Sunday, June 24, 2012

అద్దబాలు

      ఆవేళ ఆదివార౦. సూరీడు ఇంకా నిద్ర లేవలేదేమో పొగమంచు ప్రకృతితో గుసగుసలాడుతోంది. అప్పుడే నిద్రలేచిన అమ్మ మొక్కల దగ్గరకు వెళ్లింది. రోజూలా స్కూళ్ళు, ఆఫీసుల హడావిళ్ళు లేవుగా, ఈ వేళ అమ్మకు ఆటవిడుపన్నమాట. రాత్రి పూసిన ఛమేలీలను పలకరించి, గులాబీలను ముద్దుచేసి, రానిన్కులస్ రంగులను చూసి ఆశ్చర్యపడి, ఇంటి వెనుకనున్న పెరట్లో గట్టుమీద కూర్చుంది. నారింజ చెట్టు మీద పక్షులు, ఆ కొమ్మ ఈ కొమ్మ మీదకు గెంతుతూ పాటలు పాడుతున్నాయి.

       పండు నిద్రలేచి కళ్ళు తెరిచాడు. కిటికీలోంచి వెలుతురు పడుతూ వుంది. పక్కకు చూస్తే నిండుగా దుప్పటి కప్పుకుని నిద్రపోతూ వున్నాడు నాన్న, అమ్మ కనిపించలేదు. మంచం మీదనుంచి జారి కిందకు దిగాడు. పడగ్గది తలుపు దగ్గరగా వేసివుంది. మెల్లగా నడుస్తూ వెళ్ళి తొంగి చూశాడు. హాల్ వే అంతా ఖాళీగా వుంది. అమ్మకోసం వెతుకుతూ ఫామిలీ రూంలోకి వచ్చాడు. గ్లాస్ డోర్ వెనుక కూర్చుని వుందమ్మ. మెల్లగా తలుపు తెరుచుకుని పండు కూడా వచ్చి అమ్మ ఒళ్ళో కూర్చున్నాడు. విమానం బొమ్మలున్న తెల్ల నైట్ డ్రెస్ వేసుకుని నందివర్ధనంలా ముద్దుగా వున్నాడు పండు.

"అమ్మా"
"ఊ..."

"నువ్వేం చేత్తున్నావ్?"
"పువ్వులు చూస్తున్నాను నాన్నా?"
"ఎందుకు?"
"ఎందుకంటే..అందంగా ఉన్నాయి కదా అందుకు"
"ఓ...మలి పచ్చి?" ఆకాశం వైపు చూపిస్తూ అడిగాడు.
"అది కూడా అందంగా ఉంది"
"చైకిలు?" అన్నాడు దూరంగా వున్న తన బుజ్జి సైకిల్ని చూపిస్తూ.
"బుజ్జిపండు సైకిలు కదా అది కూడా చాలా అందంగా ఉంది" పండును ముద్దు పెట్టుకుని చెప్పింది అమ్మ. "లోపలకు వెళదాం పద, బ్రష్ చేసుకుని పాలు తాగుదువు గాని" అంటూ పండును దింపి పైకిలేచి౦ది.
"పాలు కూదా అందంగా వుంతాయా?"


     అమ్మ నవ్వుతూ తలూపి పండును తీసుకుని లోపలకు వెళ్ళి బ్రష్ చేసి౦ది. "నువ్వు వెళ్ళి అక్కను నిద్రలేపు ఈలోగా నేను పాలు కలుపుతాను" అంటూ వంటగదిలోకి వెళ్లింది అమ్మ. అక్కను లేపమంటే ఎక్కడలేని ఉత్సాహం పండుకు. రయ్యిన పరిగెత్తుతూ అక్క గది దగ్గరకు వెళ్లాడు. ఈలోగా అమ్మ పాలు కప్పులో పోసి మైక్రో వొవెన్ లో పెట్టింది. రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టిన దోసెల పిండి తీసి బయటపెట్టి మైక్రో వోవెన్ లోని వేడిపాలు బయటకు తీసి అందులో చాకొలేట్ పౌడర్ కలిపి సిప్పర్ లో పోసింది. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. పండు మాటలు ఎక్కడా వినపడలేదు.

"పండూ, రామ్మా పాలు తాగుదువుగాని" పిలిచింది అమ్మ. పండు దగ్గరనుండి సమాధానం లేదు. అమ్మకు ఏదో అనుమానం వచ్చి మెల్లగా వెళ్ళి చూస్తే పండు బాత్ రూంలోనుండి వస్తూ కనిపించాడు.
"బాత్రూమ్ లో ఏం చేస్తున్నావ్ నాన్నా?"

"ఏం చైతల్లా?"

     అమ్మకు నమ్మకం కలగలా, బాత్రూమ్ లోకి వెళ్ళి చూసింది. టబ్ బయట నీళ్ళు లేవు, బ్రష్ లు బ్రష్ హోల్డ్రర్ లోనే వున్నాయి. ఎక్కడి వస్తువులు అక్కడే వున్నాయి. పండును ఎత్తుకుని అక్క గదిలోకి వెళ్ళి అక్కను నిద్రలేపి బ్రష్ చేసుకోమని చెప్పి వంటగదిలోకి వచ్చింది. పండును హై చైర్ లో కూచోబెట్టి సిప్పర్ చేతికిచ్చింది. రోజులా మాట్లాడకుండా నిశ్శబ్దంగా పాలు తాగుతున్నాడు. 


"అమ్మా...." అంటూ బాత్ రూం లోనుండి అక్క పెద్దగా అరిచింది.
"ఎందుకురా అలా అరుస్తావు?" అంటూ అక్క దగ్గరకు వెళ్లిందమ్మ. అక్క బాత్ రూంలో షెల్ఫ్ ఓపెన్ చేసి నిలుచుని వుంది. అమ్మ రాగానే అమ్మకు చూపించింది. షెల్ఫ్లో అక్కడక్కడా ఎఱ్ఱని గీతలున్నాయి. అమ్మకు పండు ఎందుకు అంత సైలెంట్ గా ఉన్నాడో అర్ధం అయింది. 


"అమ్మలూ పండు హైచైర్ లో వున్నాడు వెళ్ళి తీసుకురా"
అక్క వెళ్ళి హై చైర్ బెల్ట్ తీసి పండును కిందకు దింపింది. మెల్లగా నడుస్తూ అక్క వెనుగ్గా వచ్చాడు. "పండూ ఎవరమ్మా ఇది చేసింది?" ఆ ఎఱ్ఱని గీతలు చూపిస్తూ అడిగింది.
"కక్క చేచింది" నమ్మకంగా చెప్పాడు.
"నేనా..నేను చెయ్యలేదు" అక్క తల అడ్డంగా ఊపింది.
"కక్కే చేసింది" మరింత స్పష్టంగా చెప్పాడు.
"ఏం చేసింది నాన్నా?"
"లిప్చిక్ తో ఇత్తా ఇత్తా గీతలు గీచింది" వేలితో గీసి చూపించాడు.
"నేను కాదు" అమాయకంగా చూస్తూ తల గబాగబా తిప్పింది అక్క.
ఈలోగా నాన్నకూడా నిద్ర లేచి వచ్చాడు. "ఏవైంది?" అడిగాడు నాన్న.
నాన్నను చూసిన ఉత్సాహంలో మరింత స్పష్టంగా "కక్క చేచింది" చెప్పాడు పండు.

అమ్మ పండును కోపంగా చూస్తూ "తప్పుకదూ నాన్నా నువ్వు చేసి అక్క మీద చెప్పొచ్చా" అంది.
"నేను చేతలా..కక్కే చేచింది"


      అమ్మకు ఈసారి చాలా కోపం వచ్చింది. అమ్మ పండును కోప్పడబోతుంటే నన్నేమో "పోనీలేరా వాడికెన్నేళ్ళు మెల్లగా నేర్చుకు౦టాడులే," అని పండును ఎత్తుకుని బయటకు తీసికెళ్ళి మెల్లగా అబద్దాలు చెప్పడం ఎంత తప్పో చెప్ప్డాడు. నాన్న చెప్పినవన్నీ పెద్దపెద్ద కళ్ళతో అమాయకంగా చూస్తూ బుద్దిగా విన్నాడు పండు. తరువాత  అక్క, పండు ఆటల్లో పడ్డారు. నాన్న వంట గదిలోకి వచ్చాడు. అమ్మ ఇంకా కోపంగానే ఉంది. 


"ఏం చెప్పారు వాడికి" నాన్న వైపు తిరిగి అడిగింది.
"చిన్నవాడు కదా మెల్లగా చెప్పాలి, నువ్విప్పుడు వాడిని కోప్పడ్డావనుకో నీ కోపాన్నిఅర్ధం చేసుకునే వయసు కాదు వాడికి. సరే, ఇవాళ వెదర్ బావుంది, పిల్లల్ని తీసుకుని పార్కుకు వెళ్దామా?" అడిగాడు. "అలాగే" అ౦టూ కాఫీ కలిపి ఒకకప్పు నాన్నకిచ్చి రెండో కప్పు పట్టుకుని పిల్లల దగ్గరకు వెళ్లింది అమ్మ.


      ఓ వారం తరువాత ఉదయాన్నే షేవింగ్ చేసుకోవడానికి బాత్రూమ్ లోకి వెళ్లాడు నాన్న. "పండూ" పెద్దగా పిలిచాడు నాన్న. అమ్మ, అక్క పరుగెట్టుకునెళ్లారు, వెనుకే మెల్లగా పండు. నాన్న షెల్ఫ్ డ్రాఅర్ దగ్గర నిలబడి వున్నాడు. పాల సముద్రం మీద నురగలా౦టి తెల్లని పదార్ధం తప్ప ఆ అరలో ఉండాల్సిన వస్తువులు కనిపించలేదు.

"ఎవర్రా ఇది చేసింది?"నాన్న నవ్వు కనిపించకుండా జాగ్రత్త పడుతూ పిల్లల్ని అడిగాడు.
అక్క నోరు తెరవకముందే "కక్క చేచింది" చెప్పాడు పండు.
"ఎలా చేసి౦దమ్మా?" అడిగింది అమ్మ.
"చేవింగ్ కీం ఇలా పోచేచింది" చెప్పాడు పండు.
"నేను చేయాలా" అక్క అరిచింది.
"మళ్ళీ అబద్దమా?" అడిగాడు నాన్న.
"అద్దబ౦ కాదు చేవింగ్ కీం" చెప్పాడు పండు.
"నేను చెయ్యలేదు నాన్నా" అక్క కోపంగా చెప్పింది. 


      అమ్మ పండును తీసుకుని పక్కగదిలోకి వెళ్ళగానే, నాన్న అక్కను దగ్గరకు తీసుకుని "నువ్వు చెయ్యలేదు నాన్నా, చిట్టితల్లి అబద్ధం చెప్పదని నాకు తెలుసుగా..పండు చిన్నవాడు కదా వాడికి మనం చెప్పింది అర్ధం కావడం లేదు. కొన్నిరోజులు ఇలాంటివి మనం పట్టించుకోలేదనుకో వాడే మానేస్తాడు" చెప్పాడు నాన్న.

      డైనింగ్ టేబుల్ మీద ఉప్పుతో వేసిన బొమ్మలు చూసినా, పుస్తకాలలో క్రేయాన్స్ తో గీసిన గీతలు కనిపించినా, ఫ్రిడ్జ్ ముందు నీళ్ళ మడుగు తయారైనా ఎవరూ మాట్లాడలేదు. నాన్న చెప్పినట్లుగానే కొన్నిరోజులకు పండు అలాంటి పనులు చేయడం మానేశాడు.

       తరువాతెప్పుడో ఓ రెండేళ్ళ తరువాత పండు ఏదో విషయంలో అబద్ధం చెప్పగానే ఇంట్లో అందరూ పండుతో మాట్లాడమని చెప్పేశారు. పండు పెద్దగా ఏడ్చి గొడవపెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరకు పండు ఇంకెప్పుడూ అబద్ధం చెప్పనని చెప్పాక అమ్మ పండును ఎత్తుకుని ముద్దుపెట్టుకు౦ది. ఆ రాత్రి పడుకునేప్పుడు పండుకు "నాన్న పులి" కథ చెప్పి౦దమ్మ. ఇంకా ఇలా అబద్దాలు చెపితే తనమాట ఎవరూ నమ్మరని ఎప్పడూ అబద్దాలు చెప్పకూడదని, అక్క అస్సలు అబద్దాలు చెప్పదని అందుకే అక్కంటే తనకు చాలా ఇష్టమని కూడా చెప్పింది. ఆ తరువాతెప్పుడూ పండు అబద్దాలు చెప్పలేదు.


33 comments:

  1. బుజ్జిపండు అద్దబాలు ముద్దుగా వున్నాయి :)పసిపిల్లలు ఏది చేసినా ముద్దుగానే వుంటుంది :)

    ReplyDelete
    Replies
    1. మాలా కుమార్ గారూ అవునండీ...పసిపిల్లల అల్లరి ముద్దుగా ఉంటుంది. ధన్యవాదాలు.

      Delete
  2. so cute...meeru chaala chakka pillala maatalu vrastaaru.

    ReplyDelete
    Replies
    1. అరుణ గారూ నా బ్లాగుకు స్వాగతమండీ...పిల్లల మాటలు మురిపెంగా ఉంటాయి కందండీ..అవే వ్రాస్తున్నాను. ధన్యవాదాలు.

      Delete
  3. సైకలాజికల్ ట్రీట్మెంట్!అన్నమాట. నేనూ ఇంగ్లీస్ మాటాడేస్తున్ననమ్మాయ్!! కరస్టేనా!!! :)

    ReplyDelete
    Replies
    1. అలాంటిదే బాబాయి గారూ..మీరు భలే వారే...ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతారు. ధన్యవాదాలు

      Delete
  4. చాలా బాగుందండి. 'బుజ్జిపండుగురించి రాసే మీలోని రచయిత్రి'కి నేను అభిమానిని...

    ReplyDelete
    Replies
    1. తెలుగు భావాలు గారూ మీరిస్తున్న ప్రోత్సాహంతో మరిన్ని పిల్లల కబుర్లు వ్రాయాలని ఉందండీ...మీకు బోలెడు ధన్యవాదాలు.

      Delete
    2. తప్పక రాయగలరు. స్వతహాగా చిన్న పిల్లల విషయాలు బాగుంటాయి. అందునా మీరు బుజ్జిపండు గురించి రాసే శైలి మరీ బాగుంటుంది.

      Delete
  5. మా పిల్లలకి ఈ ఆవు పులి కథ చెబుతాము.సహజమైన రచనా శైలి మీది.

    ReplyDelete
    Replies
    1. రవిశేఖర్ గారూ మన భాషలో ఎన్ని నీతి కథలు ఉన్నాయో కదా..పిల్లలు విననట్లే ఉంటారు కాని వారి ప్రవర్తనలో ఆ సంస్కారం కనిపిస్తూనే ఉంటుంది. నా శైలి నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

      Delete
  6. bujjigaadu manchi vaadandee vaalla amma laage

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారూ పిల్లలందరూ మంచివాళ్ళే కదండీ..పండు దగ్గర్నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను. మీ అభిమానానికి ధన్యవాదాలు.

      Delete
  7. చాలాబాగుందండి.. పండు అల్లరి ముద్దుగా ఉంటే మీరు రాసిన విధానం మరింతబాగుంది..
    మొదటి రెండు మూడు పేరాలు చదువుతుంటే కళ్ళముందు ఒక్కో దృశ్యం కనిపిస్తుంటే ఆ అనుభూతి ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను..

    ReplyDelete
    Replies
    1. పండుతో అనుబంధం అలా రాయిస్తోందండీ...ధన్యవాదాలు వేణు గారూ..

      Delete
  8. బాగుందండి మీ పండు అల్లరి..అబద్దాలు. మీరు చెప్పిన విధానం కూడా బాగుంది. మా వాడు తొమ్మిదేళ్ళ వయసొచ్చినా ఇప్పటికీ అబద్దాలు చెప్పి వాటిని వాళ్ళ అక్క మీదకు తోసేస్తాడు.
    బాగా వ్రాసారు జోతిర్మయి గారు...అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. అయితే మీకూ అనుభవమే నన్నమాట ఇలాంటివాన్నీనూ... ధన్యవాదాలు సురేష్ గారూ..

      Delete
  9. పండు అద్దబాలు బాగున్నాయండి :)

    -సుస్మిత

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సుస్మిత గారూ..

      Delete
  10. జ్యోతిర్మయి గారు ..బుజ్జిపండు "అద్దబాలు" విని చాలా ముచ్చటేసి.. మా అబ్బాయిని గుర్తు తెచ్చుకున్నాను అండీ! బుజ్జి పండు ముద్దు ముద్దు చేష్టలు..ఆనందమానందం.
    మీరు ఇంటిల్లపాది ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా బావుంది. మీ రచనా శైలికి అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. వనజ గారూ పిల్లలందరూ ఇంతేకదా. :) ధన్యవాదాలు.

      Delete
  11. chakkaga raasaaru, abhinandanalu.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు భాస్కర్ గారూ..

      Delete
  12. బుజ్జిపండుని నాకు కలవాలని ఉందోచ్!! ఎంత బాగా రాస్తారో తెలుసా మీరు ఇలాంటి కబుర్లు? So sweet అనాలని అనిపిస్తుందండి!

    ReplyDelete
    Replies
    1. బుజ్జిపండుకు కూడా మిమ్మల్ని కలవాలనివు౦దట. త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు వెన్నెల గారూ..

      Delete
  13. కౌముది లో మీ కవిత నాకు నచ్చింది జ్యోతి గారు!!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వెన్నెల గారూ..

      Delete
  14. మీరు ఇలాగే రాస్తుండండి..... నేను వీటిని భద్రపరిచి భవిష్యత్తులో ఉపయోగించుకుంటాను....

    మీ రచనా శైలి అద్భుతం అండీ.....

    ReplyDelete
    Replies
    1. మీ ప్రోత్సాహమే నా రచనలకు స్ఫూర్తి. ధన్యవాదాలు మాధవి గారూ..

      Delete
  15. ఓలమ్మో, ఓలమ్మో

    బుజ్జి పండు మీద అందరూ ఇలా కలిసి గూడు పుటాణి చేసి అతన్ని మంచి బాలుణ్ణి చేస్తారా!
    ఇది ఒప్పుకోము సుమీ ! నాన్నా పులి అని చెబ్తే పోనీలేరా పులి తో పోట్లాడి విజయమో వీరస్వర్గమో కనవోయ్ అని చెప్పాల్సిన కాలం కదా మరి ఇది!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారూ..చాలా కాలానికి కనిపించారు. కుశలమేనా...మీ వ్యాఖ్య కనిపించగానే చాలా ఆనందం కలిగింది. ఊర్లో లేకపోవడం వలన ఆలశ్యంగా సమాధనమిస్తున్నాను. ఏమనుకోకండి.
      బుజ్జిపండుకు పులితో పోట్లాడే వయసు రాగానే వేరే కథలు చెప్దాంలెండి. ధన్యవాదాలు.

      Delete

వాకిట వేసిన ముగ్గును చూసి గుమ్మం దాటి పలకరించే మీ అభిమానానికి నమస్సుమాంజలి.