Wednesday, September 28, 2011

మావ ముచ్చట్లు


ఎన్నని చెప్పను మావ ముచ్చట్లు
ఎన్నెన్నని చెప్పను నా మావ ముచ్చట్లు!

పచ్చ చీరాగట్టి వనలచ్చిమోలు౦టే
చీరలోనున్నట్టి 'పడుగు' తానంటాడు!

రంగుగాజుల్దొడిగి రవ్వోలె నేనుంటే
గాజుల్ల నున్నట్టి 'జిలుగు' తానంటాడు!

ముత్యాల పేటతో ముచ్చటగ నేను౦టే
పేటలో నున్నట్టి 'పూస' తానంటాడు!

ముక్కుపుడకా బెట్టి ముత్తెమోలేను౦టే
పుడక మీదున్నట్టి 'మెరుపు' తానంటాడు!

కురులేమో సిగచుట్టి సిరిలచ్చిమోలుంటె
సిగలోన ఉన్నట్టి 'మల్లె' తానంటాడు!

కాలి పట్టీ లెట్టి కలహంస వోలుంటే
పట్టీల నున్నట్టి 'మువ్వ' తానంటాడు!

ఎన్నని చెప్పను మావ ముచ్చట్లు
ఎన్నెన్నని చెప్పను నా మావ ముచ్చట్లు!!


ఎప్పుడో విన్న 'మల్లి ముచ్చట్లు' ఆధారంగా...