Monday, November 27, 2023

వియనా

ఈ పోస్ట్ యూరప్ ప్రయాణం లో ఒక భాగం. యూరప్ ప్రయాణ సన్నాహాలు మొదటి నుండి చదవాలనుకుంటే  ఇక్కడ కు వెళ్ళండి. 

ఆస్ట్రియా మధ్యయూరప్ లోని ఒక దేశము. వియనా ఆస్ట్రియా రాజధాని. ఆస్ట్రియా మొత్తం జనాభాలో మూడవ వంతు జనాభా వియనాలో ఉంటారు. వియనా నగరము, రాష్ట్రము కూడా, అక్కడ మొత్తం ఇరవై మూడు జిల్లాలు ఉన్నాయి.ఈ నగరం పాతరాతి యుగం నుండీ ఉన్నట్లుగా చరిత్ర చెపుతోంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో వియనా కూడా ఒకటి.


షార్లెట్ నుండి వియన్నాకు డైరెక్ట్ ఫ్లైట్ లేదు. జూన్ రెండవ తేదీ ఉదయం బయలుదేరి, వాషింగ్టన్ డిసి లో ఫ్లైట్ మారి మూడవ తేదీ ఉదయానికి వియనాకు చేరాం. ఆస్ట్రియన్ ఎయిర్ లైన్స్ వాళ్ళు మేము కంగారు పడినట్లు లాగేజ్ కొలతలు, బరువులు చూడలేదు, పాస్పోర్ట్ మాత్రం చూసి పంపించారంతే. ఈ మాత్రం దానికి ఎంత కంగారు పడ్డామో కదా. 

ఆస్ట్రియన్ ఎయిర్ లైన్స్ వాళ్ళకు మర్యాదలు ఎక్కువే. ఫ్లైట్ ఎక్కిన వెంటనే స్నాక్స్, ఓ రెండు గంటల తరువాత డిన్నర్ ఇచ్చారు. బ్రేక్ ఫాస్ట్ కు మాత్రం మఫిన్ ఇచ్చారు. ఉదయాన్నే అంత తీపి తినడం మనకు కష్టం.


ఫ్లైట్ ఆగి ఆగగానే సెక్యూరిటీ చెక్ ముగించుకుని ఝామ్మంటూ బయటకు వచ్చా౦, చెకిన్ లాగేజ్ కోసం వెయిట్ చేయక్కర్లేదుగా. మా వాళ్ళు అప్పటికే వచ్చేసి మాకోసం వెయిట్ చూస్తూ ఉన్నారు. లెట్స్ బిగిన్ ద ఫన్ అనుకుంటూ బయటకు వచ్చాం. మమ్మల్ని పికప్ చేసుకుని సిటీ చూపించడానికి టాక్సీ డ్రైవర్ వచ్చాడు. అతను పాకిస్తాన్ నుండి వచ్చి వియన్నా లో సెటిల్ అయ్యాడట. “అమ్మయ్య, మేం కష్టపడి జర్మన్ ట్రాన్స్లేట్ చేయక్కర్లేదు” అనుకున్నాం. వేన్ కూడా మాకు తగ్గట్టే ఉంది. వెనుక రెండు వరుసల సీట్స్ ఎదురెదురుగా ఉన్నాయి, ఇంట్లో హాల్ లో కూర్చున్నట్లు కూర్చుని మొదలెట్టేసాం ప్రయాణం కబుర్లు.

వేర్ టు గో ఫస్ట్ అనగానే కాఫీ అని నాలుగు గొంతులు అరిచాయి. డ్రైవర్ ను కఫే సెంట్రల్ కు తీసుకుని వెళ్ళమన్నాం. ఆ మాత్రం కాఫీ ఎయిర్ పోర్ట్ లోనే తాగొచ్చుగా అనే అనుమానం మీకు రావచ్చు. కఫే సెంట్రల్ కే వెళ్ళడానికో కారణం ఉంది. “దేర్ ఆర్ కాఫీ హౌసెస్ దేర్ ఈజ్ కాఫీ సెంట్రల్” అని వాళ్ళ వెబ్సైట్ లో ఉండడం చూసాం. అబ్బో అంత గర్వంగా రాసుకున్నారు అసలు కథే౦టో చూద్దామని వెళ్ళాం. 

ఇరవై అడుగుల ఎత్తులో సీలింగ్, పిల్లర్స్, వాల్ పేపర్, షాండలియర్స్, మార్బుల్ టాప్ టేబుల్స్, సోఫాలు, న్యూస్ పేపర్ స్టాండ్స్, ఫ్లవర్ వేజెస్ బాగానే ఉంది హడావిడి. కానీ అసలు విషయం అది కాదు ఆ కఫే వయస్సు దాదాపు నూట నలభై సంవత్సరాలు, అప్పట్లో అది కవులు, ఆర్కిటెక్ట్స్, ఫిలాంతరఫీస్ట్స్, డాక్టర్స్ కు సమావేశ స్థలం. ఆ కఫే లో అక్కడకు వచ్చే వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. సైకోఅనాలిసిస్ ఫౌండర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా అక్కడకు వస్తూ ఉండేవారట. తను రాసిన “ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్” అనే పుస్తకం వలనే వియనాకు ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’ అనే పేరు వచ్చింది.

కఫే సెంట్రల్ దగ్గర ఇరవై నిముషాలు వెయిట్ చేసిన తరువాత వెయిటర్ ఒక మూల యల్ షేప్ లో ఉన్న సోఫా చూపించి మెన్యూ మా ముందు పెట్టి వెళ్ళి పోయాడు. మెన్యులో కపూచినో, లాటే లతో పాటు ములాంజ్ అనే వెరైటీ కాఫీ కనిపించింది. కపూచినో కు దీనికీ తేడా ఏమిటంటే కపూచినోలో డికాషన్ పైన కాస్త పాలనురగు వేస్తారు, ములాంజ్ కు డికాషన్ పైన కాసిని వేడి పాలు పోసి దాని పైన పాల నురుగు వేస్తారు. ఎలా ఉంటుందో చూద్దామని ములాంజ్ ఆర్డర్ చేసాం. కపూచినో కంటే ఎక్కువ నచ్చేసింది.

   


    

కాఫీలు అయ్యాక కృసాంట్స్, బాయిల్డ్ ఎగ్, సూప్, కేక్స్ ఆర్డర్ చేసాం. అన్నట్లు కృసాంట్ ఎక్కడ పుట్టిందో తెలుసా, ఇంకెక్కడ ఆస్ట్రియాలోనే. ఆర్డర్ వచ్చేలోగా చుట్టూ ఉన్న వాళ్ళను గమనిస్తే అంతా రకరకాల ప్రాంతాల నుండి వచ్చినట్లున్నారు. ఎవరికీ తొందర లేనట్లు నిదానంగా కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. మేము కూడా అదే పద్దతి ఫాలో అవుతూ కాఫీలు, కబుర్లు అయ్యాక నింపాదిగా హోటల్ కు బయలుదేరాము.  



డ్రైవర్. పార్లమెంట్, ఆప్రా హౌస్, స్పానిష్ రైడింగ్ స్కూల్ అన్నీ చూపిస్తూ తీసుకువెళ్తున్నాడు. ఆ ఊరిలో బిల్డింగ్స్ అన్నీ ఒకే ఎత్తులో ఉండాలనే రిస్ట్రిక్క్షన్ ఉన్నదట. ఒకే ఎత్తులోని ఇళ్ళతో ఆ వీధులు ముచ్చటగా ఉన్నాయి.       



కబుర్లలోనే వచ్చేసింది మా హోటల్, మెర్క్యూర్ వియన్ వెస్ట్ బాన్హాఫ్. మెట్రో స్టేషన్, షాప్స్, రెస్టారెంట్స్ అన్నీ అక్కడకు దగ్గరలోనే ఉన్నాయి. హోటల్ లో చెకిన్ చేసి ఊరు చూడాలని బయలుదేరాం.   

ముందుగా నాష్ మార్కెట్(Naschmarkt) కు వెళ్ళాం. పదహారవ శతాబ్దంలో ప్రారంభించిన ఆ మార్కెట్  ఇప్పటికీ నడుస్తోంది. అప్పుడు మొదలెట్టారని అప్పటి వస్తువులు అమ్మడం లేదులెండి, ఇప్పటివే అమ్ముతున్నారు. హెర్బ్స్, చీజ్, బ్రెడ్, సీ ఫుడ్, పండ్లు ఒకటేమిటి అక్కడ సమస్తం దొరుకుతున్నాయి. వియన్నాలో ఇండియన్స్ బాగానే ఉన్నట్లున్నారు. ఆ మార్కెట్ లో ఇండియన్ షాప్ కూడా ఉంది. కొబ్బరి నీళ్ళు, ఆగరుబత్తీలు, మసాలా పొడులు లాంటి వన్నీ ఉన్నాయక్కడ. ఇక ఫుడ్ ఐటెమ్స్ అయితే చెప్పనే అక్కర్లేదు. సూషీ, కబాబ్స్, ఫిలాఫెల్, బకలవా, రాప్స్, నూడిల్స్ అలాఅ ఎన్నో ఫుడ్ వెరైటీలు దొరికే రెస్టరెంట్స్ ఉన్నాయి. అక్కడ ఏదైనా వస్తువు దొరకలేదు అంటే దాన్ని వాడాల్సిన అవసరమే లేదు అని అర్ధమట. అబ్బో ఎంత గర్వం అనుకున్నా౦ కానీ ఆ మార్కెట్ చూసాక వాళ్ళకా మాత్రం గర్వం ఉండడంలో తప్పులేదనిపించింది.  


 

 

ఆ మార్కెట్ లో కాసిన పండ్లూ అవీ కొనుక్కుని అక్కడి నుండి షాన్బ్రిన్ ప్యాలస్ కు వెళ్ళాం. ఆ ప్యాలస్ గురించి చెప్పుకునే ముందు హాబ్స్బర్గ్ డైనాస్టీ గురించి చెప్పుకోవాలి. 

హాబ్స్బర్గ్స్(Habsburgs) అనే జర్మన్స్ పదిహేనవ  శతాబ్దం నుండి ఇరవైయ్యొవ శతాబ్దం వరకూ యూరప్ లోని ఆస్ట్రియా, హంగేరీ, బొహేమియా, స్పైన్, నెదర్లాండ్స్, లెక్జ౦బర్గ్ ఇంకా ఎన్నో దేశాలను పరిపాలించారు. అయితే ఎంపరర్ చార్ల్స్ సిక్స్ కొడుకు చిన్నతనంలోనే చనిపోవడంతో ఇక ఆ వంశానికి వారసులు లేరు. చార్ల్స్ రాజ్యానికి వారసుడు లేకపోతే వారసురాలు అధికారం లోకి రావచ్చనే ప్రతిపాదన తెచ్చి అందరితో ఒప్పించారు. తన పెద్ద కుమార్తె అయిన  మరియా థెరిస్సాకు రాజ్యం అప్పగించాలని ఆయన కోరిక. 

పేపర్ల మీద సంతకాలైతే అయ్యాయి కానీ ఆయన చనిపోయిన వెంటనే ఆ ప్రతిపాదనకు  ఒప్పుకోమంటూ యుద్దాలు మొదలయ్యాయి. ఏడేళ్ళు పాటు జరిగిన యుద్దం తరువాత ఆర్చ్ డచ్చెస్ మరియా థెరిస్సా ఎంప్రెస్ మరియా థెరిస్సా అయ్యారు. కానీ ఆ యుద్దంలో హాబ్స్బర్గ్ కొన్ని దేశాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది, ఖజానా ఖాళీ అయింది. ఆ విపత్కర పరిస్థితి నుండి హాబ్స్బర్గ్ సామ్రాజ్యాన్ని కాపాడి ఆవిడ నలభై సంవత్సరాల పాటు పరిపాలించారు. మరియా థెరెస్సాకు తన చిన్నతనంలో వాళ్ళ నాన్నగారు బహుమతిగా ఇచ్చిన షాన్బ్రిన్ ప్యాలస్ (Schonbrunn Palace) నే రీమోడల్ చేయించి తన సమ్మర్ ప్యాలస్ గా చేసుకున్నారు. 

ఆవిడ మనవడు యంపరర్ ఫ్రాన్జ్ జోసెఫ్ భార్య ఎంప్రెస్ సిసిది మరో కథ. స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరే పక్షిని రాజరికపు పంజరంలో పెట్టినట్లు అయింది. ఆవిడ మీద సినిమా కూడా తీసారు.  

ఆ ప్యాలస్ చూడడానికి టికెట్ తో పాటు ఆడియో టూర్ కూడా తీసుకున్నాము. రిమోట్ లాంటి డివైజె ఇచ్చారు, ఆ డివైజ్ లో ఏ నంబర్ నొక్కితే ఆ  నంబర్ ఉన్న గది విశేషాలు వినొచ్చు. ఆ ప్యాలస్, చుట్టూ ఉన్న గార్డెన్స్ అన్నీ బొరాక్, రొకోకో స్టైల్ లో కట్టారు. బొరాక్ స్టైల్ లోని కట్టడాలు అన్నీ గ్రాండ్ గా ఉంటాయి. బొరాక్  స్టైల్ తరువాత యూరప్ లో పాపులర్ అయింది రొకొకో. అందమైన పెయింటింగ్స్, ఖరీదైన పెద్ద పెద్ద షాండలియర్స్,  స్తంభాల మీద బంగారంతో వేసిన డిజైన్స్ తో ప్యాలస్ అంతా చాలా అందంగా ఉన్నది. 


 

photo source: Visiting Vienna's Schönbrunn Palace: Highlights, Tips & Tours | PlanetWare

ప్యాలస్ లో పద్నాలుeగు వందల గదులున్నాయి గాని టూరిస్ట్ లు అందులో నలభై గదులు చూడొచ్చు. మేము ఇరవై గదులు చూసేసరికే సాయంత్రం అయిపోయింది. ఇక ఆ ప్యాలస్ లో గదులన్నీ తిరగాలంటే ఒక సంవత్సరం పడుతుందేమో. 

అక్కడి నుండి మా డ్రైవర్ మీకో మంచి ప్లేస్ చూపిస్తానని కాలిన్బర్గ్ మౌంటెన్ కి తీసుకెళ్ళాడు. అక్కడి నుండి చూస్తుంటే, ఊరు, ఊరి మధ్యలో నది, అక్కడక్కడా బ్రిడ్జెస్,  కొండ పైన చల్లని గాలి, బావుందా ప్లేస్.  


డ్రైవర్ మమ్మల్ని ఏడింటికి హోటల్ దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా అమెరికాలో లాగానే సమ్మర్ లో రాత్రి తొమ్మిదికి కానీ చీకటి పడదు. ఆ రాత్రి పక్కనే ఉన్న ఇటాలియన్ రెస్టారెంట్, వాపియానో లో డిన్నర్ చేసాము. పాస్తా, పిజ్జా, సలాడ్ అన్నింటిలో మనం ఏవి వేయమంటే అవి వేసి చేసి ఇచ్చారు.   

ప్రతి హోటల్ కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్ లో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది.  ఆ హోటల్  లో కొత్తగా అనిపించినవి జర్మన్ లో రాసిన ఐటం నేమ్స్, సలాడ్స్ ను బాటిల్స్ లో పెట్టడం.


బ్రేక్ ఫాస్ట్ అయ్యాక దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ కు వెళ్ళాం. అక్కడ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ కనిపించింది. అది ఊర్లో అన్ని దగ్గర్లా ఆగకుండా అట్రాక్షన్స్ దగ్గర మాత్రమే ఆగుతుంది, బస్ పాస్ తీసుకుంటే రోజు మొత్తంలో ఎన్నిసార్లయినా ఎక్కొచ్చు. పాస్ తీసుకుని డబుల్ డెకర్ బస్ లో పైకి వెళ్ళి కూర్చున్నాము. ప్రతి సీట్ కు హెడ్ ఫోన్స్ ఉన్నాయి  అవి పెట్టుకుంటే రూట్ కామెంటరీ వినిపించాలి కానీ మా హెడ్ ఫోన్స్ లో ఏ శబ్దమూ రాలేదు. 

ముందు రోజు షాన్బ్రిన్  ప్యాలస్ చూసా౦ కానీ గార్డెన్ చూడలేదగా, అందుకని ముందు అక్కడకే వెళ్ళాం. ఆ  ప్యాలస్, గార్డెన్ మొత్తం నాలుగు వందల ఎకరాలు ఉంటుంది. కనిపించినంత మేరా ఎటువైపు చూసినా వరుసగా పొడుగాటి చెట్లు, మధ్యలో దారి, దూరంగా ఫౌంటెన్ లు, ఎంతో అందంగా ఉందా గార్డెన్. మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా చల్లగా ఉంది ఆ ప్రాంతం అంతా.      



వింటర్ లో చలికి తట్టుకోలేని మొక్కలను లోపల పెట్టడానికి ఆ గార్డెన్ లో ఆరంజరీ ఉంది. దానిని కేవలం మొక్కలు పెట్టడానికే కాక కాన్సర్ట్స్ కు, సోషల్ గేదరింగ్స్ లాంటి వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. యూరప్ లో పదహారు, పదిహేడు శతాబ్దాలలో ఇలా గార్డెన్లో ఆరంజరీ ఉండడం ఒక స్టేటస్ సింబల్. షాన్బ్రిన్  ఆరంజరీలో సినిమా, టీవి షోస్ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. 

అన్నట్లు మీకు చెప్పలేదు కదూ. వియనాకు మరో పేరు కూడా ఉంది ‘సిటీ ఆఫ్ మ్యూజిక్‘ అని. ఎందుకో తెలుసా ప్రముఖ మ్యూజిక్ కంపోజర్స్ మోజార్ట్, బీథోవెన్ లు వియానాలోనే ఉండేవారు, అక్కడ తరచుగా మ్యూజిక్ కాన్సర్ట్స్, బాల్ డాన్సెస్ జరుగుతూ ఉండడం ఈ రెండూ కారణాలు.  ఆ గార్డెన్ చూసాక అక్కడినుండి హిస్టారిక్ సిటీ సెంటర్ కు వచ్చాము. ఆర్టిస్టిక్ బిల్డింగ్స్, వాటి మధ్య వీధుల్లో అక్కడక్కడా రెస్టారెంట్ వాళ్ళు వేసిన టేబుల్స్, అక్కడ కూర్చున్న లంచ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్న కస్టమర్స్, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. బహుశా పరుగులు లేని ప్రశాంతమైన వాతావరణం వల్లనేమో.  

లంచ్ అయ్యాక పిల్లలు, పెదనాన్న ఆల్బర్టినా మొడర్న్ ఆర్ట్ మ్యూజియంకు వెళ్ళారు.  అప్పటి వరకూ అన్నీ పాతవే చూసాంగా, కాస్త కొత్తగా ఏమైనా చూడాలని అనుకున్నారేమో! 

సాయంత్రం ఆరవుతుండగా ప్రాటర్ అమ్యూజ్ మెంట్ పార్క్ కు వెళదామని బస్ స్టాండ్ దగ్గరకు వెళ్ళామా, హాప్ ఆన్ హాప్ ఆఫ్ వాళ్ళు మేం బస్ లు సాయంత్రం ఆరు దాకే నడుపుతాం అనేసారు. అదేమిటి రోజు మొత్తం తిరగాలని కదా డే పాస్ తీసుకున్నాం,  ఆరింటికే ఆపడం ఏమిటి అనుకుని వాళ్ళను కనుక్కుంటే తెలిసింది. యూరప్ లో మన లాగా రాత్రి పగలూ పని చేయరని. ఇక చేసేదేముంది ట్రామ్ ఎక్కి ప్రాటర్ పార్క్ దగ్గర దిగాము. ఇంతకూ ఆ అమ్యూజ్ మెంట్ పార్క్ లో ఏముందో మీకు చెప్పలేదు కదూ! 

వీనారీసన్రాడ్, పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభించిన ఫెర్రిస్ వీల్, అది ఇప్పటికీ నడుస్తూ ఉంది. పార్క్ దగ్గర బస్ దిగి అమ్యూజ్ మెంట్ పార్క్ వైపుకు నడవడం మొదలు పెట్టాం. చాలా పెద్ద పార్క్ అది, పిల్లలు, పెద్దవాళ్లు అంతా బైక్ రైడింగ్ చేస్తున్నారు. ఒక అరగంట నడిస్తే వచ్చింది, ప్రాటర్ అమ్యూజ్ మెంట్ పార్క్. ఆ ఫెర్రీస్ వీల్ ఎక్కి సిటీని చూడడం బావుంది.     





అక్కడి నుండి బయటకు వచ్చేసరికి దాదాపుగా ఎనిమిదవుతోంది. దగ్గరలోనే ఉన్న జపనీస్ ఫాస్ట్ ఫుడ్ రెస్టరెంట్ లో డిన్నర్ చేసాము. సూషీ చేయడం రాక అలా చుట్టారో లేదా కొత్తగా ఉండాలని అనుకున్నారో కానీ ఆ చుట్టడం వెరైటీగా ఉంది. డిన్నర్ అయ్యాక ట్రామ్ లోనే తిరిగి హోటల్ కు వెళ్ళాము. 


ఆ కొత్త దేశంలో వెళ్ళాలని అనిపించిన దగ్గరకల్లా వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్ బాగా ఉపయోగపడ్డాయి. కలసి కబుర్లు చెప్పుకుంటూ నింపాదిగా ఊరు చూడడం మా అందరికీ నచ్చేసింది. మాకున్న రెండు రోజుల్లో టైమ్ ని కొంచెం అటూ ఇటూ సర్దితే ఓప్రా హౌస్, స్పానిష్ స్కూల్, హబ్స్బర్గ్ ప్యాలస్, ఎంప్రెస్ సిసీ మ్యూజియమ్ లాంటివేవో చూసి ఉండే వాళ్ళం. కానీ తరువాతెప్పుడో మా వియాన్నా ప్రయాణాన్ని తలచుకుంటే టైమ్ ని అలా ఇలా సర్దడమే గుర్తుంటుంది కాని వెళ్ళిన ప్లేసెస్ కాదు. మాకిలాగే బావుంది. 

తరువాత రోజు ఉదయం హోటల్లో  బ్రేక్ ఫాస్ట్ చేసి ముందుగా బుక్ చేసుకున్న వ్యాన్ లో కు బయలుదేరాము. 

తరువాత భాగం ఇక్కడ చదవొచ్చు.

8 comments:

  1. ఆ మార్కెట్ లో ఇండియన్....

    జిలేబీలున్నాయాండీ :)

    ReplyDelete
    Replies
    1. :) మంచి ప్రశ్నే వేసారు. మేము చూసినంతవరకూ లేవు. అక్కడ స్వీట్ షాప్స్ లో ఉన్నాయేమో తెలియదు. ఎవరైనా వెళ్తుంటే వాకబు చేయమని చెప్దా౦. జిలేబీలు లేకుండా అంత గర్వంగా చెప్పుకోకూడదు కదా.

      Delete
  2. లేవు!!! అంటే అవి ఆ వూరిలో తినక్కర్లేదు అని అర్థమా జిలేబి గారు? 😃

    ReplyDelete
    Replies
    1. తినొచ్చో లేదో తెలియదు కానీండి సుజాత గారు జిలేబి ప్రశ్న తో పరదా తీసారు :)

      Delete
  3. Vienna గురించి చాలా వివరంగా వర్ణించారు. మీరు వ్రాసిన దాన్ని బట్టి చూస్తే బహు అందమైన నగరం అని తెలుస్తోంది.

    మహాత్మా గాంధీ గారికి శిష్యరికం చేసిన బ్రిటిష్ దేశ మహిళ మీరా బెన్ (అసలు పేరు Madeleine Slade) భారత దేశ స్వాతంత్ర్యం తరువాత వియన్నాలోనే గడిపారు. వియన్నాలోనే మరణించారు. మరి ఆవిడకు memorial ఏమన్నా వియన్నాలో ఉందేమో తెలియదు.

    1960 ల దశాబ్దంలో వచ్చిన The Sound of Music అనే సూపర్ హిట్ musical చిత్రం (Julie Andrews, Christopher Plummer) చిత్రీకరణ - వియన్నాలో కాదు గానీ - ఆస్ట్రియా దేశంలోనే Salzburg అనే మరో నగరంలో జరిగిందట. వియన్నాకు ఎంత దూరమో తెలియదు.

    అన్నట్లు హిట్లర్ జననం ఆస్ట్రియాలోనే జరిగిందట 😏.

    సరే ఈ side విశేషాల సంగతి ఎలా ఉన్నా … మొత్తానికి Austria, Vienna చాలా చరిత్ర కలిగిన దేశము నగరమూన్నూ. యూరపు చరిత్రలో ప్రముఖ స్ధానం కలిగినవి.

    ReplyDelete
    Replies
    1. మీరాబెన్ గురించి అంతకు ముందు చదివాను. ఆవిడ మెమోరియల్ వియన్నాలో లేదనుకుంటానండి.

      మేము వియన్నా నుండి హాల్ స్టాట్ మీదుగా సాల్జ్ బర్గ్ కే వెళ్ళాము. అది కూడా చాలా అందమైన ప్రాంతం.

      Delete
  4. మాటల్లో చిత్రీకరణ బాగుంది.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.