Thursday, August 7, 2025

పొందిక

ఈ కాలంలో ఆడపిల్లలు, మగపిల్లలు కూడా చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆనందించ తగిన విషయమే. అయితే శుభ్రమైన ఇల్లు, మరకలు లేని గిన్నెలు, మడత నలగని దుప్పట్లు, ఘుమఘుమలాడే వంటలు వారికి చదువులలో నేర్పని విషయాలు. పైగా చిన్నప్పటినుండీ పని చేయడం అంటే చాలా కష్టపడిపోవడం అంటూ ఇంట్లో వారు పని నేర్పించరు. 'అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్న' చందాన పాపం ఇలాంటివి ఎలా చేసుకోవాలో తెలియక పిల్లలు నానా ఇబ్బంది పడుతుంటారు. పైగా అమెరికాకు వచ్చి ఆ పనేదో చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న పిల్లలకు కూడా సులువుగా ఎలా చేసుకోవాలో చెప్పక, 'అమెరికాలో పాపం మీ పని మీరే చేసుకోవాలిగా' అంటూ సింపతీ చూపిస్తూ రెండు నెలలకు ఒక పార్సిల్ పంపిస్తుండడంతో వీళ్ళలో పని పట్ల మొదలైన ఆ కాస్త ఉత్సాహం కూడా చచ్చిపోతుంది. చివరికి వారికి పని అంటే ఒక భూతంలా కనిపిస్తుంది.  

ఏ ఉద్యోగం చేయాలన్నా దానికి కావలసిన పనిలో తర్ఫీదు పొందడం ఎంత అవసరమో, వంట చేయడం, ఇల్లు సర్దుకోవడం, అతిథులను ఆదరించడం లాంటివి కూడా తర్ఫీదు పొందవలసిన అంశాలే అని ప్రపంచం అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ గుర్తించలేదు. అందుకే ఇంటి పనికి జీతం, గుర్తింపు రెండూ లేవు.

మా అమ్మ హైస్కూల్ టీచర్. తను నేర్పిస్తే లెక్కలంటే భయపడే పిల్లలు కూడా లెక్కల్లో నూటికి నూరు మార్కులు తెచ్చుకునేవారు. ఇక ఇంట్లో పిల్లలకు లెక్కలే కాదు, పని కూడా సరదాగా చెయ్యడం నేర్పించారు. అమ్మ ఎప్పుడూ 'ఏ పని చేసినా పొందిగ్గా చేయాలి' అని చెప్తూ ఉండేవారు. పని చేయడంలో మెళుకువలు తెలుసున్నాక ఆ పొందిక అనే పదానికి అర్థం అనుభవంలోకి వచ్చింది. నా వరకు నాకు ఇల్లు ఒక ప్రయోగశాల. నాకున్న అనేకానేక సరదాలలో వంట కూడా ఒకటి. వంట చేయడంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాను.    

ఇవాళ చేసింది ప్రయోగం కాదు కానీ ఈ చేసిన విధానం గురించి పోస్ట్ వ్రాయాలని అనిపించింది. ఒకప్పుడు గరం మసాలా, ధనియాల పొడి లాంటివి షాప్ లో కొనేదాన్ని కానీ ఈ మధ్య ఇంట్లోనే చేస్తున్నాను. కావలిసిన వస్తువులు తయారీ విధానం నేను ప్రత్యేకంగా చెప్పడం లేదు ఎందుకంటే నేను స్వస్తి వెబ్సైట్ లోని రెసిపీ చూసి చేసాను.

ఏ పనైనా చేయడానికి కావలసిన వస్తువులన్నీ ఒక్కదగ్గర పెట్టుకుంటే ఆ చేయడం తేలిగ్గా ఉంటుంది. గరంమసాలా చేయడానికి కావలసిన దినుసులు పెట్టుకోవడానికి కావలసిన సీసాలు కొనొచ్చు కానీ, నాకు ఖాళీ అయిన పచ్చడి సీసాలో, సల్సా సీసాలో వాడడం ఇష్టం. అసలు సీసాలు ఖాళీ అవడం కోసం ఎదురుచూడడంలో గొప్ప ఆనందం ఉంటుంది. సీసాలు ఖాళీ అయ్యాక వాటిలో కాసిన్ని వేడి నీళ్ళ పోసి, కొంచెం సోప్ వేసి తొలిపి, నీళ్ళు పోసిన గిన్నెలో ఒక నాలుగు గంటలు నాన పెడితే లేబుల్స్ వాటంతట అవే ఊడి వస్తాయి. ఆ తరువాత, ఆ సీసాలను డిష్ వాషర్ లో పెడితే శుభ్రంగా తళతళలాడుతూ బయటకు వస్తాయి. 

ఒక్క ధనియాలు, జిలకర తప్ప గరంమసాలాకు కావలసినవన్నీ ఆ సీసాల్లో వేసి లేజీ సూజన్ లో పెట్టాను. లేజీ సూజన్(lazy susan) లో అయితే ఏ బిర్యానీయో చేసేటప్పుడు వాడడానికి వీలుగా ఉంటాయి.

ఇవాళ ఉదయాన్నే గరంమసాలాకు కావలసిన దినుసులన్నీ తూకం వేసి ఇలా గిన్నెల్లో పెట్టుకున్నాను. ఆ సైట్ లో ఇచ్చిన కొలతలకు మూడింతలు ఎక్కువ తీసుకున్నాను. ఈలోగా ఇండియా నుండి ఫోన్ కాల్ వచ్చింది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతూ విడివిడిగా వాటన్నింటినీ సన్న సెగమీద వేయించాను. ఆ కాల్ పూర్తయ్యేలోగా వేపడం పూర్తయ్యింది.
అవి చల్లబడడానికి కొంచెం టైమ్ పడుతుందిగా ఆ సమయంలో పాఠశాల పని ఉంటే అది పూర్తి చేసి, నిన్న రాత్రి చదువుతూ పక్కన పెట్టిన 'ది ఫ్రోజెన్ రివర్' పుస్తకంలో ఒక ముప్పై పేజీలు చదివాను. ఆ తరువాత ఉదయం నానపెట్టిన బియ్యం, కీన్వా కుక్కర్ లో పెట్టి స్టవ్ వెలిగించాను. వేయించుకున్న గరంమసాలా దినుసులను రెండు దఫాలుగా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసాను. ఆ మసాలా పొడిని ఒక సగం డబ్బాలో వేసి, మరో సగం జిప్ లాక్ బాగ్ లో పెట్టి డేట్ వేసి ఫ్రీజ్ చేశాను. చూద్దాం ఎన్ని నెలలు వస్తుందో.  
ఖాళీ అయిన సరుకులను ఫోన్ లో నోట్ చేసుకున్నాను. ఆ నోట్ ఇంట్లోవాళ్ళతో షేర్ చేసే ఉంటుంది కాబట్టి ఎవరం షాప్ కు వెళ్ళినా, కావలసిన వస్తువుల లిస్ట్ తయారుగా ఉంటుంది. ఏ వస్తువులు, ఎలాంటివి, ఎన్ని కావాలో వివరంగా రాస్తేనే అవి సరిగ్గా వస్తాయన్న విషయం అనుభవపూర్వకంగా తెలిసింది.  
గరంమసాలా చేయడం కోసం వాడిన గిన్నెలన్నింటినీ డిష్ వాషర్ లో పెట్టాను. మిక్సీ జార్ కడిగి  తుడిచి, మిక్సీ తో పాటు షెల్ఫ్ లో పెట్టి, కౌంటర్ తుడిచాను. మిగిలిన పనులు కాకుండా గరం మసాలా మాత్రమే చేయడానికి నాకు అరగంట పట్టింది. ఒక్క మసాలాలు చేయడమే కాదు, అలవాటు చేసికుంటే ఏ పని చేయడం కూడా పెద్ద కష్టం ఏమీ కాదు. 


4 comments:

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.