Tuesday, November 22, 2011

చుక్కల కింద చక్కని రోజులు

        ఓ వారాంత౦ అందరం తీరిగ్గా కూర్చుని టీలు తాగుతున్న సమయంలో  విజయ్ మన౦దరం కలసి ఓసారి కేంపింగ్ కి వెళ్దామా?” అన్నారు. వెంటనే నాలుగైదు గొంతులు ఉత్సాహంగా వెళ్దాం వెళ్దాంఅని పలికాయి. "ఎక్కడికెళితే బావుంటుందో?" ఊహల్లో ఆ వూరు ఈ వూరు తిరిగేసి చివరకు 'మారిపోసా' కెళ్దాం అనే నిర్ణయానికి వచ్చాం. 


        అనుకున్నదే తడవుగా ఓ నెల తరువాత గురువారం బయలుదేరి ఆదివారం వెనుక్కు వచ్చేలాగా సైట్ బుక్ చేశా౦. ఆరు జంటలు, ఇద్దరు బ్రహ్మచారులు, నలుగురు పిల్లలు వెరసి మొత్తం పద్దెనిమిది మందిమి కలసి వెళ్ళామన్నమాట.

            ఇంకేముంది సన్నాహాల సంబరం మొదలు. ముందస్తుగా కేంపింగ్ కి  కావలసిన వస్తువుల జాబితా తయారుచేశాం. టెంట్, టార్పాన్, స్లీపింగ్ బాగ్స్, కంఫర్టర్స్.....వగైరాలు ఉండడానికి.  లాంటర్న్స్, కూలర్స్, బగ్  స్ప్రే గ్యాస్ స్టవ్, సిలిండర్..ఎక్సెట్రాలు వాడడానికి. ఇవన్నీ కొనాలన్నమాట . ఇక పిల్లోస్, గిన్నెలు, గరిటలు..... లాంటివన్నీ ఇంట్లో ఎలాగూ వుంటాయి. 

        రెండు వారాల ముందు నుండి హడావిడిలు మొదలు. అన్ని షాపులు సందడి సందడిగా తిరిగేసి కావాల్సినవన్నీ ఒక్కొక్కటిగా పోగేసాం. అప్పుడ౦తా పైలాపచ్చీసు వ్యవహారం, స్కూళ్ళు హోమ్ వర్క్ లు జీవితంలో ప్రాముఖ్యతను సంతరించుకోని రోజులు. ఆ తరువాత కలసినప్పుడల్లా, కేంపింగ్ లో "ఏం చేద్దాం?", "అ దగ్గర్లో చూడ్డానికి ఏం వున్నాయో?", "అక్కడ 'డంషార్ ఆర్ట్స్' ఆడదామా?"ఇలా సాగిపోయేవి కబుర్లు.


        “అక్కడే వంట చేద్దామా? ఇక్కడ నుండి వండి పట్టుకెళదామా?” వైష్ణవి అడిగింది. అబ్బే ఇక్కడెందుకు వైష్ణవీ, వెళ్ళేరోజుకి కుక్ చేసికేళితే చాలు తరువాత అక్కడే వంట చేద్దాంసరిత చెప్పింది. 
అందరం సరే అంటే సరే అనుకున్నాం. ఏమేమి తీసుకుని వెళ్ళాలో ఆలోచించుకుని అందులో భాగంగా ఇక వెళ్ళడానికి మూడు రోజులుందనగా స్నాక్స్ ఏవో చేశాం. తరువాత వంటగదే లేని దగ్గర వంటక్కావలసినవి   కొనడం. రాణి, మానస, నేను కాస్ట్ కో కి బయలు దేరాం.
లిస్టు చూడు రాణీ ఒక్కొకటి చదువుఅన్నాను.
బ్రెడ్, మిల్క్, ఎగ్గ్స్, కాప్సికమ్స్, మష్రూమ్స్, టమోటోస్, బర్గర్ బ్రెడ్, పాటీస్.....ఇలా చేంతాడంత లిస్టు చదివింది.
అవన్నీ తీసుకుని, మిగిలిన సరుకులు భారత్ బజారు'లో, 'లక్కీ'లో కొన్నాం. మొత్తం మీద కొత్త కాపురానికి కొన్నంత హడావిడి చేశాం.

           ఇక వెళ్ళేరోజు రానే వచ్చింది. మా ప్లాన్ ఏంటంటే మధ్యాహ్నమే బయలుదేరి చీకటి పడకముండే వెళ్లి టెంట్లు వేసికోవాలని. కార్లు లోడ్ చేసేప్పటికి ఓ మూడు గంటలు పట్టింది. మొత్తం ఐదు కార్లు, కొత్త రూట్ కదా అందరం కలిసే వెళ్దామని ఒక కారు వెనుక ఒకళ్ళం బయలుదేరాం. నాలుగు గంటల ప్రయాణంలో ఒక్కో గంట తరువాత ఒక్కో కారు మాయం. చివరి గంటలో మా ముందూ వెనుకా మావాళ్ళ కార్లేవీ కనిపించలా. 'జిపిస్'  లు లేని రోజులు మాప్ పట్టుకుని ఒక్కో ఎగ్జిట్ చూసుకుంటూ ఎట్టకేలకు గమ్యం చేరాం. 

           విశాలమైన మైదానం, సంధ్యా కాంతులు వెదజల్లుతూ ఆకాశం, చుట్టూ ఎత్తైన చెట్లూ.... "వావ్.. లోకేషన్ అదిరింది!" అనుకుంటున్నారా. మేం కూడా అదే అనుకున్నాం. ఏ టెంట్ ఎక్కడ వెయ్యాలో నిర్ణయించి కారులోవి  ది౦చేసరికి ఏ మనిషేవరో అర్ధం కాకు౦డా పోయింది. చీకట చిక్కబడి పోయిందన్నమాట. ఎక్కడా లైట్ అన్న మాట లేదు. మరి కేంపింగ్ బ్యూటీ అదే కదా..ఏదో చక్కని పల్లెటూరికి వెళ్ళినట్లు, మనల్ని ఐహిక సుఖాలకు ఓ యాభై ఏళ్ళు దూర౦గా తీసుకెళ్ళడం. ఆ చిక్కటి చీకట్లో మా వాసానికి ఏర్పాట్లు, అదే టెంట్లు వేసుకోవాలిగా. 


         ఆ చీకట్లో కారు హెడ్ లైట్స్ ఆన్ చేసి సుత్తులు, మేకులు తాళ్ళు ...ఎక్సెట్రా లతో ఓ రెండు గంటలు ఫ్రెండ్ షిప్ చేస్తే ఐదు సింగిల్ టెంట్ లు, ఒక డబుల్ టెంట్ ఏర్పడ్డాయ్.


                కబుర్ల మధ్యలో తెచ్చుకున్నవేవో తినేసి మా శయ్యాగారం లోకి అడుగు పెట్టా౦. కింద గట్టినేల, స్లీపింగ్ బాగ్ ఉందనుకోండి తోడుగా చిరుచలి. అలవాటు లేని ఆ వాతావరణం కొంచెం కొత్తకొత్త గా వుంది. ఆ విధంగా ఆ రోజు గడచింది. ఇక అక్కడి విశేషాలు.... 
                                                                                                                                            సశేషం...

19 comments:

 1. చుక్కల కింద 'శర్కరి' రోజులు !
  చక్కెర తియ్యదనాలు !

  ReplyDelete
 2. "విశాలమైన మైదానం, సంధ్యా కాంతులు వెదజల్లుతూ ఆకాశం, చుట్టూ ఎత్తైన చెట్లూ.... "
  మీ వారాంత౦ కేంపింగ్ విశేషాలు బాగున్నాయండీ

  ReplyDelete
 3. వావ్ బాగున్నాయి మీ కబుర్లు, ఏర్పాట్లు కూడాను! నేను మా labmates తో కలిసి వెళ్లాను ఇలానే కాని ప్రక్కన ఎంతో ఎత్తునించి పడే అందాల జలాశయం, మాధ్యాహ్నం మూడింటికల్ల చిమ్మ చీకటి, ఎముకలు కోరికే చలి ఆహా మా విహార యాత్రని గుర్తు చేస్తున్నాయి మీ కబుర్లు. మీ తరువాతి టపా కోసం చూస్తూ.....

  ReplyDelete
 4. ఐ ఐ కాంపింగ్ కబుర్లు..బావున్నాయ్..తర్వాతేమైందండీ? త్వరగా చెప్పాలి మరి..

  ReplyDelete
 5. 'నాలుగు గంటల ప్రయాణంలో ఒక్కో గంట తరువాత ఒక్కో కారు మాయం.' అంటే ఏదైనా సస్పెన్స్ సంఘటన జరిగిందేమో అనుకున్నానండి.. కేంపింగ్ విషయాలు తొందరగా రాసేయండి.

  ReplyDelete
 6. అర్రే.. సశేషం అనేస్తే ఎలా.. చెప్పండి ఏమేం కుక్ చేసుకున్నారూ, ఏమేం ప్లే చేసారూ? :)

  ReplyDelete
 7. బాగుంది. త్వరగా రాసేయండీ .. ఎదురు చూపులు.

  ReplyDelete
 8. & నిజమే వరూదినిగారూ.. ఎన్నాళ్ళయినా ఆ మాధుర్యం మరపుకురానంటుంది. ధన్యవాదాలు.

  @ ముందు ఇంకా ఉన్నాయండీ. ధన్యవాదాలు రాజిగారూ..

  @ రసజ్ఞా అలంటి అనుభవం మాకోసారి ఎదురయ్యింది. తరువాతి రోజుకే పెట్టా బేడా సర్దుకుని వెనక్కి వచ్చేశాం.
  ధన్యవాదాలు.

  @ చెప్తా చెప్తా..కొంచెం ఆగాలి మరి. ధన్యవాదాలు సుభా..

  ReplyDelete
 9. @ బాలూ గారూ..దేముడి దయవల్ల సస్పెన్స్ లేమీ లేవండీ..అంతా శుభమే..రాసేస్తా రాసేస్తా....మీ అందరి ప్రోత్సాహమే నా చేత ఇలా కబుర్లు చెప్పిస్తోంది. ధన్యవాదాలు.

  ReplyDelete
 10. @ అబ్బో చెప్పాలంటే చాలా వుందిలెండి అందుకే రెండో టపా..త్వరలోనే చెప్తా..ధన్యవాదాలు కొత్తవకాయగారూ..

  @ వనజగారూ..నాకు ప్రోత్సాహమిచ్చి నాతో రాయిస్తుందుకు మీకు బోలెడు ధన్యవాదాలు. త్వరలోనే పోస్ట్ చేస్తాను.

  ReplyDelete
 11. @జ్యోతిర్మయి గారు
  కరుడుగట్టిన కైది కూడా కాస్త సాన పెడితే తన కథను పూర్తి చేస్తాడు కాని మీరు ఇంత కఠిణంగా మధ్యలోనే ఆపెస్తారని అనుకోలేదు. త్వరగా చెప్పండి లేకుంటే పూర్తిగా చెప్పనందుకు బ్లాగ్ రక్షకులను పిలవాల్సి వస్తుంది. సరే కాస్త సమయం తీస్కోండి పర్లేదు ఇలాగే మేము ఒకసారి మా పిల్లలతో టూర్ వెళ్ళాం మున్నార్ వెళ్తుంటే మధ్య అడవిలో అది చిమ్మ చీకటిలో బస్సు ఆగిపోయింది . వెనకాల లోయ బస్సు కదిలిందా అంతే సంగతులు అనేలాగా ఉంది. అందరం దిగేసి తోయడానికి ప్రయత్నించాం ఎక్కడ నూలుపోగు దూరం కూడా కదలలేదు మిట్ట కదా అందుకని. ఇంకా దారిన పోయే వాహనాలన్నీ ఆగిపోయాయి దాని వల్ల. మేము ఊరుకోక క్యాంపు ఫైర్ వేసాం సరదాగా. వేరే వాళ్ళు వచ్చి చెప్పారు ఏనుగలు వచ్చే సమయం ఆపండి త్వరగా అని అది ఒక గుండ్రాయి పడినంత పని అయింది. ఎట్లో అలా చేసి ఇలా చేసి ఆపాము. చివరికి ఎవరో కేరళ మహానుబావుడు జీపు తో బస్సును లాగి పుణ్యం కట్టుకున్నారు అందరం కదిలాము చివరికి కథ సుఖాంతం. అది మాత్రం మర్చిపోలేని అనుభవం.

  ReplyDelete
 12. శర్కరీ జ్యోతిర్మయీ,

  @వరూధిని గారు, కాదండి ,
  అది జిలేబి.

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 13. మేము కూడ ఈ టపా ద్వారా దాదాపు మీతో పాటు వచ్చేసినట్టు అయ్యింది, కాంపింగ్ కి ! బాగా వ్రాసారండి

  ReplyDelete
 14. బాగుంది! నేను ఆలస్యంగా వచ్చేను మరి!!

  ReplyDelete
 15. @ కళ్యాణ్ గారూ బహుకాల దర్శనం, బ్లాగుల్లో ఎక్కడా కనపడకపోతే ఎమయ్యరా అనుకున్నాను.
  అర్దరాత్రి పిల్లలతో చాలా కంగారు పడు౦టారుగా..ఏమైతేనేం కథ సుఖాంతం..ఓ అనుభవం మీ సొంతం..తరువాత విషయాలు త్వరలోనే చెప్తాను. ధన్యవాదాలు.

  @ జిలేబిగారూ వరూధిని గారు మీరు కాదా..జిలేబి బ్లాగులో పోస్ట్ చేసింది వరూధిని అని ఉంటే మీరే అనుకున్నాను. ధన్యవాదాలు జిలేబిగారూ..

  @ శర్మగారూ ఆలస్యమేమీ లేదు. మీ ప్రోత్సాహామే పదివేలు. ధన్యవాదాలు.

  ReplyDelete
 16. ఆహా, సాహస యాత్రలాగా ఉందే, తరువాయి భాగం ఎప్పుడో మరి.

  ReplyDelete
 17. మందాకిని గారూ తరువాయి భాగం వచ్చేసిందండీ. ధన్యవాదాలు.

  ReplyDelete
 18. మీరుగానీ బే ఏరియా వాసులా..... కాస్త చెబుదురూ....

  ReplyDelete
 19. మాధవిగారూ...మేము బే ఏరియా పూర్వ వాసులమండీ..అయితే ఇప్పటికీ బే ఏరియాతో సంబ౦ధ బాంధవ్యాలు నడుస్తూనే వున్నాయ్. ధన్యవాదాలు

  ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.