Monday, April 30, 2012

మువ్వల పట్టీలు

      పసిమొగ్గలతో, పువ్వులతో హాయిగా నవ్వుతున్న ఈ సన్నజాజికి తెలుసా నన్నిక రోజూ చూడలేదని. ఆ పసిమొగ్గలు వికసి౦చగనే నాకోసం వెతుకుతాయి కాబోలు! రేపటి నుండి ఈ తీగకు రోజూ నీళ్లెవరు పోస్తారో...మేడ మీదకు వాలిన కొబ్బరాకు నా మాట వినిపించక బెంగ పెట్టుకోదూ... బంతి మొక్క కొత్త చివురులు తొడుగుతోంది, ఆకులు వచ్చే సమయానికి చూడడానికి నేను౦డను కదూ!

     ము౦గిట వేసిన ముగ్గు ఈ రోజెందుకో కలత పడినట్లుంది. ఎన్నడూ లేనిది గాలి కూడా జాలిగా వీస్తోంది. మాలతీమాధవం పక్కనున్న ఈ మెట్టుమీద కూర్చుని ఎన్నెన్ని పుస్తకాలు చదివానో! నేను లేక ఇది ఒంటరిదైపోతుందా... వీధి చివర కానుగ చెట్టు బస్సు రాగానే నన్ను పిలుస్తుంది కాబోలు..నేనిక రానని తెలియదు పాపం.

       ఇంటికి రాగానే నన్ను పిలిచే నాన్న ఇకనుండి ఎవరిని పిలుస్తారు? కబుర్లెవరితో చెపుతారు? రాత్రి భోజనాలు వడ్డించేప్పుడు మంచి నీళ్లెవరు పెడతారు? రేపట్నుండి నాన్నమ్మ తన కాళ్ళద్దాలు, తనే వెతుక్కుంటుంది కాబోలు! ఎప్పుడూ నాతో పోట్లాడే తమ్ముడు ఈ మధ్య నాతో మునుపటిలా ఉండడం లేదు. ఒక్కసారి పోట్లాడితే బావుణ్ణు. 
కుయ్యి, కుయ్యి మంటూ నా చుట్టూ తిరుగే ఈ కుక్కపిల్ల కొన్నాళ్ళకు నన్ను మరచిపోతుందేమో..

     ఇంటి ముందున్న ఆ వేపచెట్టుకే, అట్లతద్దినాడు ఊయల వేసి ఊగింది. పెరట్లో ఆ చివరగా పందిరిమీద పూసిన మల్లెలతోనే కదూ అమ్మ నాకు ప్రతి
వేసవిలో పూలజడలల్లింది. తొలిసారి ఓణీ వేసుకున్నరోజు, ఈ మందారమొక్కే నాతో ఫోటో కావాలని సరదా పడింది. ఆ జ్ఞాపకం గోడమీద బొమ్మై నిలిచింది కూడానూ. రోజూ పూజకోసం పువ్వులిచ్చే నందివర్ధన౦ ఈవేళ ఒక్క పువ్వైనా పూయలేదే! నేను వెళుతున్నానని కోపమేమో. 

      రేపు తెల్లవారి తలుపులు తెరువగానే రోజూ కనిపించే ఈ తురాయిచెట్టు, కువకువలాడే బుల్లిపిట్టలు, సైకిలు మీద నుంచి పేపర్ వేసే అబ్బాయి, పూల బుట్టతో ఇల్లిల్లూ తిరిగే రంగమ్మ నాకిక కనిపించరు కదూ. ఆకాశంలో మబ్బెక్కడా కనిపించలేదు కానీ, వర్షం మాత్రం ధారగా చెంపపై కురుస్తోంది. ఈ ముసురు ఈ వేళ ఆగేలా లేదు.

     ఇప్పటి వరకూ నాతో గడిపిన రోజులన్నీ వీడ్కోలిచ్చి గత౦లోకి జారిపోనున్నాయి. తెలియని లోకంలోకి, కొత్త జీవితంలోకి ఈ రాత్రికే నా ప్రయాణం. అన్నం తినని రోజున కేకలు వేసేవాళ్ళు ఉండరు. 'మా ఇంటి మహలక్ష్మి' అంటూ మురిసి మెటికెలు విరిచే వారు కనిపించరు. ఏ వేళ ఇంటికొచ్చినా నాకోసం వెతికే చల్లని చూపులు నన్ను చేరవిక.

      ఇక నుండి ఈ ఇల్లూ, నా వాళ్ళూ అంతా నాకు పరాయేనా. నాది అనుకున్న నా ప్రంపంచం, కాదని చెప్తున్న పెద్దరికం. ఏది నిజమో ఏది భ్రమో తెలియని అయోమయం. పక్షం క్రితమే నా మెడలో చేరిన మాంగల్యం ఈ వేళ మరీ బరువుగా ఉంది. ఓ మంత్రదండంలా నా సొంతమైన ప్రంపంచాన్ని పరాయిగా మార్చేసింది. అయినా ఎందుకో మరి కోపం రావడంలేదు. జీవితాంతం తోడుంటానని భరోసా ఇచ్చినందుకా, కష్టమైనా సుఖమైనా ఇకనుంచి ఇద్దరిదీ అని పలికినందుకా! వెండి మెట్టెలతో పాటు 
మువ్వల పట్టీలు కూడా భారంగా పుట్టింటి గడప దాటాయి.


Wednesday, April 25, 2012

ఎందరో మహానుభావులు

        మా ఊరిలో కొత్త పత్రిక ప్రచురణ గురించి చెప్పాను కదా.. మేము ప్రచురించిన రెండవ పత్రిక ఇది. తొలి పత్రిక పోయిన ఉగాదికి ప్రచురించాము. ఆ పత్రికావిష్కరణ శ్రీ పెమ్మరాజు వేణుగోపాలరావు గారి చేతుల మీదుగా జరిగింది. ఈ పత్రికలే కాక మరో నాలుగు వార్తాపత్రికలు కూడా చేశాము కాని, వాటిని ముద్రించలేదు.

       పత్రిక ప్రారంభించడం వెనుక కథ చెప్పాలి మీకు. పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నాము కదా, వారికి ఏవిధంగా స్ఫూర్తి నివ్వాలి అని ఆలోచించాము. పిల్లలు పెద్దలను చూసి అనుకరణతో చాలా విషయాలు నేర్చుకుంటారు. మరి పిల్లలు చూస్తుండగా పెద్దలెప్పుడూ తెలుగు చదవడం, రాయడం జరగడం లేదు. 'ఏ విధంగా పెద్దవాళ్ళను తెలుగు చదవడానికి ప్రోత్సహిచాలా' అన్న ఆలోచనలో ఉండగనే మా ఊరిలో పిక్నిక్ జరిగింది. ఆ సమయంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో యాదృచ్చికంగా పత్రిక గురించిన చర్చ వచ్చింది. మా తెలుగు అసోసియేషన్ వారు, ఎవరైనా పత్రిక నడపడానికి స్వచ్ఛందంగా ము౦దుకు వచ్చే పక్షంలో పత్రిక, లేక వార్తా పత్రిక మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అప్పుడు ఈ పత్రిక చేయడానికి శ్రీవారు ముందుకు రావడం జరిగింది. మనం ఏదైనా తలచుకుంటే దైవ సహాయం ఎలా లభ్యమవుతుందో ఆ సంఘటన ద్వారా తెలిసింది. 

      ఒక  పత్రిక రూపుదిద్దుకోవాలంటే ఎన్నిన్ని అంశాలు౦టాయో అనుభవపూర్వకంగా అవగతమయ్యింది. ఏ కథలు కావాలి, ఎన్ని కవితలుండాలి, వ్యాసాలు, పిల్లల కోసం ప్రత్యేకమైన  కథ...ఈ విషయాలన్నీ సమగ్రంగా పరిశీలించి కావలసినవి మా ఊరి ప్రజలు రాసేలా ప్రోత్సహించాం. మొదట్లో ఒకరో ఇద్దరో రాసి పంపించారు. ఇప్పుడు మెల్లగా ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. వాటిని పత్రికలో ఏయే పేజీలలో వచ్చేలా చూడాలనేది రెండో అంశం అదే 'లేఅవుట్' అంటే డిజైన్. మిగిలినది అచ్చుతప్పులు, ఐదారు సార్లు సరిచూసినా కూడా మళ్ళీ మళ్ళీ కనిపించే
అచ్చుతప్పులు మా ఎడిటోరియల్ బోర్డ్ సమర్ధవంతంగా సరిదిద్దారు.

      మన సంస్కృతి, సాంప్రదాయాలకు సంబధించిన ఎన్నో వ్యాసాలు, కథలు, కవితలు, పిల్లల కోసం ప్రత్యేకమైన కథ, ఇలా ఎన్నో అంశాలు ఈ పత్రికలో చోటుచేసుకున్నాయి. ఈ పత్రిక ఇప్పుడు మా ఊరి తెలుగువారి ఇళ్ళల్లో కాఫీ టేబుల్ మీద ఉండడం, వారందరూ కూడా చదవడం జరుగుతోంది. వాహిని పత్రికను
 మీతో పంచుకోవాలని బ్లాగ్ లో పెడుతున్నాను. మీ సలహాలు, సూచనలు పత్రికాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి.

     ఒక పత్రిక వెనుక ఇంత కథ ఉందా అనిపించింది. ఏడాదికి రెండు, మూడు పత్రికలకే ఇంత పని ఉంటే స్వలాభాపేక్ష లేకుండా నెలకో పత్రిక వేస్తున్న సంపాదకుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఇతర దేశాలలోవు౦డి సాహిత్యసేవ చేస్తున్న పత్రికా సంపాదకులకూ, వారికి తమ సహకారాన్నందిస్తున్నకార్యకర్తలకూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 



Monday, April 16, 2012

మూడు హాళ్ళు...ముప్ఫై ఆరు సినిమాలు

     మధ్యాహ్నం అన్న౦ తిన్నాక నేనూ, అక్కా వరండాలో మెట్ల మీద కూర్చున్నాం. ఇంతకూ అక్కెవరో చెప్పలేదు కదూ.. తాతయ్యకు తెలిసినవాళ్లమ్మాయి, వాళ్ళ ఊరిలో కాలేజి లేదట. అక్కేమో "నేనింకా చదువుకుంటానంటే", వాళ్ళవాళ్ళేమో "చదివింది జాల్లే నువ్వేం ఉద్యోగాల్జేసి ఊళ్లేలబళ్లా, ఇంట్లోనే వుండి, ఆ పొయ్యికాడ కాస్త ఎగదోస్తా ఉండు, మంచి సంబంధం జూసి పెళ్లి జేస్తాం" అన్నారంట. పాపం అక్కకేమో డాక్టర్ అవ్వాలని కోరికట, అన్నం నీళ్ళు మాని ఏడుస్తూ వుంటే వాళ్ళ అన్నయ్య ఏదో పనుండి నెల్లూరికి వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈ విషయం చెప్పాడంట.

     అప్పుడు తాతయ్య, "చదువు మీద అంత శ్రద్ద వున్న అమ్మాయిని మాన్పి౦చొద్దు నారాయణా" అన్నారంట. దానికి వాళ్ళ అన్నయ్య, "ఆడపిల్లకు చదువెందుకులే పెదనాయనా, పైగా మా ఊళ్ళో కాలేజీ లాకపోయ పక్కూరికాలేజీకి రోజూ రెండు మైళ్ళు నడిచిపోవాలి. ఆ కాలేజీలో పోకిరీ పిలకాయలంతా వుంటారు, ఆడపిల్లని అ౦దూరం పంపేదెట్టా" అన్నాడంట. అప్పుడు అమ్మమ్మ "నెల్లూరికి దీసకరా నారాయణా డికేడబ్యూ కాలేజీలో జేర్పిద్దాము, అది ఆడపిలకాయల కాలేజీయేలే" అని చెప్పిందట". "ఆస్టల్లో ఉంచాలంటే శానా కర్చవుతాదిలేమ్మా. మంచి సంబందం ఉంటే చూడండి పెళ్లి చేద్దాము" అని మనసులో మాట చెప్పాడంట. "ఆస్టల్లో బెట్టడం ఎందుకా.. మా ఇంట్లో ఉంటదిలే నాయనా" అన్నదటమ్మమ్మ. "ఎందుకులేమ్మా మీకు ఇబ్బందా" అన్నాడట అన్నయ్య. "ఇబ్బందేముందా మా పిల్లకాయల్తో పాటే వుంటది, కావాల్సినంత చదువుకోనీ" అన్నదట. ఆ విధంగా ఆ అక్క కూడా మా అమ్మమ్మకి ఇంకో కూతురైపోయింది.

     వరండాలో కూర్చున్నామా, ఎండ మండిపోతూ ఉంది. వీధీలో అప్పుడో రిక్షా, ఇప్పుడో రిక్షా మాత్రం వెళుతూ వున్నాయి, రిక్షాకి గూడు ఉండడం వల్ల  లోపలున్నదెవరో కనిపించడం లేదు. ఇంతలో లోపలనుండి పిన్ని పైట చెంగు బొడ్లో దోపుకు౦టూ వచ్చి స్థంబానికి ఆనుకుని కూర్చుంది. "అక్కా, కావేరిలో చిరంజీవి సినిమా ఆడతందట పోదామా" పిన్నినడిగింది అక్క. "నిన్ననే సినిమా జూసొస్తిమే, అమ్మొప్పుకుంటదా?" పిన్ని సందేహం. "జ్యోతినడగమందాం, అప్పుడయితే అమ్మేమ౦దు." అక్క సలహా. "నేనిప్పుడే వెళ్లి అమ్మమ్మనడిగొస్తా" అంటూ చెంగున లేచాను. పిన్ని చెయ్యిపట్టుకుని ఆపి, "ఈ వారం అప్పుడే రెండు సినిమాలు జూశాం. ఇప్పుడడిగితే అమ్మ సినిమా గినిమా యేంలా, గమ్మున గూసోండి. సినిమా లెక్కువైపోతున్నయ్ మీకు" అని అరుస్తుంది. రేపు పనంతా చేసి అప్పుడడుగుదాం, మద్యాన్నం మాట్నీకి వెళ్ళొచ్చు" అని ఉపాయం చెప్పింది.

      ఇంతలో "ఐస్, పాలైస్...ఐస్, పాలైస్...చల్లైస్" అని అరుపులు వినిపించాయి. రయ్యిన లోపలకు పరిగెత్తాను. అమ్మమ్మ చాపమీద పడుకుని 'ఆంధ్రజ్యోతి' పత్రిక చదువుతోంది. "అమ్మమ్మా..అమ్మమ్మా" పిలిచాను. "ఏమ్మా" అడిగింది, చుదువుతున్న దగ్గర మధ్యలో వేలు పెట్టి, పత్రికను మొహం మీదనుండి తీస్తూ. "ఐస్" అడిగాను. "పోపుల డబ్బాలో ముప్పావలా ఉంది, ఓ పావలా తీసుకొని కొనుక్కో౦డి అంది. కొట్టుగది దాటి వంటి౦ట్లోకి వెళ్లి అరలో ఉన్న పోపులడబ్బా జాగ్రత్తగా కింద పెట్టి మూతతీస్తే మిరపకాయల ప్లేట్ కనిపించింది. అది కూడా తీస్తే మెంతుల గిన్నెలో రెండు పావలాలు, రెండు పదిపైసళ్ళూ, చతురస్రాకారంలో వున్న ఒక ఐదు పైసలు కనిపించాయి. అందులోనుండి పావలా మాత్రం తీసుకుని మళ్ళీ జాగ్రత్తగా డబ్బా పైన పెట్టి, ఒక్కుదటన పరిగెత్తి గడపలు దాటుకుంటూ వరండాలోకి వచ్చాను. అప్పటికే ఐసబ్బాయి వచ్చిమా ఇంటిముందే బండి ఆపి నిలుచున్నాడు. ఆ అబ్బాయికి మేం కొంటావని తెలుసుగా మరీ..

      తెల్లడబ్బా పైన మూత , లాగడానికి వీలుగా డబ్బాకి రెండు కర్రలు, డబ్బా కింద నాలుగు చక్రాలు వున్న ఐసుబండిని చూడగానే నాకు హిమాలయాలను చూసినంత చల్లగా హాయిగా అనిపించింది. బ౦డి దగ్గరకు వెళ్లాను. "యేమైసు కావాల పాపా"అడిగాడు బండెబ్బాయ్. ఒక ద్రాక్షైసు, పాలైసు, సబ్జా ఐసు చెప్పాను. మూత తీసి ఊదా ఐసొకటి, తెల్లైసొకటి, తెల్లగా వుండి చివర సబ్జాలున్న ఐసొకటి ఇచ్చాడు. ఒక చేతిలో రెండు ఐసులు పట్టుకుని రెండో చేతిలో ఉన్న ఐసు చీకుతూ లోపలకు వచ్చి పిన్నివాళ్ళకు ఐసులిచ్చాను. అమ్మమ్మకు కొనలేదు. "పళ్ళు జిల్లుమంటాయమ్మా ఐసు తింటే' అని ఐసు తినదు. కొద్దిసేపటికి చేతిమీదుగా ఐసునీళ్ళు కారడం మొదలెట్టాయి. తలపైకెత్తి నీళ్ళు కిందపడకుండా తిన్నాను, ఎంతసేపని తింటాం మెడ నొప్పిపుట్టి ఐసు మొత్తం కొరుక్కుని తినేశాను.

       ఆ రోజు రాత్రి మిద్దెమీద పడుకున్నప్పుడు రేపటి ప్రణాళిక సిద్దం చేసుకున్నాం. తెల్లవారి నేను లేచేసరికి పక్కన ఎవరూ లేరు, గబగబా పరుపు మడిచేసి కిందకు వెళ్లాను. జలదాట్లో గిన్నెలు తోమేస్తూ పిన్ని, భావిలో నీళ్ళు తోడి గంగాళంలో పోస్తూ అక్క కనిపించారు. నేను మొహం కడుక్కుని వచ్చేసరికి వాళ్ళిద్దరూ గిన్నెలు కడగడం అయిపొయింది. తోమిన గిన్నెలన్నీ వంటి౦ట్లో పెట్టాను. అమ్మమ్మ ఇచ్చిన కాఫీలు అందరికీ ఇచ్చేసి, ఇక ఆ రోజుకి పనిమనిషి రాదని తెలుసుకుని, పెద్దమూట బట్టలు ఉతికేసి, ఇళ్ళూ, వాకిళ్ళూ ఊడ్చేసి, పచ్చడ్లూ, అవీ చేసేసి, మంచి నీళ్ళూ అవీ తెచ్చేసి, అమ్మమ్మ చెప్పిన పన్లూ, చెప్పని పన్లూ అన్నీ చేసి మధ్యాహ్నానికల్లా పనంతా అవగొట్టేశాం. బుద్దిగా అన్నాలు తినేసి, ఒంటిగంటకల్లా వంటిల్లు కూడా శుభ్రం చేశాం.

      అప్పుడు పిన్ని, "మా మా సినిమాకెల్తాం మా..." అన్నది. "మొన్ననే గదనే అదేదో సినిమాకు బొయినారు, ఇట్టా రోజు సినిమా అంటే మీ బాబరస్తాడు" అన్నది. "పనంతా జేశా౦ గదమా ఇంక వారం దాకా అడగం మా, చిర౦జీవి సినిమా మా" బతిమలాడింది పిన్ని. "నా దగ్గర ఐదు రూపాయలే ఉండాయి, మీకు టికెట్లకు చాలవు" కొద్దిగా కరిగింది అమ్మమ్మ. "మిగతా డబ్బులు నాదగ్గరున్నయ్ మా" అని అమ్మమ్మతో అని "పాపా బట్టలు మార్చుకు౦దా౦రా" అని హడావిడిగా లోపలకు వెళ్ళింది పిన్ని. అక్కడే ఉంటే మా దగ్గర ఎన్ని డబ్బులు వున్నాయో అమ్మమ్మకు చెప్పేస్తానని పిన్ని భయం. అయిదంటే అయిదే నిముషాలలో రెడీ అయి, "మా పొయ్యొస్తాం" అమ్మమ్మతో చెప్పింది అక్క. "కాస్త తాలండి ఏదైనా రిక్షా వస్తుందేమో జూస్తా ఉండండి. ఎండ మండిపోతా ఉంది, ఈ ఎండలో నడిస్తే వడదెబ్బ తగల్తది" హెచ్చరించింది అమ్మమ్మ. "సినిమాకు టైం అవతావుందిమా, వీధి చివర ఎక్కుతాంలే" అని అమ్మమ్మతో చెప్పి బయటపడ్డాం.

      వీధి చివర చెట్టుకింద ఓ రెండు రిక్షాలు ఆగి ఉన్నాయ్. "పిన్నీ రిక్షా ఎక్కుదాం రా" రిక్షా వైపు వెళ్ళబోయాను. పిన్ని ఆపి "మనదగ్గర డబ్బులు లేవు పాపా త్వరగా నడువ్, లేకపోతే టికెట్లు దొరకవు" అంది. ఆ నడి వేసవిలో, మధ్యాహ్నం పూట ఎర్రటి ఎండలో నడుస్తూ, నడుస్తూ ఏమిటిలెండి దాదాపుగా పరిగెడుతూ రైలు పట్టాలు దాటి, మూడు హాళ్ళకెళ్ళి సినిమా చూశాం. 


     ఓ సారి పిన్ని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికని బయలుదేరి నర్తకి థియేటర్ కి వెళ్ళాం. అక్కడికే వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఝామ్మని సినిమా చూశాము, ఈ ఏర్పాట౦తా మా పిన్ని కుట్ర..ఒట్టు నాకస్సలు తెలీదు. సినిమా చూసి ఇంటికొచ్చామా ఇంటి నిండా మనుషులున్నారు. మా పెద్ద పిన్ని, "మంచి వాసనొస్తావుంది యేడా" అనగానే మా పై ప్రాణాలు పైనే పొయ్యాయి. గబగబా లోపలికి పొయ్యి బట్టలు మార్చుకుని వచ్చాం. నర్తకి హాలు ఆ వారమే మొదలయ్యింది. ఎసిలో మంచి వాసన ఒచ్చే పెర్ఫ్యూం ఏదో కలిపినట్లున్నారు, ఇంటికొచ్చాక కూడా మా బట్టలు అవే వాసనలొస్తూ ఉన్నాయి. లీలామోహన్ కెళితే మాత్రం వస్తూ సుండలు కొనుక్కుని ఇంటికొచ్చి తినేవాళ్ళం. మరి వీధిలో తినకూడదు కదా...

     అలా నెల్లూరులో ఎన్నో సినిమాలు చాశాం, ముఖ్యంగా కృష్ణా, కావేరీ, కళ్యాణీలలో. ఆ సినిమాలన్నీ అద్భుతంగా అనిపించేవి. తరవాత్తరత ఎన్నో థియేటర్లలో ఎన్నో సినిమాలు చూసినా అప్పటి ఆ అను
వాలు మాత్రం పదిలంగా వుండిపోయాయి. 

Thursday, April 12, 2012

గుర్..ర్...ర్......

      బ్లాగక్కయ్యలూ, బ్లాగ్ వదినమ్మలూ, చెల్లెమ్మలూ అందరూ కర్రలుచ్చుకొని ఇలా వచ్చెయ్యండొచ్చెయ్యండి.

      ఏమిటీ ఏమీ లేదే అంటున్నారా..మొదలెట్టిన ఓ  నిముష౦ తరువాత వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో మీ చెవులతో మీరే వినండి. పైగా అదిచాలనట్టు చివర్లో ఆ పాటొకటి. 



Tuesday, April 10, 2012

సంబరం అంబరమైన వేళ

      ఇది నిజమా..నిజంగానేనా, నిజంగా నేనేనా...ఏమిటో కొత్తకొత్తగా... వింతగా... కొండంత ఆనంద౦, ఒకింత ఆశ్చర్యంతో కలసి ఈ చిన్న మదిలో సందడి చేస్తోంది..

     ఈ ఆకాశం ఇంత నీలంగా, నిర్మలంగా ఉందేవిటి...వెండి మబ్బులు ముసిముసి నవ్వులు రువ్వుతూ వెళుతున్నట్లుగా లేవూ...చల్లగాలి మరింత హాయిగా వీస్తోంది. రోజూ చూసే ఈ మందారం ఇవాళ మరింత అందంగా పూసిందే...ఆ రావి చెట్టు ఆకులన్నీ వింత నాట్యం చేస్తున్నట్లుగా ఎలా ఊగుతున్నాయో...గోడమీద కాలెండర్ మీదన్న బోసినవ్వుల పసి పాపలను చూస్తోంటే కలిగిన పరవశం, మది దాటి అంబరాన ఇంద్రధనస్సై మెరిసింది.

     ఆ నాటి ఆ ఆనందం విహంగమై ఎగురి విహ౦గలో వాలింది.

నా కవిత ప్రచురించిన విహంగ సంపాదకులకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.



మధురమైన సంగతేదో
ఎదనుచేరి మురిసింది!
ఎన్నడూ ఎరుగనిది
ఏమిటో ఈ భావం!
నన్ను నాకే కొత్తగ చూపే
ఓ వింత యోగం!

నీటిని తనలో నింపుకున్న
నీలిమేఘపు పరవశమా!

చినుకు బరువును మోసే వేళ
ముత్తెపుచిప్ప తన్మయమా!
అంకురాన్ని దాచుకున్న
తొలిబీజపు మైమరుపా!

కొత్త చివురులు తొడుగుతున్న
హరిద్రువపు పులకి౦తా!

మది దాగని భావమొకటి
పెదవిన పువ్వై విరిసింది!

ఒడినిండే సంబరమేదో
అ౦బరమై నిలిచింది!!



Wednesday, April 4, 2012

బుజ్జిపండు...పెరడు...పైప్ మేఘాలు

     "బుజ్జిపండూ రా నాన్నా బాక్ యార్డ్ లోకి వెళ్లి మొక్కలకు నీళ్ళు పెడదాం." అంటూ అమ్మ పెరటి తలుపు తీసింది. బుజ్జిపండు కిచెన్ సెట్ తో ఆడుతున్నవాడల్లా రయ్యిన పరిగెత్తుకొచ్చాడు. మరి పండుకి నీళ్ళంటే ఇష్టం కదా! అమ్మ నీళ్ళు పెట్టినంతసేపూ తను కూడా పైప్ కి అడ్డం వెళ్లి నీళ్ళతో ఆడుకుంటూ బట్టలు తడిపేసుకుంటాడు. అమ్మ కూడా 'ఆడుకోనీలే పాపం' అని పండును ఏమీ అనదు.

     ఆ రోజు బయట ఆకాశం మబ్బు పట్టి బాగా వర్షం వచ్చేలా ఉంది. చల్లగా గాలి కూడా వీస్తోంది. కొత్తగా వేసిన మొక్కలన్నీ ఆనందంగా తలలూపుతున్నాయి. ఓ పక్కగా ఉన్న నారింజ చెట్టుకి కాసిన ఆఖరి కాయలు అక్కడక్కడా తళుక్కుమంటున్నాయి. ఆ చెట్టు మొన్న జనవరిలో ఎన్ని కాయలు కాసిందనీ, తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చినా కూడా చెట్టు నిండా కాయలు ఉండేవి. బుజ్జిపండు, అక్క ఆడుకోవడానికి పెరట్లోకి వచ్చినప్పుడల్లా అమ్మ వాళ్లకు కాయలు కోసి ఒలిచి పెట్టేది. నాన్న, బుజ్జిపండును భుజాల మీద ఎత్తుకుంటే, పండు కాయలు కోసేవాడు. అందుకే పండుకు ఆ చెట్టంటే భలే ఇష్టం.

     పెరట్లో ఈశాన్యం మూలగా ఉన్న 'పింక్ జాస్మిన్' పందిరి అంతా మొగ్గలే. "పండూ ఇవాళ నీళ్ళు పెట్టొద్దులే నాన్నా బాగా వర్షం వచ్చేలా ఉంది. నువ్వు సైకిల్ తో ఆడుకో నేను పూలు కోస్తాను" అంది అమ్మ చెట్టు వైపు వెళ్తూ. ఈ లోగా అక్క కూడా హోం వర్క్ పూర్తి చేసుకుని పెరట్లోకి వచ్చింది. "వచ్చం వచ్చు౦దా" అనుకుని మేఘాల వైపు ఆశ్చర్యంగా చూశాడు బుజ్జిపండు. ఆకాశం కొత్తగా కనిపించింది. తరువాత అమ్మ వెనకాలే పందిరి దగ్గరకు వెళ్లాడు. అమ్మ చిన్న గిన్నెలోకి మొగ్గలు కోస్తూ ఉంది. పండుకు కూడా కోయాలని ఉంది కాని పందిరి మరీ ఎత్తుగా ఉంది. "అమ్మా నన్నెత్తుకో నేనూ కోత్తాను" అన్నాడు పండు. అమ్మ బాబుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఏ మొగ్గలు కోయాలో చెప్పింది. పండు ఒక్క మొగ్గ పట్టుకుని లాగగానే పసిమొగ్గలు కూడా తెగిపోయాయి. అమ్మకసలే పూలంటే ప్రాణం. పండును కిందకు దించి "పండూ నువ్వు అక్కతో ఆడుకో" అని పండుతో  చెప్పి"అమ్మలూ, పండును పిలువమ్మా" అని అక్కకు చెప్పింది.

     "పండూ ఇలా రా సైకిల్ ఆట ఆడుకుందాం" అని పిలిచింది అక్క. పండు దగ్గరకు రాగానే " నీ సైకిల్ లాన్ లోకి రాకూడదు, నా సైకిల్ ఫ్లోర్ మీదకు రానివ్వను" అని చెప్పి సైకిల్ మీద రౌండ్ గా తిరగడం మొదలెట్టింది. పండుకు అక్కని అలా చూడడం చాలా ఇష్టం. అమ్మ పూలు కోసినంతసేపు ఇద్దరూ అలా ఆడుకున్నారు. పూలు కోయడం అవగానే అమ్మ పూలగిన్నె గట్టు మీద పెట్టి కూరగాయల మొక్కల దగ్గరకు వెళ్ళింది. పండూ, అక్క కూడా అమ్మ దగ్గరకు వెళ్ళారు. వాళ్ళిద్దరికీ అమ్మతో కలసి కూరగాలయాలు కోయడం చాలా సరదా. గోంగూర ఆకులు తుంచి ఒక పెద్ద గిన్నెలో వేశారు. అందులోనే రెండు టమాటోలు, వంకాయలు, పచ్చి మిరపకాయలు, ఓ నాలుగు బెండకాయలు కోసి వేశారు. అమ్మ పండుకు బీన్స్ కోసి ఇస్తే పండు చేతిలో పట్టుకుని తింటూ చూస్తున్నాడు. అసలు అమ్మ పెరట్లోకి రాకపోయినా పండు బీన్స్ కోసుకుని తినేస్తూ ఉంటాడు. అక్కకి మాత్రం అలా పచ్చివి తినడం ఇష్టం ఉండదు. అక్కకి కారెట్లిష్టం. మొన్న ఫాల్ లో తాతయ్య వచ్చినప్పుడు కారెట్ చెట్లు తవ్వి కారెట్లు బకెట్లో వేసి మట్టంతా పోయేలా బాగా కడిగి అక్కకూ, పండుకూ తినమని ఇచ్చారు.

     ఎగురుతున్న తూనీగను చూస్తూ దాని వెంట సొర చెట్టు దగ్గరకు వెళ్లాడు పండు. తూనీగ వాలినవైపు మోకాళ్ళ మీదకు వంగి చూస్తూ "అమ్మా లుక్ లుక్" అరిచాడు పండు. అక్క పరిగెత్తుకెళ్ళి చూసింది, సొరపాదు దగ్గర  బుల్లి సొరపిందె ముద్దుగా కనిపించింది. నిన్నటి దాకా ఉన్న పువ్వు కనిపించలేదు. అమ్మకూడా వచ్చి ఎన్ని పువ్వులున్నాయో చూసి తీగలను తోటకూర వైపు రాకుండా నేలపైకి మళ్ళించింది. ఆ పక్కనే ఉన్న స్వ్కాష్ ఇవాళ ఓ రెండు పే...ద్ద కాయలు కాసింది. ఈ లోగా చిన్నగా చినుకులు మొదలయ్యాయి. పూవ్వుల గిన్నె, కూరల గిన్నె తీసుకుని అందరూ లోపలకు వెళ్ళారు. అక్కా, పండు ఇద్దరూ గ్లాస్ డోర్ వెనుక వర్షం చూస్తూ నిలబడ్డారు.

     రెండు గ్లాసులలో పాలు తీసుకొచ్చి పిల్లలకిచ్చి, టీ తెచ్చుకోవడానికి లోపలకు వెళ్ళింది 
అమ్మ. "అక్కా, నీకు వచ్చం ఎలా వచ్చుందో తెలుచా?" అడిగాడు పండు పాలు తాగుతూ. "మేఘాలు..." అని అక్క మొదలు పెట్టగానే, "నేను చెప్తా నేను చెప్తా" అని అరిచి పాల గ్లాసు కాఫీ టేబుల్ మీద పెట్టి "చీ(సీ)లో వాతర్, పైప్ మేగాల్లో గుండా ఆకాచంలో ఉన్న మేగాల్లోకి వెల్తుంది. అప్పుడు బయట మనం ఏమైనా పెట్టామనుకో అది క్లౌడ్ మేగాలకు తెలిసిపోతుంది, అవి వచ్చం పడేలా చేత్తాయి." చెప్పాడు పండు. టీ తాగుతూ వాళ్ళ సంభాషణ వింటున్న అమ్మ "ఈ పైప్ మేఘాల గురించి నీకెవరు చెప్పారు పండూ?" అడిగింది. పండు ఒక్క నవ్వు నవ్వి, "నేనే చెప్పుకున్నా" అన్నాడు. 

      అమ్మ, అక్క, పండు వర్షం చూస్తూ కబుర్లు చెప్పుకుంటుండగా నాన్న ఆఫీసు నుండి వచ్చాడు. అమ్మ పైప్ మేఘాల కబుర్లూ, కూరగాయల కబుర్లూ అన్నీ నాన్నకు చెప్పింది. అక్క స్కూల్ విశేషాలు, పండు తోటలో చూసిన తూనీగ కబుర్లు చెప్పాడు.



Wednesday, March 28, 2012

ఒకటే మాట

“ఆ వస్తున్న అమ్మాయిల్లో గులాబిరంగు చుడిదార్ వేసుకున్న అమ్మాయి ఎలా ఉందిరా?” తన్మయంగా చూస్తూ అన్నాడు గోపాలం.
“అటుపక్క నుండి రెండో అమ్మాయే కదూ! ఆ అమ్మాయెవరో నీకు తెలుసా?” పరీక్షగా చూస్తూ అన్నాడు మోహన్.
“లేదురా నెల రోజులుగా చూస్తున్నాను, నాకు విపరీతంగా నచ్చేసింది” అన్నాడు సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ. అమ్మాయిలు దగ్గరకొచ్చారు. గులాబిరంగు డ్రెస్ అమ్మాయి క్రీగంట చూస్తూ వెళ్ళిపోయింది.
“ఈ అమ్మాయి మా వీధిలోకి కొత్తగా వచ్చిన అమ్మాయిలా ఉందే” ఆలోచిస్తూ మోహన్.
“బాబ్బాబూ కనుక్కోరా ప్లీజ్...ప్లీజ్...ప్లీజ్”. గోపాలం అభ్యర్ధన.
“కనుక్కు౦టాలే నువ్వంత బతిమాలాలా” అభయమిచ్చి మూడురోజుల తరువాత పూర్తి వివరాలతో వచ్చాడు మోహన్.
“ఆ అమ్మాయి పేరు రాధ, వాళ్ళ నాన్న బ్యాంకు లో మేనేజర్, వాళ్ళకు ఒక్కతే కూతురు, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది” అంటూ ఏక బిగిన చెప్పాడు.
మూడు నెలలు గడిచాయి. ఆ తరువాత  ఏ సినిమా హాలులో చూసినా, పార్కులో చూసినా మన రాధా గోపాలమే..
పెద్దవాళ్ళకీ విషయం తెలిసింది. “టాట్ కుదరదన్నారు”.
రాధ గోపాలం ఇద్దరిదీ ఒకటే మాట “మేం ఇద్దరం ఒకరు లేకుండా మరొకరం ఉండలేం” అని.
ఓ ఏడాది తరువాత పెద్దవాళ్ళే సర్దుకుని ఇద్దరికీ పెళ్లి చేశారు.

                            *              *             *

పెళ్ళైన ఏడాది

“నాకు ఇంట్లో ఎక్కడి వస్తువులక్కడ వుండడం ఇష్టం రాధా” అన్నాడు గోపాలం కాఫీ తాగి కప్పు టీపాయి మీద పెడుతూ..
“నాక్కూడా గోపీ” అంటూ ఆ కప్పు తీసుకెళ్ళి సింక్ లో పెట్టి వచ్చింది రాధ.
“నా సాక్స్ ఎక్కడున్నాయ్ రాధా?” అన్నాడు టీపాయ్ మీద ఓ పక్కగా పెట్టిన పేపర్ చేతిలోకి తీసుకుంటూ..
“ఇదుగో షెల్ఫ్ లోనే ఉన్నాయ్” అంటూ తెచ్చిచ్చింది రాధ.
చదువుతున్న పేపర్ సోఫాలో పెట్టి “నేనాఫీసుకెళ్ళొస్తా రాధా, సాయంత్రం వచ్చేసరికి రెడీగా ఉండు సినిమా కెళదాం” అంటూ గుమ్మ౦ వైపు నడిచాడు. ప్రేమగా వెనుకే వెళ్ళి తలుపు గడియ వేసి వస్తూ సోఫాలో విడివిడిగా ఉన్న పేపర్లను తీసి టీపాయ్ మీద సర్దిపెట్టింది.
సాయంత్రం గోపాలం వచ్చేసరికి ఇస్త్రీ చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని తయారుగా ఉంది రాధ. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని సినిమా కెళ్ళారు. "చిలిపికనుల తీయని చెలికాడా..నీలి కురుల వన్నెల జవరాలా" అని పాటలు కూడా పాడుకున్నారు.

రెండేళ్ళ తరువాత

“నాకు ఇంట్లో ఎక్కడి వస్తువులక్కడ వుండడం ఇష్టమని నీకు తెలుసుకదా రాధా” హల్లో చుట్టూ పడి ఉన్న బొమ్మలు, వస్తువులను చూస్తూ అన్నాడు గోపాలం.
“బాబిగాడు ఒక్క క్షణం ఊరుకోడు కదా, ఎన్ని సార్లు సర్దినా మళ్ళీ అన్నీ తెచ్చి ఇంటి మధ్యలో పడేస్తాడు” అంటూ హడావిడిగా సర్దేసింది రాధ.
“నా సాక్స్ తెచ్చివ్వు రాధా” అన్నాడు టీపాయ్ మీద ఓ పక్కగా పెట్టిన పేపర్ చేతి లోకి తీసుకుంటూ..
పిల్లాడికి ఇడ్లీ పెడుతున్న రాధ ప్లేట్ పక్కన పెట్టి వెంటనే తెచ్చిచ్చింది.
గోపాలం చదువుతున్న పేపర్ సోఫాలో పెట్టి “నేనాఫీసు కెళ్ళొస్తా రాధా, సాయంత్రం వచ్చేసరికి రెడీగా ఉండు సినిమా కెళదాం” అంటూ గుమ్మ౦ వైపు నడిచాడు. అతని వెనుకే వెళ్ళి తలుపు గడియ వేసి వచ్చేసరికి పది పేపర్లను ఇరవై ముక్కలు చేశాడు చంటాడు.
సాయంత్రం వచ్చేసరికి నలిగిన చీరతో రాధ, బట్టల్లేకుండా చంటాడు..
“ఇంకా తయారవలేదా?” కొంచెం అసహనంగా గోపాలం..
“పిల్లాణ్ణి తయారు చేసి నేను చీర కట్టుకునేంతలో వీడు బట్టలు పాడుచేసుకున్నాడు. వీడికి ఒళ్ళంతా కడిగి ఇదుగో ఇప్పుడే వేరే బట్టలు మారుస్తున్నాను” అంది రాధ.
“సినిమా టికెట్లు దొరుకుతాయో లేదో” గోపాలం గొంతులో కనీ కనిపించని కోపం. పది నిముషాల తరువాత ఇద్దరూ చంటాడితో కలసి సినిమా కెళ్ళారు.

ఐదేళ్ళ తరువాత

“ఎన్నిసార్లు చెప్పాలి రాధా ఎక్కడి వస్తువులక్కడ పెట్టమని” చిందర వందరగా ఉన్న హాల్ చూస్తూ కొంచెం హెచ్చు స్థాయిలో అన్నాడు గోపాలం.
“ఉదయం పూట పిల్లలతో క్షణం తీరిక లేదు, కొంచెం అవన్నీ తీసెయ్ గోపీ” అంది రాధ, గదిలో పిల్లాడికి యూనిఫాం వేస్తూ...
హాలంతా కలియచూసి పేపర్ తీసి చదువుతూ “నాకు టైమవుతోంది రాధా, సాక్స్ తీసుకురా”
“చంటిదానికి ఇడ్లీ పెడుతున్నా గదిలో ఉన్నయ్ తీసుకో గోపీ”.
చదువుతున్న పేపర్ విసురుగా సోఫాలో పెట్టి గదిలో కెళ్ళి “ఎక్కడా?”
“అబ్బా ఎందుకలా అరుస్తావ్ గోపీ, నీ బట్టల కింద అరలో”
“నేనాఫీసు కెళ్ళొస్తా, సాయంత్రం వచ్చేసరికి రెడీగా ఉండ౦డి సినిమా కెళదాం” అంటూ విసురుగా గుమ్మ౦ వైపు నడిచాడు.
“అలాగే” వంటగదిలో నుండి ఓ అరుపు.
తలుపు దగ్గరకులాగి వెళ్ళిపోయాడు. తలుపు గడియ వేసి వచ్చేసరికి ఇల్లంతా కిష్కిందకాండ.
సాయంత్రం వచ్చేసరికి స్నానం చేయని ఒళ్ళు, నలిగిన చీరతో రాధ, మురికి బట్టలతో చంటాడు, నిద్రలో చిన్నది.
“ఇంకా తయారవలేదా?” అసహనంతో కూడిన కోపంతో గోపాలం.
“ఉదయం నుండి పని తెమిల్తేగా అసలు” విసుగుతో రాధ.
ఎవరిమీదో తెలియని కోపంతో మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు గోపాలం.


                           *              *             *
                                       
“రాధకు నా మీద ప్రేమ తగ్గిపోయిందిరా మోహన్. ఒకప్పుడు నేనంటే ప్రాణంలా ఉండేది, ఇప్పుడు నేనంటే ఎంత నిర్లక్ష్యమో.” గోపాలం.
“ఏం చెప్పమంటావ్ రాణీ, ఒకప్పుడు గోపాలాన్ని చూస్తే ఈ మనిషికసలు కోపమొస్తుందా అనిపించేది..ఇప్పుడంతా చిర్రుబుర్రులే” రాధ.
ఇప్పుడూ రాధ, గోపాలం ఇద్దరిదీ ఒకటే మాట “జీవితం నరకమైపోయిందనుకో...”.

                    #             #             #
     
       తరువాతేమై౦దంటారా ఏముందీ..స్నేహితులూ బంధువులూ హితోపదేశం చేసి వారికి చేదోడు వాదోడుగా ఉండి, ఆ తరువాత రాధాగోపాలం పిల్లల పెళ్లిళ్లకు కూడా వెళ్ళొచ్చారు. ఇప్పుడు రాధాగోపాలం ఇద్దరూ మిధునంలో అప్పదాసు, బుచ్చిలక్ష్ముల్లా కాలం గడుపుతున్నారు. ఇది ఓ ఇరవైయేళ్ళ క్రితం మాటలెండి.

       ఈ మధ్యే ఇలాటి సమస్యకు రాణి, రాధతో "అసలీ అన్యాయం సహించకే, ఇల్లు చక్కదిద్దేది నువ్వూ, పిల్లల్ని చూసేది నువ్వూ. గోపాలం నీమీద అధారటీ చెలాయిస్తున్నాడు. నువ్వే౦ ఒంటరిగా బ్రతకలేవా" అనీ, మోహన్ గోపాలంతో, "జీవితం నరకం అయ్యాక కలసి బ్రతకడ౦లో అర్ధం లేదు." అనీ చెప్పేశారు. ఇరువైపుల పెద్దలు కూడా "మీ అబ్బాయి ఇలా అంటే మీ అమ్మాయి ఇలా" అనేసుకుని అగ్నిలో ఆజ్యం పోశారు. ఎవరైనా చేదోడు వాడుగా ఉంటే, అంటారా ఈ స్పీడు యుగంలో ఎవరి గోల వారికి సరిపోతుంటే ఇక చేదోడ౦టారేమిటండీ ..ఫలిత౦.. విడాకులూ, విస్తరాకులూ, కోపాలూ, బాధలూ, ఒంటరితనాలూనూ..మధ్యలో పిల్లలు 'కోడి ఒక కోనలో పుంజు ఒక కొనలో పిల్లలేమో తల్లడిల్లె ప్రేమలేని కానలో...

Wednesday, March 21, 2012

ఎండవేళ మధ్యాహ్నం పూట..

      ఓ తాతయ్య చేతిలో సంచితో గుమ్మం బయట చెప్పులు వదిలి లోపలకు వచ్చారు. బెల్ కొట్టడాలు అవీ అప్పుడు లేవుగా. అందుకే సరాసరి లోపలికే వచ్చేశారు. పొద్దున్న నిద్ర లేచి తలుపు తెరిస్తే రాత్రి పడుకోబోయేముందే తలుపు వేయడం. తలుపులు మూసి ఉంచితే ఇంటికి అరిష్టం కదూ! అంతగా రోడ్లోకి కనిపిస్తున్నామనుకుంటే కర్టన్ వేసుకోవాలిగాని. ఆ తాతయ్య లోపలి వచ్చి

"ఏం పాపా ఎప్పుడొచ్చినావా? మీ తాతయ్య ఉండాడా?" అన్నారు.
నాకేమో ఆ వచ్చిన తాతయ్యెవరో గుర్తు రావడంలేదు. అయినా సరే మీరెవరో నాకు తెలీదండీ అనకూడదు, అది మర్యాద కాదు కదా. "తాతయ్య లేరు బయటకెళ్ళారు. కూర్చోండి అమ్మమ్మను పిలుస్తాను." అని చెప్పి అమ్మమ్మను పిలవమని చిట్టిని పంపాను. తాతయ్య సంచి పక్కన పెట్టి అక్కడున్నఆకుపచ్చ గాడ్రెజ్ కుర్చీలో కూర్చున్నారు. ఈలోగా లోపలనుండి అమ్మమ్మ, పిన్ని వచ్చారు.

"ఏవన్నా బావుండావా. ఇప్పుడేనా రావడం?" అని తాతయ్యను కుశలం అడిగి "తాతయ్యకు మంచినీళ్ళు తీస్కరాపో నాయనా" అని నాతో చెప్పింది.
"పొద్దునొచ్చినానమ్మా. ఎంకట్రెడ్డిని ఆసుపత్రిలో జేర్చినారూ, వాడితో వాళ్ళమ్మ కూడా ఆసుపత్రిలో ఉంటే ఆయమ్మకు అన్నమిచ్చి రమ్మని మీ ఒదిన నన్ను బంపినాది, సరే ఎట్టా నెల్లూరొస్తినే రెడ్డిన్జూసి పోదామని ఇటొచ్చినా". అన్నాడు తాతయ్య.
"నాల్రోజుల్నాడు ఎంకట్రెడ్డి రోడ్డుమీద బోతావుంటే చూసినానన్నా .. కాలు కట్టుకునట్టే ఉందే. అబ్బయ్య బాగా తిరగతా ఉండాడు, తగ్గిపోయింది గావాల్ననుకున్నా. మళ్ళీ తిరగబెట్టిందా?" అడిగిందమమ్మ పైట చెంగుతో చేతులు తుడుచుకుంటూ.
"కాలు బాగయినాక కుదురుగేడుంటాడమ్మా. పొద్దులొస్తం కట్ట మీద పడి తిరుగతా వుళ్ళా,  కాస్త ఎండ బెట్ట తగిలినాదంట. రెండ్రోజులు ఆసుపత్రిలో ఉంచి సెలైను గట్టాలంట". అన్నారు. ఈ లోగా నేను స్టీలు గ్లాసు, చెంబుతో నీళ్ళు తెచ్చి పిన్నికిచ్చాను. పిన్ని నీళ్ళు గ్లాసులో పోసి తాతయ్యకిచ్చింది.


    ఆ వెంకటరెడ్డి ఎవరో ఎందుకు కాలికి దెబ్బతగిలిందో అమ్మమ్మ తరువాత చెప్పింది. పొలంలో పని చేస్తుంటే కాలుకి ముల్లు గుచ్చుకు౦దంట. ముల్లేగదా యేంజేస్తు౦దిలే  అని పట్టించుకోలేదంట. అది సెప్టిక్ అయి చీము పట్టి కాలు తీసెయ్యాల్సిన పరిస్థితొస్తే పెద్దాసుపత్రిలో నెల్రోజులు౦చుకుని కాలు బాగు చేశారంట. ఆ వెంకటరెడ్డి ఎప్పుడూ పొలమూ, పొలమూ అని పొలం చుట్టూనే తిరుగుతా ఉంటాడంట.

"మావా అత్తమ్మ బావుందా" అడిగింది పిన్ని. 
"ఆ..ఆ..బావుండాదమ్మా" చెప్పాడు తాతయ్య.
"ఎట్టా నెల్లూరొస్తంటివే ఒదిన్ని దీసుకురాగూడదన్నా చాన్నాళ్ళవలా చూశా" అందమ్మమ్మ.
"మీ ఒదిన కేడ కుదరద్దమ్మా  కొడుకూ కోడలూ చీకట్నేపొలం బోత౦ట్రే, పిలకాయల్తో సరిపోతావుళ్ళా"  అని నీళ్ళు ఇంకొంచెం పొయ్యమన్నట్లుగా గ్లాసు ముందుకు పెట్టాడు. పిన్ని గ్లాసు నిండుగా నీళ్ళు పోసింది.
"ఇదిగో వస్తా, అదిగో వస్తా అంటానే ఉందిగాని రానే రాదుగా మా ఇంటికి" అని నా వైపు చూస్తూ "మనవరాల్ని గుర్తుబట్నావాన్నా" అందమ్మమ్మ.

"నాకెందుకు తెలీదమ్మా మన ఇజ్యమ్మ కూతురు గదా, అచ్చం చిన్నప్పుడిజ్యమ్మను చూసినట్లే వుళ్ళా...ఎప్పుడొచ్చినారు?" అంటూ గ్లాసులో నీళ్ళు ఎత్తి పట్టకుని గటగటా తాగేసి చేతిలో గ్లాసు కుర్చీపక్కగా పెట్టాడు తాతయ్య.
"అమ్మాయోళ్ళు రాలా..సెలవలియ్యంగనే వాళ్ళ తాత బొయ్యి జోతిని తీసుకొచ్చినాడు." అందమ్మమ్మ. కుర్చీ పక్కనున్న గ్లాసు, అమ్మమ్మ చేతిలో చెంబు తీసుకుని అన్నం సరిపోతుందో మళ్ళీ వండాల్నో చూడడానికి లోపలికి వెళ్ళిపోయింది పిన్ని.
"ఇజ్యమ్మకు స్కూల్ సెలవలేగా, రమ్మన్జెప్పలా?"
"జెప్పినావన్నా..రామకిష్టయ్యకు సెలవల్లేవ౦ట. వచ్చేనెల్లో వస్తారంట." అంది.
"ఏం పాపా నేను గుర్తు౦డానా?" అని అడిగాడు తాతయ్య నా వైపు చూస్తూ.

    తల అడ్డంగా నిలువుగా పక్కగా తిప్పాను. గుర్తు పట్టలేదంటే బావుండదు గదా. ఈ పెద్దవాళ్ళు అప్పుడప్పుడు భలే ఇరకాటంలో పెట్టేస్తారు. నా ఇబ్బంది గమనించి "పోయిన ఎండాకాలంగాక అంతకముందు ఎండాకాలమేగా అమ్మాయోళ్ల౦దరూ మీ ఊరికొచ్చి౦ది. అప్పుడే మర్చిపోద్దా" అంది అమ్మమ్మ. ఆ హింటుతో ఆయనెవరో గుర్తొచ్చింది. కోటపాడు తాతయ్య, అంటే తాతయ్య చిన్నప్పటి ఫ్రెండన్నమాట. ఆ తాతయ్య వాళ్ళ ఊళ్లోనే ఎద్దుల బండి మీద ఏటి దగ్గర కెళ్ళింది. చుట్టూ సరుగుడు తోటలు మధ్యలో చిన్న ఏరు పారుతూ ఉంటుంది. ఆ ఏటి ఒడ్డున ఇసుకలో కూచుని ఆడుకున్నాం కూడానూ. ఈ తాతయ్య అప్పుడు తాటికాయలు కొట్టి ఇచ్చాడు.

"అమ్మా రెడ్డెప్పుడొస్తాడు?" అన్నాడు తాతయ్య బుజం మీద ఉన్న టవల్తో మొహం తుడుచుకుంటూ..

"కోర్టు పనిమీద వకీలుకాడికి బోయినాడన్నా, ఈ పాటికి వస్తా వుండాల" అంటూ వీధి వైపు చూసింది.

      సరిగ్గా ఆ సమయానికే గేటు దగ్గర రిక్షా ఆగింది. అందులో నుండి తాతయ్య దిగి రిక్షా అతనికి డబ్బులిచ్చి గేటు తీసుకుని లోపలికి వచ్చి, "ఆ రిక్షా అబ్బాయికి మంచి నీళ్లీ" అని చెప్పారు జనాంతికంగా. తాతయ్య అమ్మమ్మను పిలవాలంటే పేరుండదు మరి. చాలా రోజుల వరకూ అమ్మమ్మకి పేరు౦టుందని నాకూ తెలీదు. అందరూ అమ్మమ్మని అత్తా, ఒదినా, పెద్దమ్మా, నాయనమ్మా, అక్కా ఇలాగేగా పిలుస్తారు.

"ఏం సుబ్బారెడ్డా చానా సేపయిందా వచ్చి" అని అడిగారు తాతయ్య అక్కడే ఉన్న ఇంకో కుర్చీలో కూర్చుంటూ.
"ఇప్పుడేలే ఓ అర్ధగంటయి౦ది వచ్చి. నువ్వేంది కోర్టుకు బోయినావట్నే?" ఆరాగా అడిగాడు ఇంటికొచ్చిన తాతయ్య.
"ఆ వెంకటరాజు పాలెం కాడ రోడ్డు పక్కన మన స్థలం ఆరంకణాలుళ్లా, దాన్ని గవర్నమెంటోళ్ళు రోడ్డు వెడల్పు జేస్తా కలిపేసుకుంటు౦డారూ. ఆ విషయం మాట్టాడేదానికి వకీలు కాడికి బొయినా.
"ఒంటిగంటవతావుంది. అన్నంది౦దురుగాని లేవండన్నా. సుగుణా బావికాడ గంగాళంలోకి నీళ్ళు తోడతా, మీ నాయనోళ్ళు చేతులు, కాళ్ళు గడుక్కుంటారు." అని లోపలున్న పిన్నికి వినిపించేట్లు గట్టిగా చెప్పి౦ది. 

"ఇంటికాడ పొద్దున్నే అన్నం తినేసొచ్చినాను. ఇప్పుడన్నాలవీ ఒద్దులేమ్మా రెండుగంటల బస్సుకి ఊరికి బోవాల" అని మొహమాటపడి పోయారు. 
"మిట్టమద్దానం ఎండలో యాడికి బోతావ్లే. మీ చెల్లెలు పొద్దున్న చాపల్దీసుకుంది. అన్నందిని కాసేపు పొణుకో. సాయంకాలం బోవచ్చులే" అని తాతయ్య అన్నాక రెండో తాతయ్య కూడా భోజనానికి లేచారు.  

      తాతయ్యావాళ్ళు భావిదగ్గరకు పోయాక నేనూ అమ్మమ్మ వంటిట్లోకి పొయ్యాం. అమ్మమ్మ, అంచున్నపెద్ద కంచాలు రెండు తీసి "రవన్ని నీళ్ళు తొలుపుకురా నాయనా" అని ఇచ్చింది. వాటిని సందులో ఉన్న బకెట్లో నీళ్ళతో ఒకసారి కడిగి ఇంట్లోకి తెచ్చాను. ఈలోగా అమ్మమ్మ కూరలన్నీ స్టీలు గిన్నెల్లోకి తీస్తూ ఉంది. నేను లోపలకు వచ్చి రెండు పీటలు వాల్చి, రెండు గ్లాసులు పెట్టి మూలనున్న ఎర్రని కుండలోని నీళ్ళు చెంబుతో ముంచుకొచ్చి పెట్టాను. వాళ్ళు భోజనాలకు కూర్చోగానే పక్కింటి కరుణ వచ్చింది. 

    ఇద్దరం సందులోనుండి పరిగెత్తుతూ వెళ్లి వేప చెట్టు కింద రాలిపడ్డ వేప పుల్లలేరడం మొదలు పెట్టాం. వాటితో ఏం చేస్తాం అనుకుంటున్నారా..మా బుడ్డీల సంసారానికి చిన్న చిన్న చీపుర్లు కావద్దూ..ఇంకా రెండు చివర్లు తుంచి, మస్తానన్న మిషన్ దగ్గర తెచ్చిన గుడ్డ ముక్కలతో పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు బొమ్మలు కూడా చేస్తాం. అప్పుడప్పుడూ పుల్లలాట కూడా వాటితోనే. అసలు పుల్లలాటకు చీపురు పుల్లలైతే బావుంటాయి కానీ "చీపుర్లో పుల్లలన్నీ లాగేసి సన్నంగా జేస్తావు౦డారు చిమ్ముతావుంటే చేతిలో నిలవక ఈడో పుల్ల ఆడో పుల్ల జారిపోతున్నాయని" అమ్మమ్మ కోప్పడిందిగా అందుకని వేప పుల్లలు ఏరుకుంటున్నామన్నమాట. 

    బైట బాగా ఎండగా ఉంది. పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే "తెల్లారి లేస్తే ఆటలేనా మద్దినేళ  రొంతసేపు పడుకోకూడదా" అని కేకలేయ్యక ముందే మా సామానంతా ఉన్న బుట్ట తీసుకుని మిద్దిమీద గదికి ఆనుకున్నగూట్లో చేరిపొయ్యాం. 


Monday, March 19, 2012

వాకిట్లో ముగ్గులు...వంటి౦ట్లో దోశలు

      నెల్లూరికొచ్చి అప్పుడే రెండు రోజులయిపోయింది. ఇంటికొచ్చిన వాళ్ళందరికీ మా ఊరి కబుర్లు చెప్పడమూ అయింది. ఇంతకూ మా అమ్మమ్మవాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారో చెప్పనేలేదు కదూ! అమ్మమ్మ తాతయ్య, పిన్ని, ఇద్దరు మామయ్యలు, చుట్టుపక్కల ఊర్లలో చదువుకునే సౌకర్యంలేక అమ్మమ్మవాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునే చుట్టాల పిల్లలూ, హాస్పిటల్ కి, పెళ్ళిళ్ళ షాపింగ్ లకూ, కోర్టు పనులకూ, ఊరికే చూసిపోవడానికీ వచ్చే పెద్దవాళ్ళూ ఉండేవాళ్ళు. పశువుల పాకలో రెండు ఎద్దులు, మూడు బర్రెలు, రెండు దూడలు, గాడి, కుడితొట్టి, దిబ్బ ఉండేవి.

      రాత్రిళ్ళు మేడమీద అందరం వరుసగా పరుపులు వేసుకుని చుక్కల్ని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవాళ్ళం. అప్పుడేగా సప్తఋషిమండలి, అరుంధతి నక్షత్రం, పిల్లలకోడి, వేగుచుక్క వీటన్నిటి గురించి తెలుసుకుందీ! ఆకాశంలో నెలవంకను చూస్తూ పడుకోవడం భలే ఉండేదిలే. ఇంటిపక్కనున్నవేపచెట్టు మీద ఉన్న కాకులు ఆరు గంటలకే నిద్ర లేపేసేవి. కళ్ళు తెరిచి చూస్తే ఒక్క మబ్బు తునక కూడా లేని లేతనీలపు ఆకాశం కనిపించేది. తల పక్కకు తిప్పితే ఇంటిమీదకు వచ్చిన పచ్చని వేపకొమ్మ నిండా తెల్లనిపువ్వులతో నవ్వులు రువ్వుతుండేది. పిట్టగోడ దగ్గరకు వచ్చామనుకోండి. వాకిలి ఊడ్చేవాళ్ళు, కళ్ళాపి చల్లేవాళ్ళు, ముగ్గులేసే వాళ్ళు, బొగ్గుతో పళ్ళుతోమేవాళ్ళు, కుళాయి దగ్గర నీళ్ళు పట్టేవాళ్ళు కనిపించేవాళ్ళు. లేచి దుప్పటి మడతబెట్టి పరుపు చుట్టేసి కిందకు వెళ్ళిపోవడమే, పరుపు లోపల పెట్టే పని నాది కాదు. ఎందుకంటే అది చాలా బరువు కదా పెద్దవాళ్ళెవరైనా పెడతారన్నమాట.

       ఇక మెట్లు దిగి కిందకు రాగానే వాకిట్లో బుల్లి ముగ్గు శుభోదయం పలికేది. వరండాలో తాతయ్య పడక్కుర్చీలో కూర్చుని హిందూ పేపర్ చదువుతూ ఉండేవారు. పేపరు... తాతయ్య, పేపరు... తాతయ్య. ఈ దృశ్యం మనం రోజుమొత్తంలో చాలా సార్లు చూస్తాం. పడక్కుర్చీ వైపు చూస్తే పేపరు మొదటి పేజీనో, మధ్య పేజీనో, చివరి పేజీనో కనిపించాలన్నమాట. పొరపాటున తాతయ్య కనిపించారనుకోండి, "జ్యోతీ పేపర్ చదువు" అని పిలుస్తారు. పోనీలే తాతయ్య ముచ్చటపడుతున్నారని పేపర్ చదవుతుంటానా, అలా కాదు, "పెద్దగా చదువ్" అంటారు. ఆ ఇంగ్లీష్ పేపర్ గాట్టిగా పైకి చదవాలి, తాతయ్య ఒక్కో పదం దగ్గర ఆపి అర్థాలు అడుగుతుంటారు. కాబట్టి ఏ సమయంలోనైనా తాతయ్యను చేతిలో పేపర్తో గాని చూశామా చప్పుడు చేయకుండా అక్కడినుండి వెళ్ళిపోవాలి.

      లోపలకు వెళ్ళగానే  పెద్దదో చిన్నదో అంచున్న చీర కట్టుకుని పావలా అంత బొట్టు, ముడి చుట్టూ పూలు పెట్టుకుని వేరుశనగ పప్పు వేపుతూనో, అప్పటికే వేపడం అయిపోతే చేటలో పప్పులు వేసుకుని పొట్టు చెరుగుతూనో అమ్మమ్మ కనిపిస్తుంది. ఇటుకరంగు పొట్టు గాలికి ఎగురుతుంటే చూడడానికి ఎంత 
బావు౦టుందనుకున్నారూ! తోడుగా అమ్మమ్మ గాజుల శబ్దం. నన్ను చూడగానే, "లేచామ్మా, పళ్ళు తోంకుని మొహం సుబ్బరంగా సబ్బేసి కడుక్కో పాల్దాగుదువు గాని" అంటుంది. "పేస్టు కొంచెం వేస్కో నాయినా, వేస్టు జేయబాక" అని చెప్పడం మాత్రం మరచిపోదు. మొహం కడుక్కుని రాగానే "టవల్ దండెం మీద అరేశ్నా?" అని వాకబుచేసి "జయా, పాపకు కొబ్బరినూనె బెట్టి రెండు జెళ్ళెయ్" అని పిన్నికి పురమాయిస్తుంది. ఆడపిల్లలు ఇంట్లో ముచ్చటగా కనిపించాలంట. చింపిరి జుట్లేసుకుని నిద్ర మొహాలతో కనిపిస్తే ఇంటికి దరిద్రం అట. మేమీ పనిలో ఉండగా పచ్చడి తయారవుతుంది. అప్పుడు౦టుంది అసలు ఘట్టం. 

      అమ్మమ్మ వంటి౦ట్లో పొయ్యి దగ్గర కూర్చుని దోశలు వేస్తూ ఉంటుంది. తాతయ్య పేపరు పక్కన పెట్టి వంటి౦ట్లోకి వస్తారు. పెద్దపీట తాతయ్యకు చిన్నపీట నాకు. బాదంకాయ ఆకారం
లో ఉన్న స్టీలు పళ్ళెంలో తెల్లని మెత్తని దోస వేసి ఓ పక్కగా పచ్చడి పెట్టి ఇస్తుంది, ఎన్ని దోసెలు తింటే అన్ని, లెక్కుండదు. దోసెలు కానివ్వండి, ఇడ్లీలు కానివ్వండి, టిఫిన్ ఏదైనా సరే తాతయ్య మాత్రం రెండే తినేవాళ్ళు అమ్మమ్మ ఏ సైజులో వేసినా. నా పని గ్లాసులో నీళ్ళు ముంచి పెట్టుకోవడమే, పెద్దవాళ్ళెవరైనా పక్కనుంటే వాళ్ళకి కూడా నీళ్ళు ముంచి పెట్టడం. టిఫిన్ తింటుండగా మామయ్యలూ, పిన్నీ, అక్కా ఇంటి పక్కనుండే మామయ్యా, ఇంకా చుట్టాలూ అందరూ వంట గది దగ్గరకొచ్చి పీట వాల్చుకుని టిఫిన్ తింటూ కబుర్లు చెప్పుకునే వాళ్ళు. నేను ఆఖరి దోశ వరకూ వేచుండేదాన్ని. మరి అమ్మమ్మ అప్పుడే కదా నాకు కరకరలాడే నూనె దోశ వేసి ఇచ్చేది. ఆ తరువాత పెద్దవాళ్ళందరికీ నేను కాఫీలు ఇచ్చి రావాలి. వాళ్ళు కాఫీ తాగిన తరువాత గ్లాసులు తెచ్చి జల్దాట్లో వేయడం మరచిపోకూడదు. లేకపోతే గ్లాసులో మిగిలిన కాఫీ దొర్లి ఈగలు ముసురుతాయి కదా! 

ఈ లోగా "మా, ఏ౦ జేస్తండారు?" అంటూ వెనుక వీధిలో ఉండే ఇంకో పిన్ని వంటింటి గోడ బైటనుండి పలకరిస్తుంది. 
"ఏం లా దోశలు ది౦ట౦డాం. లోపలికి రారాదా రెండు దోశలు తిందువుగాని" అంటూ వంటింటి రెండో గుమ్మం గట్టు దగ్గరకు వస్తుందమమ్మ.
"అప్పుడే తొమ్మిదవతా ఉంది. నేనాఫీసుకి పోబళ్ళా. ఇడ్లీ దినేసొచ్చినాన్లె." అ౦టుంది పిన్ని.
"పిలకాయలు టిఫిన్ జేసినారా?" 
"ఆ జేసినారు. సరే నేను బోతండా. జోతమ్మా కాస్త పిలకాయలు ఇంట్లోకొచ్చినారో లేదో జూడు" అని చక్కాబోతుంది. 
ఇవన్నీ అయ్యేప్పటికి "హోటల్ మమత వారి సమయం తొమ్మిది గంటలు" అని రేడియోలో చెప్తారు. ఈ వ్యవహారం అ౦తా వంటింటి గట్టుమీద నిలబడి కాళ్ళెత్తి చూస్తుంటామన్నమాట, లేకపోతే కనిపించదుగా మరీ.

     ఈ పూట  దోశలు మరీ ఎక్కువగా తినేశానేమో భుక్తాయసంగా ఉంది కొంచెం విశ్రాంతి తీసుకుని మిగిలిన కబుర్లు రేపు చెప్పుకుందాం.

Friday, March 16, 2012

నడివేసవి..నిమ్మకాయ మజ్జిగ..పెన్నానది

      అన్ని కాలాల్లోకి నాకు వేసవి కాలం అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఎండలు మండే వేసవి అంటే ఇష్టమేంటి అనుకుంటున్నారా. ఎండలు ముదిరితేనే కదా బడికి సెలవులిచ్చేది, అమ్మమ్మగారింటికి వెళ్ళేదీ, నాన్నమ్మ దగ్గర గారాలు పొయ్యేదీనూ. ఇంకా అలాంటి జ్ఞాపకాల కలలు ఎన్నెన్నో...

     మా చిన్నప్పుడు వేసవి సెలవలు ఎక్కువగా మా అమ్మమ్మగారి ఊరైన నెల్లూరులో గడిపేవాళ్ళం. సెలవలివ్వగానే నేను నెల్లూరికి వెళ్లి పోయేదాన్ని తరువాత అమ్మ, నాన్న, తమ్ముడు వచ్చేవాళ్ళు. అమ్మావాళ్ళు వచ్చాక అందరం కలసి కొన్ని రోజులు నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళం. ఆఖరి పరీక్ష వ్రాసి ఇంటికోచ్చేసరికే మా తాతయ్యో, పిన్నో నన్ను తీసుకెళ్ళడానికి రెడీగా వచ్చేసు౦డేవాళ్ళు. అంటే తరువాత రోజు తెల్లారగట్లే అమ్మమ్మగారింటికి ప్రయాణమన్నమాట. 


     నేను ఇంటికి వచ్చీ రావడం తోటే అమ్మను కంగారు పెట్టేసి బట్టలూ అవీ చిన్న విఐపి సూట్కేస్ లో సర్దేసుకుని త్వరగా అన్నాలూ అవీ తినేసి ఎనిమిది గంటలకల్లా ఆరుబయట మంచాలేసుకుని పక్క ఎక్కేసే వాళ్ళం. రాత్రి త్వరగా పడుకు౦టే ఉదయం త్వరగా లేవొచ్చని. ఆ ఉత్సాహంతో నిద్ర ఎక్కడ పట్టేదీ..గంట గంటకూ లేచి ఆకాశం వంక చూడ్డమే. "శ్రీ సూర్యనారాయణా మేలుకో మేలుకో" అనే భానుమతి గారి పాటలో లాగా సూర్యుణ్ణి లేపే ప్రయత్నాలు చేసేదాన్ని. చివరకు ఎప్పటికో ఓ యుగం తరువాత చుక్క పొడిచేది. ఆ చీకట్లో బ్రాయిలర్ లో కాగిన వేడినీళ్ళు పోసుకుని, రాత్రే తీసి పక్కన పెట్టుకున్న బట్టలు వేసుకుని, రెండు జడలు వేయించుకుని, రాత్రి  తడిగుడ్డలో చుట్టి మంచులో పెట్టిన మల్లెపూలు పెట్టించుకుని అమ్మ పెట్టిన ఇడ్లీలు తినేప్పటికి తెల్లగా తెల్లవారిపోయేది.

     అప్పుడు మేం ఉండే ఊర్లో బస్టాండ్ గట్రాలు లేవు. ట్రంక్రో రోడ్డ్ దగ్గరకు వెళ్లి రోడ్డుపక్కనున్న జమ్మిచెట్టు దగ్గర నిలబడితే బస్ వచ్చి ఆగుతుంది. ఆగిన బస్ ఎక్కేసి సింగరాయకొండో, కావలో వెళితే అక్కడి నుండి నెల్లూరికి ఎక్స్ ప్రెస్ బస్సు దొరకొచ్చు. ఆ రోడ్ మీదకు బస్సు పదినిముషాలలో రావొచ్చు, లేకపోతే బస్సు రావడానికి గంటైనా పట్టొచ్చు, అడపా దడపా 
ఎక్స్ ప్రెస్ బస్ కూడా అక్కడ ఆగొచ్చు. అదంతా మనం లేచిన వేళా విశేషం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఆ రోడ్ మీద రయ్యిన ఇటూ అటూ లారీలు వెళుతూ ఉండేవి. ఆ లారీల వెనుక రాసిన సినిమా పేర్లు, వాక్యాలు భలే సరదాగా ఉండేవి. నేనూ, తమ్ముడూ ఆ రోడ్ మీద ఒక ఆట ఆడేవాళ్ళం చెరొక అంకె అనుకునేవాళ్ళం. ఎవరి అంకె నెంబర్ ప్లేట్ మీద ఉంటే ఆ నంబర్ వున్న లారీలూ, బస్సులూ అన్నీ వాళ్లవన్నమాట. ఈ ఆటతో బస్సు ఆలస్య౦గా  వచ్చినా పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. మేం అల్లరి చేయకుండా ఎదురుచూడడం కోసం మా నాన్న కనిపెట్టిన ఆట ఇది. ఆ ఆటలో ఉండగానే వచ్చిన బస్సులో కూర్చుని నాన్నకు తమ్ముడికి టాటా చెప్పాక బస్సు కదలుతుంది కదా...అది రోడ్డు మీద వెళుతుందనుకున్నారేమిటి, అబ్బే మేఘాల్లోనే కదూ ప్రయాణం. ఉదయాన్నే ప్రయాణం పెట్టుకోవడం వల్ల బస్సంతా దాదాపుగా ఖాళీగా ఉంటుంది, తమ్ముడెలాగూ రాలేదు కాబట్టి కిటికీ పక్క సీటు మనకే ప్రత్యేకం. 

     కాసేపు వెనక్కి వెళుతున్న చింత చెట్లనూ, బ్రిడ్జినీ, పామాయిల్ తోటలనూ చూస్తూండగానే, పొగాకు బారెన్లు కనిపిస్తాయి. అవి దాటగానే రెండు బ్రిడ్జిలు వస్తాయి. అవన్నీ చూసి బుట్టలోంచి చందమామ పుస్తకం తీసి ఒక కథ చదవి పైకి చూస్తే జామ, మామిడి తోటలు వచ్చేస్తాయి. సింగరాయకొండ దగ్గర బస్సు ఆగగానే "జామకాయలు, జామకాయాల్ రూపాయికి ఆరు జామకాయాల్, జామకాయల్", "మామిడి కాయలమ్మా మంచి రసాలు తీసుకో౦డమ్మా", "వేర్సెనక్కాయాల్ వేర్సెనక్కాయాల్ ", "ఈతకాయలో" అంటూ బస్సు దగ్గరకు అమ్మడానికి వచ్చేవాళ్ళు. బస్సు బయలుదేరాక చందమామను ఒళ్లో పెట్టుకుని ఒక్క కునుకు తీయగానే కావలి వచ్చేసేది. కావలి బస్టాండ్ లో స్పెషల్, అల్లం నిమ్మరసం వేసిచేసిన చల్లని మజ్జిగ. డ్రైవర్  కండక్టర్ టిఫిన్ చేసి వచ్చేలోగా తాతయ్య నేను మజ్జిగ తాగేసి, అక్కడ షాపుల్లో వేలాడుతున్న పుస్తకాల దగ్గరకు వెళ్ళేవాళ్ళం. తాతయ్య నాకు బాలమిత్ర, బొమ్మరిల్లు కొనిపెట్టేవాళ్ళు. 

      కావలిలో బస్ బయదేరేప్పటికి బస్సు పూర్తిగా నిండి పోయేది. కాసేపు పక్క సీట్లో కూచున్న చిన్నపిల్లల్నీ..ఎదురు సీట్లో కూచున్న ముసలమ్మల్నీ చూస్తూ వాళ్ళ కబుర్లు మీద ఓ చెవి వేసి మళ్ళీ పుస్తకంలో తల దూర్చేసేదాన్ని. కథకూ, కథకూ మధ్య తల ఎత్తితే నీళ్ళు నిండిన చెరువులు, వేసవి అవడం మూలాన ఖాళీగా వున్న పొలాలు, వాటి గట్లమీద తాటిచెట్లు కనిపించేవి. చెట్లకి వేలాడుతూ తాటిగెలలు. అసలు తాటికాయల గురించి చెప్పాలంటే మనం నాన్నమ్మగారి ఊరు వెళ్ళాలి. ఆ కబుర్లు తరువాత చెప్పుకుందాం. 


        చివరాఖరకు మనం ఎదురుచూస్తున్న పెన్నానది కనిపించేది. బ్రిడ్జి మీద నుండి చూస్తే దూరంగా రంగనాయకుల గుడి కనిపిస్తూ ఉండేది. అవి రెండూ కనిపించాయంటే మనం నెల్లూరు వచ్చేశామన్నమాట. బస్సు దిగి తాతయ్యతో కలసి రిక్షా ఎక్కి రోడ్డుకు రెండువైపులా కనిపించే ఇళ్లూ, చెట్లూ, అక్కడా కనిపించే సినిమా పోస్టర్లూ, వాటిమీద నాగేసర్రావులూ, వాణీశ్రీలూ, చిరంజీవులని చూస్తూండగా మన వీధి ఆ చివర మలుపులో కనిపించేది. పుచ్చకాయల బండ్లు, కూరగాయల బుట్టలూ దాటుకుంటూ వెళితే వీధి మొదట్లో ఉండే సెట్టికొట్టు వచ్చేది. ఆ తరువాత డేగా వాళ్ళ ఇల్లు, పక్కనే పారిజాతం చెట్టు ఉండే ప్రసూనమ్మమ్మ గారిల్లు వెంట వెంటనే వచ్చేసేవి. ప్రసూనమ్మమ్మ గారెమీ మనకు చుట్టాలు కారు, కాని వీధిలో వాళ్ళందరినీ ఏవో వరసలు కలిపే పిలిచేవాళ్ళం ఇంతట్లో రిక్షా ఇంటి ముందు ఆగేది.

    గబుక్కున ఒక్క గంతులో రిక్షాలోనుండి దూకేసి ఇనుపగేటు గడి తీసేదాన్ని. ఆ శబ్దానికి ఇంట్లో నుండి రాధాకృష్ణుల బొమ్మ కుట్టివున్న తెల్లని కర్టెన్ పక్కకు తీసుకుంటూ చిన్నపిన్ని వచ్చేసేది. నన్ను చూడగానే తన మొహం మతాబులా వెలిగి పోయేది. "మా...బాబు, జ్యోతి వచ్చారు" అని ఓ చిన్న సైజు కేక పెట్టేది. మా అమ్మావాళ్ళు వాళ్ళ నాన్నను 'బాబా' అని పిలిచేవారులెండి. ఆ కేకకి వంటింట్లో ఉన్న అమ్మమ్మ రావడానికి ముందే ఇంటిపక్కనున్న సుగుణత్త గోడమీద నుండి తొంగి చూసి "ఏం మావా ఊరికి బోయి మనవరాల్ని తీసుకొచ్చా" అని తాతయ్యనూ "ఏం జోతా బావు౦డా" అని నన్నూ ఒక్కసారే పలకరించేది. ఈవిడ మనత్తే లెండి, పెద్దతాతయ్య కోడలు వాళ్ళింటికీ మనింటికీ మధ్య గోడే అడ్డం. ఈలోగా అమ్మమ్మ "ఏకోజావునే బయలుదేరినట్టున్నారే! అమ్మా వాళ్ళు బావుండారా?" అంటూ వరండాలోకి వచ్చేది. ఇంతట్లో పక్కింట్లో నుంచి రయ్యిన కరుణ గేటు తోసుకుని వచ్చేసేది. అచ్చుతప్పు కాదండీ తోసుకునే వచ్చేది. ఈలోగా వీధిలో వెళుతున్న చిన్నమ్మమ్మ "ఏమ్మే ఇపుడేనా రావడం..మీ అమ్మ రాలా?" అంటూ అక్కడ నుండే పలకరించేది. 

       బోల్డంత దూరం ప్రయాణం చేశాం కదా, కాస్త బడలిక తీర్చుకుని మిగిలిన కబుర్లు రేపు చెప్పుకుందాం.

Monday, March 12, 2012

చూసిచూడనట్టు పోవాలి

"సినిమాకి వెళదాం వస్తావా?"
"ఎందుకో?"
"ఎందుకేమిటి సరదాగా ఎ౦టర్టైన్ మెంటూ..."
"సరే పద...".
"థూ..యాక్..అది సినిమానా. ఆ బూతులూ..సగం సగం వేసే ఆ అమ్మాయిల బట్టలూ..."
"వాళ్ళ బట్టలూ వాళ్ళిష్టం."
"ఆ నరకడాలు ..కొట్టడాలు.."
"అదే మరి హీరోఇజం.."
"రెండర్ధాల మాటలూ, పాటలూ.."
"రాసేవాళ్ళకూ, చేసే వాళ్ళకూ లేని ఇబ్బంది మనకెందుకు!"
"కాని అది లక్షల మంది చూసే సినిమా కదా..విజ్ఞులూ ప్రాజ్ఞులూ ఉంటారుగా..." 
"చూడ్డం ఇష్టంలేని వాళ్ళు  సినిమాల కెళ్లడం మానేస్తారు.."
"చౌకబారు సినిమాలకూ, సాహిత్యానికీ పెద్దపీట వేసి..మనం అభివృద్ధి ఏవైపు సాగిస్తున్నాం?"
"చూసిచూడనట్టు పోవాలి...అన్నీ పట్టించుకోకూడదు."

"ఎలక్షన్లలో అతనెలా గెలిచాడు?"
"మనిషెవరైతేనేం కులం ప్రధానం."
"కులానికి అంతటి ప్రాధాన్యతనివ్వాలా..."
"కులానికి నాయకులేంటి సామాన్యులేంటి పసిపిల్లల దగ్గరనుండీ పెద్దవాళ్ళ దాకా అందరూ దాసులే"
"అయితే మాత్రం..దేశాన్ని పాలించవలసిన నాయకులు..కులాల కుమ్ములాటలో..."
"చూసిచూడనట్టు పోవాలి..అన్నీ పట్టించుకోకూడదు."

"పెళ్లి బాగా జరిగింది కదూ.."
"విందులో మిగిలిన వంటలతో మన ఊరికి ఓ వారం భోజనం పెట్టొచ్చు.."
"ఉన్నవాళ్ళ పెళ్ళిళ్ళు మరీ...పెళ్లి చీర పది లక్షలూ, పెళ్లి కూతురి నగలు మూడు కోట్లూనట. పెళ్ళికి పెద్దపెద్దవాళ్ళు వచ్చారు చూశావా.."
"అతనేదో కాంట్రాక్టరు అనుకుంటానే.."
"ఆ..పోయినేడాది 'మాదారం' బ్రిడ్జి కట్టించాడు."
"ఆర్నెల్ల క్రితం బ్రిడ్జి కూలి ఎనభై మంది చచ్చిపోయారనుకుంటాను.."
"చూసిచూడనట్టు పోవాలి..అన్నీ పట్టించుకోకూడదు."

"గిరిజ మంచి పిల్ల. పాపం సీత ఎలా తట్టుకుంటుందో..ఎంతైనా తల్లి మనస్సు.."
"ఏమైంది?"
"వాడెవడో ప్రేమించమన్నాట్ట. ఈ పిల్లేమో నాకు చదువే ముఖ్యమన్నదట."
"దానికి బాధె౦దుకూ?"
"పూర్తిగా వినూ..వాడికి ఒళ్ళు మండి మొహం మీద ఆసిడ్ పోశాడట." 
"అయ్యో అయ్యో...వాడికి అమ్మా నాన్నా ఉన్నారా?"
"అలా ఆవేశపడిపోకు. వాళ్ళ గురించి మనకెందుకు? మన ప్రదీపు అలా లేడుగా.."
"అయితే?' 
"చూసిచూడనట్టు పోవాలి అన్నీ పట్టించుకోకూడదు."

"సాగర్ ని రాత్రి పోలీసులు పట్టుకున్నారట."
"ఎందుకు?"
"స్నేహితులతో కలసి క్లబ్బుకెళ్ళి వస్తుంటే.."
"అదేం తప్పు కాదుగా"
"చెప్పనీ..దారిలో ఒక బిచ్చగాణ్ణి గుద్దేశార్ట."
"రోడ్డుకడ్డంగా వచ్చుంటాడు..చీకట్లో కనిపించలేదేమో.."
"అదేం కాదట..బాగా తాగేసున్నార్ట..పేవ్మెంట్ మీదకు బండి ఎక్కించేసార్ట."
"అయ్యో ఈ తాగుడలవాటు ఎక్కడిది వీళ్ళకు?"
"చిన్నప్పట్నుంచీ నాన్ననూ, మామయ్యలనూ చూడట్లా.."
"అయ్యో మంచి పిల్లలు ఎలా పాడయిపోయారు.."
"ఆ సావిత్రి ఇప్పుడు పిల్లల కోసం కూడా ఏడవాలి."
"అసలా మద్యం అమ్మడమెందుకూ?"
"సర్కారుకి డబ్బులెలా వస్తాయి మరి.."
"జీవితాలు నాశనమయ్యాక డబ్బెవరికోసం.."
"చూసిచూడనట్టు పోవాలి అన్నీ పట్టించుకోకూడదు."

"ఆ గీతింట్లో విజయ్ మకాం పెట్టాడట..."
"అదేం పనీ..ఇంట్లో దేవతలాంటి పెళ్ళాన్ని పెట్టుకుని.."
"తెల్లారి ఇంటికి వస్తున్నాట్టలే.."
"ఛీ..ఛీ సుగుణెలా రానిస్తోంది" 
"ఏం చేస్తుంది పాప౦?"
"తన్ని తరిమెయ్యొద్దూ."
"అవన్నీ పట్టించుకోకూడదు నెలకు ఇంట్లోక్కావలసిన డబ్బిస్తున్నాడుగా"
"ఇస్తే?" 
"పెళ్ళానికి తెలియకుండా వెధవ తిరుగుళ్ళు తిరిగే వాళ్లె౦తమంది లేరు?"
"ఉంటే?" 
"చూసిచూడనట్టు పోవాలి అన్నీ పట్టించుకోకూడదు."

"ఏవీ పట్టించుకోకుండా..ఎలా ఉండను?
పిల్లలు ఆ సినిమాలే చూస్తున్నారు..
ఆ దేశంలోనే మనమందరమూ ఉంటున్నా౦.
ఆ బ్రిడ్జిల మీద రోజూ వందల కొద్దీ వాహనాలు తిరుగుతున్నాయి. 
పిల్లలంతా అలాంటి కాలేజీల్లోనే చదువుతున్నారు.
గొప్ప గొప్ప నిర్ణయాలన్నీ సీసాల మత్తులో జరిగిపోతున్నాయి.
మంచేదో తెలియని పెద్దల మధ్య పసిపిల్లలు పెరుగుతున్నారు."

"చూసి చూడనట్టు పోవాలి అన్నీ పట్టించుకోకూడదు.."
"ఎలా?"
"లేచామా..తిన్నామా..పడుకున్నామా.."
"అంతేనా..."
"కావాలంటే చందామామ, వెన్నెల అంటూ కవితలు వ్రాసుకో.."
"నన్నవమానిస్తున్నావ్.."
"తెలుగు భాష, నీతులు అంటూ పిల్లలకు నూరిపొయ్యి." 
"దిస్ ఈజ్ టూ మచ్.."
"చూసిచూడనట్టు పోవాలి అది మనకలవాటేగా!"




Tuesday, March 6, 2012

ఇంతకుమించి ఏమున్నది

       మొన్నాదివారం ఉదయాన్నే తెల్లవారకముందే వచ్చి కూర్చుంది. కేవలం నాలుగ్గంటల నిద్రతో బద్దకంగా వాలిన కళ్ళను బలవంతంగా తెరిచి విషయమేమిటని అడిగాను. 'ఏవో పండగలూ వేడుకలూ ఉన్నాయిగా' అంటూ దీర్ఘం తీసింది. 'ఉంటే' అన్నాను దుప్పటి ముసుగు తలపైకి లాక్కుంటూ. ఉంటే గింటే ఏం లేదు, 'నిన్న ఏవో డాన్సులూ అవీ అనే మాటలు వినపడితేనూ...' అని ఆపేసింది. ఆ మాటతో మత్తు దిగిపోయింది. హడావిడిగా లేచి మొహం కడుక్కుని ఓ కప్పు కాఫీ కలుపుకున్నాను. నిన్న అనుకున్న పనులన్నీ చకచక పూర్తి చేసి ఏడుగంటలకల్లా పదిమంది మిత్రబృంద౦ ఒక బేస్మేంట్ లో కలిశాం. చెణుకులు, చెమక్కుల మధ్య ఓ రెండు గంటల సాధన సరదాగా నడిచింది.

      "చాలా కష్టపడ్డావ్ ఇంటికి వెళ్ళగానే కాస్త విశ్రాంతి తీసుకో" అంది. ఏమైనా నేనంటే చాలా అభిమానంలెండి. ఇ౦టి లోపలకు అడుగుపెట్టగనే ఇంట్లో వాళ్ళంతా ఒక్కొక్కళ్ళూ లేచి కిందకు దిగి వచ్చారు. దోసెలు వేస్తుండగా చిట్టితల్లి 'మంచి భారతీయ వంట తెస్తానని స్నేహితురాలికి మాటిచ్చినట్లుగా' చెప్పింది. ఆ వంట సంగతేదో చూసి, ఇంట్లో పనులు అవగొట్టేసి ఇక మంచమెక్కేద్దా౦ అనుకున్నాను. వంట అవగానే మా వారు స్క్రిప్ట్ తో వచ్చి కూర్చున్నారు. నన్ను జాలిగా చూసి దీర్ఘంగా నిట్టూర్చింది. 'ష్' అని కోప్పడి నాటిక గురించి చర్చలు మొదలెట్టాం. ఈ నాటిక నాది కాదులెండి శ్రీవారిది. ఈ లోగా ఫోన్ "మిమ్మల్ని చూసి చాలా రోజులయింది ఐదు నిముషాల్లో వస్తున్నామన్న" కబురు వినిపించింది. వచ్చిన వాళ్ళతో పిచ్చాపాటీ కబుర్లు చెప్తుంటే మాకంటే ఎక్కువగా సరదా పడింది.

     ఈలోగా నాటిక రిహార్సిల్స్ మొదలెడదామని పిలిచిన మిత్రులు రానే వచ్చారు. వారికి స్క్రిప్ట్ వినిపించి మార్పులూ చేర్పులూ గురించి చర్చిస్తుండగా మరో ముగ్గురు మిత్రులు ఓ తీయని కబురు మోసుకు వచ్చారు. నాటిక చర్చలు ముగించి వచ్చిన వారు నిష్క్రమించారు. కొత్తగా వచ్చిన మిత్రులతో ఆడిన కారంస్ ఆట 'టోర్టియా చిప్స్', 'గ్వాకమోలీ' నేపధ్యంలో పసందుగా సాగింది. ఆట జరుగుతుండగానే బుజ్జిపండు కోసం పిలుపు వచ్చింది. ఝామ్మని పండు వాళ్ళ నేస్తాల దగ్గరకు వెళ్ళాడు. సందట్లో సడేమియా..చిట్టితల్లి ప్రాజెక్ట్ పేరుతో తుర్రుమంది. తనేమో జరిగేవన్నీ చిరునవ్వుతో చూస్తూ విశ్రాంతిగా కూర్చు౦ది.

      వచ్చిన మిత్రులను పంపించి తెలుగు తరగతికోస౦ పాఠ్యా౦శాలు చూసుకుని తరగతికి కావాల్సిన కుర్చీలు, బోర్డ్లు సర్డుతుండుగానే విద్యార్ధులు ఉపాధ్యాయులు హాజరు. 'తేనెల తేటల మాటలతో' పాట ప్రతి గదిలోనూ ప్రతిధ్వనించింది. ఈ పాట వింటున్నఆ కళ్ళలో పరవశం చూడాలి. సరే వాళ్ళను పంపించి భోజనాలు అయ్యాయనిపించాగానే పత్రిక పనికోసం మరో ఇద్దరి వచ్చారు. వారి పని చూసి ఫోనులో మాట్లాడాల్సిన విషయాలు పూర్తిచేసి రాత్రి పది గంటలకు విశ్రాంతిగా కూర్చుని ఉదయం నుంచీ జరిగిన విషయాల గురించి కబుర్లు చెప్పుకున్నాము. అన్ని అనుభావాలను ఆనందంగా దాచుకుని తృప్తిగా వీడ్కోలు తీసుకుంది.

    ప్రతి రోజూ ఇలా గడిస్తే ఎంత బావుంటుందో! అత్యాశ కదూ. కనీసం ప్రతి వారం అన్నా ఇలా గడిస్తే సంతోషమే. ఆ రోజు మొత్తం పెద్దలూ పిల్లలూ కలసి సుమారుగా యాభైమందిని కలిసాము. ఉదయం తిన్న ఒక్క దోశతో సాయంత్రం వరకూ ఆకలే గుర్తు రాలేదు. మూసిన తలుపుల వెనుక నెలలు నెలలు గడిచిపోయే ఈ రోజుల్లో ఒక్క రోజును అంత తృప్తిగా పంపించడం అదృష్టమే కదూ.

       పని చేయడం శ్రమ అనుకుంటా౦ కాని, ఇష్టమైన పని చేయడంలోని తృప్తిని అనుభవించిన వాళ్ళెవ్వరూ ఆ ఆనందాన్ని ఒదులుకోరు. పని చెయ్యడానికి భయపడతాం. సమయం మీదో సామర్ధ్యం మీదో నెపం వేస్తాం. పనిలో ఉండే కష్టాల్ని ఏకరువు పెడతాం. లేదు ఏతావాతా ఆ పని చేశామనుకోండి గుర్తింపు కోసం ప్రాకులాడతాం. నిజంగా పని చేసిననాడు మనకు లభించే తృప్తి ముందు ఇతరుల పొగడ్తలు తేలిపోతాయి. ఆ పని సమాజానికి సంబంధించినదైతే ఆ తృప్తే వేరు.

     ఉదయాన్నే నన్ను నిద్రలేపిన రోజు, వెళ్ళే ముందు తనకు బాగా నచ్చిన వాటి గురించి చెప్పింది.

  • మర్యాదలు, మట్టిగడ్డల గురించి ఆలోచించక నేరుగా వచ్చి తలుపు తట్టడం. 
  • నలుగురు కలిసి అడేవేళ బుజ్జిపండును తలచుకుని పిలుచుకెళ్ళడం. 
  • పిల్లల౦దరూ కలసి పాడిన 'తేనెల తేటల మాటలతో' పాట. 
  • అవకాడోతో తొలిసారిగా చేసిన 'గ్వాకమోలి'. 

Tuesday, February 28, 2012

ప్చ్.. నాకంత అదృష్టమా

      ఝాన్సీ కాఫీ తాగుతూ కిటికీలో నుండి బయటకు చూస్తూ ఉంది. ఉదయం నుండి ఆకాశం మబ్బుపట్టి ఉందేమో వేసవికాలం అయినా ఆరుగంటలకే చీకట్లు ముసురుకుంటున్నాయి. రోడ్డుమీద అప్పుడో కారు ఇప్పుడో కారు వెళుతూ వున్నాయి. రోజూ ఈ సమయానికి వీధిలో ఆడుకునే పిల్లలెవరూ ఆ సమయంలో కనిపించలేదు. ముందుగదిలో లైట్ వేసి కిటికీతెర వేసేసింది ఝాన్సి. భర్త, పిల్లలు సెలవలకు ఇండియా వెళ్ళడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఉద్యోగంలో ఏవో ఇబ్బందుల కారణంగా ఝాన్సీకి వెళ్ళడానికి కుదరక ఆమె అమెరికాలోనే ఉండిపోయింది.
      

      ఆ గదిలో ఒక మూలగా వున్న 'డ్రాగన్ ట్రీ' ఆకులు చివర ఎండిపోయి ఉ౦డడం  గమనించి మగ్ తో నీళ్ళు తీసుకునివచ్చి పోసింది. అలాగే ఇంట్లో ఉన్న మిగతా మొక్కలకు కూడా నీళ్ళు పోసి వాటి ఆకులమీద నీళ్ళు చల్లి, 'ఆఫ్రికన్ వైలెట్' మొక్కకున్న వాడిన పూలను తీసేసింది ఝాన్సి. నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే చెక్క నేల మీద తన అడుగుల చప్పుడు తనకే పెద్దగా వినిపిస్తోంది. ఆ పనవగానే సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసింది. ఓ పావుగంట చూసిన తరువాత తననెవరో గమనిస్తున్నట్లుగా
అనిపించింది.

       మెల్లగా తల తిప్పి చూస్తే పెరటి వెనుకవైపునున్న కిటికీలన్నీ తెరచివున్నాయి, బయట లీలగా చెట్లు తప్ప ఏమీ కనిపించలేదు. 
ఇంట్లో వాళ్ళతో వెళ్ళకుండా ఒంటరిగా ఉండిపోవాల్సిన పరిస్థితులను తిట్టుకుంటూ లేచి వెళ్ళి అన్ని కిటికీలు వేసి, తెరలు దించి  టివి చూడాలనిపించక బాబు గదిలోకి వెళ్ళి అరమర సర్దడం మొదలు పెట్టింది. అక్కడ పిల్లలిద్దరూ దాచుకున్న 'యూగియో కార్డ్లు',  'కాయిన్ కలెక్షన్' పుస్తకం కనిపించాయి. వాళ్ళ వస్తువులు చూస్తున్న కొద్దీ వాళ్ళ మీద మరీ బెంగగా అనిపించి పాప గదిలో ఉన్న కంప్యూటర్ లో పవర్ ఆన్ చేసి పాటలు పెట్టి౦ది. సర్దడం పూర్తవగానే వాల్యూమ్ బాగా పెంచి వంటగదిలోకి వెళ్ళింది. ఇంటికి మధ్యలో పెద్ద హాలు, హాలుకు ఒక పక్కగా మూడు పడగ్గదులు, రెండో వైపున వంటగది డైనింగ్ హాలు ఉండే ఆ ఇంట్లో వంటగది వరకూ పాటలు వినిపించాలంటే ఎక్కువ వాల్యూమ్ పెట్టక తప్పదు. ఉదయం చేసిన పప్పు, దొండకాయ వేపుడుతో భోజనం చేస్తూ ఉండగా ఫోన్ మోగింది. పాటల శబ్దంలో అవతల వాళ్ళు చెప్పేది వినిపించక, పాప గదిలోకి పరిగెత్తి కంప్యూటర్ పాజ్ లో పెట్టి ఫోన్ చేసిన రాగిణితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ భోజనం ముగించేసరికి ఎనిమిది గంటలయింది.

      కిటికీలూ, తలుపులన్నీ వేసివున్నాయో లేదో మరొక్కసారి చూసి, సెల్ ఫోనూ, మంచినీళ్ళ గ్లాసు తీసుకుని సెక్యూరిటీ అలారం ఆన్ చేసి పడగ్గదిలోకి వెళ్ళింది. గ్లాసు, ఫోన్ మంచం పక్కనే ఉన్న నైట్ స్టాండ్ మీద పెట్టి గది తలుపు గడియవేసి తలుపు ఒకసారి లాగి చూసి౦ది. ఉదయం నుంచి కిటికీ తీయకపోవడం వల్ల ఉక్కగా అనిపించి కిటికీ తీయబోయి ఒంటరిగా ఉన్న విషయం గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకుని ఫాన్ ఆన్ చేసి మంచం మీద వాలి రాత్రి సగం చదివి ఆపేసిన పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది ఝాన్సి. ఆ నిశ్శబ్దం...ఒంటరితనంలో చదవాలనిపించక పుస్తకా౦ మూసి పక్కన పెట్టింది. హోరున గాలి వీస్తున్నట్లు౦ది, బయటనుండి వింత శబ్దాలు మొదలయ్యాయి. కొంచెం సేపు ఆలకించి మంచం దిగి మెల్లగా కిటికీ దగ్గరకు వచ్చి తెర తొలగించి చూసింది. చీకట్లో పెరట్లో వున్న పెద్ద ఆలివ్ చెట్టు ఊగిపోతూ భయకంరంగా కనిపించింది.   


        అంతవరకూ ఉన్న ఒంటరితనం భయంగా మారింది. ఇలా ఒక్కర్తే ఉండడం ఝాన్సీకి అస్సలు అలవాటు లేదు. అందులోనూ వర్షం రాత్రి, ఇప్పుడు కరంట్ పోతేనో అనుకుని మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకుంది. పక్కన ఇంటి వాళ్ళతో కొద్ది పరిచయం ఉన్నా ఏ రాత్రన్నా అవసర౦ పడితే పిలిచేంత చనువు లేదు. పోనీ ఏ స్నేహితులింటికి వెళదామన్నా వర్షం చాలా ఎక్కువగా ఉంది. ఇంతలో ఝాన్సి భయానికి తగ్గట్టుగా కరంట్ పోయింది. గాలికి పెరట్లో చెట్లు ఊగుతున్న శబ్దం భయంకరంగా వినిపిస్తోంది. కిటికి మీద వర్షం పడే శబ్దంకూడా చీకట్లో భయం గొలిపేలా ఉంది. గదిలో ఫాన్ ఆగిపోవడంతో మరీ ఉక్కగా ఉంది. సుమారుగా అరగంట తరువాత కరెంట్ వచ్చింది. ఝాన్సీకి టీవీ చూస్తూ నిద్రపోయే అలవాటు ఉండడంతో టివి రిమోట్ లో స్లీప్ మోడ్ కి టైమర్  పెట్టి టీవీ చూస్తూ పడుకుంది. కాసేపటికి మాగన్నుగా నిద్ర పట్టింది.

"ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా
ముట్టుకుంటే ముడుసుకు౦టావ్ అంత సిగ్గా
మబ్బే మసకేసిందిలే  పొగమంచే తెరగా నిలిసి౦దిలే "


      ఉలిక్కిపడి నిద్ర లేచింది ఝాన్సీ. ఒక్కక్షణం తనెక్కడుందో.. ఏమిటో అర్ధం కాలేదు ఆమెకి.
 ఒంటరిగా ఉన్నానన్న విషయం గుర్తురాగానే వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. టైం చూస్తే రాత్రి రెండయింది, ఇంట్లో తనొక్కతే ఉంది. మరి పెద్దగా వినిపిస్తున్న ఆ తెలుగు పాట ఎక్కడినుండి వస్తున్నట్టు? పోనీ బయటెక్కడి నుండో వినిపిస్తు౦దా అనుకుంటే ఇంటి పక్క ఇళ్ళవాళ్ళంతా అమెరికన్లు. వెంటనే ఇండియాలో ఉన్న భర్తకు ఫోన్ చేసింది.

"హలో ఏంట్రా ఈ టై౦లో ఫోన్ చేశావ్? ఇంకా పడుకోలేదా?" అడిగాడు విక్రం.
"పడుకున్నాను. ఇప్పుడే మెలుకువ వచ్చింది."
"ఇప్పుడే బయటకు వెళదామనుకు౦టున్నాం. ఇంతలో నువ్వు ఫోన్ చేశావు" ఝాన్సీ గొంతులోని కంగారు గమనించక చెప్పుకుపోతున్నాడు విక్రం.
"అది కాదు మనింట్లో పెద్దగా పాటలు  వినిపిస్తున్నాయి. నాకు చాలా భయంగా ఉంది."
"పాటాలా? పాటలేంటి?" అయోమయంగా అడిగాడు విక్రం.
"అదే నాకూ అర్ధం కావట్లేదు."
"రాత్రి పాటలు పెట్టి మరచిపోయి నిద్ర పోయుంటావ్."
"నిన్న సాయత్రమెప్పుడో కంప్యూటర్లో పెట్టాను. తరువాత పాజ్ చేశాను. ఎవరూ కదిలించకుండా ఇప్పుడెలా వస్తున్నాయవి?" సందేహంగా వెలిబుచ్చింది ఝాన్సి.
"కంప్యుటర్ దగ్గరకు వెళ్ళి చూడోసారి."
"అమ్మో నాకు భయం. నేను వెళ్ళను."
"సరే పడుకో అయితే ఉదయాన్నే చూడొచ్చు"
"అసలు మీకు కొంచెమన్నా కంగారు లేదు. అర్ధరాత్రి ఇంత పెద్ద శబ్దంతో పాటలు వస్తుంటే 'ఎవరు పెట్టారా?' అని నేను భయంతో చచ్చిపోతుంటే సింపుల్ గా 'పడుకో పొద్దున్న చూడొచ్చని' చెప్తారా" భయంతో పాటు కోపం కూడా తోడయ్యింది.

"మరి ఎలా? పోనీ సాగర్ వాళ్లను పిలుస్తావా వాళ్ళొస్తారు."
"ఒద్దులెండి, అసలేమయిందో తెలియకుండా మరీ అర్ధరాత్రి ఎలా లేపుతాం. ఉదయం దాకా మీరే ఇలా మాట్లాడుతూ ఉండండి" చెప్పింది ఝాన్సి.
"ఏమిటీ! ఉదయం దాకానా? నాకు ఫరవాలేదు కానీ నీకే సమస్య, రేపు నువ్వు వర్క్ కి వెళ్ళాలి కదా. ఒక్కసారి వెళ్ళి చూడు పాటలు ఎక్కడినుండి వస్తున్నాయో, సెక్యురిటీ అలారం ఆన్ చేసే ఉందిగా భయం లేదులే"

        ఈ కబుర్లలోనే ఓ పావుగంట గడిచింది. పాటల శబ్దానికి పక్క వాళ్ళు లేస్తారేమో అని ఒకపక్క ఝాన్సీకి కంగారుగా ఉంది. ఏమైతే అదయిందని వెళ్ళిచూడడానికే నిశ్చయించుకుని సెల్ ఫోన్ లో '911' నొక్కి చేతిలో పట్టుకుంది. అవసరమై టాక్ బటన్ నొక్కితే పోలీస్ స్టేషన్ లో వాళ్ళు లైన్ లోకి వచ్చి ఇక్కడ జరుగుతున్నది మాటల ద్వారా తెలుసుకుంటారని  ఝాన్సి ఉద్దేశం. 

     ఇక్కడ ప్రమాదం జరుగుతుందని తెలిసిన వెంటనే ఐదు నిముషాల్లో పోలీసులొస్తారన్న భరోసాతో "సరే మీరు లైన్ లోనే ఉండండి" అని విక్రం కి చెప్పి 'బహుశా ఇదేనేమో తను చేసే ఆఖరి కాల్' అనుకుంటూ మెల్లగా తలుపు తీసి బయటకు తొంగిచూసింది ఝాన్సి. అనుమాని౦చదగ్గ దృశ్యాలు కాని, భయానక దృశ్యాలు కానీ లేక అంతా మామూలుగా ఉంది. పాటలు పెద్ద శబ్దంతో పాప గదిలోనుండి వినిపిస్తున్నాయి. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా పాప గది తలుపు తీసింది. ఏ అగంతకుణ్ణి చూడాల్సివస్తుందో,  ఏ పరిస్థితిని  ఎదుర్కోవలసి వస్తుందో అనుకుంటూ లైట్ వేసింది. ఆశ్చర్యం గదిలో ఎవరూ లేరు కిటికీ కూడా మూసే ఉంది. కంప్యుటర్ నుండి పెద్దగా పాటలు మాత్రం వినిపిస్తున్నాయి. ఆ శబ్దానికి ఫోన్ లో అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినపడడం లేదు. కంప్యూటర్ దగ్గరకు వెళ్ళి పాటలు ఆపింది ఝాన్సి.

"ఇక్కడెవరూ లేరు కాని కంప్యుటర్ నుండే పాటలు వస్తున్నాయి." చెప్పింది. ఝాన్సీ తో సరదాగా మాట్లాడుతున్నాడు కాని విక్రంకి కూడా కంగారుగానే ఉంది. "ఎలా వస్తున్నాయి పాటలు ఇంట్లో ఎవరైనా ఉండి ఉంటారా? పోలీసులను పిలవకుండా తప్పు చేస్తున్నామా" ఇలా పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఝాన్సీకి కింద పడి ఉన్న ఫైర్ అలారం కనిపించింది. "ఏమండీ ఇక్కడ ఫైర్ అలారం కింద పడి ఉంది." ఆన్నది.

      జరిగింది అర్ధం అయ్యింది విక్రమ్ కి. "నువ్వు సాయంత్రం పాటలు పాజ్ లో పెట్టానన్నావుగా. ఆ తరువాత ఆ ఫైర్ అలారం కీ బోర్డు మీద పడడంతో పాజ్ లో ఉన్న బటన్ ఆన్ అయి పాటలు వచ్చాయి" చెప్పాడు విక్రం. జరిగిన విషయం అర్ధమై సమస్య ఏమీ లేదని తెలిశాక మనసు తేలికపడింది ఝాన్సీకి. ఈ ఫోన్ హడావిడి వల్ల ఇండియాలో ఉన్నఇంట్లో వాళ్ళందరకూ విషయం తెలిసి అందరూ ఝాన్సీతో మాట్లాడారు. అంతకుముందు వరకు భయం కలిగించిన విషయం కాస్తా సరదాగా మారింది. 

     ఏం జరిగి ఉంటుందో ఆలోచించకుండా ఏవేవో ఊహించుకుని తను భయపడి వాళ్ళను భయపెట్టినందుకు సిగ్గుగా అనిపించిది ఝాన్సీకి. రెండు వారాలుగా ఒంటరిగా ఉంటున్నా, నిన్న సాయంత్రం వాతావరణం, పరిస్థితులు కలిగించిన అనుమానం తనలో భయాన్ని పెంచినట్లుగా గుర్తించింది. అయినా కూడా ఎవరినీ పిలిచి ఇబ్బంది పెట్టకుండా కొంతవరకూ ధైర్యాన్ని ప్రదర్శించి వెళ్ళి చూసినందుకు గర్వంగానూ అనిపించింది ఆమెకు. అలా ఆలోచిస్తూ ఆ తెల్లవారుఝామున నిశ్చింతగా నిద్ర పోయింది ఝాన్సి.

    ఇంతకూ ఆ ధైర్యశాలి ఝాన్సీలక్ష్మి ఎవరో తెలుసా నేనే..ఇప్పుడిలా సరదాగా చెప్తున్నాను కాని ఆ రాత్రి తలుపు తీసేప్పుడు పేపర్లో చదివినవి, టివిలో చూసిన వార్తలన్నీ గిర్రున తిరిగాయి. నా జీవితలో ఆఖరిరోజన్న నిర్ణయానికి కూడా వచ్చేశాను. ఎప్పుడైనా ఈ విషయం గుర్తొచ్చి ఈ మాట మా వారితో అంటే "ప్చ్ నాకంత అదృష్టమా" అని నిట్టూరుస్తూ ఉంటారు. 

Tuesday, February 21, 2012

అమ్మమ్మ గారూ అమెరికా ప్రయాణం

       నాన్నమ్మ, తాతయ్యల మమకారాలను, వారికి వారి మనుమలకూ వుండే భాషా౦తరాలనూ, అమెరికాలో వున్న పిల్లల, పెద్దల సంఘర్షణలను, ఇతివృత్తంగా తీసికుని చేసిన ప్రయత్నమే ఈ 'అమ్మమ్మగారు అమెరికా ప్రయాణం'.

        ఓ అమ్మమ్మగారు అమెరికాలో ఉన్న మనుమరాలిని చూడడానికి వస్తారు. ప్రయాణం గురించిన కబుర్లు మనం అమ్మమ్మ మాటల్లోనే విందాం.
                                                 
అబ్బ ఏం ప్రయాణమే పరమేశ్వరుడు కనిపించాడనుకో"
"అయినా అంత పెద్ద విమానం నడిపేటప్పుడు మంఛి వంట మనిషిని పెట్టుకోనఖ్ఖర్లా"
"ఆ విమానం బాత్రూముల్లో కనీసం మగ్గులన్నా పెట్టలేదేమే. మన రైళ్ళలోనే నయం. చదవేస్తే ఉన్న మతి పోయిందని"

అమ్మమ్మగారు ఏం తెచ్చారో చూడండి. 

"ఆ ఏమి లేవు అవకాయఉసిరికాయనిమ్మకాయచితకాయ తొక్కుటొమాటో పచ్చడిఉప్పుమిరిపకాయలుకాసిని జంతికలు సున్నుడలుఅరిసెలు"

ఇండియా వెళ్లి తమతో గడపడం లేదన్న బాధతో అమ్మమ్మ వేసిన చెణుకులు

ఆ...చూసి నాలుగేళ్ళవలా ఏం గుర్తుపడతార్లేఆ..అ వచ్చినప్పుడు కూడా షాపింగులనీ , చుట్టాలనీగుళ్లనీ, గోపురాలని తిరుగుతూనే వుంటారాయె."

పిల్లలు కోసం పెద్దల ఆరాటం....వారి మధ్య అడ్డుగోడగా నిలిచిన భాష గురించి బాధతో అమ్మమ్మ గారు ఏమన్నారంటే 

"రెండు నెల్లున్నారమ్మా... అయినా అలవాటే అవలా. ఆ శాంతమ్మవాళ్ళాయన ఆ పిల్లల కోసం కళ్ళలో ఒత్తులేసుకుని ఎదురు చూశారంటే నమ్ము. ఒక్కగానొక్క కూతురాయ."
"అందుకే మరి చిన్నప్పట్నుంచి మన భాష నేర్పితే ఈ రోజు ఈ పరిస్థితి రాదుగా. అమ్మమ్మలునాన్నమ్మలు అనుకున్నప్పుడల్లా వీళ్ళని చూడలేరు. చూసినప్పుడన్నా కరువుతీరా కబుర్లు చెప్పుకోవద్దా."

నాటికలో కొత్త పాత్రల ప్రవేశం. వాళ్ళెవరో ఎక్కడికెళ్ళొచ్చారో చూద్దాం.  

 నళిని : కోల్స్ నుంచి 10 డాలర్స్ ఫ్రీ కూపన్ వచ్చిందని వెళ్ళాం. 
రాధిక : ఓ దానికోసం వెళ్ళారా ఏం కొన్నరేమిటి?
నళిని : ఓ 2పిక్చర్ ఫ్రేములురెండు కార్పెట్లు కొన్నాం.
రాధిక : ఏమిటీ 10 డాలర్స్ కే అన్నొచ్చాయా?
కావేరి: కాదులే బావున్నాయని కొన్నా౦.

టీనేజ్ పిల్లలకు పెద్దలకు మధ్య సంఘర్షణ. 

"ఇంట్లో ఏం వండినా" I don't like this" అంటారు. పోనీ ఏం కావాలో చెప్తారా అంటే అదీ లేదూ. ఒక్కోసారి స్కూల్ నుండి రావడం రావడమే "mom we need to go to staples" అని ఒకటే హడావిడి. వీకెండ్ దాకా ఆగమంటే కుదరదేస్టౌ మీద కూర సగంలో ఆపేసి అలా ఎన్ని సార్లు షాపులకి పరిగెత్తానో..."

వాళ్ళ సమస్యలు విని అమ్మమ్మ ......

"అది మీ మనసులలో ఉన్న సంఘర్షణ కావేరీ. మీరు ఊహించుకున్న జీవితం వేరు. ఇక్కడ మీరేదుర్కుంటున్న పరిస్తితులు వేరు. అందుకే అన్ని సుఖాలు అందుబాటులో వున్నా మీకు జీవితం వెలితిగానే అనిపిస్తుంది."
"వాళ్ళకు మన౦ ఇంట్లో చెప్తున్నవి వేరు బయట వాళ్ళు చూస్తున్నవి వేరు. ఈ సంఘర్షణలో వాళ్ళు నలిగిపోతూ వుంటారు. అది అర్ధం చేసికొని మసలుకోమంటున్నా"
  
తెలుగు నేర్చుకోవాలన్న సరదా....రోజుకు పదిగంటలు ఇంగ్లీష్ ప్రంపంచంలో మెలగాల్సిన పరిస్థితులు...ఇక వాళ్ళ తెంగ్లీషు..

"మను: రేపు కూడా యేవో ప్రాక్టీసులున్నైకాని మానేసి వచ్చేశా౦"
అమ్మమ్మ: రేపు మానెయ్యడమేమిట్రా ?
శ్రీకర్: రేపు కాదురా ఇవాళ. ఇ...వా...ళ. వీడు ఈ మధ్యే తెలుగు నేర్చుకు౦టున్నాడు జేజమ్మా?
మను: ఓకే...ఓకే.... ఈవల.

అమ్మమ్మ గారు, పిల్లలకు పెద్దలకు మధ్య సారధ్యం వహించి పెద్దరికంతో సలహాలిస్తారు. అదండీ కథ. 
మొదటి భాగం 
రెండొవ భాగం 

       ఎప్పుడో విన్న కవితను కొంచెం మార్చి ఓ కవిత వ్రాసి ఈ నాటికలో ఒక పాత్రతో చెప్పించాను. కవి/కవయిత్రి అనుమతి తీసుకోవాలంటే ఎక్కడ ఎప్పుడు చదివానో గుర్తులేదు. ఈ నాటికను ఆదరించిన మా ఊరివాళ్ళకు, నాటికలను ప్రోత్సహిస్తున్న మా తెలుగు అసోసియేషన్ కు, స్ఫూర్తిదాయకమైన కవితను వ్రాసిన కవి/కవయిత్రికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకు౦టున్నాను. 




Sunday, February 12, 2012

మీ ప్రేమ పరిభాష ఏమిటి?

       “ఏమిటీ...ప్రేమకు భాషా?” సందేహంగా ఉంది కదూ! ఉంటుందనే చెప్తున్నారు డా. గేరి చాప్మన్. ఈ ప్రేమ భాష గురించి వారు వ్రాసిన పుస్తకం “ఫైవ్ లవ్ లా౦గ్వేజస్". ప్రశంస, కబుర్లు, పనిలో పాలుపంచుకోవడం, బహుమతులు, స్పర్శ ఇలా ఐదు భాషల ద్వారా ప్రేమను వ్యక్తం చెయ్యొచ్చ౦టున్నారు ఆ రచయిత.

         ఓ ఇల్లాలు కోపంగా ఉన్నారు. “పాపం ఇంట్లో పని ఎక్కువై౦దేమో! సహాయం చేద్దామని” ఆ ఇంటాయన తనవంతుగా కూరలు తరిగేస్తున్నారు,
అన్నం వార్చేస్తున్నారు. ఇంటా బయటా తనే అయి పనులన్నీ చక్కబెట్టేస్తున్నారు. మార్పేమీ లేకపోగా చిర్రుబుర్రులు మరింత ఎక్కువయ్యాయి. సరదాగా సినిమాకి వెళదామన్నారు. కాంతామణికి చిరాకు తగ్గనే లేదు. “నేనింత సహాయం చేస్తున్నా పట్టించుకోవడంలేదని’ ఆ కాంతునకు కూడా కోపం వచ్చేసింది. తరచి చూడగా తెలిసి౦దేమిటంటే ఆ ఇంతికి తన పెనిమిటి సమక్షమే స్వర్గమట. సినిమాలు, టివీల అంతరాయం లేకుండా రోజూ కాసింత సేపు చక్కగా కబుర్లు చెప్పుకుంటే చాలట. ఇక అప్పట్నుంచీ ఆ ఆర్యుడు రోజులో కొంత సమయం తన అర్ధాంగి కోసమే కేటాయించారు. ఆ ఆలుమగల జీవితం న౦దనవనం.


The 5 Love Languages: The Secret to Love That Lasts [Book]ఓ శ్రీమతి పరాకుగా ఉంటున్నారు, తెగ చిరాకు పడిపోతున్నారు. వంటి౦ట్లో గిన్నెలన్నీ కొత్త శబ్దాలు చేస్తున్నాయ్. శ్రీవారు బాగా అలోచించి ఉప్పాడ చీర పట్టుకొచ్చారు, సినిమాకి షికారుకి తీసుకెళ్ళారు. వంటిట్లో గిన్నెలతో పాటు పెరట్లో వస్తువులూ చప్పుడు చేయడం మొదలుపెట్టాయి. రోజులు గడిచేకొద్దీ అమ్మగారి విసుర్లు అయ్యగారి కసుర్లు ఎక్కువవుతున్నాయి. చల్లని సంసారంలో మంటలు రేగాయి. ‘ఎలా ఆర్పాలా’ అని అరా తీస్తే తెలిసి౦దేమంటే, ఆ శ్రీమతి తన బాధ వెళ్ళబోసుకునే సమయాన సదరు శ్రీవారు సలహాలు గట్రాలు ఇవ్వక “అవునా”, “అయ్యో”, “నిజమే సుమా”లతో సరిపెట్టేస్తే చాలునట పట్టుచీరలూ, వెండిమెట్టెలు లాంటి బహుమతులేమీ అఖ్ఖరలేదట. కథ సుఖాంతం.

        పై ఇద్దరి కథలూ విన్న ఓ పతిదేముడు తన సతీమణి కోపంగా, చిరాకుగా ఉన్న సమయంలో స్నేహితుల సలహాలు పాటించారు. ఏమైందటారా? హ హ..పనిచేయలేదు. ఆ మగనికి ఏం చెయ్యాలో తోచలేదు. తల పట్టుక్కూర్చున్నారు, 'కారణమేమయివుంటుందా?' అని ఆలోచనలతో సతమమైపోయారు. ఎన్నో అష్టకష్టాలకోర్చి తెలుసుకున్నదేమంటే, సదరు సతీమణికి బహుమతులంటే అంటే ఇష్టమట. అది తెలిసిన పతిదేముడు సతీమణి కోసం అప్పుడప్పుడు ఓ మిఠాయి పొట్లం, ఓ మూర పువ్వులు, ఓ పుస్తకం... తీసుకురావడం మొదలు పెట్టాడు. ఇక తరువాతేముందీ వారి జీవింతం ముళ్ళదారి వదిలి పువ్వులనావలో సాగింది.

         ఓ తండ్రి ఇంటికి రావడమే టివి చూస్తున్నాడని కొడుకు మీద ఎగిరిపడ్డాడు. “ఇప్పటివరకూ చదువుకున్నాడు ఇప్పుడే చూస్తున్నాడని” శ్రీమతి చెప్పబోయినా చాల్లే “నీ వల్లే చేడిపోతున్నాడని” శ్రీమతినీ విసుక్కున్నాడు. మొహం ముడుచుకుని పిల్లాడు గదిలోకి, శ్రీమతి పెరట్లోకి వెళ్లారు. ఈ మధ్య ప్రతి రోజూ జరిగే ఇలాంటి విసుర్లకు అర్ధం తెలియక ఆ శ్రీమతి తల్లడిల్లిపోతూంది. ఆ శ్రీవారికి కావలసిందేమిటి? ఎందుకలా కోపంగా ఉంటున్నారు?
         
         ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఓ సంవత్సరం తిరిగేసరికి “అసలు నీలాంటి వాణ్ని చేసుకున్నాను నాకు బుద్దిలేద”ని ఆవిడంటే, “ఆ లేదన్న విషయం ఇప్పటి వరకూ దాస్తావా” అని అతను. ‘ఛీ’ అంటే ‘ఛీఛీ’ అని ‘ఛా’ అంటే ‘ఛాఛా’ అని అనుకున్నారు. వారిద్దరిమధ్య తేడా ఎక్కడొచ్చింది?

        ఈ ప్రేమ భాష భార్యాభర్తలకో, ప్రేమికులకో పరిమితం కాదండోయ్! పిల్లలకు తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది. పిల్లలు మన మాట వినట్లేదని బాధపడిపోతూ ఉంటాం. అసలు మనం వాళ్ళ భాషలో చెప్తున్నామా? వాళ్లకు కావలసిన ఆసరా మనమిస్తున్నామా?

       ఒకరికి ఒక భాషే ఉంటుందా, ఉంటే తరచు అది మారుతుందా? భార్యా భర్తలిద్దరిదీ ఒకటే భాష అయితే సమస్య ఉండే అవకాశం ఉందా? ఉంటే ఎలా పరిష్కరించుకోవాలి? మన ప్రేమభాష తెలుసుకోవడం ఎలా? ఇలా అనేక విషయాల మీద ఈ పుస్తకంలో చక్కని విశ్లేషణ ఉంది. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం “ఫైవ్ లవ్ లాంగ్వేజస్”.




Monday, February 6, 2012

తల కళ్ళు

       అక్క బుల్లి డ్రాయింగ్ టేబుల్ దగ్గర కూర్చుని దీక్షగా బొమ్మ వేసుకుంటుంది. బుజ్జిపండు అక్క దగ్గరకెళ్ళి నిలబడ్డాడు. "కక్కా(మన బుజ్జాయికి అప్పటికి అక్క అనడం రాదు) నువ్వేం చేత్తున్నావ్?" అడిగాడు పండు. "బొమ్మ వేస్తున్నా" తల పైకెత్తకుండానే చెప్పింది అక్క. "ఏం బొమ్మ?" కొంచెం ఒంగి మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని బొమ్మ వైపు చూస్తూ అడిగాడు పండు.  "మన ఫామిలీ బొమ్మ వేస్తున్నా" పేపర్ పైకి పెట్టి ఆనందంగా చూసుకుంటూ చెప్పింది అక్క.

"ఇది ఓలు?" ఒక బొమ్మ మీద వేలు పెట్టి చూపిస్తూ అడిగాడు.

"అది అమ్మ" చెప్పింది అక్క.
"మలి ఇది?"
"నాన్న"
"ఇది కక్క" కాళ్ళ వరకు పొడవు జుట్టున్న బొమ్మను చూపించి ఆనందంగా చెప్పాడు పండు. అక్కను తలచుకుంటేనే పండు మోహంలో సంతోషం తోసుకుని వస్తుంది.
"గుడ్ జాబ్. భలే కనుక్కున్నావే". అక్క మొహం వెలిగిపోయింది. అక్క వేసిన లావుపాటి బెరడు పైన చిన్న బాల్ ఆకారంలో వున్న చెట్టును చూపిస్తూ "ఇది బిల్దింగ్" అన్నాడు పండు.

      అక్కకు అది నచ్చలా. 'నేను ఇంత బాగా చెట్టు వేస్తే బిల్డింగ్ అంటాడా' అనుకుని, "బుజ్జిపండూ నువ్వు బ్లాక్స్ పెట్టుకో" అంది. పండుకి బ్లాక్స్ పెట్టడం అంటే ఎక్కడలేని సరదా. రయ్యిమని పరిగెత్తుతూ మూలనున్న పెద్ద డబ్బాని గది మధ్యకు లాక్కుని వచ్చి మూత తీసి అన్నీ కిందపోశాడు. ఆ శబ్దానికి అక్క రెండు చెవులూ గట్టిగా మూసుకుంది. పెరట్లో మొక్కలకు నీళ్ళు పోస్తున్న అమ్మ ఏం జరిగిందోనని పరిగెత్తుకునొచ్చి౦ది. అమ్మయ్య బ్లాక్స్ శబ్దమే అనుకుని "పండూ ఆడడం అయిపోయాక అన్నీ సర్దేయాలి. ఏం" అని చెప్పింది. "ఓకే అమ్మా" అంటూ బుజ్జిపండు బ్లాక్స్ ఒకదాని మీద ఒకటి పెట్టడం మొదలుపెట్టాడు. 

     "కక్కా కక్కా, లుక్ లుక్" సంతోషంగా చప్పట్లు కొడుతూ పిలిచాడు బుజ్జిపండు. ఓ సారి తలెత్తి చూసి, తమ్ముడి కళా సృష్టికి ఒకి౦త ఆశ్చర్యపడి "వావ్ భలే పెట్టావే, ఇంతకూ ఏంటి పండూ అది?" అని అడిగింది. "ఇది ఏలోపెన్." దాని చుట్టూ ఎగురుతూ బదులిచ్చాడు. కాసేపటికి మళ్ళీ బ్లాక్స్ అటూ ఇటూ మార్చి "కక్కా కక్కా" అని పిలిచాడు. "మెల్లగా తలెత్తి చూసి, "ఇప్పుడే౦ పెట్టావు పండూ" అడిగింది. "కాల్" చెప్పాడు బుజ్జి. "కార్ చాలా బావుంది." అని బొమ్మకి క్రేయాన్ తో రంగులు వేయడం మొదలు పెట్టింది.

     "కక్కా లుక్" మళ్ళీ పిలిచాడు పండు. అక్క చూడలేదు దీక్షగా రంగుల్లో మునిగి పోయింది. దగ్గర కెళ్ళి మొహంలో మొహం పెట్టి "కక్కా కక్కా, చూలు ఏం పెత్తానో" అని బ్లాక్స్ వైపు చూపించాడు. అక్క అయిష్టంగా బొమ్మ మీదనుంచి చూపు మరచి కొంచెం నీరసంగా "గుడ్ జాబ్ పండు" అంది. అక్క మెచ్చుకోగానే పండు ఎగురుకుంటూ బ్లాక్స్ దగ్గరకెళ్ళాడు. ఓ ఐదు నిముషాలాగి "కక్కా లుక్" అన్నాడు. అక్క తలెత్తకుండానే "చూస్తున్నా పండూ" అంది. పండు నమ్మలా "లుక్ ఎత్ మై ఎల్లో తక్" అన్నాడు మళ్ళీ.

    "పండూ నాకు ఫోర్ ఐస్ ఉన్నాయ్. రెండు ఫ్రంట్ రెండు బాక్. నా బాక్ ఐస్ తో చూస్తున్నా" అని వివరించింది అక్క. దానికి సాక్ష్యంగా "నీ ఎల్లో ట్రక్ బావుంది" అని మెచ్చుకుంది కూడా. నిజమే కాబోలనుకున్నాడు పండు. అప్పటినుండి ఎప్పుడైనా అక్కని పిలిచి అక్క తల తిప్పకపోతే "ఓ బాక్ ఐస్ తో చూస్తున్నావా" అనేవాడు పండు. ఓ రెండేళ్ళు అక్క 'తల కళ్ళు' దివ్యంగా పనిచేశాయి. నిజం తెలిసే వరకూ బుజ్జి పండు హాపీస్, అక్క హాపీస్. ఇద్దరూ గొడవ చెయ్యకుండా ఆడుకు౦టున్న౦దుకు అమ్మ కూడా హాపీ.