Sunday, November 26, 2023

యూరప్ ప్రయాణం - లగేజ్

ఈ పోస్ట్ యూరప్ ప్రయాణం లో ఒక భాగం. ఇంతకు ముందు పోస్ట్ ఇక్కడ చదవొచ్చు. 

కాన్ కూన్, జమైకాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరం ఒక్కో పెద్ద సూట్ కేస్ పట్టుకెళ్ళాం. యూరప్ కూడా అలానే అనుకున్నాం కానీ, యూరప్ కు ఎంత తక్కువ సామానుతో వెళితే ప్రయాణం అంత సుఖంగా ఉంటుందని తెలిసి ఆశ్చర్యపోయాము.

ఫ్లైట్ లో చెకిన్ చేసిన సూట్ కేస్ లు మిస్ అయితే రెండు మూడు రోజుల వరకూ రాకపోవచ్చు. మేము ఏ ఊర్లోనూ గట్టిగా మూడు రోజులు కూడా ఉండట్లేదు కాబట్టి ఒకవేళ సూట్ కేస్ లు మిస్ అయితే మళ్ళీ అవి మా దగ్గరకు ఎప్పుడు ఎలా చేరుతాయో తెలీదు.

మరో ఇబ్బంది కూడా ఉంది. యూరప్ లో ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్ళడానికి ట్రైన్స్ బుక్ చేసుకున్నాం. ట్రైన్స్ లో ఆ సూట్ కేస్ లు పెట్టడం తీయడం అంతా శ్రమతో కూడుకున్న పని. ట్రైన్ దిగాక రూమ్ కు వెళ్ళడం మరో ఇబ్బంది. మేము ఉండబోతున్నది అంతా హిస్టారిక్ సెంటర్స్ లో. అక్కడ రాళ్ళు పరిచిన రోడ్ల మీద టాక్సీలు వెళ్ళకపోవచ్చు. వెనిస్ లాంటి దగ్గర అయితే టాక్సీలు అసలు ఉండవు, హోటల్ కు వెళ్ళాలంటే బోలెడు బ్రిడ్జ్ లు ఎక్కి దిగాలి. ఇవన్నీ ఆలోచించాక కారీ ఆన్ లాగేజ్ తోనే వెళ్ళడం ఉత్తమం అనుకున్నాం.

ఇంట్లో ఉన్న బుల్లి సూట్ కేస్ లలో పెద్దవిగా ఉండే రెండు కారీ ఆన్ లు తీసుకుని వెళదాం అనుకున్నాం కానీ, ఎయిర్ లైన్స్ లగేజ్ నిబంధనలను చూస్తే ఒక్కొక్క ఎయిర్ లైన్స్ కు ఒక్కక్క విధంగా ఉన్నాయి. అమెరికా నుండి వియన్నాకు యునైటెడ్, ఆస్ట్రియన్ లైన్స్ ఫ్లయిట్స్ లలో వెళ్తున్నాం. యునైటెడ్ కొంచెం ఫరవాలేదు కానీ ఆ ఆస్ట్రియన్ ఎర్ లైన్స్ వాళ్ళు ఖరాఖండిగా ఉంటారని రివ్యూలు చూస్తే తెలిసింది. కారీ ఆన్ సూట్ కేస్ లు వారు చెప్పిన కొలతలలో లేకపోయినా, బరువు ఎక్కువ ఉన్నా చెకిన్ చేయమంటారట. ప్రాగ్ నుండి మిలాన్ కు లోకల్ ఫ్లైట్ లో వెళ్తున్నాం, ఆ ఎయిర్ లైన్స్ లగేజ్ నిబంధనలతో పెద్దగా ఇబ్బంది లేదు.

ఇంట్లో ఉన్న నాలుగు కారీ ఆన్ సూట్ కేస్ లు, ఆరు బ్యాక్ పాక్ లు కొలిచి చూస్తే ఒక్కటి కూడా ఆస్ట్రియన్ ఎయిర్ లైన్స్ వారి నిబంధనలకు సరిపోలేదు. ఒక సూట్ కేస్, రెండు బ్యాక్ పాక్ లు మాత్రం కొంచెం దగ్గరగా ఉన్నాయి. ఏ౦ చేయాలా అని చాలా సేపు తర్జన బర్జనలు పడిన తరువాత, ఒక సూట్ కేస్, బ్యాక్ పాక్ కొనడానికి, మరో చిన్న సూట్ కేస్, బ్యాక్ పాక్ ఇంట్లోవే తీసుకుని వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం.

ఆస్ట్రియన్ ఎయిర్ లైన్స్ నిబంధనలకు సరిపడిన సూట్ కేస్ వెతకడం కష్టమే అయింది. పొడవు, వెడల్పు లలో ఏదో ఒకటి ఎక్కువవుతుంది, రెండు సరిపోతే లోతైనా ఎక్కువవుతుంది. ఆరు రోజుల అకుంఠిత పరిశోధన తరువాత అవన్నీ సరిపోయే విధంగా ట్రావెల్ ప్రో మాక్స్ లైట్ 19” సూట్ కేస్, ఒక బ్యాక్ పాక్ అమెజాన్ లో దొరికాయి. కొలతలు, బరువులు అన్నీ సరిపోయినా, ఒక్కొక్క సారి సూట్ కేస్ లను చెకిన్ చేయమంటారట. చూద్దాం ఏం జరుగుతుందో.

పదహారు రోజుల ప్రయాణానికి కావలసిన బట్టలు ఈ బుల్లి కేరీ ఆన్ సూట్ కేస్ లలో ఎలా పట్టించాలి. ఆ సందేహం రాగానే ఉందిగా యూట్యూబ్ అందులో చూసాం. నాలుగు వారాల యూరప్ ప్రయాణానికి కేవలం బ్యాక్ పాక్ తోనే వెళ్ళడం ఎలా? యూరప్ ప్రయాణానికి కావలసిన వస్తువులు ఏమిటి? లాంటి వీడియోలు చూసాక తెలిసిందేమిటంటే ఒక్క వారానికి సరిపడా బట్టలు తీసుకెళ్ళి, మధ్య లో ఒకటి రెండుసార్లు వాషర్ లో వేస్తే సరిపోతుందట. మేము ఫ్లోరెన్స్ లో, మిలాన్ లో తీసుకున్న హోటల్స్ మార్చి వాషర్స్ ఉన్న ఎయిర్బియన్బి లు బుక్ చేసాం.

బట్టలు వాషర్ లో వేయడం సమస్య కాదు కానీ యూరప్ లో డ్రయ్యర్స్ ఉండవు. డ్రయ్యర్స్ లేకపోతే మేము వేసుకునే ఈ దళసరి జీన్స్ ఎప్పటికి ఆరతాయి? అంటే జీన్స్ కాకుండా త్వరగా ఆరిపోయే బట్టలు కావాలి. బోలెడు షాప్స్ వెతికిన తరువాత ఎడీబావర్, జె క్రూ, అమెజాన్ లలో మాకు నచ్చిన తేలిక పాటి బట్టలు దొరికాయి.

ఫేస్ బుక్ లోని యూరప్ ట్రావెల్ గ్రూప్ లో ప్రయాణానికి కావలసిన సమాచారం చాలా దొరికింది. యూరప్ లో వాతావరణం వింతగా ఉంటుందిట. పెళ్ళున ఎండ కాస్తూ ఉన్నప్పుడే హఠాత్తుగా కుంభవృష్టి కురుస్తుందట. గొడుగు వేసుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదు, గాలి వీస్తే బట్టలు పూర్తిగా తడిసిపోతాయని చెప్తున్నారు. అంటే రైన్ కోట్ తప్పని సరి. అవి కూడా ఎడీబావర్ లోనే దొరికాయి. మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరగాలంటే కాటన్, లెనిన్ బట్టలు కావాలి.

ఆన్ లైన్ షాపింగ్ వచ్చాక షాప్స్ లో బట్టలు సరిగ్గా దొరకడం లేదు. సైజ్ సరిగ్గా ఉంటే కావలసిన కలర్ ఉండదు. కలర్ నచ్చినదానికి సైజ్ దొరకదు. అందుకని ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టి ఇంట్లో వేసుకుని చూసి మిగిలినవి రిటర్న్ చేయడం ఒక రెండు వారాలు వెబ్ సైట్స్ చూడడం ఆర్డర్ పెట్టడం సరిపోయింది. అలా తేలిగ్గా ఉండి, త్వరగా అరే బట్టలు తీసుకున్నాము.

ఇటలీలో హిస్టరీక్ సెంటర్ అంతా రాళ్ళు పరిచిన రోడ్లు ఉంటాయి. ఆ రోడ్ల మీద రోజుకు పదిహేను, ఇరవై వేల అడుగుల నడక ఉంటుంది. సరైన షూస్ కనుక వేసుకోకపోతే కాళ్ళు బెణికే ప్రమాదం ఉంది. ఎన్నో శతాబ్దాల క్రితం వేసిన ఆ రోడ్ల మీద అప్పట్లో ఎలా నడిచే వాళ్ళో మరి. ప్రతి రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు షూస్ విప్పకపోతే పాదాలకు గాలి ఆడక మరో సమస్య వస్తుంది. అందుకోసం ఒక జత సాండల్స్ కూడా ఉంటే మంచిది.

నా షూస్ కొద్దిగా అరిగిపోయి ఉన్నాయి. తడిచిన రాళ్ళ మీద ఆ షూస్ తో కనుక నడిస్తే జర్రున జారి పడే ప్రమాదం ఉంది. షూస్ కోసం ఒక వారం పాటు షాప్స్ చుట్టూ తిరిగాను. వైడ్, ఆర్చ్ సపోర్ట్ షూస్ షాప్స్ లో దొరకడం లేదు, ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టడం, అవి సరిపోక పోవడం వాటిని మార్చడం ఇలా ఒక పది రోజులు గడిచింది. అప్పటికి ప్రయాణం రెండు రోజుల్లోకి వచ్చేసింది. నేను తీసుకోవాలని అనుకున్న వైట్ షూస్ మాత్రం దొరకలేదు. మా ఊరిలో షార్లెట్ రన్నింగ్ కంపెనీ అనే షాప్ ఉంది, అక్కడ ఏ పాదాలకు ఏ షూస్ అయితే సరిగ్గా ఉంటాయో చెప్తారు. అక్కడ రెండు మూడు వెరైటీలు చూపించారు కానీ, అవి వేసుకున్న కొత్తల్లో కరిస్తే కష్టమని నేను వాడుతున్న బ్రూక్స్ మరో కలర్ లో ఉంటే అవి తీసుకున్నాను.

సాండల్స్ కోసం నాలుగు షాప్స్ తిరిగి, ఆర్ ఇ ఐ లో కీన్ సాండల్స్ తనకు, రాక్ రూమ్ షూస్ లో తేవా వెర్రా నాకు తీసుకున్నాం. ఎక్కువగా నడవడం వలన కాలి వేళ్ళకు బొబ్బలు రాకుండా మోల్ స్కిన్, మడిమ మీద షూస్ ఒరుసుకుని ఇబ్బంది పెట్టకుండా బ్యాండ్ ఎయిడ్ లు తీసుకున్నాము.

యూరప్ లో చిత్ర కళ, శిల్ప కళలు ఎన్నో శతాబ్దాల నుండి ప్రాచుర్యం పొందినా ప్రస్తుతం చోర కళ ప్రాచుర్యంలో ఉందట. జేబు దొంగల నైపుణ్యం గురించి పలువురి ప్రశంసలు విన్నాను. బ్యాగ్ మన దగ్గరే ఉంటుందట కానీ, అందులో పర్స్ మాయమవుతుందట. మనతో మాట కలిపో, ఏ సందేహామో అడిగి మనల్ని ఆలోచనలో పడేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకు పోతారట. జరుగుతాయో, జరగవో తెలియని ప్రయత్నాలను అరికట్టేందుకు అమెజాన్ లో ట్రావెలాన్ యాంటీ తెఫ్ట్ బాగ్ తీసుకున్నాను. జిప్ ఉన్న జేబులోనే పర్స్ లు పెట్టుకోవడం, క్రౌడ్ ఉన్న దగ్గర బ్యాక్ పాక్ లు ముందుకు వేసుకోవడం చేయాలట. ఇటలీ ప్రయాణం విహార యాత్ర మాత్రమే కాదు సాహస యాత్ర కూడా. పాస్పోర్ట్స్, పర్స్, డబ్బులు, కార్డ్స్ పోగొట్టుకోకుండా మేము ఇంటికి తిరిగి వస్తే గెలిచినట్లే.

సెల్ ఫోన్ కు డేటా తీసుకున్నాం. క్రెడిట్ కార్డ్స్ పనిచేస్తాయి కానీ ఎక్కడైనా అవసరం అవుతాయేమో అని యూరోలు బాంక్ నుండి తెచ్చుకున్నాం. రిక్ స్టీవ్స్ యాప్ లో ఆడియో టూర్స్ ఉన్నాయి. టాయ్ లెట్స్ ఎక్కడున్నాయో తెలియడానికి యూరప్ లో ఫ్లష్ యాప్ వాడతారు. మనకు ఊబర్ లాగా ఇటలీ లో మూవ్ ఇట్ యాప్ వాడతారు. అలాంటి యాప్స్ అన్నీ డౌన్ లోడ్ చేసుకున్నాం. వైఫై సిగ్నల్స్ వలన ఇబ్బంది రాకుండా ట్రైన్ స్టేషన్ నుండి హోటల్స్ కు మ్యాప్ చూసుకుని ఆ రూట్ డౌన్ లోడ్ చేసుకున్నాం.

ప్రయాణానికి అన్నీ సిద్ధమే కానీ, ఇటలీలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తక్కువట. మేమిద్దరం చిన్న వాళ్ళమేమీ కాదు, యాభైల్లో ఉన్నాం. ఈ వయస్సులో సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకూ అతీతులం కాదు. ప్యాకేజ్ టూర్ తీసుకోకుండా స్వంతంగా వెళ్తున్నాం. ఎక్కడైనా ఇబ్బంది వస్తేనో? యూరప్ లో ఫుడ్ అమేజింగ్ అంటారు. చింతకాయ పచ్చడి, పండు మిరప కారం ఇష్టంగా తినే మాకు ఇటాలియన్స్ చేసే ఉప్పూ కారాలు లేని పాస్తాలు నచ్చుతాయా? ఎటు చూసినా నోరు ఊరిస్తూ జిలాటో(ఐస్ క్రీమ్స్) షాప్స్ కనిపిస్తాయట. ఎక్కువ తినేస్తామేమో.

ఒకవేళ ప్రయాణం మధ్యలో ఏ జ్వరమో వస్తే, అది కోవిడ్ అయితే? మధ్యలో మరేదైనా ఇబ్బంది ఎదురయితే, ఏ కారణం చేతయినా ప్రయాణం వాయిదా వేయాల్సి వస్తే? మేము తీసుకున్న వాటిలో కొన్ని నాన్ రిఫండబుల్ టికెట్స్ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏమిటో? అన్ని రోజులూ ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నా ఇలాంటి సందేహాలు బోలెడు వస్తూ ఉండేవి. ఇక ప్రయాణం రెండు రోజుల్లో ఉందనగా చూద్దాం యూరప్ మాకు ఎలాంటి అనుభవాలు ఇవ్వబోతోందో అనుకుంటూ వెళ్ళే రోజు కోసం ఎదురు చూసాం.


తరువాత భాగం ఇక్కడ చదవొచ్చు.