Tuesday, April 16, 2019

పాఠశాల పదవ వార్షికోత్సవం

పాఠశాల పదవ వార్షికోత్సవం జరుపుకున్నాం. అవునండీ పదవ వార్షికోత్సవమే. షార్లెట్ లో పుట్టి పెరిగిన పాఠశాల. ఎట్లా జరుపుకున్నామో తెలుసా! ధూమ్ ధామ్ గా జరుపుకున్నాం. 200 మంది విద్యార్ధులు, 37 మంది ఉపాధ్యాయులు, 700 మందికి పైగా సభ్యులు కలసి చేసుకున్నామంటే మరి చూడండి. మా ఉపాధ్యాయులు మంచి మంచి పాటలు, పద్యాలు, నాటికలు వేయించారు. చిన్న పిల్లలైనా మా విద్యార్ధులు బహు చక్కగా ప్రదర్శించారు. వార్షికోత్సవం నాటి భోజనల్లోకి వెయ్యికి పైగా లడ్లు స్వయంగా చేసుకున్నాం. బకెట్లు అవీ అంత తేలిగ్గా దొరకని అమెరికాలో కూడా బకెట్లతో సాంబారు వడ్డించుకున్నాం. భోజనానంతరం వేసుకున్న కిళ్ళీలు కూడా మేమే తయరుచేసుకున్నాం.

ఎప్పట్లాగే ఈ వార్షికోత్సవం కోసం కూడా మా పాఠశాల తల్లిదండ్రులతో సహా ఎవరినీ చందాలు అడగలేదు. మా విద్యార్ధులు తలకో నలభై డాలర్లు వేసుకున్న డబ్బుల్లో వాళ్ళకి తెలుగులో వ్రాసిన ట్రోఫీలు, ఉపాధ్యాయులకు ప్రముఖ రచయితలు స్వయంగా సంతకం చేసిన పుస్తకంతో పాటు చిన్న బహుమానం, పూర్వ ఉపాధ్యాయులకు ట్రోఫీలు, స్వచ్చంద కార్యకర్తలకు బుల్లి బహుమానాలు కూడా ఇవ్వగాలిగాం.

పాఠశాల గుర్తింపు చిహ్నంలో ఏం ఉన్నాయో తెలుసా? భాష, భావం, భవిత. వాటి అర్ధం భాషను నేర్పిస్తూ, మంచి భావాలు పెంపొందించి భవిత సన్మార్గంలో ఉండేట్టు చూడడం అన్నమాట. ఈ భావాలు పెంపొందించడం అంటే పాఠ్యాంశాలలో మంచి మాట, సుభాషితాలు పెట్టడమే కాక వాటిని ముందు ఆచరించి చూపిస్తున్నాం. ఎలా అంటారా?

ఉదాహరణకి ఫీజు లేకపోతే కమిట్ మెంట్ ఉండదనే భావనను తోసిరాజన్నాం, ఒక సంస్థ అభివృద్దికి ధనమో, ప్రచారమో అవసరం లేదని ఢ౦కా భజాయించి చెప్పాం. ఇప్పటివరకు మా కార్యక్రమాలకు స్పాన్సర్స్ లేరు. ఎవరైనా విరాళం ఇస్తామన్నా మేము తిరస్కరిస్తుంటాం.

మామూలుగా ఇవన్నీ చెప్పుకుంటే బాకా ఊదుకున్నట్లు ఉంటుందేమో అని మొహమాట పడేవాళ్ళం అయితే ఈసారి మా కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిధిలే ఆ మాట చెప్పాక మేము కూడా మహా గర్వంగా చెప్పుకుంటున్నాం. శ్రమ అనుకోకుండా ఎంతో దూరం నుండి మా కార్యక్రమానికి విచ్చేసి మా కుటుంబసభ్యుల్లా కలసిపోయిన కిరణ్ ప్రభ గారికి, కాంతి గారికి, ఫణి గారికి, శ్రీనివాస్ భరద్వాజ కిషోర్ గారికి, రవి శంకర్ గారికి అనేకానేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

పాఠశాాల ఉపాధ్యాయులకు ఒక పుస్తకం బహుమతిగా ఇవ్వడం పోయినేడాది నుండి మొదలుపెట్టాం. ఈ ఏడాది కొంతమంది రచయితలు పాఠశాల బృందానికి తమ సంతకంతో పుస్తకాలు పంపించారు. మధురాంతకం నరేంద్రగారికి, వారణాసి నాగలక్ష్మి గారికి, డొక్కా ఫణి కుమార్ గారికి, దగ్గుమాటి పద్మాకర్ గారికి, మునుకుంట్ల గునుపూడి అపర్ణ గారికి, రాధ మండువ గారికి, సోమరాజు సుశీల గారికి, పీ. సత్యవతి, అత్తలూరి విజయలక్ష్మి గారికి, పొత్తూరి విజయలక్ష్మి గారికి వేంపల్లి రెడ్డి నాగరాజు గారికి అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వీరిలో చాలా మంది రచయితలు ఉచితంగా తమ పుస్తకాలు పంపించారు.

అతిధుల మాటల్లో
https://www.paatasalausa.org/videos




























































14 comments:

  1. 👏👏👏👏👏 super.
    Wish you many more such celebrations. Hold on to your commitment jyothirmayi garu

    ReplyDelete
  2. మీరు చేసిన కార్యం మామూలు విషయం కాదు. ఇంత బృహత్కార్యాన్ని చక్కగా నిర్వహించిన మీజట్టు మొత్తానికి అభినందనలు. మేమిలాగే చేస్తామనే మీ పూనిక కూడా బహు ప్రశంసనీయం.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు అన్యగామి గారు.

      Delete
  3. పదవ వార్షికోత్సవం జరుపుకున్న మీ పాఠశాలకు శుభాభినందనలు .

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రాజారావు గారు.

      Delete
  4. సమిష్టిగా పని చేసి సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించారు. అభినందనలు.

    మొదటి ఫొటోలోనూ, మరికొన్ని ఫొటోల్లోనూ చూస్తే మాతమ్ముడు రవిశంకర్ కూడా హాజరయినట్లు తెలుస్తోంది. సంతోషం.

    ReplyDelete
    Replies
    1. రవిశంకర్ గారు పాఠశాల ఉపాధ్యాయులేనండి. కొలంబియాలో పాఠాలు చెప్తున్నారు. వారు పాఠశాల పాట కూడా వ్రాశారు. ఈ కర్యక్రమానికి అతిధి కూడానండి. ధన్యవాదాలు.

      Delete

  5. వామ్మో ! వామ్మో ! పిల్ల కాయలకు కిళ్ళీల్నేర్పించేరా :)


    అభినందనలతో

    లక్కుపేట రౌడీ ప్రత్యక్షమయ్యేరా :)



    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అబ్బే లేదండి జిలేబి గారు. వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాం. :)

      ధన్యవాదాలు

      Delete
  6. శుభాభినందనలు, జ్యోతిర్మయిగారు!

    ReplyDelete
  7. అభినందనలు !! చాలా బావుందండీ. లడ్డూలు, తాంబూలాలు నోరూరించేస్తున్నాయి. ఆ పుస్తకాలు చూస్తుంటే మీ పాఠశాల ఉపాధ్యాయురాలిని అయిపోదాం అనిపిస్తోంది :) అమెరికాలో ఇలాంటి ఉత్సవాలు చూస్తుంటే ‘ఐకమత్యమే మహాబలం’ కదా అనిపించక మానదు

    ReplyDelete
    Replies
    1. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం మాలో కొత్త ఉత్సాహం నింపుతుంది. మరో ఏడాది పాఠాలు మొదలుపెట్టడానికి ఎదురుచూస్తూ ఉంటాం. పుస్తకాలు ఇవ్వడం పోయిన సంవత్సరం నుండే మొదలుపెట్టాం. ధన్యవాదాలు చంద్రిక గారు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.