Tuesday, June 24, 2014

కాఫీ కప్పు.....కాపర్ హెడ్డు

      మొన్నో రోజు మధ్యాహ్నం పూట ఎవరో బెల్ కొట్టారు. తలుపు తెరిచాను. ఆకుపచ్చ రంగు చొక్కా, ఖాకీ పాంట్ వేసుకుని తలుపుకు రెండడుగులు దూరంగా ఒకతను నిలబడి ఉన్నాడు. చొక్కామీదేదో బాడ్జ్ ఉంది.

       "మీ తోటలో చీమల పుట్టలున్నాయ్, మీ చూరు కింద కందిరీగ తిరుగుతోంది" అన్నాడు. బెల్ కొట్టి మరీ ఈ విషయం చెప్పాలా? అనుకుంటుండగా అతను "నా పేరు స్కాట్. ఫలానా పెస్ట్ కంట్రోల్ కంపెనీలో పనిచేస్తున్నాను. నెలకో నలభై డాలర్లిస్తే వాటిల్నిమీ ఇంటి వైపు రాకుండా చేస్తాం" అన్నాడు.

      మా ఊర్లో చీమలంటే అలాంటిలాంటివి కాదు కరెంట్ చీమలు. తోటలో అక్కడక్కడా తవ్వేసి పుట్టలు పెట్టేస్తాయి. చూడకుండా కాలేస్తే ఇక అంతే కాలిపైకెక్కి చటుక్కున కుట్టేశాయంటే కాలంతా దద్దుర్లే. అయితే మాత్రం చీమలు పోవడానికి నెలకు నలభై డాలర్లా. రాణి చీమను చంపే మందుందిగా దాన్ని కాస్త పుట్టమీద చల్లితే చాలు. చీమలు అమాయకంగా దాన్ని తీసుకువెళ్ళి రాణి చీమకివ్వడం, అది చచ్చిపోవడం, దానితో ఈ చీమలు మరో స్థావరం వెతుక్కోవడం చేస్తూ ఉంటాయి. ప్రతి ఏడాది ఈ విధంగానే చీమలను తరిమేస్తూ ఉంటాం.

     "చీమలకు, కందిరీగలకు మందు వేస్తూ ఉంటాం. మాకు మీ సర్వీసెస్ అక్కర్లేదు" అని చెప్దామనుకుంటూ ఉండగా స్కాట్, గులాబీలను చూపిస్తూ "జపనీస్ బీటల్స్ కూడా రాకుండా చేస్తాం" అన్నాడు. ఎండాకాలం మొదలవడం ఆలస్యం, ఈ జపనీస్ బీటల్స్ పొలోమని కుటుంబాలతో సహా వలస వచ్చేస్తాయి. ఇక తోటలో ఆకులన్నీ జల్లళ్ళే. గులాబీల పరిస్థితి మరీ దారుణం, రేకు రేకులో బీటిల్స్ దాక్కుని మరీ వాటిని భోంచేస్తుంటాయి. ఇంతకుముందు పుల్లగా ఉందనేమో ఎర్ర గోంగోరను వదలిపెట్టేసేవి. వాటికీ రుచి తెలిసినట్లుంది ఇప్పుడు గోంగోర, బెండ, సొర ఒకటేమిటి అన్నింటినీ తినేస్తున్నాయ్. వాటి కోసం మందులేవో తెచ్చి చల్లి చూశాం. చల్లినప్పుడు పారిపోయి నాలుగురోజులు పోయాక మళ్ళీ వచ్చేస్తాయ్. గులాబీ మొగ్గ కొంచెం రేకు విచ్చగానే అందులో దూరిపోవడం...

       పనిమీద బయటకెళ్ళిన ఇంటాయన కారు దిగడంతోనే స్కాట్ ఆయన్ను అక్కడే ఆపేసి, టర్మైట్స్ గురించీ, అవి ఇంటిని నాశనం చేసే తీరు తెన్నులు గురించి చెప్పేసి, ఈయన్ను ఊదరగొట్టేసి అవునననిపించుకుని ఇంటి చుట్టూ మందు కొట్టేసి వెళ్ళిపోయాడు.

       ఓ నాలుగురోజులు ఎక్కడా చీమ, పురుగు కనిపించలేదు మొన్న శుక్రవారం మాత్రం మళ్ళీ ఓ నాలుగు బీటిల్స్ కానిపించాయి. "చూశారా అతను ఉట్టి కబుర్లు చెప్పి వెళ్ళాడు. నాలుగు రోజుల్లో మళ్ళీ వచ్చాయివి" అంటూ కత్తెర పట్టుకుని బయలుదేరాను ఆ బీటిల్స్ ఉన్న పూలు కత్తిరించడానికి. "వాటినేం చెయ్యకు పెస్ట్ కంట్రోల్ వాళ్ళకు ఫోన్ చేస్తాను. వాళ్ళే వచ్చి మందు వేస్తారు" అన్నారు.

      ఇవాళ ఉదయం సుమారు పదిగంటల ప్రాంతంలో వచ్చాడు స్కాట్. "మొక్కలకు మందు వేస్తున్నాను" అని చెప్పి పెరట్లోకెళ్ళాడు. అలా చెప్పకపోతే "ఏ అగంతకుండో పెరట్లో దూరాడు" అనుకుంటానని కాబోలు! ఓ పావుగంట తరువాత చీమల పుట్టలకు, బీటిల్స్ కి మందు వేశానని రాసున్న కాగితాన్ని ఇచ్చి సంతకం పెట్టమన్నాడు. ఆ పని పూర్తవగానే వెళ్ళడానికి రెండడుగులు వేసి వెనక్కి తిరిగి

"బైదవే మీ తోటలో ఆ వైపు పాముంది" అన్నాడు.
"పామా? ఏం పాము? ఎక్కడ?" కొంచెం కంగారుగా అడిగాను.
"అదిగో అక్కడ వర్షం నీళ్ళు పడడానికి గొట్టం కింద పచ్చగా ట్రే పెట్టేరుగా దాని కింద. మందు చల్లేప్పుడు చూశాను"
"అమ్మయ్య పెస్ట్ కంట్రోల్ తీసుకోవడం మంచిదయ్యింది" అనుకుంటూ "ఏం పామది? నీళ్ళ పామేనా?" అడిగాను.
"కాదు. కాపర్ హెడ్"
"అయ్య బాబోయ్. కాపర్ హెడ్డా. చాలా విషపూరితమైంది కదూ! నువ్వు చూడబట్టి సరిపోయింది. సాయంత్రమైతే వీధిలో పిల్లలంతా గడ్డిలోనే ఆడుతూ ఉంటారు." అన్నాను.
"యా చిన్న పామే. నేను దాన్ని కదిలించలేదు" అన్నాడు.
అతనేం అంటున్నాడో నాకర్ధం కాలేదు. "ఇంకా బతికే ఉందా? అంటే నువ్వు చంపలేదా?" కొంచెం భయంగా అడిగాను.
"నో...నో మేం కేవలం చీడపురుగులనే చంపుతాం. పాముల్ని పట్టుకోవాలంటే యానిమల్ కంట్రోల్ వాళ్ళను పిలవాలి."

        కారు దగ్గరకు వెళ్ళి యానిమల్ కంట్రోల్ నంబరున్న పేపరొకటి తెచ్చి నాచేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అతను పాముందని చెప్పిన వైపు చూస్తే దట్టంగా హైడ్రాంజియా, కమేలియా పొదలున్నాయి. మూడొందల అరవై రోజులు ఇంటి నుండి పనిచేసి అవసరమైన అర్రోజులే ఆఫీసుకి వెళ్ళడం అయ్యవారికి అలవాటు. ఫోన్ చేశాను. ఏ అత్యవసర సమావేశంలో ఉన్నారో ఫోన్ తియ్యలేదు. మెసేజ్ పెట్టాను. పోయిన సంవత్సరం తెలిసిన వాళ్ళింట్లో కాపర్ హెడ్ చంపారని గుర్తొచ్చి అతనికి ఫోన్ చేశాను.

     "మా ఇంటి ముందు పాముందట, యానిమల్ కంట్రోల్ కు ఫోన్ చెయ్యనా?" "వాళ్ళు వెంటనే రారు. అటువైపు వెళ్ళకండి. సాయంత్రం చూద్దాం" అని సలహా ఇచ్చారు.

      ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. "పాము కనిపిస్తే ఏం చెయ్యాలి?" గూగులమ్మను అడిగాను. ఏం చెయ్యొద్దు దాన్ని కదిలించకుండా ఉంటే దాని దారిన అదే పోతుంది అని సమాధానం వచ్చింది. "దాని దారిన అదే పోతుందా! ఎక్కడికి పోతుంది? ఏమో!" "అసలు పాములు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?" ఈ సారి ప్రశ్నను కొంచెం మార్చాను. ఈ ప్రశ్నకు చాలా సమాధానాలే ఉన్నాయి.



      "పిల్లిని పెంచాలి". "పిల్లినా బాబోయ్! పిల్లలతోనే క్షణం తీరిక ఉండడంలేదు. ఇక పిల్లులూ, కుక్కలూ ఎక్కడ. అయినా పిల్లిని పెంచితే పాములు రావా" అనుకుంటూ అసాంతం చదివాను. పిల్లుల వలన ఎలుకలూ, చుంచులూ, పక్షులు రావు కాబట్టి వాటిని ఆహారంగా తీసుకునే పాములు కూడా రావని ఉంది. ఇంట్లో ఎలుకలూ, చుంచులూ లేవు కాబట్టి పిల్లిని పెంచడం పరిష్కరం కాదు.

       "పందిని పెంచాలి." మా 'హెచ్ ఓ ఏ' బహుశా దీనికి ఒప్పుకోకపోవచ్చు.
"నెమలిని పెంచాలి" ఏమిటీ పామును చంపడానికి నెమలిని పెంచాలా? అదెక్కడ దొరుకుతుంది? దొరికినా డిసెంబర్ లో ఇక్కడి చలికి తట్టుకుంటుందా! అయినా పామును ఒదిలించుకోవడానికి ఇవన్నీ పెంచుకోవాలా?

       వాటి గురించి చదువుతున్నా మనసంతా బయటున్న పాము మీదే ఉంది. అదింకా అక్కడే ఉందా? ఒకవేళ అదిగాని పొదల్లోకి వెళ్ళిందంటే దాన్ని పట్టుకోవడం కష్టమే. గరాజ్ లోకి కాని వెళ్ళదుకదా! అక్కడ చెప్పులన్నీ ఉన్నాయి. స్టాండ్ మీదే ఉన్నాయి కాని చిన్నపామంటున్నారు, వేసుకునేప్పుడు చూసుకొని వేసుకోవాలి.

       ఇలా లాభం లేదని పామును దూరంగా తరిమేసే మందు కోసం వెతికాను. రకరకాల మందులు కనిపించాయి. అమ్మయ్య ఇవి తెచ్చి ఇంటి చుట్టుపక్కలంతా చల్లేస్తే చాలు. ఆ పాములు పారిపోతాయి అనుకునేంతలో 'ప్రిజర్వింగ్ వైల్డ్ లైఫ్' అట ఆ సైట్ లో అసలు అవేవీ పనిచేయవనీ, పాములు దాక్కోవడానికి వీలులేకుండా చూసుకోవడమే ఉత్తమమైన మార్గమని రాసుంది.

      పెరట్లో సొర, బీర ఇప్పుడిప్పుడే చాటలంత ఆకులతో పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయి. నిద్రలేస్తే ఆకు పిందె చూస్తూ, కలుపు తీస్తూ కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటాను. వాటికింద నీడగా ఉందని పాములు అక్కడికి వచ్చేస్తే? రాకుండా ఉండాలంటే ఇప్పుడా మొక్కలు పీకేయ్యలా?

     "మళ్ళీ మొదటికొచ్చింది వ్యవహారం" అనుకుంటూ ఇంకొన్ని సమాధానాలు చదవడం మొదలెట్టాను. "ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు మీ పిల్లలకు పాముల గురించి ఎందుకు చెప్పకూడదు?". ఏమిటీ పిల్లలకు పాముల గురించి చెప్పడానికి పెరట్లో పాముని చూపించాలా? ఇదెక్కడ చోద్యం? "మీ పిల్లలు కుక్కల గురించి, పిల్లుల గురించి భయపడడం లేదు. మరి పాములను చూసి ఎందుకు భయపడాలి. వాటి గురించి మీరు వారికి వివరించొచ్చు కదా!" అని ఉంది. పిల్లలకు వాటి గురించి చెప్తాం. వాళ్ళు చూసుకోకుండా పొరపాటున వాటిని ముట్టుకుంటే, లేకపోతే వాటిమీద కాలేస్తే అవి కుట్టకుండా ఊరుకుంటాయా? భలే వాళ్ళే అనుకుంటుండగా గరాజ్ తెరిచిన చప్పుడు వినిపించింది.

        తలుపు తెరిచి చూసేసరికి ఇంకెవరు? ఇంటాయనే మెసేజ్ చూసుకున్నట్లున్నారు దొరికిన గడ్డపార పట్టుకుని హడావిడిగా పొదల దగ్గరకు వెళుతున్నారు. పిల్లలకు చెప్పమన్నారు కదా! పైగా ఒక్కళ్ళే వెళితే ప్రమాదం కూడాను అని బుజ్జిపండును పిలిచాను. పండంటే మూడేళ్ళ వాడు కాదండోయ్. ఆరడుగులకు పైమాటే..ఈ మధ్య జిమ్ కెళ్ళి బస్కీలవీ తీస్తున్నాడు. వాళ్ళనాన్నతో రోజుకోక్కసారైనా కుస్తీ పట్లు వేయడం ప్రస్తుతం వాడి హాబీ.

    ఉదయాన్నే టెన్నిస్ ఆడి అలసిపోయి మంచి నిద్రలో ఉన్నాడు. వాడి గదిలోకి వెళ్ళి "పండూ, నాన్న పామును చంపుతున్నారు. నువ్వు కూడా వెళ్ళు" అని చెప్పాను. దుప్పటి పక్కకు తీసి నిద్ర కళ్ళతో "వాట్ పామా... నాన్నను ముందు ఫోటో తీయమని చెప్పు" అని దుప్పటి మళ్ళీ ముసుగు పెట్టేశాడు.

       ఏమిటి ఇంతకీ పామేమయిందా అని చూస్తున్నారా? ఇంకెక్కడి పాము అది ఎప్పుడో తప్పుకుంది. ఎటు పోయిందో! రేపు ఉదయం కాఫీ కప్పు పట్టుకుని చెట్లమధ్య దూరే సాహసం మాత్రం చెయ్యలేను.



18 comments:

  1. వేప గింజలు చితక్కొటి నీళ్ళలో వారం నానబెట్టి, ఆ నీళ్ళు మొక్కల మీద చల్లితే ఏపురుగూ చేరదు. ఇంత అవస్థ పడలేమంటే వేప నూని తీసుకుని నీటిలో కొద్దిగా సర్ఫ్ లాటి సబ్బు కలిపి దానిలో వేప నూని వేసి గిలకొట్టి మొక్కల మీఎద చల్లినా పురుగులు చేరవు.
    మా దొడ్డిలో పాములు అలాగే తిరుగుతుంటాయి, పిల్లలని కూడా ఏం చేయవు, వాళ్ళూ వాటిని కదిలించరు.

    ReplyDelete
    Replies
    1. వేప నూనె ఉంది బాబాయి గారు. తెల్లదోమ, పచ్చ పురుగు లాంటివాటికి చల్లుతుంటాము. అప్పుడప్పుడూ పొదలలో కూడా వేస్తే మంచిదేమో! మంచి సలహా ఇచ్చారు. ధన్యవాదాలు.

      Delete

  2. కాఫీ కప్పు, కాపర్ హెడ్డు, సూపర్ గుడ్డు !!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కామెంటడంలో మీరే హెడ్డు జిలేబి గారు. థాంక్యు.

      Delete


  3. >>> వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.

    ఈ మీ పై వాక్యం బాగుందండీ !! ఇంత సోబబుగా కామెంటే 'తారల్ని' పలకరించే వారు మీరొక్కరే అనుకుంటా !!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యకు వెలకట్టగలమా! కలాన్ని పట్టి నడిపించేవి అవేకదండీ! ఆ తారలకు మనసులో మాట చెప్పుకున్నాను.
      థాంక్యు జిలేబి గారు.

      Delete
  4. అయ్యొయ్యో! వాటినీ జీవించనీయండి.
    మన ప్రాణం మనకెంతో వాటి ప్రాణం వాటికీ అంతే!

    ReplyDelete
    Replies
    1. మా వీధిలో ఐదారేళ్ళ పిల్లలున్నారు. వాళ్ళా మొక్కల చుట్టూ తిరుగుతూ హైడ్ అండ్ సీక్ ఆడుతుంటారు. వాళ్ళనేమైనా చేస్తుందేమోనని భయం అంతేనండీ. వాటిని చంపాలని కాదు. మా హెచ్ ఓ ఏ కి మెయిల్ పంపిస్తాను. అందర్నీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తారు.

      Delete
  5. Replies
    1. పట్టీ పట్టనట్టుగా. :) కల గురించి రేపు కొత్త పోస్ట్ రాసుకుందాం.

      Delete
  6. మీ దేశంలో పాములను చంపడం నేరం కాదా అండి?

    ReplyDelete
    Replies
    1. మా దేశం అంటారా...:) అలాగే అనుకుందాంలెండి.

      మంచి ప్రశ్నే అడిగారు భాస్కర్ గారు. కొన్ని రాష్ట్రాలలో ఈ లా ఉందనుకుంటాను. నార్త్ కెరొలినాలో కూడా కొన్నిరకాల పాములను చంపకూడదు. ప్రాణాపాయము కలిగించే పక్షంలో కాపర్ హెడ్ లాంటి వాటిని నిర్మూలించొచ్చు.

      Delete
  7. మీ పోస్ట్ బాగుంది కానీ పాము భయపెడుతుందండీ... బహుశా వెళ్ళిపోయి ఉండచ్చు కానీ ఎందుకైనా మంచిది కాస్త అప్రమత్తంగా ఉండండి...

    ReplyDelete
    Replies
    1. అది వెళ్ళిపోయి ఉండొచ్చు కాని, ఇంకేమైనా ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకుంటూ తిరుగుతున్నాము. థాంక్యు శ్రీకాంత్ గారు.

      Delete
  8. బాగుంది మీ కాపరుహెడ్డు కమామీషు. ఈసారి కనిపిస్తే, దానికి, యూట్యూబ్‌లో నోము సినిమా చూపించండి. లేదా, చంద్రకళలా ఓ పాట నేర్చుకొని పాడెయ్యండి (with English subtitles). మీ గొంతు సుశీల గొంతులా ఉంటే, మిమ్మల్ని దీవించి వెళ్ళిపోతుంది. లేకపోతే, మళ్ళా మీ ఇంటి దరిదాపుల్లోకి రాదు. (ఎందుకైనా మంచిది, కొంచం దూరంగా నిల్చొని పాడండి). Jokes aside, 3 వారాల క్రితం, మా ఇంటికి ఒక పనివాడు వచ్చినపుడు, మీ ఇంటికి ఒక విజిటర్ వచ్చిందని, ఇంటి ముందు ఎండకి సేద తీరుతున్న ఒక 3-4 అడుగుల పాముని చూపించాడు. ఇంతకు ముందు చాలాసార్లు వాటిని ఇంటి చుట్టుపక్కలా, గరాజ్‌లో, అక్కడా, ఇక్కడా చూసేము కాబట్టి అంతగా భయపడలేదు. ఇక్కడ టెక్సస్‌లో అవి విషపూరితమైనవి కాదని చెప్పడంవల్ల కొంత రిలీఫ్. నేను కూడా, మీలాగే గూగుల్లో వెతికేను, ఎలాంటి మొక్కల్ని పెంచితే అవి రావో వగైరా, వగైరా. ప్రస్తుతానికి మాత్రం, హోండిపో నుంచి స్నేక్ఎవే తెచ్చి అప్పుడప్పుడు చల్లుతుంటాను. వీటి గురించి వివరిస్తే, నా కామెంట్, మీ బ్లాగు కన్నా పెద్దదవుతుంది. అందుచేత భయపడకండి. అలవాటయిపోతుంది లెండి.

    ReplyDelete
  9. కేకే గారు జాగ్రత్తగా చూసుకొని నడవడం అలవాటయ్యింది. :) థాంక్యు.

    ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.