Sunday, March 16, 2014

మా వాళ్ళు ఒప్పుకోరేమోనండీ

"నమస్తే డాక్టర్ గారు."
"రామ్మా రా. ఓ పిల్లల్ని కూడా తీసుకొచ్చావా?"
"అవునండి. ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోలేదుగాని, పిల్లల్ని మీరోసారి పరీక్ష చేస్తే మంచిదని తీసుకొచ్చాను. ముందు మా చిన్నబాబును చూడండి.”
“ఏమైందమ్మా బాబుకు?”
“వీడు ఎవరి దగ్గరికీ పోడండి. ఇరవై నాలుగ్గంటలూ నన్నంటిపెట్టుకునే ఉంటాడు."
"బాబుకిప్పుడు నాలుగేళ్ళు కదూ! సాధారణంగా పిల్లలకు మూడేళ్ళ వయసొచ్చేప్పటికే ఆ భయం పోతుంది. కాని..... “
“చెప్పండి డాక్టర్, సందేహించకండి.”
“మీ బాబుకు మాత్రం పోదమ్మా"
"ఎందుకని డాక్టర్?"
"అది తనకు వంశపారంపర్యంగా సంక్రమించింది."

"మా వాళ్ళెవరూ అస్సలు ఇంట్లో ఉండరుకదండీ. ఉదయం నిద్ర లేస్తే ఆ ఊరు ఈ ఊరు అని తిరుగుతూనే ఉంటారు. ఆఖరికి మా అత్తగారు కూడా ఇరవై నాలుగు గంటలూ అరుగుమీద కూర్చుని ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ రాజకీయాలు మాట్లాడుతుంటారు."
"మరి అంతా తెలిసిన వాళ్ళు, ముందు వెనుకలు ఆలోచించకుండా పరిచయస్థులకో, బంధువులకో మాత్రమే ఎందుకు మద్దతిస్తారో తెలుసా? అలాంటి నిర్ణయాల వలన జరిగే అనర్ధాలు కూడా ఊహించగలరు. కాని పాపం మీ వాళ్ళకు కొత్త వాళ్ళంటే భయం. దీన్నే 'స్ట్రేంజర్ యాంగ్జైటీ' అంటారు.

"ఓ...మా మామగారి పెద్ద అమ్మమ్మ గారి చిన్న మనవడు లేడూ, అదేనండీ అందరూ చంటి అంటారే! అతను చదువు చట్టుబండలూ లేక రాజకీయాల్లో తిరుగుతుంటాడు. అతనేం మాట్లాడతాడో అతనికే తెలియదు. మా చేత అతనికి ఓట్లేయించినప్పుడు ఎందుకా అనుకున్నాను. ఇదన్నమాట సంగతి."
"...."

"సర్లెండి. మా పెద్ద బాబునోసారి చూడండి డాక్టర్. దూరానున్నవి సరిగ్గా కనిపించట్లేదటండీ. పాపం టీచర్ బోర్డు మీద ఏం రాస్తున్నారో తెలియట్లేదట."
"దాందేముంది. పరీక్ష చేసి మంచి అద్దాలిద్దాంలేమ్మా."
"అప్పుడు సరిగ్గా చూడగలడా డాక్టర్?"
"ముందున్నదేదో చూడగలడు. కానీ ముందుచూపు మాత్రం తనకు ఎప్పటికీ లేకపోవచ్చు. అదీ వంశపారంపర్యమే"

"అయ్యో అలాగా! అవునులెండి. ఆ ముందుచూపే ఉంటే ఎమ్ ఎల్ ఏ చనిపోతే కనీసం సంతకం పెట్టటం కూడారాని వాళ్ళావిడకు మా వాళ్ళు పట్టుబట్టి మరీ పదవెందుకు ఇప్పిస్తారు? ఆ కుటుంబం మీద సానుభూతి ఉంటే బ్రతుకు తెరువు చూపించాలి కాని, అర్హతలేని ఆవిడకు అధికారం అప్పచెప్పడం..."
"...."
"మా పాపనోసారి చూడండి డాక్టర్ గారు. తనకు సరిగ్గా వినిపించడం లేదండీ. ఏ విషయమైనా గట్టిగా అరిచి చెప్పాల్సి వస్తుంది."
"పాపా, ఇటు రామ్మా. ఇలా కూర్చో"
.

.

"చెముడేమన్నా ఉందా డాక్టర్?"
"పాపకు బాగానే వినిపిస్తుందమ్మా. తనే వినిపించుకోవడం లేదు"
"ఇది కూడా....."
"అవునమ్మా... నీ అనుమానం నిజమే. మీ మామగారి దగ్గరనుండి అందర్నీ పరీక్ష చేస్తున్నాను. మీ వాళ్ళందరకూ ఉన్నదే ఇది కూడానూ"
“నిజమేలెండి. వినిపించుకుంటే మా వాళ్ళకు మంచీ చెడ్డా తెలిసి ఊరుకి మంచి చేసేవాళ్ళనే ఎన్నుకునేవాళ్ళుగా! అలా వినిపించుకోక పోబట్టి కదూ కనీసం ఊర్లో మంచి నీళ్ళు కూడా లేకుండా నానా ఇబ్బందులూ పడుతున్నాం, ఆడవాళ్ళం పట్టపగలు నడిరోడ్లో ఒంటరిగా నడవడానికి భయపడి చస్తున్నాం.”
“......”

“డాక్టర్ గారూ, మరి మా బావగారు, వదిన గారు ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. బాగా తెలివికల వాళ్ళని మాష్టారు గారు ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటారు కూడాను. వాళ్ళకిలాంటివేమీ లేవు కదండీ.”
“ఎందుకు లేవమ్మా మొహమాటం అనే అతి ప్రమాదకరమైన జబ్బుంది. మీ ఇంట్లో తీగ మీద ఆరేసిన పట్టుచీరను ఏ దొంగైనా పట్టుకుపోవడం చూస్తున్నా నోరు తెరిచి ఒక్కమాటా మాట్లాడరు. ఆ దొంగేమైనా అనుకుంటాడనీ, దారిని పోయేవాళ్ళకు వినిపిస్తుందనీనూ."
"అయ్యో....అయితే ఇక ఈ పిల్లలు ఇంతేనా డాక్టర్ గారు. ఇవన్నీ పోవడానికి మందేమైనా ఇవ్వండి."

"మందంటే....ఆ, రోజుకో పది నిముషాలు ఆలోచించడం నేర్పమ్మా"
"మా ఇంటా వంటా లేని పనని మా వాళ్ళు ఒప్పుకోరేమోనండీ..."



19 comments:

  1. పాపం ఈ కుటుంబం ఇంకెంత కాలం ఇలా అవస్థలు పడాలో నండీ!

    ReplyDelete
    Replies
    1. ఆలోచించడం, స్వంత నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకునే వరకూనండి.

      Delete
  2. అద్దరకొట్టేసారు...

    ReplyDelete
    Replies
    1. అందుకే ఎక్కడా చప్పుడు లేదు ప్రవీణా.

      Delete
  3. మీరు మరీనూ!! ఇలా ఇన్ని నిజాలు ఒకే కథ లో రాసేస్తే ఎలా?

    ReplyDelete
    Replies
    1. ఇంకా చాలా నిజాలు ఉన్నాయండి. రాస్తే తట్టుకోలేరేమోనని తక్కువే రాశాను.

      Delete
  4. Replies
    1. ఏమిటీ తూరుపు తిరిగి దండం పెట్టేశారా.. :)

      Delete
  5. Replies
    1. ఏం చెయ్యాలో అర్ధంకాక నవ్వేశారా?

      Delete
  6. tagalalsina chote tagilindi andi :)

    ReplyDelete
  7. చాలా బాగుంది ." మా వాళ్ళు ఒప్పుకోరేమోనండీ..." =)

    ReplyDelete
    Replies
    1. థాంక్యు రాజ శేఖర్ గారు.

      Delete
  8. ఫ్యామిలి ఫ్యామిలి ఇలా ఉంటే ఇహ మనమేమి చేయగలమండి జ్యోతిర్మయి గారు. కథ కథనం ఆసక్తికరంగా సాగింది. నెనర్లు.

    ReplyDelete
    Replies
    1. ఫామిలీ ఇలా ఉన్నా పీపుల్ ఇలా ఉన్నా ఆలోచించడం నేర్చుకునే దాకా ఏమీ చేయలేమండీ. ధన్యవాదాలు :)

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.