Tuesday, November 22, 2011

చుక్కల కింద చక్కని రోజులు

        ఓ వారాంత౦ అందరం తీరిగ్గా కూర్చుని టీలు తాగుతున్న సమయంలో  విజయ్ మన౦దరం కలసి ఓసారి కేంపింగ్ కి వెళ్దామా?” అన్నారు. వెంటనే నాలుగైదు గొంతులు ఉత్సాహంగా వెళ్దాం వెళ్దాంఅని పలికాయి. "ఎక్కడికెళితే బావుంటుందో?" ఊహల్లో ఆ వూరు ఈ వూరు తిరిగేసి చివరకు 'మారిపోసా' కెళ్దాం అనే నిర్ణయానికి వచ్చాం. 


        అనుకున్నదే తడవుగా ఓ నెల తరువాత గురువారం బయలుదేరి ఆదివారం వెనుక్కు వచ్చేలాగా సైట్ బుక్ చేశా౦. ఆరు జంటలు, ఇద్దరు బ్రహ్మచారులు, నలుగురు పిల్లలు వెరసి మొత్తం పద్దెనిమిది మందిమి కలసి వెళ్ళామన్నమాట.

            ఇంకేముంది సన్నాహాల సంబరం మొదలు. ముందస్తుగా కేంపింగ్ కి  కావలసిన వస్తువుల జాబితా తయారుచేశాం. టెంట్, టార్పాన్, స్లీపింగ్ బాగ్స్, కంఫర్టర్స్.....వగైరాలు ఉండడానికి.  లాంటర్న్స్, కూలర్స్, బగ్  స్ప్రే గ్యాస్ స్టవ్, సిలిండర్..ఎక్సెట్రాలు వాడడానికి. ఇవన్నీ కొనాలన్నమాట . ఇక పిల్లోస్, గిన్నెలు, గరిటలు..... లాంటివన్నీ ఇంట్లో ఎలాగూ వుంటాయి. 

        రెండు వారాల ముందు నుండి హడావిడిలు మొదలు. అన్ని షాపులు సందడి సందడిగా తిరిగేసి కావాల్సినవన్నీ ఒక్కొక్కటిగా పోగేసాం. అప్పుడ౦తా పైలాపచ్చీసు వ్యవహారం, స్కూళ్ళు హోమ్ వర్క్ లు జీవితంలో ప్రాముఖ్యతను సంతరించుకోని రోజులు. ఆ తరువాత కలసినప్పుడల్లా, కేంపింగ్ లో "ఏం చేద్దాం?", "అ దగ్గర్లో చూడ్డానికి ఏం వున్నాయో?", "అక్కడ 'డంషార్ ఆర్ట్స్' ఆడదామా?"ఇలా సాగిపోయేవి కబుర్లు.


        “అక్కడే వంట చేద్దామా? ఇక్కడ నుండి వండి పట్టుకెళదామా?” వైష్ణవి అడిగింది. అబ్బే ఇక్కడెందుకు వైష్ణవీ, వెళ్ళేరోజుకి కుక్ చేసికేళితే చాలు తరువాత అక్కడే వంట చేద్దాంసరిత చెప్పింది. 
అందరం సరే అంటే సరే అనుకున్నాం. ఏమేమి తీసుకుని వెళ్ళాలో ఆలోచించుకుని అందులో భాగంగా ఇక వెళ్ళడానికి మూడు రోజులుందనగా స్నాక్స్ ఏవో చేశాం. తరువాత వంటగదే లేని దగ్గర వంటక్కావలసినవి   కొనడం. రాణి, మానస, నేను కాస్ట్ కో కి బయలు దేరాం.
లిస్టు చూడు రాణీ ఒక్కొకటి చదువుఅన్నాను.
బ్రెడ్, మిల్క్, ఎగ్గ్స్, కాప్సికమ్స్, మష్రూమ్స్, టమోటోస్, బర్గర్ బ్రెడ్, పాటీస్.....ఇలా చేంతాడంత లిస్టు చదివింది.
అవన్నీ తీసుకుని, మిగిలిన సరుకులు భారత్ బజారు'లో, 'లక్కీ'లో కొన్నాం. మొత్తం మీద కొత్త కాపురానికి కొన్నంత హడావిడి చేశాం.

           ఇక వెళ్ళేరోజు రానే వచ్చింది. మా ప్లాన్ ఏంటంటే మధ్యాహ్నమే బయలుదేరి చీకటి పడకముండే వెళ్లి టెంట్లు వేసికోవాలని. కార్లు లోడ్ చేసేప్పటికి ఓ మూడు గంటలు పట్టింది. మొత్తం ఐదు కార్లు, కొత్త రూట్ కదా అందరం కలిసే వెళ్దామని ఒక కారు వెనుక ఒకళ్ళం బయలుదేరాం. నాలుగు గంటల ప్రయాణంలో ఒక్కో గంట తరువాత ఒక్కో కారు మాయం. చివరి గంటలో మా ముందూ వెనుకా మావాళ్ళ కార్లేవీ కనిపించలా. 'జిపిస్'  లు లేని రోజులు మాప్ పట్టుకుని ఒక్కో ఎగ్జిట్ చూసుకుంటూ ఎట్టకేలకు గమ్యం చేరాం. 

           విశాలమైన మైదానం, సంధ్యా కాంతులు వెదజల్లుతూ ఆకాశం, చుట్టూ ఎత్తైన చెట్లూ.... "వావ్.. లోకేషన్ అదిరింది!" అనుకుంటున్నారా. మేం కూడా అదే అనుకున్నాం. ఏ టెంట్ ఎక్కడ వెయ్యాలో నిర్ణయించి కారులోవి  ది౦చేసరికి ఏ మనిషేవరో అర్ధం కాకు౦డా పోయింది. చీకట చిక్కబడి పోయిందన్నమాట. ఎక్కడా లైట్ అన్న మాట లేదు. మరి కేంపింగ్ బ్యూటీ అదే కదా..ఏదో చక్కని పల్లెటూరికి వెళ్ళినట్లు, మనల్ని ఐహిక సుఖాలకు ఓ యాభై ఏళ్ళు దూర౦గా తీసుకెళ్ళడం. ఆ చిక్కటి చీకట్లో మా వాసానికి ఏర్పాట్లు, అదే టెంట్లు వేసుకోవాలిగా. 


         ఆ చీకట్లో కారు హెడ్ లైట్స్ ఆన్ చేసి సుత్తులు, మేకులు తాళ్ళు ...ఎక్సెట్రా లతో ఓ రెండు గంటలు ఫ్రెండ్ షిప్ చేస్తే ఐదు సింగిల్ టెంట్ లు, ఒక డబుల్ టెంట్ ఏర్పడ్డాయ్.


                కబుర్ల మధ్యలో తెచ్చుకున్నవేవో తినేసి మా శయ్యాగారం లోకి అడుగు పెట్టా౦. కింద గట్టినేల, స్లీపింగ్ బాగ్ ఉందనుకోండి తోడుగా చిరుచలి. అలవాటు లేని ఆ వాతావరణం కొంచెం కొత్తకొత్త గా వుంది. ఆ విధంగా ఆ రోజు గడచింది. ఇక అక్కడి విశేషాలు.... 
                                                                                                                                            సశేషం...