ఇదిగో మిమ్మల్నే, ఇడ్లీ చల్లారిపోతోంది త్వరగా రండి. కాఫీ తాగేసి వెళ్తారా, ట్రావల్ మగ్ లో పోసివ్వనా? ఎనిమిదైపోతోందని రోజూ హడావిడి పడకపోతే ఓ పావుగంట ముందు లేవచ్చుగా! ఏమిటీ...ఇవాళ ఆఫిసుకు వెళ్ళక్కర్లేదా... వర్క్ ఫ్రం హోమా? ఆ విషయం రాత్రే చెప్తే హాయిగా ఏ మసాలా దోసెలో వేసుకునే వాళ్ళంగా. సర్లే రండి, ఆకలి దంచేస్తోంది... ఇడ్లీ తింటూ మాట్లాడుకుందాం.
* * * *
నిన్నలేదూ.... ఎందుకా నవ్వూ! అర్థమైంది లెండి. నిన్న లేదూ అన్నాననేగా. నిన్నెప్పుడూ ఉంటుంది. రేపే ఎంతమందికి ఉంటుందో తెలీదు. నిన్న రేపు సంగతెందుకుగాని అసలు విషయం చెప్పమంటారా? అది చెప్పబోతుంటేనే మధ్యలో మీ నవ్వు....ఇంతకీ ఏం చెప్పాలనుకున్నానబ్బా. ఆ మధ్యలో మాట్లాడకుండా విషయం పూర్తిగా వినండి. నిన్నా........ఇప్పుడే రావాలా ఆఫీస్ కాల్. ఇక మధ్యాహ్నం వరకు దొరకరు అయ్యగారు.
* * * *
నేను బయటకు వెళ్తున్నాను. షాప్ లో కొన్ని రిటర్న్స్ ఇవ్వాలి. అలాగే లైబ్రరీలో కొంచెం పనుంది, వచ్చేసరికి ఆలశ్యం అవుతుందేమో! కూరలన్నీ కౌంటర్ మీదే పెట్టాను, రైస్ కుక్కర్ కూడా ఆన్ చేశాను. మీరు భోంచేసెయ్యండి. పనిలో పడి మొన్నట్లా మూడింటివరకూ తినకుండా ఉంటారేమో! షుగర్ డౌన్ అయితే కష్టం. ఏమిటీ అలా చెయ్యరా సరే! అయినా ఒంటిగంటకు ఫోన్ చేసి గుర్తు చేస్తాలే. మరి నా సంగతంటారా? బయటే ఏదో ఒకటి తినేస్తాను.
* * * *
అయ్యో! ఫోన్ చేయడం మార్చేపోయాను. ఏమిటీ... లంచ్ చేసేశారా? గిన్నెల్లో గరిటెలు సింకులో పెట్టి మూతలు సరిగ్గా పెట్టారా? గుర్తు చెయ్యక్కర్లేదా. సరే! పెరుగు ఫ్రిడ్జ్ లో పెట్టడం మర్చిపోకండి సాయంత్రానికి పుల్లగా అయిపోతుంది. అసలే ఇవాళ ఎండ ఎక్కువగా ఉంది కూడా!
అన్నట్లు ఇవాళ సాయంత్రం సుగుణా వాళ్ళింట్లో గెట్ టు గెదర్ ఉంది. ఏడింటికల్లా రమ్మన్నారు. ఐదున్నరకు జిమ్ కి వెళ్దామా? త్వరగా వచ్చేస్తే రెడీ అవడానికి టైం ఉంటుంది. ఏమిటీ ఇవాళ జిమ్ కి వెళ్ళాలని లేదా! రోజూ ఇలా ఏదో ఒక వంకతో జిమ్ మానేయాలని చూస్తే ఎలా? రేపు హైకింగ్ వెళ్దామంటారా. సరేలే. రమేష్ వాళ్ళు కూడా వస్తారేమో కనుక్కోండి....ఓ ఆల్రెడీ కనుక్కున్నారా. మరీ...ఆరింటికి బయలుదేరితే సరిపోతుందిగా! ఇంట్లో వాటర్ బాటిల్స్ లేవనుకుంటాను, టార్గెట్ లో తీసుకుని వస్తాలెండి. గ్రనోలా బార్స్ కూడా తేనా? ఏమిటీ ఎక్స్ట్రాకేలరీస్ ఎందుకంటారా? సర్లే ఆపిల్స్ తీసుకెళ్దాం. ఏమంటున్నారు....సరిగ్గా వినపడట్లేదు. కట్ అవుతోంది....ఇక్కడ సిగ్నల్ బాగా లేనట్లుంది...... కాన్ఫరెన్స్ కాల్ కి టైం అవుతోందా ... సర్లెండి బై మరి.
* * * *
ఇవాళ వర్క్ త్వరగా అయిపోయినట్లుందే, టీ తాగుతారా? ఏమిటీ... మీరే పెడతారా? సరే నాకు గ్రీన్ టీ వద్దు. నార్మల్ టీ కావాలి, అసలే మధ్యాహ్నం లంచ్ సరిగ్గా చేయలేదు. ఎందుకు చేయలేదంటారా?....డెలీలో ఫ్రెంచ్ బ్రెడ్ తీసుకున్నాను. అది గట్టిగా రాయిలా ఉంది. అసలే పళ్ళన్నీ నొప్పిగా ఉన్నాయ్ దాంతో తినలేక పోయాను. ఏమిటీ డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళమంటారా. వద్దులెండి వెళ్తే విజ్డమ్ టీత్ అన్నీ పీకేయ్యాలంటాడేమో! ఇవాళ పనులన్నీ పూర్తయినట్లేనా? ఓ ఇన్సూరెన్స్ వాళ్ళతో కూడా మాట్లాడారా. మొన్న నేను మాట్లాడితే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కట్టమన్నారు. మీకు రెండొందలకే ఎలా ఒప్పుకున్నారబ్బా!... ఫేస్ వాల్యూ అంటారా! వాళ్ళతోగాని ఫేస్ టైం చేశారా ఏమిటి? లేదా. చేశారేమో వాళ్ళు కూడా నాలానే మిమ్మల్ని చూసి అమాయకులని మోసపోయారనుకున్నాను.
సర్లెండి కబుర్లు తరువాత చెప్పుకుందాం, ఆరయిపోతోంది, ముందు మీరు డ్రెస్ ఛేంజ్ చేసుకుంటే నేనెళ్ళి చీరకట్టుకునొస్తాను... ఆల్రెడీ మార్చుకున్నారా. ఈ కార్గో షార్ట్స్ ఏమిటి లాన్ మొవ్ చెయ్యడానికి వెళ్తున్నట్లుంది. ఇదిగో ఈ పచ్చగళ్ళ చొక్కా, మొన్న కొన్న చినో పాంట్ వేసుకోండి బావుంటుంది.
* * * *
పదకొండవుతోంది పడుకుందామా! .....ఫ్రైడేనేగా సినిమా చూద్దామంటారా. సరే యుట్యూబ్ లో సర్చ్ చేయండి, అయినా ఏం మంచి సినిమాలున్నాయ్ అన్నీ చెత్త. అయితే పుస్తకం చదువుకుందామంటారా!.... ఓ ఆల్రెడీ పుస్తకం తెచ్చేశారే... మళ్ళీ గోదావరి కథలేనా...ఇది ఆరోసారి కదూ చదవడం!.....అలా గోదారొడ్డున తిరిగి రావడం కోసం ఎన్నిసార్లయినా చదవొచ్చునంటారా. నిజమే! తలుపు తీస్తున్నారెందుకు? ఇప్పటికిప్పుడు గోదారెళ్దామంటారా ఏం? వెన్నెల పుచ్చపువ్వులా ఉందా..... కాసేపలా వాకింగ్ కి వెళ్ళొద్దామంటారా....ఇంత రాత్రి నాకు భయం బాబూ! నేను రాను. మీరొక్కళ్ళే వెళ్ళొస్తానంటున్నారా? ఏ పిశాచాలన్నా ఎత్తుకుపోగలవు జాగ్రత్త. ఏమిటీ.... అంత అదృష్టం మీకెక్కడదంటారా?
* * * *
మరీ నిశ్సబ్దంగా ఉంది ... సందడంతా ఏమైపోయిందని ఇల్లేమో దిగులు పెట్టేసుకుంది. ఆ టికెట్టేదో కొంచెం ప్రీపోన్ చేసుకుని త్వరగా వచ్చెయ్యకూడదూ!