Thursday, September 29, 2011

మా ఊరి ముచ్చట్లు

గున్న మావి కొమ్మల్లోన కోయిలమ్మ రాగాలు
పంటచేల దారుల్లోన పైరగాలి సరాగాలు!

సందె గాలిలో తేలియాడే సన్నజాజి పరిమళాలు
పైరు నిండుగ విరగబూసే బంతిపూల సోయగాలు!

కొండ మీద గుడిలోన జే గంటల సవ్వడులు
చెరువు కింద వాగులోన బాల కృష్ణుల కేరింతలు!

అరుణారుణ సమయాన వెనుతిరిగే గోమాతలు
మర్రిచెట్టు ఊడలతో ఆటలాడే మర్కటాలు!

కార్తీకాన చెరువుల్లో ప్రాతఃకాల  దీపాలు
పుష్య మాస వేకువల్లో వెల్లి విరిసేటి రంగవల్లులు!

ఎదురొచ్చి పలకరించే అమ్మమ్మల అనురాగాలు
ఎనలేని ప్రేమగల తాతయ్యల  ముద్దుమురిపాలు!

ఇలా ఎంత చెప్పినా తరగవు
మా వూరి ముచ్చట్లు!!