Monday, February 29, 2016

ఏమిటీ పాఠశాల??

         "ఎక్కడా అడ్వర్ టైజ్ మెంట్ లేదు. ఏ టివిలోనూ చూడలేదు, వార్తా పత్రికలోనూ చదివిన గుర్తులేదు. ఈ 250 మంది విద్యార్ధులేమిటీ! 45 మంది టీచర్లేమిటీ! మూడు ఊర్లలో ఈ తరగతులేమిటీ! ఏడాదికి ఏడాదికీ రెట్టింపు సంఖ్యలో విద్యార్ధులు పెరుగడమేమిటీ? ఏడువందల మందితో వార్షికోత్సవమా! పైగా ఇంతమంది కార్యకర్తలు ఏదో తమ కుటుంబంలో పనిలా చకచకా చేసేస్తున్నారు, అచ్చ తెలుగు వంటకాలు వండి తీసుకుని వచ్చి మారీ విందుభోజనం పెడుతున్నారు. ఎలా సాధ్యం అవుతోంది ఇదంతా?" అంటూ వేరే ఊరు నుండి మా ఊరు వచ్చిన వారు, నిన్న జరిగిన పాఠశాల వార్షికోత్సవంలో కలసినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారి ప్రశ్నలకు సమాధానంగానే ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. 

      "పాఠశాల అంటే ఏమిటి? ఏం చేస్తున్నామిక్కడ?" అన్న విషయానికి వస్తే బంధాలు, బంధుత్వాలు గురించి చెప్పుకోవాలి. మనిషి సంఘజీవి. సుఖమైనా దుఃఖమైనా పంచుకునే వారుండాలి, మన వాళ్ళైతే మరీ సంతోషం. రక్త సంబంధీకుల మధ్యైనా సరే అనుబంధం బలపడాలంటే అర్ధం చేసుకునే భాష ప్రధానం. మన పిల్లలకు మన పెద్దవాళ్ళతో అనుబంధం ఏర్పడడానికి అవరోధంగా ఉంది ఈ భాష. మాతృభాష మనం పిల్లలకు నేర్పించినట్లయితే ఆ సమస్యను అధిగమించవచ్చుననే ఉద్దేశ్యంతో 2009 జనవరిలో చార్లెట్ లో మొదలైంది పాఠశాల. 

       అయితే ఇప్పటి విద్యావిధానం అటు ఇండియాలో కానీయండి ఇక్కడ కానీయండి కేవలం బ్రతుకు తెరువు చూపించే చదువుల పట్ల శ్రద్ధ వహిస్తున్నాయి కాని, మానవ సంబంధాలు, అనుబంధాలు, మానసిక వికాసం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మనం చిన్నప్పుడు నలుగురి మధ్య పెరిగిన వాతావరణం కూడా ప్రస్తుతం కనిపించడం లేదు. రోజులో ఎక్కువ శాతం చదువు, వారి క్లాసులు వాటితోటే వారికి సమయం గడిచిపోతోంది. మిగిలిన సమయం ఎలెక్ట్రానిక్స్... పిల్లలకు మంచీ, చెడూ చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా పూర్తిగా మనమీదే ఉంది. ఇవన్నీ కూడా పిల్లలకు పాఠాలు చెప్తున్నప్పుడు వారిని గమనించి తెలుసుకున్న అంశాలు. అందుకే తెలుగు నేర్పించడమే ధ్యేయంగా పెట్టుకున్న పాఠశాల విద్యావిధానంలో నీతి శతకాలు, మంచి విషయాలు, సుభాషితాలు చేర్చడం జరిగింది. ఈ శతకాలు నేర్చుకోవడం వలన మరో ప్రయోజనం భాషలో స్పష్టత పెరగడం. 

      భాష భావం భవిత...ఇవి పాఠశాల లక్ష్యాలు. మాతృభాషను బోధిస్తూ, విద్యార్ధులలో మంచి భావాలు పెంపొందించి భవితను సన్మార్గం వైపు నడిపించడమే పాఠశాల ముఖ్యోద్దేశ్యం.

       ఏడేళ్ళ క్రితం తెలుగు నేర్పించాలని నిర్ణయించుకున్న తరువాత ఎదురైన సమస్య ఏమి నేర్పించాలి, ఎలా నేర్పించాలి? పుస్తకాలు లేవు, ఇండియా నుండి తెప్పించిన పుస్తకాలు తెలుగు రాయడం నేర్పించడానికి ఉపయోగపడుతున్నాయి కాని మాట్లాడడం నేర్పడానికి కాదు. అప్పుడే సిలబిస్ స్వంతంగా తాయారు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు రూపకల్పనే ఈ నాటి నాలుగు తరగతుల పాఠ్యాంశాలు. ఆ తరువాత పిల్లలకు ఆసక్తి కరంగా ఉండేలా వర్క్ షీట్స్ తాయారు చేయడం జరిగింది. ఈ అభ్యాసాలు పూర్తిచేయడం వలన వారికి రాయడం, చదవడమే కాక చక్కని తెలుగు మాట్లాడానికి కూడా తేలిక అయింది.


      "నేను ప్రొఫెసర్ ను కాను, లక్చరర్ ని కాను, చివరకు టీచర్ ని కూడా కాను మరి నాకున్న పరిమితజ్ఞానంతో తాయారు చేసినటువంటి ఈ సిలబస్ సరైనదేనా? ఎవరైనా తెలిసిన వారు చూసి చెపితే బావుణ్ణు" అని అనుకుంటూ ఉండేదాన్ని. అనుకోకుండా ఓ ఆరు నెలల క్రితం "తెలుగు ఎందుకు నేర్పించాలి?" అన్న చర్చలో పాల్గొనడం జరిగింది. అదే చర్చలో పాల్గొన్నటువంటి కేతు విశ్వనాధ రెడ్డి గారి మాటల ద్వారా వారు పలు విద్యా సంస్థల సిలబస్ ను పరిశీలించినట్లుగా అర్ధం అయింది. వారు డా|| బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటి డైరెక్టర్ గా పని చేసిన వారూ, ప్రముఖ కథకులు, విమర్శకులు కూడానూ. వారికి విషయం చెప్పాను. ఆయన వెంటనే "తప్పకుండానమ్మా పంపించండి చూద్దాం"  అన్నారు. సిలబస్ పంపించాను. 

     వారు క్షుణ్ణంగా పరిశీలించి, సిలబస్ లోని ప్రతి వాక్యాన్ని వివరిస్తూ దాదాపుగా మూడు గంటలు నాతో మాట్లాడారు. వారేమన్నారంటే "పరభాషా మాధ్యంలో పెరుగుతున్న పిల్లలకు ముందుగా నేర్పవల్సింది మాతృభాషలో మాట్లాడడం. అది కూడా చాలా సులువుగా ఉండాలి. వారి తల మీద బరువులా ఉండకూడదు. బాగ్ ని సంచి అని, టేబుల్ ని బల్ల అని, సాక్స్ ను మేజోళ్ళు అని  నేర్పనవసరంలేదు. వాడుక భాష నేర్పినట్లయితే వారు సులభంగా నేర్చుకోగలుగుతారు. మీ సిలబస్ సరళంగా నేర్చుకునేలా ఉంది. ఇలాగే ఉండాలి కూడా". అంటూ అక్కడా చిన్న చిన్న మార్పులు సూచించారు. ఆ మాటతో గొప్ప ఉత్సాహం వచ్చింది. 

       షికాగో, విస్కాన్సిన్, అగస్టా, మెంఫిస్... ఇలా చాలా ప్రాంతాల వారు మా పాఠశాల విద్యావిధానం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. సిలబస్ అడిగితే సంతోషంగా ఇస్తున్నాం. అయితే ఒక్క షరతు ఈ సిలబస్ ను విజ్ఞానం పంచడానికి ఉపయోగించాలే తప్ప వ్యాపారంగా మార్చుకోవడానికి కాదు. అంటే తెలుగు నేర్పించడానికి మా సిలబస్ తీసుకున్నట్లయితే వారికి పాఠాలు ఉచితంగా చెప్పాలి. న్యూ జెర్సీ లోని జై గురుదత్త సంస్థ వారు పాఠశాల సిలబస్ నుపయోగించి పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు.  

      మాకు తెలుగు నేర్పించడమే ప్రధానం. అందుకే మా ఉపాధ్యాయులే విద్యార్ధుల దగ్గరకు వెళ్తారు. అర్ధం కాలేదా? మా పాఠశాలకు స్కూల్స్ అవీ అవసరం లేదండీ. ఉపాధ్యాయుల ఇళ్ళే తరగతులు. ఆరుగురు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయులు, అంతకు మించితే ఇద్దరు ఉపాధ్యాయులు. సంఖ్య ఎక్కువైన కొద్దీ విద్యార్ధులందరినీ పట్టించుకోవడం కుదరదు.  

      భాష కోసం ఏమైనా చెయ్యాలనే తపన ఉన్నవారు కొందరైతే, ఎలాగూ మన పిల్లలకు నేర్పాలనుకుంటున్నాం మరికొంత మందితో కలిసైతే ఉత్సాహంగా నేర్చుకుంటారని అనుకునే వారు మరికొందరు. పాఠశాల వలన మా పిల్లలు మా పెద్దవాళ్ళతో మాట్లాడగలుగుతున్నారు ప్రతిగా పాఠశాలకు ఏమైనా చెయ్యాలనుకునే వారు ఇంకొందరు. ఇలా ఎవరికి వారు ఆలోచించుకుని పాఠాలు చెప్పడానికి ముందుకు వస్తున్నారు.  

       ఎక్కడా అడ్వర్టైజ్ మెంట్ లేదేమిటి? అని వారిడిన ప్రశ్నకు మా సమాధానం అడ్వర్ టైజ్ మెంట్ ఇవ్వడానికి ఇది వ్యాపార సంస్థ కాదు. పిల్లలకు తెలుగు నేర్పించండి అని మేమెవ్వరికీ చెప్పం. పిల్లలకు తెలుగు నేర్పించాలనుకోవడం స్వవిషయం. తెలుగు నేర్పించాలనుకునే వారికి సహాయం చేస్తాం. మా పాఠశాల తల్లిదండ్రులకు కూడా ఒక్కటే చెప్తాం. "మీరే మీ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు. ఉపాధ్యాయులు దానికి సులువైన మార్గం చూపిస్తారు."     
  
        కొలంబియా తెలుగు అసోసియేషన్ వారు పోయిన సంవత్సరమే పాఠశాల తరగతులు మొదలు పెట్టారు. ఈ ఏడాది అక్కడ నలభైకి పైగా విద్యార్ధులు తెలుగు నేర్చుకుంటున్నారు. రాలేలో ఈ ఏడాదే పాఠశాల మొదలైంది. అక్కడ కూడా పాతిక మంది వరకు విద్యార్ధులు తెలుగు నేర్చుకుంటున్నారు. ఎక్కువ సంఖ్యలో విద్యార్ధులు తెలుగు నేర్చుకోవడం చూస్తుంటే మాతృభాష మీద పెరుగుతున్న మమకారానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. 


15 comments:

 1. >> అచ్చ తెలుగు వంటకాలు వండి తీసుకుని వచ్చి మారీ విందుభోజనం పెడుతున్నారు.

  ఆహా నోరూ రెనుగా అని చదివా నండీ ! బాగుంది మీ ప్రయత్నం ! సిలబస్ తో అంటూ ఒక ప్రణాళిక పెట్టుకుని చేయడం కూడా చాలా బాగా నచ్చింది !

  చీర్స్
  జిలేబి

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు జిలేబి గారు.

   Delete
 2. గ్రేట్ అండి అభినందనలు జ్యోతిర్మయి గారూ ..
  రాధిక (నాని)

  ReplyDelete
  Replies
  1. థాంక్యు రాధిక గారు.

   Delete
 3. తెలుగు నేర్పించంగ తీరైన విధిగల
  బహు ముఖ జ్ఞాన - మీ పాఠశాల
  చదువుతో బాటుగా సంస్కారములు నేర్పు
  పరిణత శీల - మీ పాఠశాల
  ఉచిత విద్యాదాన మొనర కట్టడి యైన
  వరణీయ సంస్థ - మీ పాఠశాల
  సకుటుంబ పరివార సంబంధ బాంధవ్య
  ములు నేర్పు మహతి - మీ పాఠశాల

  జ్యోతి తలపున ప్రభవించి ఖ్యాతి గాంచి
  అమెరికా ప్రవాసాంధ్ర విద్యార్థులకయి
  సేవలందించు సత్కార్య శ్రీలు గురియు
  పాఠశాలకు ప్రణతులు బహు విథముల .

  ReplyDelete
  Replies
  1. ఇంత చక్కని పద్యాన్ని బహుకరించారు. ధన్యవాదాలు రాజారావు గారు.

   Delete
 4. ప్రయత్నం పదిమందికి ఉపయోగపడేదయినప్పుడు దానికి నలుగురు మంచివారి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయండీ.శుభోజ్జయం కలగాలి

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పింది ముమ్మాటికీ నిజమండీ. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు.

   Delete
 5. అభినందనలు జ్యోతిర్మయి గారు.

  ReplyDelete
 6. ఎక్కడో ఏడు సముద్రాలకావల తెలుగు భాష కోసం ఇంత తపన చూస్తుంటే ఆనందంగా ఉంది ఇక్కడ ఇండియా లో ఆ తపన లేనందుకు ఎంతో సిగ్గుగా ఉంది ఏది ఏమైనా నీ కృషి పట్టుదల అభినందనీయం ఎంతో గర్వకారణం

  ReplyDelete
 7. Mee lanti vaaru pillalandariki mana bhasha nerpinchali ane thapanatho nadum biganchi modalupettakapothe Ee desam kaani desam lo bhasha kaani bhasha lo mana bhasha peddavaallatho ne moolana padipoyedandi!!
  Hats off to you Jyothirmayi garu!!

  ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.