Thursday, December 3, 2015

పదుగురాడిన మాట

        ఉదయం మెలుకువ రాగానే రాత్రి పడుకునేదాకా స్వారీ చేసిన ఆలోచన చటుక్కున తిరిగొచ్చింది. దాన్ని వదిలించుకోవడం ఎంతైనా అవసరం. లేకపోతే ఓ రోజుని స్వాహా చేసేస్తుంది, అసలే ఆలోచనకు ఆకలెక్కువ.

       ఇలా పడుకుంటే కుదిరేలా లేదు, లేచి కిటికీ తెరలు తొలిగించాను. సూరీడు చలికి బద్దకించాడో ఏమిటో ఇంకా చీకటి చిక్కగానే ఉంది. ఏదైనా పుస్తకం చదువుకోవచ్చు గాని, మనస్సును అదుపులో పెట్టాలంటే ఏదో ఒక పనిచేయాలి. వంట గది వైపుగా అడుగులు వేశాను. ఫ్రిడ్జ్ లో నండి కూరగాయలు తీసి ముక్కలు తరిగి వంట మొదలెట్టాను. అలవాటుగా చేతులు పనిచేస్తున్నా ఆలోచన మాత్రం వదలట్లేదు. ఏమిటో అంత దీర్ఘాలోచన అనుకుంటున్నారా! మనుష్యులు... మనస్థత్వాలు. ఎప్పటికీ అర్ధం కాని అంశం కదూ ఇది!

      చిన్నప్పుడు ఒక కథ విన్నాను. ఒక బీద బ్రాహ్మణుడు మేక పిల్లని భుజాన వేసుకు వెళ్తుంటాడు. ఆ దారిలో వెళ్తున్న దొంగలు నలుగురికి ఆ మేకను ఎలాగైనా స్వంతం చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. దానితో వారు ఒకరి తరువాత ఒకరు ఆ బ్రాహ్మణుడికి ఎదురు పడి "ఏమయ్యా కుక్కను భుజాన వేసుకుని వెళ్తున్నావు" అని అడుగుతారు. మొదట అది మేకే అని చెప్పిన బ్రాహ్మణుడు నలుగురూ ఒకే మాట చెప్పడంతో అది కుక్కే అన్న అభిప్రాయానికి వచ్చి దాన్ని అక్కడే వదిలి వెళ్ళిపోతాడు. "పదుగురాడిన మాట పాటియై ధరజెల్లు ఒక్కడాడు మాట ఎక్కదు ఎందు" అని వేమన గారన్నారు. పై రెండింటి సారాంశం కూడా ఒక్కటే, పది మందీ ఏమంటే అదే చెల్లుతుంది అని. 

      ఇప్పుడు సమస్య ఏమిటంటే ఆనాడు మంచో చెడో పది మందీ ఓ మాట చెప్పేవారు. వినడం వినకపోవడం ఎదుటి వారి గుణగణాల్ని బట్టి ఉంటుందనుకోండి. అది వేరే విషయం. కాని ఈ నాడు అసలు మాట చెప్పడమే మానేశారు. ఎందుకనీ అంటారా? అదిగో అదే నా ఆలోచన. 

      జరుగబోయే అనర్ధాలు తెలిసి కూడా ఇవన్నీ మనకెందుకులే మనకిప్పుడేమీ నష్టం జరగడం లేదుగా అనే అలసత్వం కావచ్చు. లేదా "ఇలా ఆలోచించడం తప్పు, ఇలా చెయ్యకూడదు, ఒక్క ఆలోచన వల్ల వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉంది, తద్వారా నష్టపోయేది మనమే" అన్న విషయం నిక్కచ్చిగా చెప్తే స్నేహితునికో, ఒక వర్గానికో దూరమౌతామన్న స్వార్ధపూరితమైన మొహమాటం కావచ్చు. ఇలాంటి మొహమాటానికి పోయే కదా దుర్యోధనుడి అధర్మమైన కోరికకు మద్దతునిచ్చి కర్ణుడు కురువంశ పతనానికి పరోక్షంగా కారణమయ్యాడు. 

      ఎదురుగా ఎన్నెన్నో ఘోరాలు జరుగుతుంటాయి అవన్నీ పెద్ద పెద్ద అవాంతరాలు తెచ్చి పెట్టేవి కావు. కాని అలా అని ఊరుకుంటే పర్యవసానం ఎలా ఉంటుందో 'ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్' బ్లాగ్ లో 'బురద గుంట- రేప్ ప్రపంచం' లో సవివరంగా వ్రాశారు. 

      ఇలాంటి అనర్ధాలు చాలనట్లు పుండు మీద రసి కారినట్లు ఈ కులపిచ్చి ఒకటి. ఆ దుర్వాసన నేడు ఖండాంతరాలు దాటి వాడవాడలా వ్యాపిస్తోంది. ఇలాంటి పదాలు వాడడానికే అసహ్యంగా ఉంది. చదవడానికి మీకెలా ఉందో మరి. అంతకంటే దరిద్రమైన ఉపమానాలు వాడడానికి సంస్కారం అడ్డం వస్తోంది. 

       ఎన్నో విషయాలను మనం చూసి చూడనట్లు వదిలివేస్తున్నాం. వాటివలన జరుగుతున్న అనర్ధాలకు మాత్రం విపరీతంగా స్పందిస్తున్నాం. ప్రతి మనిషికీ ఏవేవో కోరికలు ఉంటాయి, అందరీ ఆలోచన ధోరణీ ఒక్కలా ఉండదు. కాని ఆ కోరికలు వ్యవస్థను నాశనం చేస్తున్నాయని తెలిశాక కూడా ఖడించక పోవడం, చూసి చూడనట్లు మాట్లాడకుండా ఊరుకుంటున్నామంటే ఆ నేరంలో మనమూ భాగం పంచుకుంటున్నామనే అర్ధం.

      ముఖ్యంగా నాయకులు, ఒక రంగంలో విజయం సాధించిన వారు, గురువులు..... నలుగురి దృష్టి వారిపై ఉంటుంది. వారిని అనుసరించే వారు కూడా కోకొల్లలు. అలాంటి వారు సంయమనం పాటిస్తూ, అడుగు ఎంత జాగ్రత్తగా వేయాలి. తడబడితే అది నమ్మకం మీద, మానవత్వం మీద కదా దెబ్బ తగిలేది. ఆ నమ్మకమే పోయాక చేయడానికేమి మిగిలుంటుంది? 

        సమస్యను మొక్కగానే తుంచేస్తే అది మానులా ఎదగకుండా ఉంటుంది. గోటినే ఉపయోగించడం మరచిపోయిన వాళ్ళం, మనకు గొడ్డలి పట్టుకోవడం చేతనవుతుందా? యావత్ ప్రాణకోటిలో మనిషికి మాత్రమే ఉన్న వరం... మాట. అనవసర మొహమాటాలు వదిలిపెడితే మనిషి జన్మకు సార్ధకత చేకూరుతుంది.



21 comments:

  1. సులభా పురుషారాజన్ సతతః ప్రియవాదినః
    అప్రియస్య పథ్యస్య వకతా శ్రోతా దుర్లభః......మారీచుడు.

    ReplyDelete
    Replies
    1. Pl correct

      సులభా పురుషారాజన్ సతతః ప్రియవాదినః
      అప్రియస్య పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః......మారీచుడు.

      Delete
    2. మీరేక్కడికో పోయారండీ ! సూపర్ పదభిఘావళి !

      ఆలోచనకు ఆకలెక్కువ.
      మనస్సును అదుపులో పెట్టాలంటే ఏదో ఒక పనిచేయాలి..
      ఫ్రిడ్జ్ లో నండి కూరగాయలు తీసి ముక్కలు తరిగి వంట మొదలెట్టాను.

      యావత్ ప్రాణకోటిలో మనిషికి మాత్రమే ఉన్న వరం... మాట.

      ఇంతకీ ఈ టపా లో ఏదో "సూక్షి" ఉంది ! అది ఏమిటో తెలీటం లేదు .

      జిలేబి

      Delete
    3. మీ వ్యాఖ్యకు అర్ధం వెతుకుతూ వెళ్ళాను బాబాయి గారు. మీ బ్లాగులో దొరికింది. మారీచుడు మంచి చెప్పే ప్రయత్నం చేశాడు, పాపం రాజకీయం తెలియదతనికి. మంచి స్నేహుతుడు చేయవలసిన ప్రయత్నం చేశాడు. వినడం వినకపోవడం పూర్తిగా రావణాసురిడి నిర్ణయం.

      Delete
    4. శుభం. ఆ శ్లోకంలో టైపొ లున్నాయి, తరవాత సరి చేసినది కామెంట్ గా ఇచ్చాను. దానిని ప్రచురించగలవు.

      Delete
    5. జిలేబి గారు,

      పదభిఘావళి... పద ప్రయోగం చేయడంలో మీ తరువాతే ఎవరైనా. విషయం ఇంత చక్కగా అర్ధం చేసుకుని సూక్షి తెలియడం లేదంటున్నారే...

      Delete
    6. పదభిఘావళి , సూక్షి ...... ఇలా ఇలా వ్రాయడం వల్ల పాఠకులకేమీ ఇబ్బంది రాదు గాని , ( సదరు జిలేబీలను కూడా గారని సంభోదించడం నాకిష్టముండదు , వారి పేరు తెలిస్తే గారు చేర్చి ఘనంగా సంభావించవచ్చు ) వారు మాత్రం ఈ అలవాటు వరవడిలో పడి తియ్యటి తెలుగు మాటలను మరిచి పోయి , ఈ అలవాటు నుండి బయట పడక పోవడం ఖాయం .

      Delete
    7. రాజారావు గారు, అసలు పేరుతో కాక, కలం పేరుతోనే రచనలు చేయడం అన్నది వారి స్వవిషయమని భావించాను.

      Delete
  2. జ్యోతి ..కాలం తెస్తున్న మార్పులివి - లోకంలో అడుగేస్తున్న నూతన పోకడ లివి గర్హించ దగినవి
    ఇలా వ్యక్తీకరించడం తప్ప ఏమి చేయలేని అశక్తత -- సుమతి వేమన భర్తృహరి శ్రీశ్రీ ఎంతగానో ఖండించారు, ఎన్నో రచనలు చేసారు -నువ్వు చేసింది అదే - స్పందించడం మంచి మనిషిగా మన కర్తవ్యం -వినకపోవడం పాటించక పోవడం వారి వారి కర్మం

    ReplyDelete
    Replies
    1. నూతన పోకడలలో గర్హించు, గర్వించు ఈ పదాలకు తేడా తెలియకపోవడమే కారణం నాన్నా. కొంతమందికి అవగాహన లోపమైతే. ఎందుకులే తెలుసుకోవడం రెండూ పదాలేగా ఏది వాడితే తప్పేంటి అనే వితండవాదం మరి కొందరిది. తెలియజేయలసిన బాధ్యత అందరిదీనూ. ఎందరి త్యాగఫలితమో అయిన స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తున్నాం. కులమతాలను రెచ్చగొట్టి ఆ పరిస్థితుల్లోకి నెట్టి వేయబడుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోవడం ఉత్తమం కాదు. స్వార్ధపరులు, అధికార దాహం ఉన్న వాళ్ళు కొందరే ఉంటారు. మౌనంగా చూస్తూ ఉన్నవాళ్ళు మాత్రం అధిక సంఖ్యలో ఉంటారు. తప్పు మౌనానిదే అంటాను. ప్రశ్నించడం మొదలు పెడితేనే పరిస్థితి అదుపులోకి వస్తుంది.

      Delete
  3. ఓరిమి లేదు కాస్తయిన , ఒఠ్ఠి యహంకృత వాక్స్రవంతిలో
    తీరిక లేదు వేరొకరు తెల్పిన దేమొ వినంగ , విన్ననూ
    వారిది యెంతమాత్రమును వాదన కెక్కదు , తామె యింతకున్
    నేరిచినట్టి వారమను నిక్కు _ కనంగ వివేకులందరున్ .

    ReplyDelete
  4. కోరికలు వ్యవస్థను నాశనం చేస్తున్నాయని తెలిశాక కూడా ఖడించక పోవడం, చూసి చూడనట్లు మాట్లాడకుండా ఊరుకుంటున్నామంటే ఆ నేరంలో మనమూ భాగం పంచుకుంటున్నామనే అర్ధం.

    ఖచ్చితంగా ! మీకు చెడు అనిపించినదాన్ని ఖండించితీరాలి ! మీరు అనుమతిచ్చిన ప్రతిదీ శాసనమైపోతుంది.చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా లాభం లేదు.చాలామంది దృష్టిలో నేను చెడ్డగా అవుతున్నాను అయినా చెపుతూనే ఉన్నాను.

    ReplyDelete
    Replies
    1. ఈ మాట చెప్పడం గురించి ఈ మధ్యే ఓ ఫ్రెండ్ గొప్ప సలహా ఇచ్చారు. "ఏ విషయమైనా సూటిగా చెపితే ఎవరూ ఒప్పుకోరు. ఇగోలు అడ్డం వచ్చేస్తాయి. ప్రతి మనిషిలోను మానవత్వం ఉంటుంది. చెప్పే విధానంలో విషయం చెప్పి ఓదలివేయడమే. వెంటనే వినక పోయినా మన మాటలో సత్యం అర్ధమయ్యే రోజు తప్పకుండా వస్తుంది."

      ఒక్కమాటలో చెప్పాలంటే షుగర్ కోటెడ్ పిల్ వాడడమేనటండి. ప్రయత్నించి చూశాను. కొన్ని దగ్గర పని చేస్తోంది.

      Delete
    2. మనం కొన్ని పద్ధతులు,నియమాలు ఏర్పరుచుకున్నాం.వాటిని కాలానుగుణంగా మార్చుకోవలసి వస్తుంది. స్త్రీలు నెమ్మదిగా చెపితే కొందరు వింటారు. కొంతమంది చాంధసులకు మామూలుగా చెపితే సరిపోదు.కృష్ణుడు చెప్పినట్లు ఎదుటివారిని మార్చాలంటే మనం మారాలి.మనం ప్రస్తుతం చూస్తున్న ప్రపంచం అదే ! దీనిని మార్చాలంటే వారు/మనం మారక తప్పదు.అవసరం మనిషిని నడిపిస్తుంది.

      Delete
  5. చాలాసేపు ఆలోచనల్లో ఉండిపోయానండీ పోస్టు చదివి.. ఒకటీ, రెండూ కాదు.. చాలా విషయాలు గుర్తొచ్చాయి మరి..

    ReplyDelete
    Replies
    1. నన్ను నిలువనీయక కదిలిన కలం మిమ్మల్నీ కదిలించిందంటారు.

      Delete
  6. Jyothy Garu,
    Totally agree with you.
    It took me sometime to get out of the thoughts after reading ur post.
    From home to outside world if we say something people are ready to tag with anything they want, from crazy to psycho.
    Yes Sugar coated pills is the way. I strongly believe that we need to speak out and definitely there will be reaction, ego hurts but humans will understand, it only takes sometime

    ReplyDelete
    Replies
    1. అర్ధం చేసుకున్నారు చాలా సంతోషం సురభి గారు. ఏదైనా చెయ్యాలన్న పట్టుదల ముందుకు నడిపిస్తే, చెయ్యగలమన్న నమ్మకం ఆ పనిని సాకారం చేస్తుంది. మనమేం చెయ్యగలమన్న నిరాశావాదంతో అడుగువేస్తె చేసేందుకు ఏముంటుంది? ఒట్టి మాటలు తప్ప.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.