Sunday, January 26, 2014

"ఊ..." అంటే వస్తుందా?

"అనగనగనగా ఒక ఊర్లో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఒకరోజు బావి గట్టుమీద కూర్చుని బట్టలు కుడుతోంది." ఓ రోజు రాత్రి భోజనాలయ్యాక పిల్లలిద్దరికీ కథ చెప్తోంది అమ్మ. 

"అప్పుడు సూది జారి బావిలో పడిపోయింది. ఆ సూది ఎలా బయటకు వస్తుంది?" పిల్లల్ని వైపు చూస్తూ ఆడిగింది.
"పెద్ద మాగ్నెట్ కి తాడు కట్టి బావిలో వేస్తే వస్తుంది." చిట్టితల్లి సమాధానం. 
"బావి అడుగునంతా బురద, ఇసుక, ఇనుప ముక్కలు,  చిన్నచిన్న రాళ్ళు అన్నీ ఉంటాయి కదా! దొరకడం చాలా కష్టం"
"బావిలోకి జంప్ చేసి వెతికితే దొరుకుతుంది" గర్వంగా అక్క వైపు చూశాడు పండు.
"చిన్న సూది కార్పెట్ మీద పడితేనే కనిపించదు ఇక బావిలో ఎలా దొరుకుతుంది పండూ?"
"బావిలో నీళ్ళన్నీ బయటకు పంప్ చేస్తే కనిపిస్తుంది" చెప్పి౦ది చిట్టితల్లి 
"నీళ్ళన్నీ పంప్ చేసినా కింద బురదలో కూరుకుని ఉంటుంది కాని కనిపించదు." 
"దెన్ హౌ?" ఆలోచనలో పడ్డాడు పండు. 

నాన్న ఈ కథనంతా ఆసక్తిగా వింటున్నాడు. చిన్నప్పుడు చాలా సార్లే విన్నాడీ కథ, కాని "ఊ అంటే వస్తుందా? ఆ అంటే వస్తుందా" అ౦టూ పెద్ద వాళ్ళు ఆట పట్టించడమే అతనికి తెలుసు. నిజంగా బయటకు తీసే ఉపాయం చెప్తుందేమో అని  చేసే పని ఆపేసి మరీ వాళ్ళ సంభాషణ వింటున్నాడు. 

"సూదిని ఫైండ్ చేసే స్పెషల్ టూల్స్ ఏమైనా ఉన్నాయా?" అడిగింది చిట్టితల్లి.
"ప్చ్.." పెదవి విరిచింది అమ్మ. 
"ఐ నో" అరిచాడు పండు. 
"ఏమిటో చెప్పూ" అక్కకు కూడా త్వరగా తెలుసుకోవాలని కుతూహలం. 
"సూదికి దారం ఉందిగా అది ఫ్లోట్ అవుతుంది కదమ్మా" గారంగా అమ్మ ఒళ్ళో పడుకుని ఆమె గాజులతో ఆడుకుంటూ చెప్పాడు. 
"ఒట్టి దారమే అయితే ఫ్లోట్ అవుతుంది పండూ. కాని సూది బరువు కదా సూదితో పాటు దారం కూడా మునిగి పోయింది ." 
"బావి అడుగున ఫిల్టర్ ఉంటుందా పడినవన్నీ బయటకు తెచ్చుకోవడానికి" చిట్టితల్లి ప్రశ్న. 
"అలాంటివి ఏమీ ఉండవు"
"అయితే వాటర్ అంతా బయటకు పంప్ చేయడమే బెస్ట్ ఆప్షన్" ఓ నిర్ణయానికి వచ్చేసింది చిట్టితల్లి. 
"ఆ అవ్వకు నీళ్ళన్నీ బయటకు తోడే శక్తి లేదు. పైగా ఎంత తోడినా మళ్ళీ నీరు ఊరుతూనే ఉంటాయి"  తనకు తెలియకుండా నాన్న కూడా వాళ్ళ కథలోకి వచ్చేశాడు. 
"సం హౌ షి నీడ్స్ టు ఫైండ్ ఇట్, డాడ్" నాన్నను చూడగానే చిట్టితల్లి భాష మారింది. 
వాళ్ళ మాటలకు నవ్వింది అమ్మ. "ఏం చేసినా దొరకదు నాన్నా అది" 
"మరి?" పండు 
"కొన్ని థింగ్స్ అంతే. ఒకసారి జారిపోయాక మళ్ళీ దొరకవు"  
"బట్...బట్, అవ్వకి సూది కావాలి గామ్మా" పండుకు అమ్మ చెప్పిన ముగింపు నచ్చలేదు. 
"కావాలి. అవ్వ బావిలోకి ఒకసారి దీర్ఘంగా చూసి నిట్టూర్చి, మౌనంగా ఇంట్లోకి వెళ్ళి ఇంకో సూది తెచ్చుకుని మళ్ళీ కుట్టడం మొదలుపెట్టింది."
"ఆ" ఆశ్చర్య పోయాడు పండు.

"అయితే పాత సూది పోయినట్లేనా? అవ్వదానికోసం వెతకలేదా?" అడిగింది చిట్టితల్లి. ఆమెకు ఏ వస్తువు పారేయడం ఇష్టం ఉండదు. తన ప్రీస్కూల్ బొమ్మలు, విరిగి పోయినవి కూడా ఇంకా తనదగ్గర ఉన్నాయి. 
"పోగొట్టుకున్న సూదే కావాలని పట్టుబడితే. అది దొరకొచ్చేమో కాని దాన్ని వెతికే ప్రయత్నంలో చాలా నష్టపోవాల్సి వస్తుందని అవ్వకి బాగా తెలుసు" చెప్పింది అమ్మ. 
"కాని పాత సూదే బావుంటుంది కదా! ఐ కాంట్ ఫర్గెట్ట్ ది ఓల్డ్ వన్స్" 
"మరచిపోవడం ఎందుకు? మంచి జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుంటే సరి. అయితే దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే పోయిన సూది తిరిగి రాదు, కుట్టడమూ పూర్తవదు" 
"సో వుయ్ నీడ్ టు లెట్ ఇట్ గో అఫ్ థింగ్స్" ఆలోచిస్తూ చెప్పింది చిట్టితల్లి. 
"ఎగ్జాట్లీ" చెప్పాడు నాన్న.   
"నాట్ ఓన్లీ థింగ్స్ బట్ పీపుల్ టూ" ముక్తాయించింది అమ్మ.


28 comments:

 1. హ్మ్.. బాగుందండీ.. ఏం చెప్పబోతున్నారా అని ఆసక్తిగా చదివా.. Very well said but that is the toughest part... బుద్దికి తెలుస్తుంటుంది కాని మనసేమాట వినదు.

  ReplyDelete
  Replies
  1. థాంక్యు వేణు గారు. మనసు మాట వినాలంటే బుద్దిని బా...గా ఎదగనివ్వడమే.
   ఆ ప్రయత్నమే ఇది. :)

   Delete
 2. Replies
  1. థాంక్యు బోనగిరి గారు.

   Delete
 3. u mean 2 say forget the people lost :)

  ReplyDelete
  Replies
  1. మానసికంగా మనల్ని వదిలిపోయిన వారికి కూడా వర్తిస్తుంది బాబాయి గారు.

   Delete
 4. Nice interpretation!What is lost is an everlasting memory whether they are things or people!

  ReplyDelete
  Replies
  1. థాంక్యు ఉమాదేవి గారు.

   Delete
 5. Bavundandi muginpu....chinnappudu memu u ante vastundaa annavallame..radhika(nani)

  ReplyDelete
  Replies
  1. మేము కూడానండి. ఇప్పుడు పిల్లలు ఊ..ఆ..అనకుండా సమాధానాలు ఇచ్చేస్తున్నారు.

   Delete
 6. "నాట్ ఓన్లీ థింగ్స్ బట్ పీపుల్ టూ"...heart touching at the end!

  ReplyDelete
  Replies
  1. దుఃఖములో కూరుకుపోతే మన మీద ఆధారపడిన వారి పరిస్థితి? స్థితప్రజ్ఞత అలవాటు చేసుకోవాలని గీతా సారాంశం కదండి.

   Delete
 7. బాగుంది మేడం...
  చివరిదాకా ఇంటరెస్టింగ్ గా
  చదివేట్లు చేసారు...

  అది దొరకొచ్చేమో కాని దాన్ని వెతికే
  ప్రయత్నంలో చాలా నష్టపోవాల్సి వస్తుందని...

  practicality...

  సమయానికి తగిన ఆలోచన లేకుండా...
  పోయిన సూదే వెదుకుతాం అందరం జనరల్ గా...
  అవ్వ పాటి ఆలోచన లేకుండా...

  మీ బ్లాగ్ లుక్ చాలా బాగుంది...
  నీట్ గా సర్దబడిన ఇంటిలా...
  ముగ్గులన్నీ కంటికి ఇంపుగా...


  అభినందనలు...

  ReplyDelete
  Replies
  1. ముగ్గుమీద మీరు చల్లిన పూలు కూడా అందంగా ఉన్నాయి.
   ధన్యవాదాలు రావు గారు.

   Delete
 8. Replies
  1. సరదాగా అంటున్నారు కాని మీకు చెప్పే౦తటి దాన్నా.
   థాంక్యు

   Delete
 9. Replies
  1. థాంక్యు కొత్తపాళి గారు

   Delete
 10. మరిచిపోవటం ఎందుకు ? మంచి జ్ఞాపకం గా గుర్తు పెట్టుకుంటే సరి ........ చాలా బాగుందండి మీ మాట

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు భాను గారు.

   Delete
 11. అది దొరకొచ్చేమో కాని దాన్ని వెతికే ప్రయత్నంలో చాలా నష్టపోవాల్సి వస్తుందని అవ్వకి బాగా తెలుసు" చెప్పింది అమ్మ. good

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు.

   Delete
 12. అప్డేటెడ్ జెనెరేషన్ తో బాటూ అప్డేట్ అయిన అమ్మ చెప్పిన కథ. వెరీ నైస్ :)

  ReplyDelete
  Replies
  1. అప్డేట్ అయిన మీ వాఖ్యను ఆనందంగా చదువుకున్నాను స్ఫురిత గారు.

   థాంక్యు.

   Delete
 13. సునిశితమైన ఆలోచనతో చాలా బాగా రాశారు.బాధించే జ్ఞాపకాలున్నా మునుముందుకు సాగాలని చక్కగా చెప్పారు

  ReplyDelete
  Replies
  1. ఇలా ప్రోత్సాహించే వాళ్ళుంటే ఇంకా రాయాలనిపిస్తుందండి. ధన్యవాదాలు బ్రహ్మేశ్వరావు గారు.

   Delete
 14. మిమ్మల్ని పేరుతో సంభోదించాలంటే మనసు రావడం లేదండీ. అక్కా అనాలో, ఆంటీ అనాలో కూడా తెలియడం లేదు.

  మీరు రాసిన ఈ కథ, wow! I just loved it. ఆ మాటకొస్తే మీ రాతలన్నీ చాలా చాలా బావున్నాయి :)

  ReplyDelete
  Replies
  1. బ్లాగులో చాలా చదివినట్లున్నారే. అంత అభిమానంగా మాట్లాడారు అది చాలు. పిలుపులో ఏముందిలెండి.

   Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.