస్ అదీ ఎందుకని నడవడం మొదలుపెట్టాం. మొదట్లో కాస్త ట్రాఫిక్ కనిపించింది కానీ తరువాత అంతా రాళ్ళు పరచిన సన్నని దారి, పక్కన ఎత్తైన భవనాలు.

ఫలానా టైమ్ కు వస్తున్నామని ముందుగానే తెలియజేయడంతో మేము తీసుకున్న అపార్ట్మెంట్ ఓనర్ సూజన్ మమ్మల్ని గుమ్మం దగ్గరే పలకరించి రిసెప్షన్ రూమ్ కి తీసుకెళ్ళారు. పాస్ పోర్ట్ లవీ చూసి కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని మా ఫ్లాట్ దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అది స్టూడియో అపార్ట్మెంట్. పెద్ద రూమ్ ఒక వైపు కిచెన్, డైనింగ్ టేబుల్, మరో వైపు బెడ్, డెస్క్, టీవి, క్లోజెట్, లాండ్రీ బాత్ రూమ్ సెపరేట్ గా ఉన్నాయి. క్లోజెట్ కూడా పెద్దది, వెనిస్ లోలాగా బట్టలు పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు. చక్కని వెలుతురుతో శుభ్రంగా ఉంది.  

మిలాన్ లో లాగానే అక్కడ కూడా స్టవ్, వాషర్ ఎలా వాడాలనే వివరాలు ఇటాలియన్ లో రాసి ఉన్నాయి. మిలాన్ లో స్టవ్ ఎలా వెలిగించాలో అర్థం కాక ఆమ్లెట్ వేసుకోలేకపోయాం కదా. అది గుర్తొచ్చి ముందు స్టవ్ ఎలా వెలిగించాలో లాండ్రీ ఎలా వేయాలో అన్నీ అడిగి తెలుసుకున్నాము. యూరప్ లో డ్రయ్యర్స్ ఉండవని తెలిసిన దగ్గర నుండీ బట్టలు ఎక్కడ ఆరేయాలనే సందేహం ఉందిగా. సూజన్ ను అడిగితే క్లోత్స్ రాక్ చూపించారు. మా స్టూడియో తాళం, మెయిన్ గేట్ తాళం ఇచ్చి, ఏమైనా కావాలంటే తనకు ఫోన్ చేయమని చెప్పి వెళ్ళిపోయారు సూజన్.

బట్టలు లాండ్రీలో వేసి లంచ్ చేయడానికి బయటకు వెళ్ళాం. మధ్యాహ్నం ఎండ కాస్త తీవ్రంగానే ఉన్నా రోడ్ పక్కనున్న పెద్ద బిల్డింగ్స్ నీడ పడడంతో అంత వేడిగా అనిపించడం లేదు. ఐదు నిముషాలు నడవగానే వచ్చింది మర్కాటో సెంట్రలే ఫిరెన్జే (సెంట్రల్ మార్కెట్ ఆఫ్ ఫ్లోరెన్స్). మార్కెట్ బయటంతా స్ట్రీట్ వెండర్స్ హ్యాండ్ బాగ్స్, లెదర్ గూడ్స్, బట్టలు, హ్యాట్స్ అమ్మే స్టాల్స్ పెట్టుకున్నారు. లోపలకు వెళితే పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు అమ్మే షాప్స్ బోలెడున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఫుడ్ కోర్ట్ లో చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. వెజిటేరియన్ ఫుడ్ స్టాల్ లో పోక్ అనే ఐటమ్ తీసుకున్నాం. ఫర్వాలేదు బాగానే ఉంది, కాస్త ఉప్పు, కారము వేస్తే చిపోట్లే లాగా ఉంటుంది.  

     
        
మార్కెట్ చూసాక బసిల్లికా డి శాన్ లొరేంజో (బసిల్లికా ఆఫ్ సెయింట్ లారెన్స్) కు వెళ్ళాము. క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరంలో కట్టిన చర్చ్ అది. పదిహేనవ శతాబ్దంలో మెడిస్సీస్ పాత చర్చ్ స్థానంలో కొత్త చర్చ్ కట్టారు. దానిలో లైబ్రరీ, ఆర్ట్ మ్యూజియమ్, ప్రేయర్ హాల్, బరియల్ గ్రౌండ్ ఉన్నాయి.
అక్కడి నుండి ‘పియజ్జా డెల్ డ్యుమో’ కు వెళ్ళాము. ఇటలీలో పియజ్జాలు ప్రధాన కేంద్రాలని చెప్పుకున్నాం కదా. ఆ పియజ్జా లో శాంతా మరియా డెల్ ఫియొరె అనే కేథడ్రెల్, బెల్ టవర్, బాప్తిస్ట్రీ ఉన్నాయి.

శాంతా మరియా డెల్ ఫియొరె ను కట్టడానికి నూట యాభై సంవత్సరాలు పట్టిందట. లేత గులాబీ, ఆకుపచ్చ, తెలుపు రంగు చలువరాళ్ళతో తాపడం చేసిన కట్టడం అది. దగ్గరగా దగ్గరగా చూస్తే చిన్న పిల్లలు స్కేలు పెట్టి గీతలు గీసి డ్రాయింగ్ వేసినట్లుంది. ఆ కట్టడం వెనుక వైపున పైన పెద్ద డోమ్ ఉంది. మొత్తం బిల్డింగ్ కట్టడం ఒకటి, ఆ ఒక్క డోమ్ కట్టడం ఒకటి. యాభై రెండు మీటర్ల ఎత్తు, నలభై నాలుగు మీటర్ల వెడల్పుతో ఏ ఆధారమూ లేకుండా డోమ్ ను అంత ఎత్తులో నిలబెట్టారు. చెక్క, ఇనుము వాడకుండా కేవలం ఇటుకలతోనే కట్టారట ఆ డోమ్. ఆ డోమ్ ను కట్టిన ఆర్కిటెక్ట్ ఫిలిప్పో బ్రూనెల్లెషి.
 
 
పియజ్జా డెల్ డ్యుమో నుండి కొంచెం ముందుకు వెళితే పలాజ్జో వెచ్చియొ వచ్చింది. పదమూడవ శతాబ్దంలో కట్టిన ఆ కాజల్ ను ప్రస్తుతం టౌన్ హాల్ లా వాడుతున్నారు. ఆ కాజల్ బయటంతా పెద్ద పెద్ద విగ్రహాలతో ఆ ప్రాంతం అంతా మ్యూజియమ్ లాగా ఉంది.
 
మేము వెళ్తున్న దారి పక్కనంతా బొమ్మలు వేస్తూ, గిటార్ వాయిస్తూ ఆర్టిస్ట్స్ వారి ప్రపంచంలో వారు న్నారు. కళారాధన ఫ్లోరెంటైన్స్ జీన్స్ లోనే ఉందేమో.
 
 
ఆ రోజు జియొస్ట్ర డెల్ ఆర్కిడాడో ఫెస్టివల్ అట రిపబ్లిక్ స్క్వేర్ దగ్గర పెరేడ్ జరుగుతోంది. మనం సీతారామ కళ్యాణం జరుపుకుంటున్నట్లుగా అక్కడ కూడా రి పద్దతిలో అలాంటిదే జరుపుకుంటున్నారు. పద్నాలుగవ శతాబ్దంలో ఫ్రాన్సెస్కో కసాలి, ఆంటోనియా శాలింబేని అనే భగవత్ స్వరూపుల పెళ్ళి జరిగిందట. ఆ పెళ్ళి వేడుకలను అక్కడ ప్రతి సంవత్సరమూ జరుపుకుంటారు. 
 
మధ్యాహ్నం నుండీ తిరుగుతూనే ఉన్నాం కాఫీ తాగుదామని కన్సర్టో పాజ్కోస్కి కు వెళ్ళాము. ఒకప్పుడు అది పాలిష్ బ్రూవరీ ప్రస్తుతం కఫే. కఫే బయటంతా ఎండ పడకుండా కవర్ చేసి కింద టేబుల్స్, సోఫాలు వేసి పైనుండి చల్లగా నీళ్ళు స్ప్రే చేస్తున్నారు.  
  
మేము రూమ్ కి వచ్చేసరికి ఆరవుతోంది. వాషర్ లో వేసిన బట్టలు తీసి క్లోత్స్ రాక్ మీద ఆరేసి, కాసేపు నిద్ర పోయి లేచేసరికి ఫ్లోరెన్స్ నీరెండలో మెరిసిపోతోంది. తాజ్ ప్యాలస్ లో ఎనిమిది గంటలకు టేబుల్ రిజర్వ్ చేసాం. అక్కడకు వెళ్తూ ఉంటే టూర్ బస్ లో వచ్చే టూరిస్ట్స్ వెళ్ళిపోయినట్లున్నారు రోడ్స్ కొంచెం ఖాళీగా ఉన్నాయి. తాజ్ లో దమ్ బిర్యాని, చికెన్ టిక్కా మసాలా, గార్లిక్ నాన్, బూంది రైతా ఆర్డర్ చేసాం. చాలా రోజుల తరువాత మన భోజనచేస్తున్నామని కాదు కానీ అన్ని ఇటమ్స్ కూడా రుచికరంగా ఉన్నాయి. బిల్ కూడా తక్కువే అయింది, ముప్పై యూరోలు. 

సాయంకాలాలు ఫ్లోరెన్స్ ఆర్నో నదిలో తన అందాలు చూసుకుంటూ మురిసిపోతుందట. అదేమిటో చూద్దామని ఆర్నో నది దగ్గరకు వెళ్ళాం. అమెరికాలో లాగానే ఇటలీలో కూడా ఎండాకాలం రాత్రి తొమ్మిదింటి వరకు చీకటి పడదు. సంధ్య వెలుగులో 
 
 
చీకటి చిక్కపడే వరకూ ఆర్నో దగ్గరే ఉండి తిరిగి వస్తుంటే పియజ్జా డ్యూమో దగ్గర గిటార్ సంగీతం, దీపల వెలుగులో మెరిసిపోతున్న శాంతా మరియా డెల్ ఫియొరె, ఉదయం చూసిన దానికంటే అందంగా ఉంది. ఆ ప్రాంతం అంతా.
రాత్రి రూమ్ కు వెళ్ళేసరికి పదయ్యింది. ఆ రోజు మా నడక మొత్తం పదకొండు మైళ్ళు. తరువాత రోజు సోమవారం, ఫ్లోరెన్స్ లో మ్యూజియమ్స్ కు శలవు. అందువలన మేము ఫ్లోరెన్స్ దగ్గరలోని   చిన్క్వె టెర్రే కు వెళ్ళాము. ఆ కబుర్లు తరువాత పోస్ట్ లో చెప్పుకుందాము.

ప్రయాణం కబుర్లు మొదటి నుండీ చదవాలంటే ఇక్కడకు, తరువాత భాగం చదవాలంటే ఇక్కడకు వెళ్ళండి.