Sunday, March 17, 2013

వ్యసనాల వలన ఉపయోగాలు

"వ్యసనాల వలన ఉపయోగాలా..మతీ గితీ కాని పోయిందా ఏం?" అనుకుంటున్నారా. అబ్బే అలాంటిదేం లేదండి. వ్యసనం అంటే వదలలేనిదట. ఎలాగూ వదలలేంగా సప్తవ్యసనాలకు కొన్ని మార్పులు చేసుకుని అలాగే కొనసాగిద్దాం. పుణ్యం పురుషార్ధం రెండూ దక్కుతాయి. 

వేట: కౄరమృగాలు మారుమూల అడవుల్లో ఎక్కడో దాక్కునేవి ఒకప్పుడు. ఇప్పుడు వీధుల్లో ముసుగు వేసుకుని తిరుగుతున్నాయి. వేటాడి వేటాడి రేపటి తరం నిర్భయంగా బ్రతికేలా చేద్దాం.

జూదం: ఈ వ్యసనాన్ని తప్పకుండా పెంచుకోవలసిందే, చిన్న తేడాతో.....ఎప్పుడూ ఒకటే ఆట అయితే బోర్ కొడుతుంది కూడానూ... ఇవాళ మార్కెట్లో నలుగురూ కలసి ఆడుకోగలిగిన బోర్డు గేమ్స్ ఎన్నో వున్నాయి. కుటుంబంతో కలసి ఈ వ్యసనాలకు బానిసలౌదాం. జీవితం చివరి అంకంలో ఒంటరినని వగచే దుస్థితి కలుగదు. 

పరస్త్రీ వ్యామోహం(కామము):  హద్దులు దాటి పోస్టర్ల మీద అర్ధనగ్నంగా నిలబడుతోంది, వెండితెర మీద తైతక్కలాడుతోంది, అందాల పోటీల్లో విలువలొదిలేసింది, వెబ్ సైట్ల లో వలువలు విడిచేసింది. కళ్ళు మూసుకుపోయి అన్నింటినీ చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తున్నాం. అభినవ కీచకుల్ని తయరుచేస్తున్నాం. 

క్షణికమైన ఆనంద౦ కోసం అడ్డదారి తోక్కేబదులు శాశ్వతమైన ఆనందాన్ని సొంతం చేసుకోవడానికి రాజమార్గం వెతుకుదాం. రవంత ప్రేమ, ఆదరణ కోసం అలమటించే జీవితాలు ఎన్నో! సోదరభావంతో ఆసరా ఇద్దాం...అక్కున చేర్చుకుందాం. కొండంత అభిమానం మనదౌతుంది. 

మద్యపానం: ఒకప్పుడు తప్పుగా పరిగణింపబడేది. నేడు నాగరికతా చిహ్నంగా చెప్పబడుతోంది. వ్యసనం మనల్ని బానిసలుగా చేసుకున్నదనడానికి పరాకాష్ఠ ఇది. మద్యం తీసుకుంటూ మనస్సుకు ముసుగేసుకుని తప్పొప్పుల గీత చెరిపేస్తున్నాం. రేపటి తరానికి మంచి చెడు చెప్పే అర్హత కోల్పోతున్నాం. 

మనసును జోకొట్టే మద్య౦ మాని మానసికానందాన్ని కలిగించే చిన్నపని ఎంత చిన్నపనైనా సరే చేస్తే అది ఎంతటి తృప్తిని ఇస్తుందో కదా!  

ధనం(వృధా చేయడం): సొంతలాభం కొంతమాని పొరుగువారికి సాయపడదాం. సంపాదించిన దానికన్నాఎక్కువ తృప్తి కలుగుతుంది. 

పరుషంగా మాట్లాడడం(దుర్భాష): అన్యాయాన్నిఎదిరించే ప్రతిసారి మన వాక్కు ఇలానే ఉండాలి. 

పరుషంగా దండించడం(క్రౌర్యం): తప్పొప్పులకు సరైన నిర్వచనం ఇచ్చి, తప్పు చేసిన వారికి ఇది తప్పదంటే ఇక దండిచాల్సిన అవసరం రాదేమో.

ఆచరించడం సాధ్యం కానిపని అంటున్నారా... మన బ్రతుకు మరో క్షణంలో ముగిసిందనుకోండి, సమస్యే లేదు. ఏ పక్షవతమో వచ్చి మంచంమీద రోజులు గడపవలసి వచ్చినప్పుడు మనం చేసిన తప్పులకు మన మనసే పెద్ద శిక్ష వేస్తుంది. బ్రతికుండగానే నరకం చూపిస్తుంది. దిద్దుకోవడానికి కాలం వెనక్కి తిరగదుగా...

మనస్సు కోతిలాంటిదట. నిరంతరం జ్ఞానబోధ చేస్తూ దారిలో పెట్టుకోవాలి. మొదటి ఇరవై సంవత్సరాలు సంపాదించడానికి అవసరమైన చదువుల కోసం వినియోగిస్తున్నాం. ఆ తరువాత జీవనప్రవాహంలో కలసి ఆ వేగానికి కొట్టుకుపోతున్నాం. ఫలితం...గొర్రెదాటు వ్యవహారం. ఎవరేది చేస్తే అదే ఆచరించడం, అదే మంచిదనుకోవడం. నేడు ఏ ఇల్లు చూసినా అందంగా అలంకారాలు కనిపిస్తున్నాయి కానీ, మానసిన వికాసానికి అవసరమైన పుస్తకం ఒక్కటి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించడంలేదు. "పుస్తకం లేని ఇల్లు కిటికీ లేని గది వంటిది"ట. 

మనం చేసిందే గొప్ప అని వాదనలకు దిగుతాం.... ఓ పక్క అనుమానం పీడిస్తూనే వుంటుంది. ఆ అనుమానన్ని నివృతి చేసుకోవడానికో, మెప్పుదల కోసమో ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్ వర్క్ లకు అలవాటు పడుతున్నాం. మనం ఏదో నలుగురికి చెప్పాలనో మన గొప్ప చూపాలనో ఏదో ఓ మాట అంటాం, నలుగురు లైక్ కొడతారు. మనం పెట్టింది చదివారో లేదో, చూసారో లేదో కూడా తెలియదు. లైక్ లు చూసి పొంగిపోతాం. మన మనసును సమాధాన పరచడానికీ, జోకొట్టడానికీ కదూ ఈ వ్యవహారాలన్నీ. ..

ఒక చిన్న పనిచేసి నలుగురికోసమే బ్రతుకుతున్నట్లుగా కబుర్లు చెపుతాం. పేపర్లో ఫోటో వేయించుకుంటాం. ఫేస్ బుక్ లో అప్డేట్స్ పెడతాం. అందుకు అవసరమైతే ఒక హత్యనో, మానభంగాన్నో ఆయుధంగా వాడుకుంటాం. మనల్ని మనం ఎంత అవమానించుకుంటున్నామో అర్ధరాత్రి నిశ్శబ్దంలో  అర్ధమౌతూనే ఉంటుంది. 

యుద్ధం చేద్దాం నిజమైన ఆనందం కోసం...నికార్సయిన జీవితం కోసం. 

36 comments:

 1. crisp n right on the face !!

  ReplyDelete
  Replies
  1. సూటిగా చెప్తేనే సరిగ్గా అర్ధమౌతుందనీ...ధన్యవాదాలు వినీల గారు.

   Delete
 2. నాది లైక్ ఒక్కటే కాదు జ్యోతిర్మయి గారు...చదివాను కూడా.. గమనించాలని మనవి..:)
  ప్రస్తుత పరిస్థితులపై మీ ఆవేదన, ఆక్రోశం అర్థవంతమైనవి.

  ReplyDelete
  Replies
  1. సురేష్ గారు గమనిచానండి :) ముసుగు వీరులు ఎక్కువైపోతున్నారు. కొన్నాళ్ళకు వారు తమను తామే మర్చిపోతారేమో...ధన్యవాదాలు.

   Delete
 3. చాలా బాగా చెప్పారు జ్యోతి గారూ...ఇది చదవగానే నాకు గుర్తొచ్చిన మొదటి పాట "సిరివెన్నెల" గారి "నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని నిప్పుతోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని".

  మీరు చెప్పినవి గాక ఇంకొక భయంకరమైన వ్యసనం ఉందండోయ్.. గాస్సిప్స్ గాలి కబుర్లు. ఇవి ఎవరికీ లాభం చేయకపోగా ఎన్నో రిలేషన్స్ దీనివల్ల కట్ అయిపొతున్నాయి.

  ReplyDelete
  Replies
  1. హై హై నాయక గారు సిరివెన్నెల గారిక్కూడా ఆ పాట రాసినప్పుడు ఇదే బాధా, అవేశమూ వుండి వుంటుంది.
   ఈ వ్యసనాలను సప్తవ్యసనాలు అంటారట. ఇక గాలివార్తల గురించి మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళూ నిజం. ధన్యవాదాలు.

   Delete
 4. చాలా బాగా రాసారండి.ఇది మిమ్ములను జోకోట్టడానికి కాదు.
  నిజమే-పుస్తకం లేని ఇల్లు కిటికీ లేని గదట కాదు,గదే!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు హరిగారు.

   Delete
 5. Replies
  1. ధన్యవాదాలు హరీష్ గారు.

   Delete
 6. Replies
  1. మీకు నచ్చిందంటే ఖచ్చితంగా ఇది మంచి పోస్టే. ధన్యవాదాలు వనజ గారు.

   Delete
 7. మీరు రాసిన దానిలో సెకండ్ పార్ట్ అక్షర సత్యం.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు కిషోర్ గారు.

   Delete
 8. *మానసిక వికాసానికి అవసరమైన పుస్తకం ఒక్కటి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించటంలేదు*

  ఆ మధ్య బ్రిటన్ లో చాలా రోజులు అల్లర్లు జరిగాయి. అల్లరిమూక మార్కేట్ లో ఉండే ప్రతి షాప్ ను పగలగొట్టి అందులోని వస్తువులను పట్టుకెళ్లిపోయారు. కాని ఆ అల్లరి మూకలు ఒక్క షాపు జోళికి మాత్రం వెళ్లలేదు. అదే పుస్తకాల షాప్!

  ReplyDelete
  Replies
  1. మా అమ్మ చెపుతుండే వారు "దొంగలు దోచుకోలేని ఆస్తి విద్య ఒక్కటే అని". అది గుర్తొచ్చింది. ధన్యవాదాలు శ్రీరాం గారు.

   Delete
 9. చాలా బాగా చెప్పారు .

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు అజ్ఞాత గారు.

   Delete
 10. చాలా బాగా చెప్పారు .

  ReplyDelete
 11. చాలా బాగా చెప్పారండి... అన్నీ ఆచరణాత్మకంగా ఉన్నాయి. రాత్రి నిద్రపోయే ముందు మనం ఆ రోజు ఏమి చేసామో ఆలోచించుకుంటే రేపు మరలా అటువంటి పనులు చెడు పనులు చెయ్యకుండా ఉంటాము. మంచి ఆలోచన కలిగించారు.. ధన్యవాదములు.

  ReplyDelete
  Replies
  1. చక్కని సూచన. ధన్యవాదాలు జగదీష్ గారు.

   Delete
 12. @ జ్యోతిర్మయి గారు చాలా చక్కగా చెప్పారండి !
  పైన హై హై నాయక గారితో వంద శాతం అంగీకరిస్తున్నా !

  ReplyDelete
  Replies
  1. నేనూ కూడా శ్రవ్య గారు. ధన్యవాదాలు.

   Delete
 13. మంచి పోస్ట్... మారుతూ మార్చటానికి ప్రయత్నించుదాం..

  ReplyDelete
  Replies
  1. మారుతూ మార్చడం..చక్కగా చెప్పారు. ధన్యవాదాలు ప్రిన్స్ గారు.

   Delete
 14. నర్మగర్భంగా రాసారు మేడం ఈ టపా...

  ReplyDelete
  Replies
  1. నవజీవన్ గారు సూటిగా రాశాననుకున్ననే... ధన్యవాదాలు.

   Delete
 15. *నా ప్రత్యేకత…..ఎముందబ్బా, పెద్దలడిగాక చెప్పకపోవడం పద్ధతి కాదే….పాఠకులే సాయం చెయ్యాలి.*

  నెల్లూరోళ్ల యాస తో రాసిన టపాలను చదివి ఆనందించాను. బ్లాగులో నెల్లూరి యాసను రాసిన వారు మీరేనేమో!

  Sri

  ReplyDelete
  Replies
  1. తెలియదండి. బాల్యం గుర్తొచ్చినప్పుడల్లా భాష మారిపోతూ వుంటుంది. ధన్యవాదాలు శ్రీ గారు.

   Delete
  2. నాకిప్పటికి వెలిగింది. మీరు ముఖాముఖి గురించి చెప్పారు కదూ. ఇంతకు ముందు ఎవరైనా వ్రాశారేమో తెలియదు. థాంక్యు.

   Delete
 16. Rojoo mee blog chudatam oka vyasana mypoindi.

  ReplyDelete
  Replies
  1. సుబ్రహ్మణ్యం గారూ ఇది సప్త వ్యసనాలలోకి రాదు లెండి. మీరు నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. :-) ధన్యవాదాలు.

   Delete
 17. అన్నీ మన ఎదుట కనపడే కఠిక నిజాలే. అందులో కొన్నిటికైనా నిత్యమూ ప్రతి ఒక్కరూ బానిస కాక తప్పటంలేదు.
  పుస్తకం లేని ఇల్లు కిటికీ లేని గదివంటిది...రాను రానూ జీవితాలు గదులే లేని ఇళ్ళయిపోతున్నాయి.
  మంచి పోస్ట్!

  ReplyDelete
  Replies
  1. చిన్నిఆశ గారు కుదురుగా కూర్చుని ఆలోచించే సమయమూ, ఆలోచన కలిగించే పరిసరాలు ఉండడం లేదండి. ధన్యవాదాలు.

   Delete
 18. వర్తమానాన్ని వాస్తవికతతో వివరించారు.చక్కటి వ్యాసం.ఒంగోలు నందు జరిగిన తెలుగు సౌరభం గురించి వ్రాసాను నా బ్లాగ్ లో గమనించగలరు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు రవిశేఖర్ గారు. ఆ వ్యాసం చూశానండి.

   Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.