Showing posts with label అవీ..ఇవీ. Show all posts
Showing posts with label అవీ..ఇవీ. Show all posts

Wednesday, December 21, 2011

జెన్ వై (jenaration y)

మా పిన్ని కూతురు ప్రసూనకు ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే మంచి సంబంధ౦ వచ్చిందని పెళ్లి చేశారు. ఆ అబ్బాయి ఉండేది కూడా మేం ఉన్న ఊరికి దగ్గర్లోనే అని తెలిసి అందరం చాలా సంతోషించాం. పెళ్ళయిన రెండు నెలలకు ప్రసూన  కాపురానికి వచ్చింది.

"అక్కా ఇండియన్ షాప కి వెళ్లి గ్రాసరీస్ తెచ్చుకుందామా?  వచ్చిన రెండు రోజుల తరవాత ఫోన్ చేసింది.
“అలాగే మధ్యాన్నం లంచ్ అయ్యాక వెళదాం” అన్నాను.
ఆ మధ్యాహ్నం ఇద్దరం చెరొక కార్ట్ తీసుకుని షాప్ లోకి వెళ్ళాము. “లిస్టు రాసుకుని వచ్చావా?”  అడిగాను.
“అమ్మనడిగి అన్నీ రాసుకుని వచ్చాను.” అంది పెద్ద లిస్టు పర్సులోనుంచి తీస్తూ.

      బియ్యం దగ్గరనుండి మొదలుపెట్టాము. అక్కడ పదిహేను రకాల బియ్యం ఉన్నాయి. ఏవి కొనాలో చెప్పి బాగ్ తీసి కార్ట్ లో పెట్టాను. లిస్టులో తరువాతది కందిపప్పు. పప్పులు ఉన్న సెక్షన్ లోకి వెళ్ళాము. అక్కడ నా ఫ్రెండ్ రాధిక కనిపించింది. పరిచయాలయ్యాయి. తనేదో రైస్ నూడిల్స్ కోసం వచ్చిందట ఏ బ్రాండ్ కొనాలో తెలియలేదంటే, మా ప్రసూనను పప్పులు తీసుకోమని తనతో వెళ్లి ఆ సేమ్యా ఏదో చూసి వచ్చాను. అప్పటికి పది నిముషాలైంది. ప్రసూన పప్పులను పరీక్షగా గమనిస్తూ నిలబడి ఉంది. కార్ట్ లో బియ్యం తప్ప మరేమీ లేవు.

“ఏం తీసుకోలేదేం ప్రసూనా?” అని అడిగాను.
“అక్కా పేర్లన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి.” అంటూ అయోమయంగా చూసింది.
అప్పటికి నాకర్ధం అయింది. మా అమ్మాయికి ఏ పప్పులు ఏవో తెలియవని. సరే, ఏ పప్పేదో వివరించి చెప్పాను.
“ఇంకేమన్నా ఉన్నాయా తీసుకోవలసినవి?” అడిగాను.
“రవికి రైస్ కంటే చెపాతీలే ఇష్టం అట. మనం మైదాపిండి తీసుకోవాలి? అంది.
“మైదాతో చపాతీలా?” అన్నాను వచ్చేనవ్వాపుకుంటూ.
“ఓ కాదా అయితే శనగ పిండి తీసుకుందా౦” అంది. ఇక నవ్వకుండా ఉండడం నా వల్ల కాలేదు.

                *          *         *         *

       ఆ తరువాత ఇంట్లో పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. ఒక్కోసారి వెళ్ళేసరికి ఏడుపు మొహంతో ఉండేది. అప్పటికీ రవి ఓపిగ్గా అన్నీ దగ్గరుండి చూపించేవాడు, పనులన్నీ ఇద్దరూ కలిసే చేసేవాళ్ళు. 

      మా పిన్ని ప్రసూనను వంటగదిలోకి అడుగు పెట్టనిచ్చేది కాదు. తనకు అన్నీ అవలవాటు అవడానికి దాదాపుగా సంవత్సరం పట్టింది. తన వైవాహిక జీవితపు తొలినాళ్ళన్నీ ఇలా పనులు నేర్చుకోవడానికే సరిపోయినట్లనిపించింది. పెళ్లై ఎవరి సంసారం వాళ్ళు  చూసుకోవాలని తెలిసినా పిల్లలకు ఏమీ అలవాటు చెయ్యకపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో మా ప్రసూన లాంటి వాళ్ళను చూసాక తెలిసింది. భార్యా భర్తలకు ఒకరిమీద ఒకరికి ఎంత ప్రేమున్నా నిద్ర లేచేసరికి ఆకలిదేగా రాజ్యం.

     తనింకా ఓ సంవత్సరం ఖాళీగా ఉంది. వచ్చిన వెంటనే ఉద్యోగంలో చేరే వాళ్ళు, లేకపోతే వెంటనే ప్రగ్నేన్సీ వచ్చినవాళ్ళ కష్టాలు చెప్పనే అఖ్ఖర్లేదు. ఇక మొగపిల్లలైతే చదువులకోసమో, ఉద్యోగారీత్యానో ఇక్కడకు వస్తారు. ఏమీ చేసుకోవడం రాక ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడతారు. ఫలితం ఊబకాయం, ఆరోగ్యం పాడవడం. ఉతికిన బట్టలు, విడిచిన బట్టలు వేరువేరుగా పెట్టుకోవాలని కూడా తెలియని పిల్లల్ని చూశాక, పిల్లలకు చదువుతో పాటు, చిన్న చిన్న పనులు  చిన్నప్పట్నుంచే ఓ ఆటలా నేర్పితే బావుంటుందనిపించింది.




Wednesday, November 9, 2011

ఆ నలుగురూ

ఆ మధ్య ఒకసారి మా స్వరూప ఫోన్ చేసింది. ఆవిడ నిన్ను కలవాలన్నారు. ఈ పూట మధ్యాహ్నం వస్తార్టఅంది.
ఆవిడా, ఆవిడెవరు? ఎందుకొస్తున్నారు?” అడిగాను. 
వేరే కాల్ ఏదో వస్తుంది.  లైన్ లో ఉండుఅ౦ది.  ఓ ఐదు నిముషాలు లైన్లో ఉన్నా.
నాకు అర్జంట్ పని ఉంది సాయంత్రం మాట్లాడతాను. ఆవిడతో మాట్లాడుఅని ఫోన్ కట్ చేసింది. ఎప్పుడూ ఇంతే హడావిడి, పూర్తి వివరాలు చెప్పనే చెప్పదు.

మధ్యాహ్నం అయింది. ఆవిడ వచ్చారు.  కుశల ప్రశ్నలయ్యాక ఏం పని మీద వచ్చారు”  అని అడిగాను. ఏదో ఉద్యోగం ఉంది, ఫలానా దగ్గర చేస్తావా అని అడిగారు. ఇదేదో బానే వుందే ఇంటికి వచ్చి మరీ ఉద్యోగం ఇస్తామంటున్నారు, ఏమి నా భాగ్యం"అనుకున్నా.
ఇంతకీ నేను చేయవలసిన పనేమిటి?” అడిగాను.
వెళ్ళాక తెలుస్తుంది”.
వింతగా వుందే, ఎంత సమయం పని చెయ్యాల్సి ఉంటుంది?” అన్నా. 
మీరు చేయ్యగలిగిన౦త సేపు
జీతం యెంతో?
మీరు చేసే పనిని బట్టి ఉంటుంది.”  
ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా?”
మీరు ఊహించలేనన్నిఅన్నారు.
"నాకు పనే౦టో తెలియదు, ఎలా చెయ్యగలనో" బెరుకుగా అడిగాను.
"అప్పుడప్పుడు నా స్నేహితులు వచ్చి నిన్ను చూస్తూనే ఉంటారు." 

       ఏమీ అర్ధం కాలేదు. ఆవిడ కాసేపు ఉండి వెళ్లారు. ఆవిడ వెళ్ళాక చాలా సేపు ఆలోచించా. అసలు పనేంటో, ఎక్కువ సేపు చెయ్యాలేమో, జీతం కూడా సరిగా తెలియదు ఇలా సాగిపోయాయి. ఇప్పుడు హాయిగా ఉన్నాంగా ఎందుకీ బాధలుఅనిపించింది. ఆ సాయత్రం స్వరూప ఫోన్ చేసి ఏమై౦దని అడిగింది. జరిగిందంతా చెప్పి నా నిర్ణయం కూడా చెప్పాను. బాగా ఆలోచించావా?” అంది. ఆ అన్నీ ఆలోచించానుఅన్నా. సరే నీ ఇష్టం అని ఫోన్ పెట్టేసింది.

      "అనవసరంగా కాళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని వదలుకున్నానా"అని కాసేపు, "లేదులే మంచి పనే చేసా"నని" కాసపు అనిపించేది. వద్దనుకున్నాక ప్రశాంతంగా అనిపించింది. ఆవిడ మళ్ళా ఓ రెండు సార్లు వచ్చి తలుపుతట్టారు. కిటికీలోనుంచి చూసి తలుపు తీయడమే మానుకున్నా. కొద్ది రోజులు దాని గురించి ఆలోచనలు వచ్చాయి, కాని ఇప్పుడు హాయిగా సుఖంగా ఉన్నా౦గా ఈ త్యాగాలూ, అవీ అంటే కష్టం పైగా ఏం వస్తుందో, ఎంత వస్తుందో తెలియని భాగ్యానికి ఎందుకు లేని పోని కష్టాలు అని, ఆ విషయాన్ని పక్కకు నెట్టేశాను.

      ఆ తరువాత ఓ నాలుగు నెలల క్రితం అనుకుంటాను రోజులు మరీ రొటీన్గా అనిపించాయి. రోజూ ఒకటే పని. సడన్గా ఆవిడ గుర్తొచ్చారు. స్వరూపనడిగా ఆవిడెప్పుడూ ఒక దగ్గర వుండరని, వివరాలు సరిగ్గా తెలియవని, తన దగ్గర ఉన్నఅడ్రెస్ ఏదో ఇచ్చింది. వెతుక్కుంటూ వెళ్లాను. వెంటనే కాదుకాని మొత్తానికి ఆవిడని చూడగలిగాను. ఉద్యోగం గురించి మాట్లాడాను. "ఇప్పుడా ఉద్యోగం లేదుగా" అన్నారు. నిరుత్సాహంగా వెనక్కి తిరిగాను. "ఆగండాగండి, అదిలేదు కాని ఇంకోటి ఉంద"ని వివరాలు చెప్పారు.

           వెంటనే వెళ్లి చేరిపోయాను. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించింది. ఇంట్లో బయట పనులతో చాలా ఇబ్బంది అయింది. తరువాత మెల్లగా అన్నీ సర్దుకోవడం మొదలు పెట్టాయి. మధ్య మధ్యలో ఆవిడ స్నేహితులు వచ్చి కలుస్తూ ఉత్సాహపరుస్తూ ఉండేవారు. చాన్నాళ్ళు ఇలా జరిగాక ఈ మధ్యే ఆవిడ స్నేహితురాలు వచ్చి నన్ను ఆశ్చర్యానందాలలో ముంచివేశారు.

        “ఇంతకూ 'ఆ నలుగురూ' ఎవరని?” కదూ మీ ప్రశ్న. మొదటగా వచ్చి౦ది అవకాశంమధ్యలో పర్యవేక్షి౦చి౦ది తృప్తి’, 'అనుభవము' చివరగా వచ్చి౦ది అదృష్టం’.

        మనకు అవకాశం వచ్చినా అందుకోవడానికి బోలెడంత ఆలోచిస్తాం. ఒక్కోసారి అనవసర భయాలతో వదిలి వేస్తాం కూడా....కాని మనకు ఏం కావాలో తెలుసుకుని ప్రయత్నం చేస్తే మనకు ముందుగా ఎదురయ్యేది తృప్తి. తరువాత వచ్చేది అనుభవం. వాటన్నిటి చుట్టమే అదృష్టం. 


Wednesday, November 2, 2011

విన్నవించుకోనా చిన్న కోరిక

         అమ్మలూ నువ్వింకా కదలనే లేదా? ఇలా కబుర్లేసుకు కూర్చుంటే ఎలా తల్లీ? ఈ వేళ గురించి నీకు ఎప్పుడనగా చెప్పాను? అన్నీ విన్నావు  ‘ఊ’ కొట్టావు కూడా. ఊ..ఊ..పద పద మరి. ఇలా చీమ నడకలు నడిస్తే ఎలా బంగారం? నీకిష్టమైనపుడు పరగులు పెడతావు,  నిలవమన్నానిలవవు. ఇప్పుడేమో ఇలా! ఎలారా నీతో? ఏమిటీ? అంతా కోపమే! చిన్న సాయమేగా అడిగాను. అదికూడా చేయకపోతే ఎలా తల్లీ! అప్పుడెప్పుడో నాకు  గాయమైనప్పుడు సాయం చేసావా? నేనెలా మరచిపోతాను మరచిపోలేదులే. ఏదో మనసూరుకోక అన్నాలేరా. అలా బుంగమూతి పెట్టకు. నీకీ వేళ మల్లెమొగ్గలతో జడల్లుతానుగా, ఏమిటీ మల్లెలొద్దా పోనీ మొగలిపూల జడ వేయనా. నా బంగారం...త్వరగా కదులమ్మా.

       ఇల్లలికాను, ముగ్గులు పెట్టాను తోరణాలు కట్టాను. ఇహ..నీ పనే మిగిలింది. ఈ వర్షం ఒకటి, పొద్దు గడవనివ్వదు, రేయి తరగనివ్వదు.  ఆ చందురుడ్ని మత్తే కమ్మిందో సూరీడికి బద్దకమే వచ్చిందో ఎక్కడా వెలుగు రేఖ కనపడ్డమే లేదు. చిన్నవైనా చుక్కలే నయం. స్వాగతం పలకడానికి ఎప్పుడో వెళ్లిపోయాయి ఒక్కళ్ళూ కదలరేమర్రా ఒక్కదాన్ని ఎంతని తిరగను? నాకున్న తొందరలో మీకు పిసరంతైనా లేదే?

       ఈ కాలాన్ని కదలమని నువ్వైనా చెప్పవమ్మా పువ్వమ్మా! ఈ కాలం కదిలేదెప్పుడో, నా నిరీక్షణ పూర్తయ్యేదెన్నడో! అప్పుడేగా సంతోషం ముంగిట వాలేది, ఆ నక్షత్రాల వెలుగు కళ్ళలో ప్రతిఫలించేదీనూ!!



Monday, October 3, 2011

అలా మొదలైంది...

         
              నేను వ్రాసిన కవితలు బావున్నాయా? అసలు ఎవరికైనా నచ్చుతాయా? అనే అనుమానం వుండేది. నా హితులూ, స్నేహితులూ బావున్నాయనే వారు, కాని నా మీద ప్రేమతో చెప్తున్నారేమో అని సందేహం. కౌముదికి పంపించాను.

             'కిరణ్ ప్రభ గారు' "Good concepts and very good expressions.. Keep writing Jyothirmayi Garu...."  అని పంపించినప్పుడు అంత గొప్ప సంపాదకులకు నచ్చాక నా సందేహం తీరిపోయింది. నా కలం కదలడానికి ప్రోత్సాహమిచ్చిన 'కిరణ్ ప్రభ' గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

           ఓ రోజు అలవాటుగా 'చిమటామ్యూజిక్.కాం' లో పాటలు వినడానికి వెబ్సైటు ఓపెన్ చేసాను. అక్కడ కొన్ని పాటలకు 'నిషిగంధ' గారి వ్యాఖ్యానం చదివాను. చాలా చాలా నచ్చింది. ఆ సైట్ లోనే ఆవిడ పొయెట్రీ అని కనిపించి౦ది. వెళ్లి చదవడం మొదలు పెట్టాను. ఆ కవితల్లో నన్ను నేను మరచి పోయాను. ఆవిడ కవితల్లో ప్రతి వాక్యంలో భావుకత వెల్లివిరుస్తుంది. పారిజాతాలు మన మనసులోనే  విచ్చుతున్న అనుభూతి కలుగుతుంది.

ఆవిడ కవితల్లో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు.....

ఊపిరి తాకినంత మాత్రాన
సామీప్యం సాన్నిహిత్యమవ్వదని!

ఈ కవితలో సామీప్యానికి సాన్నిహిత్యానికి ఉన్న తేడా అవిడ వివరించిన శైలి....అద్భుతం. అలాగే వెన్నెల గురించి ఆవిడ వాక్యాలు

'చుక్కల నవ్వుల్ని తోడిచ్చి
జాబిలి దోసిలి నించి
జారవిడిచింది..'

ఈ వాక్యాలలో ఎంత ప్రేమ భావం నిండియున్నదో చూడండి.

'ఏ దిగంతాల అవతల
నీ అడుగుల సడి వినబడిందో
పువ్వు నించి పువ్వుకి
ఆనందం వ్యాపిస్తోంది..'

ఇలా ఎన్నెన్నో...

           ఇక ఈ కవితల వ్యాఖ్యలు. నాకు ఇంకో ప్రపంచం చూపించాయి. అలా కనిపించిందే 'స్నేహమా' రాధిక గారి బ్లాగు. ఆవిడ  చిన్న చిన్న పదాల అల్లికతో కవితలు ఎంత బాగా వ్రాశారో! ప్రతి కవితకి ఒక చిత్రం ఆ కవితలకు అదనపు ఆకర్షణ. ఆవిడ 'గాయ పడిన నమ్మకాలు' కవితలో అంటారూ ..

'గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకుని
అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను'

మనసుని కదిలించే సన్నివేశం మన కళ్ళ ముందు ఆవిష్కృతమౌతుంది. ఇక 'ఊరు' కవితలో

'ఇక రాననుకున్నారో ఏమో
అయినవాళ్ళు కొందరు
చెప్పకుండానే దాటిపోయారు'

ఇది చాలు ఆవిడ కవితల గురించి చెప్పడానికి.

       నాకు బ్లాగ్ పెట్టాలన్న ఆలోచన అప్పుడు మొదలైంది. బ్లాగుపెట్టి వ్రాస్తుంటే తెలియని ఆనందం నాలో. ఇంతటి ఆనందం నాకు కలగడానికి ఈ బ్లాగు పెట్టడానికి స్ఫూర్తి నిచ్చిన నిషిగంధ గారికి, రాధిక గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

       . మొదలుపెట్టాక "నా బ్లాగుకి వచ్చి వ్యాఖ్యతో పలకరించకపోతే...ఎంత అద్భుతమైన రచనని చదవకుండా ఉండేదాన్నోకదా" అంటూ 'ఇల్లాలి ముచ్చట్లు' సుధ గారి వ్యాఖ్య చూశాక ఎంత ఆనందం కలిగి౦దో మాటల్లో చెప్పలేను. అలాగే మధురవాణి గారు కామెంట్ పెట్టటమే కాక నాతో చెలిమికి తన రాధ నిచ్చిన తొలి నెచ్చెలి, తరువాత 'వెన్నెల్లో గోదారి' శైల బాల గారు నా రెండో అతిధి. ఈ మధ్యనే 'కడలి' సుభ గారు కూడా...

        మధుర వాణి గారికి, శైల బాల గారికి, సుభ గారికి...ఇంకా బ్లాగుకు వచ్చి కామెంటిచ్చిన అందరికీ నా ధన్యవాదాలు.

జ్యోతిర్మయి

Wednesday, September 7, 2011

కార్తీక౦లో ఓ రోజు


            'వనభోజనం' అన్న మాట వింటే చాలు, మనస్సు చిన్నతనంలోకి పరుగులు తీస్తుంది.  ముందుగా గుర్తొచ్చేది కార్తీక మాసం. మా ఊరిలో చిన్న, పెద్ద ఆడవాళ్ళ౦దరూ  తెల్లరగట్లే  చెరువులో అభ్యంగన స్నానాలు చేసి అరటి బోదేలో నూనె దీపాలు వెలిగించి ఆ  నీళ్ళలో వదిలే వాళ్ళు.  పొగమంచులో కనిపించినంత మేర నీళ్ళు, అందులో మెల్లగా కదులుతూ దీపాలు, ఓహ్! ఎంత చూసినా తనివి తీరేది కాదు. 


          ఇక వన భోజనాలు...  సందడే సందడి.  నాన్నమ్మ, తాతయ్య, బాబాయిలు,  పిన్నులు, వాళ్ళ పిల్లలు, ఇంకా  ఊరి నుండి వచ్చే చిన్నత్త, పెద్దత్త, మామయ్యలు ఊరిలో వుండే చుట్టాలతో కలసి ఓ డెబ్బై  మంది దాకా తయరయ్యేవాళ్ళం. రెండెడ్ల బండ్ల మీద కావలసిన సామానంతా బండిజల్లలో వేసికుని తోటలోకి వెళ్ళేవాళ్ళం. మా పాలేరు వెంకడు గాడి పొయ్యి తొవ్వేవాడు. చిన్నత్త వంకాయలు కొస్తే, పెద్ద పిన్ని ఎసట్లో బియ్యం  వేసేది, నాన్నమ్మ పచ్చడి నూరితే, నీలవేణి, సామ్రాజ్యం పిన్ని నీళ్ళు తెచ్చేవాళ్ళు. బాబాయిలు వేడి వేడి అండాలను ఇట్టే ఎత్తి అవతల  పెట్తేసే వాళ్ళు, ఇలా పెద్దవాళ్ళంతా తలా ఒక పని అందుకునే వాళ్ళు.


            పిల్లలమ౦తా కలసి కోతి కొమ్మచ్చి, కుందుడు గుమ్మ, దాగుడు మూతలాట, ఖో ఖో ఆటలతో తోటంతా హోరెత్తించే వాళ్ళం . ఆకలేసిన పిల్లలకి  ఏ లడ్డో, వాంపూసో తాయిలం పెట్టేవాళ్ళు. దాహా నికి కొబ్బరి బోండాలు, నిమ్మకాయ మజ్జిగ ఉండనే ఉండేవి. వంటలన్నీ అయ్యాక అందరికీ ఉసిరిక చెట్టుకింద పంక్తి భోజనాలు. వేడి వేడి అన్నంలో చింతకాయ తొక్కు, దోసకాయ పప్పు, కమ్మని నెయ్యి ఆదరువగా అప్పడాలు, గుమ్మడికాయ వరుగులు, గుత్తి వంకాయ కూర, పులిహోర, మీగడ పెరుగు, ఆవకాయ, చివరగా పాయసం. ఆ  భోజనం అమృతంలా వుండేది.
          
          దేశంకాని దేశం వచ్చాం, ఇక్కడ చెరువులూ  దీపాలు లేవు, వనభోజనాలూ లేవు అని దీర్ఘంగా నిట్టూర్చి ఎవరైనా మెయిల్ పంపించారేమోనని మెయిల్ ఓపెన్ చేశాను. అప్పుడు చూశాను మా తెలుగు అసోసియేషన్ వారి  వనభోజనాల ఆహ్వానం. ఇదేమిటి మనసులో అనుకున్నది మెయిల్ కెలా తెలిసిందని ఆశ్చర్యపోతూ మొత్తం చదివాను. ఈ వనభోజనాలు మన ఊరిలోలాగ ఉంటాయా,  ఏమన్ననా?  అయినా ప్రయత్నించి చూద్దాం అని 'వాలంటీర్ షీట్' ఓపెన్ చేసి 'గుత్తి వంకాయ'కి  సైన్ అప్ చేశాను. ఇలా చేశానో లేదో అలా వెంటనే ధన్యవాదములతో అచ్చ తెలుగులో మెయిల్. ఇక ఆ  రోజు కోసం ఎదురు చూస్తూ పక్కింటి పద్మని దీని గురించి అడిగాను ఎలా ఉంటుందని? "  ఆ... ఏదో ఉంటుందిలే... ఏమీ ఉబుసుపోక ఇలాటివి యేవో ఒకటి చేస్తూనే ఉంటారని" సమాధానం.  అనవసంగా వెళ్తున్నామేమో  అని ఆలోచిస్తూ అన్యమస్కంగానే 'గుత్తొంకాయ కూర' వండి  శ్రీవారు పిల్లలతో  కలసి నిర్ణీత స్థలానికి వెళ్ళాను.
  
         ఆ  పార్కుకు వెళ్ళేసరికే  కార్యకర్తలు స్వచ్ఛంద సేవకులతో ఆ  ప్రాంతమంతా కళ కళ లాడుతోంది. ఒక  రెండు వరుసలలో స్టాండులు అమర్చి పదార్ధాలను ఒద్దికగా సర్దుతున్నారు.  ఓ ప్రక్క మంచి నీళ్ళ కాన్లు, కూలర్లలో జ్యూసులు సోడాలు. బాడ్జ్ పెట్టుకున్న ఒక కార్యకర్త నన్ను నవ్వుతూ పలకరించి నా పేరు తెలుసుకుని నేను తెచ్చిన ట్రేని అందుకున్నారు. అక్కడ అందరూ కలసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒక్క కుటుంబంలా కలసి పనిచేస్తున్నారు. ఇంతలో బుగ్గ మీద సీతాకోక చిలుకతో చిన్నారి, చేతిలో వాటర్ బెల్లూన్ పట్టుకుని పెద్దాడు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఇదేంటిరా అని ఆశ్చర్యంగా చూశాను. రెండో షెల్టర్లో పిల్లలకు ఓ ముగ్గురు అమ్మాయిలు ఫేస్  పైంటింగ్ వేస్తున్నారు, కొంత మంది పిల్లలు వాటర్ బెలూన్లతో ఆడుకుంటున్నారు. ఆ  పక్కగా చెట్టు కింద టగ్ అఫ్ వార్, అలా పిల్లలందరూ ఆనందంగా ఆటలాడుకుంటున్నారు. 

  
        ఇంతలో భోజనాలకు పిలుపొచ్చింది. "పిల్లలు తినడానికి ఏమైనా వున్నాయో, లేవో? కొంచం పెరుగన్నం అన్నా కలుపుకు రావాల్సింది" అనుకుంటూ  ప్లేట్ తీసుకున్నాను. బిర్యాని, పులిహోర, చపాతీలు,  చెన్నా కర్రీ, వంకాయ కూర, పచ్చడి, సాంబార్, గులాబ్ జామ్, చికెన్ కర్రీ, పెరుగు, దద్దోజనం, ఆవకాయ్. "బాబోయ్ ఇన్ని వంటకాలే" అనుకుంటూ పిల్లలకి, చపాతీ చెన్నా కర్రీ, దద్దోజనం పెట్టాను. ఈలోగా పెద్దవాళ్ళు కూడా మొదలెట్టారు. నిజం చెప్పొద్దూ! వంటలన్నీ అమోఘం తృప్తిగా భోంచేశాను . ఇంట్లో కూరలకు వంకలు పెట్తే శ్రీవారు కూడా రెండు మూడు సార్లు వడ్డించుకోవడం చూసి 'ఔరా' అనుకున్నాను. 

        అందరి భోజనాలు అవగానే జనరల్ బాడీ మీటింగ్ కి పిలుపొచ్చింది అప్పటి వరకూ అసోసియేషన్  వారు చేసిన కార్యక్రమాలు, చేయబోయే  కార్యక్రమాలు అన్నింటి గురించీ చెప్పారు. ఈ సంవత్సరం మొట్ట మొదటి సారిగా వాహిని పత్రికను కూడా ముద్రించారట. కథలు కవితలంటే ప్రాణం నాకు వెళ్లి పత్రికను చేతిలోకి తీసికున్నాను ఆశ్చర్యం! ఎంత బావుందో, ఇలా౦టి  తెలుగు పత్రిక చూసి ఎన్నాళ్ళయిందో! ఇలా పేజీలు తిప్పుతున్నాను ఈ లోగా 'ఒక్క నిముషం తెలుగు' అని పిలుస్తున్నారు అలా వెళ్లి చూద్దును కదా ఇచ్చిన సందర్భాన్ని బట్టి ఒక్క నిమిషం 'తెలుగులో మాత్రమే' మాట్లడాలట. చాలా మంది ప్రయత్నించారు అక్కడున్న అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈలోగా  కొంతమంది ఫుడ్ సర్వ్ చేసిన షెల్టర్ అంతా శుభ్రంగా క్లీన్ అప్  చేసేశారు. ఆ  పక్కగా చెట్టు కింద పిల్లలు 'మ్యూజికల్ చైర్స్' ఆడుతున్నారు.
  
         తరువాత 'కబడ్డీ', 'టచ్ మీ టు' గేమ్స్ ఆడాము. చిన్నప్పుడెప్పుడో స్కూల్ లో ఆడిన ఆటలు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఇంత బాగా ఎంజాయ్ చేశాను. ఎండ ఎక్కువగా వుంది పిల్లలు ఏం చేస్తున్నారో అని చూద్దును కదా ఒకళ్ళ చేతిలో పుచ్చకాయ ముక్క, ఇంకొకళ్ళ చేతిలో కాప్రిసన్, దూరంగా శ్రీవారి చేతిలో నిమ్మకాయ మజ్జిగ.ఎండలో తీయని పుచ్చకాయ తింటూ చిన్నప్పటి రోజులు గుర్తుచేసికున్నాను, మా వనభోజనాల సందడి మళ్ళీ తిరిగి వచ్చినట్లైంది. పాత, కొత్త మిత్రులందరికీ వీడ్కోలు చెప్పి మళ్ళీ ఇలాంటి వనభోజనాల సందడి ఎప్పటికో కదా.....అనుకుంటూ పార్కింగ్ లాట్  వైపు కదిలాము.