Sunday, March 17, 2013

వ్యసనాల వలన ఉపయోగాలు

"వ్యసనాల వలన ఉపయోగాలా..మతీ గితీ కాని పోయిందా ఏం?" అనుకుంటున్నారా. అబ్బే అలాంటిదేం లేదండి. వ్యసనం అంటే వదలలేనిదట. ఎలాగూ వదలలేంగా సప్తవ్యసనాలకు కొన్ని మార్పులు చేసుకుని అలాగే కొనసాగిద్దాం. పుణ్యం పురుషార్ధం రెండూ దక్కుతాయి. 

వేట: కౄరమృగాలు మారుమూల అడవుల్లో ఎక్కడో దాక్కునేవి ఒకప్పుడు. ఇప్పుడు వీధుల్లో ముసుగు వేసుకుని తిరుగుతున్నాయి. వేటాడి వేటాడి రేపటి తరం నిర్భయంగా బ్రతికేలా చేద్దాం.

జూదం: ఈ వ్యసనాన్ని తప్పకుండా పెంచుకోవలసిందే, చిన్న తేడాతో.....ఎప్పుడూ ఒకటే ఆట అయితే బోర్ కొడుతుంది కూడానూ... ఇవాళ మార్కెట్లో నలుగురూ కలసి ఆడుకోగలిగిన బోర్డు గేమ్స్ ఎన్నో వున్నాయి. కుటుంబంతో కలసి ఈ వ్యసనాలకు బానిసలౌదాం. జీవితం చివరి అంకంలో ఒంటరినని వగచే దుస్థితి కలుగదు. 

పరస్త్రీ వ్యామోహం(కామము):  హద్దులు దాటి పోస్టర్ల మీద అర్ధనగ్నంగా నిలబడుతోంది, వెండితెర మీద తైతక్కలాడుతోంది, అందాల పోటీల్లో విలువలొదిలేసింది, వెబ్ సైట్ల లో వలువలు విడిచేసింది. కళ్ళు మూసుకుపోయి అన్నింటినీ చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తున్నాం. అభినవ కీచకుల్ని తయరుచేస్తున్నాం. 

క్షణికమైన ఆనంద౦ కోసం అడ్డదారి తోక్కేబదులు శాశ్వతమైన ఆనందాన్ని సొంతం చేసుకోవడానికి రాజమార్గం వెతుకుదాం. రవంత ప్రేమ, ఆదరణ కోసం అలమటించే జీవితాలు ఎన్నో! సోదరభావంతో ఆసరా ఇద్దాం...అక్కున చేర్చుకుందాం. కొండంత అభిమానం మనదౌతుంది. 

మద్యపానం: ఒకప్పుడు తప్పుగా పరిగణింపబడేది. నేడు నాగరికతా చిహ్నంగా చెప్పబడుతోంది. వ్యసనం మనల్ని బానిసలుగా చేసుకున్నదనడానికి పరాకాష్ఠ ఇది. మద్యం తీసుకుంటూ మనస్సుకు ముసుగేసుకుని తప్పొప్పుల గీత చెరిపేస్తున్నాం. రేపటి తరానికి మంచి చెడు చెప్పే అర్హత కోల్పోతున్నాం. 

మనసును జోకొట్టే మద్య౦ మాని మానసికానందాన్ని కలిగించే చిన్నపని ఎంత చిన్నపనైనా సరే చేస్తే అది ఎంతటి తృప్తిని ఇస్తుందో కదా!  

ధనం(వృధా చేయడం): సొంతలాభం కొంతమాని పొరుగువారికి సాయపడదాం. సంపాదించిన దానికన్నాఎక్కువ తృప్తి కలుగుతుంది. 

పరుషంగా మాట్లాడడం(దుర్భాష): అన్యాయాన్నిఎదిరించే ప్రతిసారి మన వాక్కు ఇలానే ఉండాలి. 

పరుషంగా దండించడం(క్రౌర్యం): తప్పొప్పులకు సరైన నిర్వచనం ఇచ్చి, తప్పు చేసిన వారికి ఇది తప్పదంటే ఇక దండిచాల్సిన అవసరం రాదేమో.

ఆచరించడం సాధ్యం కానిపని అంటున్నారా... మన బ్రతుకు మరో క్షణంలో ముగిసిందనుకోండి, సమస్యే లేదు. ఏ పక్షవతమో వచ్చి మంచంమీద రోజులు గడపవలసి వచ్చినప్పుడు మనం చేసిన తప్పులకు మన మనసే పెద్ద శిక్ష వేస్తుంది. బ్రతికుండగానే నరకం చూపిస్తుంది. దిద్దుకోవడానికి కాలం వెనక్కి తిరగదుగా...

మనస్సు కోతిలాంటిదట. నిరంతరం జ్ఞానబోధ చేస్తూ దారిలో పెట్టుకోవాలి. మొదటి ఇరవై సంవత్సరాలు సంపాదించడానికి అవసరమైన చదువుల కోసం వినియోగిస్తున్నాం. ఆ తరువాత జీవనప్రవాహంలో కలసి ఆ వేగానికి కొట్టుకుపోతున్నాం. ఫలితం...గొర్రెదాటు వ్యవహారం. ఎవరేది చేస్తే అదే ఆచరించడం, అదే మంచిదనుకోవడం. నేడు ఏ ఇల్లు చూసినా అందంగా అలంకారాలు కనిపిస్తున్నాయి కానీ, మానసిన వికాసానికి అవసరమైన పుస్తకం ఒక్కటి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించడంలేదు. "పుస్తకం లేని ఇల్లు కిటికీ లేని గది వంటిది"ట. 

మనం చేసిందే గొప్ప అని వాదనలకు దిగుతాం.... ఓ పక్క అనుమానం పీడిస్తూనే వుంటుంది. ఆ అనుమానన్ని నివృతి చేసుకోవడానికో, మెప్పుదల కోసమో ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్ వర్క్ లకు అలవాటు పడుతున్నాం. మనం ఏదో నలుగురికి చెప్పాలనో మన గొప్ప చూపాలనో ఏదో ఓ మాట అంటాం, నలుగురు లైక్ కొడతారు. మనం పెట్టింది చదివారో లేదో, చూసారో లేదో కూడా తెలియదు. లైక్ లు చూసి పొంగిపోతాం. మన మనసును సమాధాన పరచడానికీ, జోకొట్టడానికీ కదూ ఈ వ్యవహారాలన్నీ. ..

ఒక చిన్న పనిచేసి నలుగురికోసమే బ్రతుకుతున్నట్లుగా కబుర్లు చెపుతాం. పేపర్లో ఫోటో వేయించుకుంటాం. ఫేస్ బుక్ లో అప్డేట్స్ పెడతాం. అందుకు అవసరమైతే ఒక హత్యనో, మానభంగాన్నో ఆయుధంగా వాడుకుంటాం. మనల్ని మనం ఎంత అవమానించుకుంటున్నామో అర్ధరాత్రి నిశ్శబ్దంలో  అర్ధమౌతూనే ఉంటుంది. 

యుద్ధం చేద్దాం నిజమైన ఆనందం కోసం...నికార్సయిన జీవితం కోసం.