Wednesday, September 7, 2011

కార్తీక౦లో ఓ రోజు


            'వనభోజనం' అన్న మాట వింటే చాలు, మనస్సు చిన్నతనంలోకి పరుగులు తీస్తుంది.  ముందుగా గుర్తొచ్చేది కార్తీక మాసం. మా ఊరిలో చిన్న, పెద్ద ఆడవాళ్ళ౦దరూ  తెల్లరగట్లే  చెరువులో అభ్యంగన స్నానాలు చేసి అరటి బోదేలో నూనె దీపాలు వెలిగించి ఆ  నీళ్ళలో వదిలే వాళ్ళు.  పొగమంచులో కనిపించినంత మేర నీళ్ళు, అందులో మెల్లగా కదులుతూ దీపాలు, ఓహ్! ఎంత చూసినా తనివి తీరేది కాదు. 


          ఇక వన భోజనాలు...  సందడే సందడి.  నాన్నమ్మ, తాతయ్య, బాబాయిలు,  పిన్నులు, వాళ్ళ పిల్లలు, ఇంకా  ఊరి నుండి వచ్చే చిన్నత్త, పెద్దత్త, మామయ్యలు ఊరిలో వుండే చుట్టాలతో కలసి ఓ డెబ్బై  మంది దాకా తయరయ్యేవాళ్ళం. రెండెడ్ల బండ్ల మీద కావలసిన సామానంతా బండిజల్లలో వేసికుని తోటలోకి వెళ్ళేవాళ్ళం. మా పాలేరు వెంకడు గాడి పొయ్యి తొవ్వేవాడు. చిన్నత్త వంకాయలు కొస్తే, పెద్ద పిన్ని ఎసట్లో బియ్యం  వేసేది, నాన్నమ్మ పచ్చడి నూరితే, నీలవేణి, సామ్రాజ్యం పిన్ని నీళ్ళు తెచ్చేవాళ్ళు. బాబాయిలు వేడి వేడి అండాలను ఇట్టే ఎత్తి అవతల  పెట్తేసే వాళ్ళు, ఇలా పెద్దవాళ్ళంతా తలా ఒక పని అందుకునే వాళ్ళు.


            పిల్లలమ౦తా కలసి కోతి కొమ్మచ్చి, కుందుడు గుమ్మ, దాగుడు మూతలాట, ఖో ఖో ఆటలతో తోటంతా హోరెత్తించే వాళ్ళం . ఆకలేసిన పిల్లలకి  ఏ లడ్డో, వాంపూసో తాయిలం పెట్టేవాళ్ళు. దాహా నికి కొబ్బరి బోండాలు, నిమ్మకాయ మజ్జిగ ఉండనే ఉండేవి. వంటలన్నీ అయ్యాక అందరికీ ఉసిరిక చెట్టుకింద పంక్తి భోజనాలు. వేడి వేడి అన్నంలో చింతకాయ తొక్కు, దోసకాయ పప్పు, కమ్మని నెయ్యి ఆదరువగా అప్పడాలు, గుమ్మడికాయ వరుగులు, గుత్తి వంకాయ కూర, పులిహోర, మీగడ పెరుగు, ఆవకాయ, చివరగా పాయసం. ఆ  భోజనం అమృతంలా వుండేది.
          
          దేశంకాని దేశం వచ్చాం, ఇక్కడ చెరువులూ  దీపాలు లేవు, వనభోజనాలూ లేవు అని దీర్ఘంగా నిట్టూర్చి ఎవరైనా మెయిల్ పంపించారేమోనని మెయిల్ ఓపెన్ చేశాను. అప్పుడు చూశాను మా తెలుగు అసోసియేషన్ వారి  వనభోజనాల ఆహ్వానం. ఇదేమిటి మనసులో అనుకున్నది మెయిల్ కెలా తెలిసిందని ఆశ్చర్యపోతూ మొత్తం చదివాను. ఈ వనభోజనాలు మన ఊరిలోలాగ ఉంటాయా,  ఏమన్ననా?  అయినా ప్రయత్నించి చూద్దాం అని 'వాలంటీర్ షీట్' ఓపెన్ చేసి 'గుత్తి వంకాయ'కి  సైన్ అప్ చేశాను. ఇలా చేశానో లేదో అలా వెంటనే ధన్యవాదములతో అచ్చ తెలుగులో మెయిల్. ఇక ఆ  రోజు కోసం ఎదురు చూస్తూ పక్కింటి పద్మని దీని గురించి అడిగాను ఎలా ఉంటుందని? "  ఆ... ఏదో ఉంటుందిలే... ఏమీ ఉబుసుపోక ఇలాటివి యేవో ఒకటి చేస్తూనే ఉంటారని" సమాధానం.  అనవసంగా వెళ్తున్నామేమో  అని ఆలోచిస్తూ అన్యమస్కంగానే 'గుత్తొంకాయ కూర' వండి  శ్రీవారు పిల్లలతో  కలసి నిర్ణీత స్థలానికి వెళ్ళాను.
  
         ఆ  పార్కుకు వెళ్ళేసరికే  కార్యకర్తలు స్వచ్ఛంద సేవకులతో ఆ  ప్రాంతమంతా కళ కళ లాడుతోంది. ఒక  రెండు వరుసలలో స్టాండులు అమర్చి పదార్ధాలను ఒద్దికగా సర్దుతున్నారు.  ఓ ప్రక్క మంచి నీళ్ళ కాన్లు, కూలర్లలో జ్యూసులు సోడాలు. బాడ్జ్ పెట్టుకున్న ఒక కార్యకర్త నన్ను నవ్వుతూ పలకరించి నా పేరు తెలుసుకుని నేను తెచ్చిన ట్రేని అందుకున్నారు. అక్కడ అందరూ కలసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒక్క కుటుంబంలా కలసి పనిచేస్తున్నారు. ఇంతలో బుగ్గ మీద సీతాకోక చిలుకతో చిన్నారి, చేతిలో వాటర్ బెల్లూన్ పట్టుకుని పెద్దాడు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఇదేంటిరా అని ఆశ్చర్యంగా చూశాను. రెండో షెల్టర్లో పిల్లలకు ఓ ముగ్గురు అమ్మాయిలు ఫేస్  పైంటింగ్ వేస్తున్నారు, కొంత మంది పిల్లలు వాటర్ బెలూన్లతో ఆడుకుంటున్నారు. ఆ  పక్కగా చెట్టు కింద టగ్ అఫ్ వార్, అలా పిల్లలందరూ ఆనందంగా ఆటలాడుకుంటున్నారు. 

  
        ఇంతలో భోజనాలకు పిలుపొచ్చింది. "పిల్లలు తినడానికి ఏమైనా వున్నాయో, లేవో? కొంచం పెరుగన్నం అన్నా కలుపుకు రావాల్సింది" అనుకుంటూ  ప్లేట్ తీసుకున్నాను. బిర్యాని, పులిహోర, చపాతీలు,  చెన్నా కర్రీ, వంకాయ కూర, పచ్చడి, సాంబార్, గులాబ్ జామ్, చికెన్ కర్రీ, పెరుగు, దద్దోజనం, ఆవకాయ్. "బాబోయ్ ఇన్ని వంటకాలే" అనుకుంటూ పిల్లలకి, చపాతీ చెన్నా కర్రీ, దద్దోజనం పెట్టాను. ఈలోగా పెద్దవాళ్ళు కూడా మొదలెట్టారు. నిజం చెప్పొద్దూ! వంటలన్నీ అమోఘం తృప్తిగా భోంచేశాను . ఇంట్లో కూరలకు వంకలు పెట్తే శ్రీవారు కూడా రెండు మూడు సార్లు వడ్డించుకోవడం చూసి 'ఔరా' అనుకున్నాను. 

        అందరి భోజనాలు అవగానే జనరల్ బాడీ మీటింగ్ కి పిలుపొచ్చింది అప్పటి వరకూ అసోసియేషన్  వారు చేసిన కార్యక్రమాలు, చేయబోయే  కార్యక్రమాలు అన్నింటి గురించీ చెప్పారు. ఈ సంవత్సరం మొట్ట మొదటి సారిగా వాహిని పత్రికను కూడా ముద్రించారట. కథలు కవితలంటే ప్రాణం నాకు వెళ్లి పత్రికను చేతిలోకి తీసికున్నాను ఆశ్చర్యం! ఎంత బావుందో, ఇలా౦టి  తెలుగు పత్రిక చూసి ఎన్నాళ్ళయిందో! ఇలా పేజీలు తిప్పుతున్నాను ఈ లోగా 'ఒక్క నిముషం తెలుగు' అని పిలుస్తున్నారు అలా వెళ్లి చూద్దును కదా ఇచ్చిన సందర్భాన్ని బట్టి ఒక్క నిమిషం 'తెలుగులో మాత్రమే' మాట్లడాలట. చాలా మంది ప్రయత్నించారు అక్కడున్న అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈలోగా  కొంతమంది ఫుడ్ సర్వ్ చేసిన షెల్టర్ అంతా శుభ్రంగా క్లీన్ అప్  చేసేశారు. ఆ  పక్కగా చెట్టు కింద పిల్లలు 'మ్యూజికల్ చైర్స్' ఆడుతున్నారు.
  
         తరువాత 'కబడ్డీ', 'టచ్ మీ టు' గేమ్స్ ఆడాము. చిన్నప్పుడెప్పుడో స్కూల్ లో ఆడిన ఆటలు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఇంత బాగా ఎంజాయ్ చేశాను. ఎండ ఎక్కువగా వుంది పిల్లలు ఏం చేస్తున్నారో అని చూద్దును కదా ఒకళ్ళ చేతిలో పుచ్చకాయ ముక్క, ఇంకొకళ్ళ చేతిలో కాప్రిసన్, దూరంగా శ్రీవారి చేతిలో నిమ్మకాయ మజ్జిగ.ఎండలో తీయని పుచ్చకాయ తింటూ చిన్నప్పటి రోజులు గుర్తుచేసికున్నాను, మా వనభోజనాల సందడి మళ్ళీ తిరిగి వచ్చినట్లైంది. పాత, కొత్త మిత్రులందరికీ వీడ్కోలు చెప్పి మళ్ళీ ఇలాంటి వనభోజనాల సందడి ఎప్పటికో కదా.....అనుకుంటూ పార్కింగ్ లాట్  వైపు కదిలాము. 
        

4 comments:

 1. అవునండీ ఇక్కడన్నీ బాగా చేస్తారు, వెళ్ళడానికి టయిము కుదరాలంతే...
  మీ పోస్ట్ బాగుందండీ..

  ReplyDelete
 2. వెళితే సరదాగా ఉంటుంది. అందర్నీ కలుస్తాము కదా..
  ధన్యవాదములు.

  ReplyDelete
 3. ఇక్కడ కూడా వనభోజనాలుంటాయా..... అయ్యో నాకు తెలియదు..... మొన్నే కార్తీక మాసంలో అమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఈ వనభోజనాల గురించే మాట్లాడుకున్నాం.... ఏ ఆటలాడినా ఏదో ఒక ప్రైజు ఇచ్చి పంపేవారు....

  కొద్దిగా పెద్దయ్యాక పురాణాల క్విజ్లో పాల్గొని గెలుచుకున్న గిఫ్ట్ గుర్తొచ్చింది మీ టపాతో... ( నేను ఒక్క ప్రశ్నకే జవాబు చెప్పినా మా టీముకే ప్రైజ్ వచ్చింది... :-) )

  ReplyDelete
 4. మాధవి గారూ వేసవిలో మా ఊరొచ్చేయండి. వనభోజనాలకు వెళ్దాం..అప్పుడు కూడా పురాణాల్లో క్విజ్ పెట్టించమందా౦. ధన్యవాదాలు.

  ReplyDelete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.