Saturday, March 20, 2021

పెళ్ళికి కావలసినవి

ఇప్పటి వరకు అమెరికాలో తెలుగుపెళ్ళిఆచారాలు వ్యవహారాలు అంటూ రెండు రోజుల నుండీ కబుర్లు చెప్పుకుంటున్నాం. నిన్నటి కబుర్లు ఇక్కడ చదవొచ్చు.

పంతులు గారు పెళ్ళికి కావలసిన వస్తువులు అంటూ పెద్ద లిస్ట్ ఇచ్చారు. అందులో బియ్యం, తమలపాకులు, అరటి పండ్లు, కొబ్బరి బోండాలు, మామిడాకులు, అగరొత్తులు, కర్పూరం లాంటివి ఇక్కడ దొరుకుతాయి. మట్టి గాజులు, మెట్టెలు, బాసికాలు లాంటివన్నీ ఇండియా నుండి తెప్పించుకోవాలి. ఇలా ఏవి ఎక్కడ దొరుకుతాయో చూసుకుంటున్నాం.

ఇంతలో ఓ ఫ్రెండ్ ఫోన్ చేసారు. జ్యోతిగారూ లిస్ట్ లో జీలకర్ర బెల్లం లేవు అని. వాళ్ళ తమ్ముడి పెళ్ళి మా అమ్మాయి పెళ్ళి కంటే ఐదురోజుల ముందు. ఇద్దరమూ కంబైన్డ్ స్టడీ చేసినట్లు ఈ పెళ్ళి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. తను చెప్పబట్టి సరిపోయింది, లేకపోతే ముహూర్తం టైమ్ లో హఠాత్తుగా ఇవి ఎలా వస్తాయి?  సరే పంతులు గారితో మాట్లాడాం, జీలకర్ర బెల్లం దంచి ముద్ద చేసి తీసుకురమ్మన్నారు. జారుగా చేస్తే మొహం మీదకు కారుతుందట, గట్టిగా ఉంటే తల మీద అతుక్కోదట. ఎంత చిక్కగా ఉండాలో మరి, తెలియాల౦టే మేమిద్దరం మరోసారి పెట్టుకుని చూసుకోవాలా?

ఆ పెట్టుకునేదేదో మేం చూసుకుంటాం లెండి అంటూ ఓ ఫ్రెండ్ ఆ పని తాను తీసుకుని చక్కగా ముద్ద చేసి పెళ్ళి మండపానికి తీసుకుని వచ్చారు.

ఇక పెళ్ళి బట్టలంటే పెళ్ళికూతురుకి పట్టుచీరలు, పెళ్ళికొడుకుకి సూట్, పంచె సరిపోతాయి అనుకునే రోజులా కావుగా ఇవి. వాళ్ళిద్దరే కాదు ఇంట్లో అందరూ కూడా డిజైనర్ బట్టలే వేసుకుంటున్నారు.  అందులో ఇబ్బందేమీ లేదు గానీ చిక్కంతా ఎక్కడొచ్చిందంటే కొలతలు. మామూలుగా డిజైనర్స్, టైలర్స్ దగ్గరకెళ్తే వాళ్ళే కొలతలు తీసుకుంటారు. మరి మనం ఏడేడు సముద్రాలకు ఇవతల ఉన్నాం కదా! దానికి మధ్యేమార్గంగా టైలర్లు ఓ పద్దతి కనిపెట్టారు. వీడియో కాల్ లో మాకు కొలతలు ఎలా తీసుకోవాలో నేర్పించారు.

మా అమ్మాయి తన డ్రెసెస్ అన్నీ తానే సెలక్ట్ చేసి డిజైనర్ లకు ఇచ్చింది కానీ, బుజ్జి పండుకు, వాళ్ళ నాన్నకు వీటిలో పెద్ద అనుభవం లేదు. పెళ్ళి కొడుకు వాళ్ళే వీళ్ళిద్దరికీ సెలెక్ట్ చేసుకోవడంలో సహాయం చేయడమే కాక వాళ్ళ బట్టలతోపాటు వీళ్ళవి కూడా కుట్టించేసారు. మేం ఎలా కొలతలు తీసామో? వాళ్ళెలా కుడతారో? అనుకున్నాం కానీ, దాదాపుగా అన్నీ చక్కగా సరిపోయాయి. ఒకటి రెండు డ్రెసెస్ మాత్రం అనుకున్నట్లుగా రాలేదు. ఎందుకైనా పనికొస్తాయని కొన్ని ఎక్కువ డ్రెసెస్ తెప్పించుకున్నాం కాబట్టి ఇబ్బంది అవలేదు.

   


పెళ్ళి బట్టలకు అంటూ ఇంట్లో అందరం పోలో మంటూ వెళ్ళి షాపింగ్ చేయడం ఒక సరదా. “అక్కా, ఈ పింక్ చీర భలే ఉంది చూడు”, “వదినా, నెమలి కంఠం రంగు చీర వ్రతానికి తీసుకుందామా?” “పిన్నీ ఈ సాఫ్ట్ సిల్క్ చీరలు పెట్టడానికి బావుంటాయి కదూ?” అత్తా, ఈ పేస్టల్ కలర్ చీరలు కూడా బావున్నాయ్. నువ్వొకటి తీసుకుంటావా? ఇలా మాట్లాడుకుంటూ పెళ్ళి కూతురితో పాటు ఇంట్లో అందరూ కూడా చీరలు కొనే ఆ సందడే వేరు. ప్చ్.. ఇప్పుడా కోరిక తీరదు. మరి ఈ చీరలు కొనడం ఎలా?
“ఏమేం కావాలో చెప్పక్కా నేను చూసుకుంటాను" అంటూ కంచికి వెళ్ళి చీరలు షాపింగ్ చేసే బాధ్యత మా తోడికోడలు తీసుకుంది. ఈ కరోనా టైమ్ లో కంచికి వెళ్ళడం రోజంతా మాస్క్ పెట్టుకుని షాపింగ్ చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు, పైగా అక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది జనం ఉన్నార్ట. అక్కడ షాప్ నుండి వీడియో కాల్ చెయ్యబోతే వైఫై పనిచెయ్యలేదు. షాప్ వాళ్ళు పాస్వార్డ్ ఇవ్వలేదట. వాళ్ళ ఫోన్ తీసుకుని ఓపిగ్గా చీరలన్నీ చూపించింది. తాను పింక్ చీర చూపిస్తే మాకు మిరప్ప౦డు రంగులో కనిపించేది. బంగారంలా మెరిసిపోయే జరీ అంచు, వీడియోలో వెండి రంగులో ఉండేది. నాకూ, మా అమ్మాయికీ, మా మరదలికి, మేనకోడలికీ అందరికీ ఓపిగ్గా సెలెక్ట్ చేసింది. వాటికి మాచింగ్ గాజులు ఎంపిక చేసి మరీ తెచ్చింది.


“అక్కా, టైలర్ తో మాట్లాడి ఉంచాను. పది రోజుల్లో బ్లౌజ్ లు కుట్టిస్తాడట. డిజైన్స్ ఎలా కావాలో చెప్పండి” అంది. డిజైన్ సెలెక్ట్ చేయాలంటే బార్డర్ పొడవు అదీ తెలిస్తే బావుంటుంది అనగానే మా మరిది కూతురు చక్కగా చీరల బార్డర్స్ కొలిచి పంపించింది. వాటిని బట్టి డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. నెల్లూరులోని టైలర్ దేవేంద్ర పదిరౌజులలో బ్లౌజెస్ వర్క్ చేసి కుట్టారు.


పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు కొన్ని అకేషన్స్ కి మాకు కలర్ థీమ్ ఇచ్చారు. దాని కోసం కొన్ని బట్టలు మింత్రా లో, ఇంకా పెళ్ళికి కావలసిన వస్తువులు కొన్ని అమెజాన్ లో చూసి మా మరిది కూతురికి వాట్స్ అప్ లో లింక్స్ పెట్టేదాన్ని. ఈ పాపే ఆర్డర్స్ పెట్టి వచ్చిన వాటికి క్వాలిటీ చెక్ చేసేది. వాట్స్ అప్ లో మా ఇద్దరి సంభాషణ ఆ నెల రోజులూ లింక్స్, పిక్స్ లో నడిచింది. 😊 లవ్ యూ బంగారం.

ప్రదానం రోజు అందరూ ఒకే బట్టలు వేసుకోవాలని పెళ్ళి కొడుకు వాళ్ళు అందరికీ రామ్ రాజ్ కాటన్స్ నుండి పంచలు తెప్పించారు.


బట్టల విషయానికి వచ్చినప్పుడు మా అమ్మ “నూలు చీర నూరేళ్ళు శాశ్వతం కాదని” సామెత చెప్తుండే వాళ్ళు. పెళ్ళి బట్టలంటే అలా కొన్నాం. మరి నగలో, పైగా పెట్టుకుని చూసుకోకుండా తీసుకుంటే నప్పుతాయో లేదో తెలియదు. నగల షాప్ వాళ్ళు వీడియో కాల్స్ లో చూపిస్తే కొన్ని సెలెక్ట్ చేసాం. ఒక ఫ్రెండ్ వెళ్ళి మేం సెలెక్ట్ చేసినవే కాక ఇంకా కొన్ని మోడెల్స్ చూసి ఆ షాపులో అమ్మాయికే పెట్టించి చూపించారు. వాటి ధరలూ అవీ తనే బేరం చేసారు. ఒక్కసారిగా పనంతా అవదుగా, రెండు మూడు సార్లు వెళ్ళి ఓపిగ్గా చూసి కావలసినవన్నీ తీసుకోవడానికి సహాయం చేసారు. అప్పటికి వాళ్ళమ్మాయి పెళ్ళయి నాలుగు రోజులే అయింది. అయినా కూడా తాను అంత శ్రమ తీసుకుని సహాయం చేశారు. తాను సెలెక్ట్ చేసినవన్నీ మా మరిది వాళ్ళ ఇంటికి పంపించారు.


 వాటిని జాగ్రత్తగా పాక్ చేసి ఫ్లయిట్ లో తీసుకుని రావడంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయట. ప్రతి అయిర్పోర్ట్ లో సెక్యూరిటీ చెక్ దగ్గర అన్ని నగలూ బయటకుతీసి అక్కడ దుకాణం పెట్టి, మళ్ళీ అన్నీ సర్దుకుని లోపల పెట్టుకోవాలి.

ఈ పెళ్ళి కబుర్లన్నీ బెంగుళూర్ లో ఉన్న మా కజిన్ కి చెప్తుంటే పెళ్ళికి కావలసిన మిగిలిన వస్తువులన్నీ తాను పంపిస్తానని పెద్ద బాధ్యత భుజాన వేసుకుంది. ఒక రోజు “అక్కా వెండి షాప్ కి వచ్చాను ఇక్కడ చెంబు మూడొందల యాభై గ్రాముల బరువుంది తీసుకోనా?” అంటూ కాల్ చేసింది. అంటే ఆ చెంబు బరువు ఎక్కువనా? తక్కువనా? లేదా చెంబులు అంతే  బరువు ఉంటాయా? ఏమో తెలిసేది ఎట్లా? ఇంట్లో ఉన్న వెండి సామానంతా కిచెన్ కౌంటర్ ఎక్కించి ఉప్పు, మిరపకాయలు తూచే వేయింగ్ స్కేల్ మీద పెట్టి బరువు చూసాను. అట్లాగే బంగారు వస్తువులు కూడా. ఇండియాకి వచ్చినప్పుడు షాప్ కి వెళ్ళడం నచ్చినవేవో కొనడం తప్ప బరువు, ఖరీదు గురించి ఏమీ తెలియదు. అదేదో వేరే సబ్జెక్ట్ లా ఉండేది. కొత్తగా తెలుసుకున్నది ఏమిటంటే కావలసినవి ఎంచుకోవడం కూడా ఒక కళ అని, ఏం కావాలో తెలియాలంటే వెనుక చాలా కృషి చేయాలనీనూ.పెళ్ళికి కొనాలనుకున్న వెండి వస్తువులు తాను తీసుకుని పంపింది.

ఆ లిస్ట్ లో గరిక ముంతలు కూడా ఉన్నాయి. నేను వరంగల్ పెళ్ళికి కనుక వెళ్ళక పోయి ఉంటే అవేమిటో కూడా తెలిసేది కాదు. 
నెల్లూరు జిల్లా వైపు వాటిని అరివేణి కుండల౦టారు. అవి మనకు ఎక్కడ దొరుకుతాయని పూజారి గారినే అడిగాం. ఆయన చెప్పిన షాప్ కి వెళ్తే అక్కడ పెరుగు కుండలు ఉన్నాయి. అందులో పెద్ద సైజ్ ది చట్టిలా ఉంది. చిన్నది కొంచెం కుండలా ఉంది. ఏదీ కూడా ముంతలా మాత్రం లేదు. రంగు లేసిన మట్టివేవో ఉన్నాయి కానీ అవి బొత్తిగా కూజాల్లా ఉన్నాయి, వాటికి ఓ పక్కన ముక్కు పొడుచుకుని వచ్చింది. నీళ్ళు పోస్తే అందులోనుండి కారి పోతాయి. అవి కరవాచౌత్ కుండలట, పైగా అవి గ్లాసుకి ఎక్కువ చెంబుకు తక్కువ సైజ్ లో ఉంది. అబ్బే అదికాదని ఆ పెరుగు కుండలే రెండు తీసుకుని రంగులు, డిజైన్లు వేయాలని అనుకున్నాం. 

ఈలోగా మా కజిన్ ఓ ఫోటో పంపింది. అవి 
షికాగోలో ఉన్నాయట. అక్కడ నుండి వాటినెలా తెప్పించడం? షికాగోలో ఉంటే న్యూజెర్సీ కూడా దొరకొచ్చేమో అని న్యూజెర్సీ లో ఉన్న కజిన్ కి ఫోన్ చేసి చెప్పాను. తను అప్పటికప్పుడు షాపులన్నీ తిరిగి పటేల్ బ్రదర్స్ లో ఉన్నాయి అని అక్కడి నుండే వీడియో కాల్ చేసింది. సైజ్ కరెక్ట్ గా తెలియడానికి మాజా బాటిల్ పెట్టి పిక్ పంపించింది.


ఒకటి మంచి సైజ్ లో ఉంది కానీ రంగులు డిజైన్ లు వేసుకోవాలి. ఆ ఊరి పటేల్ బ్రదర్స్ లో ఉంటే మా ఊర్లో కూడా పటేల్ బ్రదర్స్ ఉందిగా తెప్పిస్తారేమోనని అడగాo. అవి అక్కడ లోకల్ గా దొరికేవని అలా పగిలిపోయే వస్తువులు తెప్పించమని చెప్పారు. సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. మరో ఫ్రెండ్ వాళ్ళు థాంక్స్ గివింగ్ కి న్యూజెర్సీ వెళ్తుంటే వెళ్తుంటే వాళ్ళకు తేవడానికి కుదురుతుందేమో అని అడిగాం. ఆవే కాకుండా  
ఏమేమి కావాలో చెప్పండి, మన ఊరిలో దొరకనివి అన్నీ అక్కడ దొరుకుతాయి అన్నీ తెచ్చి పెడతాం అన్నారు. ఎంత మంచి వాళ్ళో కదా!

ఇంతలో పెళ్ళి సబ్జెట్ కలసి నేర్చుకుంటున్న ఫ్రెండ్ ఉన్నారుగా తాను ఇండియా నుండి గరిక ముంతలు తెప్పించారట. ఏమీ పాడవ కుండా వచ్చాయని తెలిసి మా తోడికోడలికి ఆ విషయం చెప్పాను. వెంటనే గుంటూరు వెళ్ళిన మా మరిదికి చెప్పినట్లు౦ది, వీడియో కాల్ చేశాడు. “వదినా ఇక్కడ పెళ్ళికి కావలసినవన్నీ ఉన్నాయి. ముంతలే కాక ఇంకా ఏమైనా కావాలా చెప్పూ” అని. చెప్పినవన్నీ ఓపిగ్గా దగ్గరుండి కొన్నాడు. షాపింగ్ అంటే ఆమడ దూరం పరిగెత్తే ఆ పెద్దమనిషి కూతురి కోసం అనేసరికి ఎట్లా ఓపిక తెచ్చుకున్నాడో చూడండి.



మొత్తానికి కుండలు చక్కగా వచ్చాయి. భలే ఉన్నాయి కదూ. కావలసిన వస్తువులు ఇండియాలో అయితే ఒక్క పూట షాప్ కి వెళ్ళి తెచ్చుకుంటాం. అవే ఇక్కడ కావాలంటే ఎంత ప్రయాసో కదా!

పెళ్ళికి కావలసిన వస్తువులన్నీ మా తోడికోడలు కాబోయే వియ్యంకురాలు కొంటామని చెప్పారు. అవి కొనాలంటే వాళ్ళు ఏ విజయవాడకో, చెన్నయ్ కో, లేక హైదరాబాద్ కో వెళ్ళాలి. మామూలు రోజుల్లో అయితే ఫరవాలేదు కానీ ఈ కోవిద్ టైమ్ లో వేరే ఊరు వెళితే రాత్రి అక్కడ ఏ హోటల్ లోనో ఉండాలి. ఇప్పటికే బట్టలనీ అవనీ, ఇవనీ బాగానే రిస్క్ లో పెడుతున్నామని మేమే వద్దన్నాము.

అట్లా పెళ్ళికి కావాలసిన వస్తువులు వచ్చాయి, డెకరేషన్ ఏర్పాట్లు ఇక్కడ చదవొచ్చు