ఈ రోజు ఉదయం కాఫీ లేదు. ఎలా ఉంటుంది? ఫ్రిడ్జ్ లో పాలు లేని విషయం నిన్న సాయంత్రం అంత ముఖ్యమైన విషయంగా తోచలేదు మరి. సరే ఉద్యోగం ఒకటి ఉందిగా ఉదయం ఆరున్నరకల్లా ఇంటి దగ్గర బయలుదేరితేగాని ఏడుగంటల ట్రైన్ దొరకదు. ఇవాళ హడావిడిగా లేచి పరుగులు పెడుతూ వచ్చి ట్రైన్ లో కూర్చున్నాను. రాత్రి కిక్ ఇంకా దిగలేదు, ఫుల్ హాంగ్ ఓవర్.
"ఏమిటీ ఈ కోణం కూడా ఉందేమిటి" అని అపనమ్మకమూ, ఆశ్చర్యమూ కలిపేసి అలా కోపంగా చూడకండి. సంవత్సరంలో ఈ ఏప్రిల్ నెలలో ఎలాంటి మత్తులో ఉంటానో మా వాళ్ళందరకూ తెలుసు. అర్ధరాత్రుళ్ళు మెయిల్స్, వాట్స్ ఆప్ మెసేజెస్ వెళ్తుంటాయ్ కదా! సిలబస్ మీద పనిచేస్తుంటే నిద్రెలా పడుతుంది? సరే ఇదంతా మాకెందుకు చెప్తున్నట్లు అనుకుంటున్నారా?
నేపథ్యం తెలియకపోతే విషయం పూర్తిగా అర్ధం కాదుగా అందుకని.
ఇంతలో ఒకావిడ ట్రైన్ ఎక్కి ఖాళీగా ఉన్న సీట్లన్నీ వదిలేసి నా పక్కన వచ్చి కూర్చున్నారు.
"ఆర్ యు జ్యోతి? ”
"యా, సారీ ఐ డోంట్ రిమెంబర్ యు, డిడ్ వుయ్ మీట్ సంవేర్? " అడిగాను.
"పాటషాల" అన్నారు.
మత్తు కొంచెం దిగింది. పాఠషాల అయితే. చి, ఛీ పాఠశాల అయితే నన్ను గుర్తుపట్టాలిగా, నేనేనా అని ఎందుకడుగుతున్నట్లు. సందేహం వచ్చింది. అవున్లే పట్టుదో, కాటన్ దో ఏదో ఒక చీర కట్టుకుని ఎప్పుడూ ఇంత బొట్టూ, కాటుకతో కనిపించే నేను ఇలా తెల్ల చొక్కా, నల్ల పేంట్ వేసుకుని, మొహాన బొట్టూ అదీ లేకుండా బరువు కళ్ళతో ట్రైన్ లో ఓ మూల కూర్చునుంటే ఎవరు మాత్రం గుర్తు పట్టగలరు? ఎందుకైనా మంచిదని
"డు యు స్పీక్ తెలుగు?" అని అడిగాను.
"పాటషాల అంటుంటే" అన్నారావిడ.
మత్తుపూర్తిగా దిగింది.
"ఓ మీ పిల్లలు పాఠశాలలో ఉన్నారా? ఒకటవ తరగతా?" అడిగాను.
"లేదండీ నాలుగవ తరగతి" చెప్పారు.
😭
సిలబస్ రివ్యూ చేస్తున్నప్పుడు ప్రతివారం డిక్టేషన్ లో పాఠశాల, భారతదేశము ఉండాలని లక్ష్మి గారు ఎందుకన్నారో అప్పుడర్ధం అయ్యింది.
ఈ సారి సమ్మర్ వర్క్ లో శలు, ళలు, ణాలు.. ఇంకా ఫలు, ఠలు, ఢలు...... 😡😡😡
ReplyDeleteపాటషాల కు నషా వదిలింది అంటారు :)
జిలేబి
వదిలింది, బాధ్యత కూడా పెరిగింది. :)
Delete‘శ’ సరే!! ఎప్పుడూ కష్టాలే!! ‘ణ’ కి, ‘ళ’ కి కలిగే కష్టాలు చూస్తుంటే ఒక్కోసారి కడుపు తరుక్కుపోతుందండీ
ReplyDeleteఈ తరం వారికి ఇదే బాగా అలవాటయిపోయిందండీ. వాళ్ళ నుండి తరవాత తరం వారు అదే నేర్చుకుంటారు, అదే సరైన ఉచ్చారణ అనుకుంటారు.
Deleteసినిమా కళాకారులూ, గానగంధర్వులూ కూడా అంతే ... ముఖ్యంగా 'ష' (సమాజంపై వీళ్ళ ప్రభావం మరింత తేలికగా పడుతుంది). నిన్న పేపర్లో చూశాను ... "షక్కు" బాయి అని వ్రాశారు, చూ'షా'రా మరి 🙁? "షితార", "షాటర్ డే", "షన్ డే", "షెప్టెంబర్", "డిషెంబర్" అని పలికేవారూ ఎక్కువవుతున్నారు. 'షుక్ర'వారాలు, 'షని'వారాలు సరేసరి.
ఇక ఒత్తుల విషయం కూడా అధ్వాన్నమే. కొంతమంది సినిమా తారలు ఒత్తులు పలకలేరు .... "బార్యాబర్తల అనుబందం" అని డైలాగ్ చెబుతారు.
'ష' ఫ్యాషన్ అనుకుంటారేమో మరి ... టీవీలో వచ్చే కొంతమంది వయసుమీరిన వారు కూడా (మా తరం వారిలా కనిపించేవారు) అలవాటు చేసుకుని పట్టిపట్టి అనవసరమైన చోట 'ష' పలుకుతుంటారు. నిజానికి అటువంటి వారిని చూస్తే నాకు జాలేస్తుంటుంది.
ఏం చెయ్యగలం, కొంచెం 'నీల్ల'తో 'కల్లు' తుడుచుకుంటుందాం, మనసుకు కాస్త 'షాంతి'గా, 'ప్రషాంతం'గా అనిపించవచ్చు ? 🙁
బహుశా కొన్ని ప్రాంతాలలో ణ, శ పలకరేమోనండి. పిల్లలకి నేర్పించాలంటే ముందు పెద్దవాళ్ళతో మాట్లాడి విషయం వాళ్లకు అర్ధం అయ్యేలా చెప్పాలి. కొత్త ప్రయత్నాలు చేస్తున్నాం. చూద్దాం ప్రయోజనం ఉంటుందేమో!
Delete// "బహుశా కొన్ని ప్రాంతాలలో ణ, శ పలకరేమోనండి." //
Delete---------------------
చైనా వాళ్ళో, జపాన్ వాళ్ళో, రెండు దేశాల వారూనో 'ర' పలకలేక బదులుగా 'ల' అంటారని విన్నాను. 'ణ', 'శ' గురించి మీరనేది ఆ రకంగా అంటారా? మరి 'ళ' సంగతి?
ఏమైనప్పటికీ I must say you are very generous in making that statement 🙁.
వాళ్ళ భాషలో ఉండే అక్షరం "ర". "ల" అనే అక్షరం లేదు. అయితే కొంతమంది బహుశా కాస్త నత్తిలాంటి లక్షణం వల్లేమో "ర"ని "ల"గా పలుకుతారు.
Deleteచిన్నప్పుడు స్కూల్ లో చదువుకునే టప్పుడు మేము "మనదైతే బుర్ర అయ్యవారిది బుఱ్ఱ మనమెక్కితే గుర్రం అయ్యగారిది గుఱ్ఱం" అనేవాళ్లం........ మహా
ReplyDeleteవిన్నకోట నరసింహారావు గారూ. ...... జాగ్రత్త సారూ. వాళ్ళు ఒత్తి భార్యా భర్తలు అంటే వారి లాలాజల తుంపర్లతో మనకి అభిషేకం జరుగుతుంది........ మహా
మహా 🙂.
Delete