Wednesday, September 28, 2011

మావ ముచ్చట్లు


ఎన్నని చెప్పను మావ ముచ్చట్లు
ఎన్నెన్నని చెప్పను నా మావ ముచ్చట్లు!

పచ్చ చీరాగట్టి వనలచ్చిమోలు౦టే
చీరలోనున్నట్టి 'పడుగు' తానంటాడు!

రంగుగాజుల్దొడిగి రవ్వోలె నేనుంటే
గాజుల్ల నున్నట్టి 'జిలుగు' తానంటాడు!

ముత్యాల పేటతో ముచ్చటగ నేను౦టే
పేటలో నున్నట్టి 'పూస' తానంటాడు!

ముక్కుపుడకా బెట్టి ముత్తెమోలేను౦టే
పుడక మీదున్నట్టి 'మెరుపు' తానంటాడు!

కురులేమో సిగచుట్టి సిరిలచ్చిమోలుంటె
సిగలోన ఉన్నట్టి 'మల్లె' తానంటాడు!

కాలి పట్టీ లెట్టి కలహంస వోలుంటే
పట్టీల నున్నట్టి 'మువ్వ' తానంటాడు!

ఎన్నని చెప్పను మావ ముచ్చట్లు
ఎన్నెన్నని చెప్పను నా మావ ముచ్చట్లు!!


ఎప్పుడో విన్న 'మల్లి ముచ్చట్లు' ఆధారంగా...

11 comments:

  1. లోకేష్ శ్రీకాంత్ గారూ..థాంక్స్ అండి.

    ReplyDelete
  2. నా బ్లాగులో కొత్త పాళీ గారి సంతకం ఎంత బాగుందో..
    బోలేడు ధన్యవాదాలు కొత్త పాళీ గారూ.

    ReplyDelete
  3. కవిత భావయుక్తం గా బాగుంది.

    ReplyDelete
  4. నాగమణి గారూ...థాంక్ యు.

    ReplyDelete
  5. ఈ ఊసులింటుంటె
    నా పలుకు ఊ కొట్టు
    ఎన్ని విన్నా విన్నట్టు
    ఎదలోన సొద పెట్టు
    బాగున్నాయండీ జ్యోతి గారు...మావ ముచ్చట్లు.

    ReplyDelete
  6. ఊ కొట్టాలే గాని ఉసులేల?
    పలుకు తేనియలొలుకు
    కవితలే చెప్పంగ
    నెచ్చెలీ..నీ ప్రోత్సాహం
    మరుపన్నదే లేదు ఆజన్మాంతం.

    శుభ గారూ ధన్యవాదాలు.

    ReplyDelete
  7. నెచ్చెలీ ! అని నా మనసు నింపేసారండీ...

    ReplyDelete
  8. జ్యోతిర్మయి గారూ,

    ఈ కవిత నండూరి వారి ఎంకిపాటలు గుర్తు చేస్తోంది.
    "ఎనక జల్మములోన ఎవురమో నంటే, సిగ్గొచ్చి నవ్వింది సిలక నా ఎంకి
    ముందు మనకేజన్మ ముందోలె యంటె తెల్లతెల బోయింది పిల్ల నా ఎంకి
    ఎన్నాళ్ళు మనకోలే ఈ సుకములంటె కంటనీరెట్టింది జంటనా ఎంకి"
    ఇది శిల్పం తో పాటు structural beauty కి కూడా ఉదాహరణగా నిలుస్తుంది. మీ కవితలో పల్లవి, ముగింపులో ఇచ్చిన Refrain, 3 వ పాదం

    రంగైన గాజుల్దొడిగి రవ్వోలె నేను౦టే
    గాజుల్ల నున్నట్టి 'గలగలలు' తానంటాడు!

    మాత్రమే నడక దెబ్బ తిన్నాయి. మిగిలినవి చాలా చక్కగా వచ్చేయి. మరోసారి ఎందుకు ప్రయత్నించ కూడదు? There is no last word for any poem

    మీ మూడోపాదం ఇలా (మీకు నచ్చిన మాటలు ఎంచుకుని) సవరిస్తే మిగతా వాటితో align అవుతుంది:

    రంగుగాజుల్దొడిగి రవ్వోలె నేనుంటె
    గాజుల్ల నున్నట్టి "తళుకు"/ "జిలుగు"/ వెలుగు తానంటాడు

    అభినందనలు

    ReplyDelete
  9. మూర్తి గారికి నమస్కారములు.
    ఆ కవిత చదివినప్పుడు కొంచెంగా నచ్చలేదు కాని ఎక్కడో తెలియలేదు. మీరు బాగా చెప్పారు. మీ సలహా ప్రకారం
    "రంగుగాజుల్దొడిగి రవ్వోలె నేనుంటె
    గాజుల్ల నున్నట్టి 'జిలుగు' తానంటాడు"

    అని మార్చాను ఇప్పుడు చాలా బావుంది. చిన్న మనవి నన్ను గారు అనకండి. మీ సవరణకు ధన్యవాదములు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.