తరువాత రోజు నిద్రలేచి టెంట్ బయటకు రాగానే అత్భుతమైన దృశ్యం, తెలిమంచు తెరల్లో ప్రకృతి. చెట్ల మధ్యలో దోబూచులాడుతూ రవి కిరణాలు ఎంత అందంగా వున్నాయో! కాళ్ళ కింద మెత్తగా తగులుతున్న మట్టినేల, స్వాగతమంటున్న చల్లగాలి, చూపులు సాగినంత మేరా నిర్మలమైన ఆకాశం. రాత్రి చీకట్లో కనిపించలేదు కానీ, మధ్యలో స్థలం వదిలి, చుట్టూ టెంట్లు వేసికున్నాం, ఒక పక్కగా కారు దగ్గరకు వెళ్ళడానికి దారి, మరో పక్క పిక్నిక్ టేబెల్, బార్బిక్యూ గ్రిల్, కొంచెం దూరంగా షెల్టర్,
మాలాగే కా౦పింగ్ కి వచ్చిన వాళ్ళ టెంట్స్ దూరదూరంగా కనిపిస్తున్నాయి. ఓ ఇరవయ్ అడుగుల దూరంలో రెస్ట్ రూమ్స్, ఓ ఫర్లాంగ్ దూరంలో బాత్రూమ్స్ ఉన్నాయి. సైట్ మొదట్లో ఓ చిన్న స్టోర్, అందులో ఫైర్ వుడ్, సాల్ట్, వాటర్, మెడిసిన్స్, స్నాక్ పాకెట్స్ లాంటి నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అన్నీ అధిక ధరల్లోనే ఉన్నాయనుకోండి. అన్ని సైట్లకూ మధ్యగా వాలీబాల్ కోర్ట్. చెట్ల మధ్యగా వాకింగ్ ట్రైల్స్ కనిపిస్తున్నాయి.
మాలాగే కా౦పింగ్ కి వచ్చిన వాళ్ళ టెంట్స్ దూరదూరంగా కనిపిస్తున్నాయి. ఓ ఇరవయ్ అడుగుల దూరంలో రెస్ట్ రూమ్స్, ఓ ఫర్లాంగ్ దూరంలో బాత్రూమ్స్ ఉన్నాయి. సైట్ మొదట్లో ఓ చిన్న స్టోర్, అందులో ఫైర్ వుడ్, సాల్ట్, వాటర్, మెడిసిన్స్, స్నాక్ పాకెట్స్ లాంటి నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అన్నీ అధిక ధరల్లోనే ఉన్నాయనుకోండి. అన్ని సైట్లకూ మధ్యగా వాలీబాల్ కోర్ట్. చెట్ల మధ్యగా వాకింగ్ ట్రైల్స్ కనిపిస్తున్నాయి.
ఇవన్నీ చుట్టేసి వచ్చి ఇక పనిలో పడ్డాం. ఒకళ్ళు సిలిండర్ బిగిస్తే, ఇంకొకరు దోశపిండిని ఐస్ బాక్స్ లోంచి తీశారు, మరొకరు టేబుల్స్ సర్దారు ఇలా తలా ఒక పని ఆడుతూ పాడుతూ చేశాసామన్నమాట. ముందుగా దోశెల కార్యక్రమం మొదలు పెట్టాం. చిరుచలిలో వేడివేడి కారం దోసలు, ఆమ్లెట్ దోసెలు, ఉల్లిదోసెలు ఇలా రకరకాల దోసెలు. మాలో
బ్రెడ్ ఆమ్లెట్ వాళ్ళు కొందరు. వాళ్ళు అవి కూడా వేయడం మొదలు పెట్టారు. ఇలా టిఫిన్ సెక్షన్ ఎంజాయ్ చేశాం. తరువాత హికింగ్ పేరుతో చెట్టూ, పుట్టా తిరిగేసి పిట్టల్ని పలకరించి వచ్చి, కే౦పింగ్ చైర్స్ లో సెటిల్ అయ్యాం. ఉత్సాహం కాస్త ఎక్కువ పాళ్ళలో వున్నవాళ్ళు బైక్ రైడింగ్ కెళ్ళారు.
మధ్యాహ్నం దేశవాళీ వంటలు తిన్నాంగా, సాయంత్రం బార్బిక్యూ గ్రిల్ మీద ముష్రూమ్స్, కాప్సికమ్స్, ఆనియన్స్, కార్న్, యాం లాంటి వాటిని గ్రిల్ చేశాం. పాటీస్ గ్రిల్ మీద పెట్టి లెటస్, టొమాటోస్, మేయొనైజ్ లతో బర్గర్ ఫిక్స్ చేసి డిన్నర్ కానిచ్చాం. అన్నీ సర్దేసరికి సందెపొద్దు నల్లనై౦ది. ఆ చీకట్లో అంత్యాక్షరి పేరుతో ఇష్టమైన పాటలన్నీ పాడుకున్నా౦. ఘంటసాల గారు ముఖ్య అతిధి.
ఆరుబయట పండువెన్నెల.....వెలుగులు చి౦దుతూ అందాల చందమామ...చుక్కలచీర కట్టిన నల్లని ఆకాశం... చిత్తరువులై నిలిచిన పొడవాటి చెట్లు...చుట్టూ నిశ్శబ్దం... మంచుకురుస్తూ చిరుచలి....ఆ వెన్నెలరాత్రి ఎంత బావుందో! అమెరికా సిటీస్ లో ఆకాశం, అర్ధరాత్రికూడా నీలంగానే ఉంటుంది నియాన్ లైట్ల మహిమేమో. ఇలా అందమైన నక్షత్రాల్ని చూడడానికైనా సంవత్సరానికోసారి క్యాంపింగ్ కి వెళ్ళాలనుకున్నాం.
బ్రేక్ ఫాస్ట్ తరువాత ఔత్సాహికులందరూ వాలీబాల్ ఆడి, బాల్ భరతం పట్టారు. కొందరేమో పిల్లల్తో కలసిపోయి గుజ్జనగూళ్ళూ, కోతికొమ్మచ్చి ఆడారు. ఆ మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ కుర్మాతో భోజనం. భుక్తాయాసం తీరగానే అందరం సరదాసరదాగా 'డంషార్ ఆర్ట్స్' ఆడాం, ‘జూ లకటక’ సినిమా ఆ రోజు హైలైట్. ఇక రాత్రికి పావుభాజీ పలహారం. ఆ విధంగా కాలం వైపన్నా చూడక ఆ రోజు కూడా గడిపేశాం.
ఇక ఆదివారం, మెల్లగా కదిలింది కాలం. వస్తువులన్నీ సర్ది తిరగి కార్లెక్కించేసరికి మధ్యాహ్నం అయ్యింది. ఆ ప్రదేశాన్ని వదలడం కార్లక్కూడా ఇష్ట౦లేనట్లు భారంగా కదిలాయి. తిరిగి వచ్చేదారిలో ఒక అత్భుతాన్ని చూశాం. అదే 'షా౦డ్లియర్ ట్రీ', సుమారుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల వయసున్న చెట్టు. పంతొమ్మిది వందల ముప్ఫైలో ఆ చెట్టుబెరడుని తొలిచారట. అందులోనుండి కార్లు కూడా వెళ్ళొచ్చు. అంత పెద్దపెద్ద చెట్లున్న ఆ పార్క్ చాలా నచ్చింది.
అందరం ఇలా కలసి మెలసి మూడు రోజులు ఒక కుటు౦బంలా మెలగడం ఎక్కువ ఎంజాయ్ చేసామో..కేంపింగ్ ఎక్కువ ఎంజాయ్ చేసామో చెప్పడం కష్టం. పిల్లలకు అమ్మ నాన్నలు కాకుండా మిగిలిన వారితో అనుబంధం ఏర్పడడానికి నాంది ఇలాంటి విహారాలనే చెప్పొచ్చేమో! అలా మా తొలి కేంపింగ్ అనుభవాల్ని పదిలంగా మూట కట్టుకుని ఇంటికి చేరాం. తరువాత ప్రతి సంవత్సరం కేంపింగ్ కి వెళ్తున్నాం కాని, ఈ కేంపింగ్ మాత్రం చాల ప్రత్యేకంగా మా మనుసుల్లో నిలిచిపోయింది.