దాదాపుగా నెల క్రితం, అంటే సెప్టంబర్ నెల ఆఖరి ఆదివారం సాయంత్రం నేనూ, తనూ, పండూ తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. పండుకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఆ రోజు మా ఇద్దరికీ ‘యూటా నేషనల్ పార్క్స్(Utah National Parks)’ గురించి చెప్తూ అక్కడకు వెళ్ళడానికి అక్టోబర్ మంచి సమయం అన్నాడు. అయితే ఈ అక్టోబర్ లోనే వెళ్దాం అని డేట్స్ చూస్తే అక్టోబర్ మొదటి వారంలో తప్ప మరి ఏ వారంలోనూ మాకు కుదిరేలా లేదు. మరీ వారంలో ఏర్పాట్లవీ చేసుకుని వెళ్ళాలంటే కూదరదు కదా వద్దులే అన్నా వాళ్ళిద్దరూ “ఎందుకు కుదరదూ?” అంటూ అక్కడ ఏఏ పార్క్స్ కు వెళ్ళాలో చూసి, రానూ పోనూ ప్రయాణంతో సహా వారం రోజులు సరిపోతుందన్నారు.
శని, ఆదివారాలు పోయినా నాలుగు రోజులు సెలవు తీసుకోవాలంటే ఆఫీస్ లో ఒక మాట చెప్పాలి కదా! సోమవారం మధ్యాహ్నానికి చెప్పడం అయింది, ఆ తరువాత ఫ్లైట్స్, హోటల్స్ బుక్ చేయడం, హైకింగ్ షూస్ కొనడమూ పూర్తి అయింది. ఆ తరువాత తెలిసింది గవర్న్మెంట్ షట్ డౌన్ గురించి, ప్రయాణపు ఏర్పాట్లు పూర్తయ్యాక చేయగలిగిందేమీ లేదు కనుక చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో అనుకుంటూ బుధవారం సాయంత్రం ఫ్లైట్ ఎక్కాము.
ఈ ప్రయాణంలో మేము వెళ్ళాలని అనుకున్నవి మాన్యుమెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ (Monument Valley National Park), మైటీ ఫైవ్ నేషనల్ పార్క్స్ (Mighty five National Parks), బ్లాక్ కెన్యన్ నేషనల్ పార్క్(Black Canyon National Park).
కొర్టెజ్ లో మేము తీసుకున్న హోటల్ హాలీడే ఇన్(Holiday Inn Express Mesa Verde-Cortez by IHG). హోటల్ కొంచెం పాతగా అనిపించినా పయనీర్ డెకరేషన్ తో అందంగా ఉంది.
మిగిలిన కబుర్లు తరువాత భాగంలో